చిత్త ప్రసాద్‌ ‘రాతబడి’ చేశాడు!

నంది అంటే నంది
పంది అంటే పంది
అనే వాళ్ళను వంది మాగధులంటారు. ‘పంది’మాగధులని ఎందుకనరో!
అలాంటి ‘పంది’మాగధుడే ఒక ‘మధురమయి’న రాజ్యంలో ప్రధాన మంత్రిగా చెలామణీ
అయిపోతున్నాడు.
ఆ రాజ్యం పేరు ‘రసగుల్లా రాజ్యం’. మంత్రికీ, రాజ్యానికీ ఏ మాత్రం పొంతన లేదు కదూ!
అందమైన దేశానికి అసహ్యకరమైన మంత్రి ఎందుకొస్తాడు? రాజుకు బుధ్ధిలేక పోతే సరి!
బుధ్ధిలేని రాజూ, గడ్డితినే మంత్రీ ఉద్యానవనంలో విహరిస్తుండంగా, నిజంగానే ఇద్దరూ పందిని
చూశారు.
‘ఏమిటది?’ అన్నాడు బుధ్ధిలేని రాజు.
చిత్రం! పందిని పంది- అని చెప్పలేదు గడ్డితినే మంత్రి.
‘బక్కచిక్కిన ఏనుగు’ అన్నాడు.
అనగానే సరిపోదు కదా! అందుకో కథ చెప్పాలి. ఏం కథ చెబుతాడు? గడ్డితినే మంత్రి గడ్డి కథే
చెబుతాడు.
రాజ్యం లో ఏనుగులకు పెట్టాల్సిన గడ్డిని, మావటీలు తినేస్తున్నారన్నాడు. ఇంకేముంది?
మావటీలను ఖైదు చేశారు.
కొన్నాళ్ళు గడిచాక, మళ్లీ అదే చోట విహరిస్తుండగా అదే పంది వచ్చింది.
‘ఏమిటది?’అని మళ్ళీ అడిగాడు బుధ్ధిలేని రాజు.
పందిని పంది- అని ఇప్పుడు మాత్రం చెబుతాడేమిటి గడ్డితినే మంత్రి?
ఏనుగని కూడా చెప్పలేదు. ‘ఎలుక’ అనిచెప్పాడు. కాకుంటే ‘బలిసిన ఎలుక’ గా
అభివర్ణించాడు.
ధాన్యాగారపు సిబ్బంది నిద్రపోవటంవల్ల దేశంలో ఎలుకలు ధాన్యాగారంలో చొరబడి తిని ఇలా
బలిసాయి- అని ఇంకో ‘గడ్డి’ కథ చెప్పేశాడు.
ఒకే పందికి రెండు వ్యంగ్యచిత్రాలు. ఒక సారి చిక్కిన ఏనుగులాగా. మరొకసారి బలిసినఎలుక
లాగా!
వీటిని ఏ కలంతోనో, కుంచెతోనో గీస్తే ‘క్యారికేచర్‌’.
మన మంత్రి నోటితో వేశాడు కాబట్టి ‘ఓరకేచర్‌’ అని అనవచ్చేమో! (  తొండం కాస్తా పంది
ముట్టెగా మారిన పరిణామ క్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించినందుయినా మంత్రికి ఈ బిరుదు ఇవ్వాలి)
ఒకానొక కథలోని ఒకానొక ‘పాత్ర’కు ఇంతటి ‘చిత్ర’ణా!?
అంతటి పెద్ద పెద్ద ఆశ్చర్యాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ కథ రాసింది-సాక్షాత్తూ
జగమెరిగిన చిత్రకారుడే. పేరు చిత్త ప్రసాద్‌.
తెగించిన బానిస మహాబలుడిగా ఎలా మారతాడో- సినిమావాళ్ళ గ్రాఫిక్స్‌లో కాదు- ఇప్పటికీ,
ఎప్పటికీ చిత్త ప్రసాద్‌ గీతల్లో మాత్రమే చూడగలం.
అలాంటి చిత్తప్రసాద్‌ కథలు కూడా రాశారు. ఇవి ‘మూల’ భాషలో ఎలావున్నాయో తెలీదు
కానీ, ‘లక్ష్య’ భాషలోకి వాటి ‘ఆత్మ’లతో సహా తెచ్చేశారు సమత.( ఈ కథల్లో ‘ఆత్మ’లు కూడా వున్నాయి
లెండి!)
ముల్లు ముల్లుతో తియ్యాలో లేదో తెలియదు కానీ, వెటకారాన్ని వెటకారంతోనే అనువదించాలి.
అందుకే కాబోలు ఇందులో వున్న దయ్యాలు కూడా కూడా బెంగాలీ దయ్యాల్లా వుండవు.
తెలుగు వాళ్ళ పెంపుడు దయ్యాల్లా వుంటాయి.
మనిషి చస్తే దయ్యమవుతాడని నమ్మకం కదా! మరి కులం చస్తే!? అమ్మా ఆశనీ
మనిషి చచ్చినా కులం చావదు. దయ్యమైనా కులం వచ్చేస్తుంది.
దయ్యాలు అందరినీ పీక్కు తినవచ్చు. కానీ కులం దయ్యాల్ని పీక్కు తింటుంది.
ఈ ‘భూత వర్ణ వ్యవస్థ’ను చిత్తప్రసాద్‌ చెట్టెక్కించి మరీ పట్టిచ్చారు. బ్రాహ్మణులు పరిశుభ్రమైన
అగ్రహారాల్లోనూ,  శూద్ర, అతిశూద్ర వర్ణాలు మురికి ప్రదేశాల్లోనూ వున్నట్టుగా, బ్రాహ్మణ దయ్యాలు
అతిపవిత్రమైన వకుళ వృక్షం మీదా, శూద్రదయ్యాలు మర్రి చెట్టుమీదా వుంటాయి. బ్రాహ్మణ దయ్యాలను
ఎలాబడితే అలా పిలిస్తే, రచయితక్కూడా మంచిది కాదు. బతికున్నవాళ్ళే ఆయన్ను పీక్కు తినవచ్చు.
అందుకోసం వాటిని ‘బ్రహ్మాదిత్యులు’ అని పిలిచాడు. ఈ బ్రహ్మాదిత్యులే మిగిలిన దయ్యాలకు పౌరోహిత్యం
చేస్తాయి. ‘పర’కర్మలు కూడా చేస్తాయి కాబోలు.(అపర కర్మల సంగతి ఎలాగూ బతికున్న వాళ్ళు
చూసుకుంటారు.)
దయ్యాలకు తీరని కోరికలుండిపోతాయంటారు. ఆ మాట కొస్తే తీరని కోరికలవల్లే
దయ్యాలవుతాయంటారు. మనిష్టం! ఎవరూ అడిగేది? దేవుళ్ళ మీద చేసిన కల్పనల కన్నా స్వేఛ్చగా దయ్యాల
మీద చేసుకోవచ్చు. చిత్త ప్రసాద్‌ కథల్లో దయ్యాలకు కూడా అలాంటి కోరికలుంటాయి. ఒక కథలో ఒక
దయ్యానికి(బ్రహ్మాదిత్యుడికి) ప్రేమించాలని కోరిక పుడితే, మరో కథలో మరో దయ్యానికి(శంకు-చున్నీ)కి
కాపురం చెయ్యాలనే ముచ్చట కలుగుతుంది. తప్పులేదు. బతికే హడావిడిలో పడి అందరూ మరచిపోయే
విషయాలే ఈ ప్రేమానుబంధాలు. బ్రహాదిత్యుడు బతికున్నప్పుడు ఇష్టపడ్డ వకుళకు ఏమీ చెయ్యలేక పోయాడు.
‘వకుళ’ పేరుతో ఇంకోఅమ్మాయి తనుండే చెట్టు దగ్గరకి వస్తే ఆమెకూ, ఆమె ప్రేమకూసాయం చేస్తాడు. ఆ
సాయం కూడా తన కుండే ‘భూత’శక్తుల వల్ల చెయ్యలేక పోతాడు. ఇతర శూద్ర భూతాల మీద తనకుండే ఉన్నత
‘ప్రేతాధిక్యత’నుపయోగించుకుని ప్రేమజంటను కలుపుతాడు. అందుకే కాబోలు సమాజం పైనుంచి వచ్చిన
సంస్కర్తల్నే ఒప్పుకుంటుంది, కిందనుంచి వస్తే గుర్తించదు.
కాపురాన్ని కాపురంలాగే చెయ్యాలి. ప్రేమచూపిస్తే చాలా మంది మగళ్ళకు నచ్చదు. పాపం
శంకు చున్నీ అనే ప్రేమగల దయ్యం, బతికున్న వాళ్ళలో ఒకణ్ణి భర్తగా ఎంచుకుని వాడి సేవలో తరిస్తుంటుంది.
అంతవరకూ ఫర్వాలేదు. అపారమైన ప్రేమను ప్రకటించటానికి ఓ దయ్యపు సాహసం చేస్తుంది. కాపురంలో ప్రేమ
కలిసిపోతే, పధ్ధతిగల మగడు ఊరుకుంటాడా? తన్ని తగలెయ్యడూ..!? కానీ వాడికా దమ్ములు కూడా లేక,
భూతవైద్యుడితో తన్నించేస్తాడు.
తెలివీ, మంచితనమూ- ఈ రెండూ ఒకరిలోనే వుంటే..?
ఎంతబాగుంటుంది?
ఇలా అనుకుంటాం కానీ, నిజంగా తెలివయిన మంచివాడు ఎదురయితే కోపం వచ్చేస్తుంది.
మంచి వాడంటే మనకో లెక్క వుంటుంది. వాడో వెర్రి వెంగళప్పలా వుండాలి. మనం
వాడిముందు నటించేస్తున్నా పోల్చుకోకూడదు. ఇష్ట పూర్వకంగా వాడు మోసం చేయించుకోవాలి… ఇలా
‘మంచివాడి’ నుంచి మనం కోరుకునే అర్హతలు చాలా వుంటాయి.
అలాగే, తెలివయిన వాడి గురించి మనఅంచనాలుంటాయి. వాడు పరమ కిలాడీ అనీ,
దేవాంతకుడనీ, తలకాయలు మార్చేవాడనీ.. అనుకుంటాం. పొరపాటున కూడా ఒక మంచి విశేషణం వాడం.
అంటే సమాజం- తెలివయిన వాళ్ళకీ మంచి వాళ్ళకీ మధ్య ఒక బండగీత గీసేసింది.
తెలివయిన వాళ్ళు మంచివాళ్లు కారు; మంచి వాళ్ళు తెలివయిన వాళ్ళు కారు.
తెలివయిన మంచివాడు కనిపిస్తే అధికారంలో వున్న వారికి ఏరిపారెయ్యాలని పిస్తుంది.
బహుశా వీళ్ళే ఉద్యమకారులు కాబోలు!
చిత్తప్రసాద్‌ రాసిన ‘నల్లపిట్ట- రాజు’ కథలో ఊరువెళ్ళాలనుకున్న ఓ ముసలమ్మ తన
సపోటాపళ్ల చెట్టుకు కాపలా పెట్టాలనుకుని, మూడు రకాల పక్షుల్ని పరీక్షిస్తుంది.
మొదటిది కొంగ: దీనికి తెలివి తప్ప మంచి తనం లేదు.’ముసలమ్మా! దారిలో నువ్వు చస్తే ఈ
చెట్టు నాకే సంక్రమిస్తుందా?’ అని ముసలమ్మతో చీవాట్లు తింటుంది.
రెండవది కాకి: మంచితనం తప్ప తెలివి లేదు. ‘దొంగలొస్తే దాక్కొని గమనిస్తా’నని చెప్పి
ముసలమ్మకు కోపం రప్పిస్తుంది.
మూడవది నల్లపిట్ట: దీనికి తెలివీ, మంచితనమూ రెండూ వున్నాయి.
ఈ చెట్టును కాపాడ్డానికి సాక్షాత్తూ రాజుతోనే యుధ్ధం చేస్తుంది.
నల్లపిట్ట అందమైనది. తెలివయిన మంచివాళ్ళే అందమైన వాళ్ళు.
నల్లపిట్టలు తెచ్చే వసంతం కోసం లోకం మొత్తం ఎదురు చూస్తుంది. ఇందటి సుందర
స్వప్నాన్ని కన్న చిత్త ప్రసాద్‌ అందమైన కథకుడు కాకుండా పోతాడా!?
జానపదకథా అందమైనదే, ఆధునిక కథా అందమైనదే!
నండూరి యెంకీ అందమైనదే, కృష్ణశాస్త్రి ఊర్వశీ అందమైనదే,
ఎవరి అందం వారిది.
కానీ ఆధునిక కథకి జానపద వేషం కడితే! ఎందుకు బాగుండదూ!
ఊర్వశి కూడా కచ్చా బిగించి కలుపు తీస్తుంది.
రష్యన్‌ మహాకథకుడు చెహొవ్‌ ‘ఆదాము,హవ్వ’ల్ని కాస్సేపు ఆధునిక ‘ప్రేయసీ ప్రియుల్లా’
చూపించాడు. అద్భుతమనిపించింది.
ఆ మాట కొస్తే జానపదకథల్ని మళ్ళీ మరోలా చెప్పుకోవచ్చు. ఆధునికాత్మను చేర్చుకోవచ్చు.
చైనా మహారచయిత లూషన్‌ ఈ పనే చేశాడు. పాపం ఇందుకోసం భారతీయాంగ్ల రచయిత
ఎ.కె,రామానుజన్‌ జీవితాంతం తాపత్రయపడ్డారు.
కథను సంక్షోభంలో పడేసి, మెట్టుమెట్టుగా క్లయిమాక్సుకు తీసుకు వెళ్ళటానికి జానపదలోని
‘గొలుసుకట్టు’ పట్లు  మనసును పట్టేస్తాయి. ఎప్పటికీ చెరిగిపోవు.
‘ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరును మరచి పోతుంది’ అన్న తర్వాత, ఎవరెవర్ని
ఎలా అడుగుతుందో, చెబుతుంటే, ఓహ్‌! ఆ ప్రయాణమే గొప్పగావుంటుంది. వదలుకోగలమా?
సమత ఎలా పట్టారో, ఏమో..! చిత్త ప్రసాద్‌ రాసిన ఏ నాలుగు కథల్నీ పట్టేశారు. నాలుగూ
నాలుగు ‘అందమైన దయ్యాలు’. చదివేటప్పుడే పాఠకుల్ని పట్టుకుంటాయి. కానీ మురిపించి వదిలేస్తాయి.
కానీ పాఠకుల్లోనూ రచయితలుంటారు. వాళ్ళని మాత్రం పట్టుకుంటే వదలవు. వీటిని
వదలించుకోవాలంటే ఒక్కటే మార్గం: వాళ్ళుకూడా కనీసం ఒక్కొక్కరూ ఒక్కొక్క ఆధునిక జానపదకథ అన్నా
రాసి చూపించాలి. అప్పుడు వదిలేస్తాయి.
ఇంత పెద్ద ‘రాత బడి’ లాంటి చేతబడిని, అసలు రచయిత చిత్తప్రసాద్‌, అనువాదకురాలు
సమతా కుమ్మక్కయి చేసేశారు.
మన దయ్యాలు  బెంగాలీ మంత్రాలకు లొంగవేమోనని తెలుగు మంత్రాలు కూడా  సమత
సర్వస్వతంత్రంగా సిధ్ధం చేశారు.
‘అంబ పలుకు జగదాంబ పలుకు
కంచిలోనుండు కామాక్షి పలుకు
మా పిన్ని చెట్టు జోలికి ఎవరయినా వచ్చారా,
కోస్తాను వారి ముక్కూ, చెవులూ పర్రాపర్రా’
ఇది  కథలో నల్లపిట్ట చదివే మంత్రం. కథలు చదివేక ఈ మంత్రం చదివేస్తే దయ్యాల్లాంటి పాత్రలు
వెళ్ళిపోతాయి. కథ మిగిలిపోతుంది. ప్రయత్నించండి.
-సతీష్‌ చందర్‌
11 డిశంబరు 2010

Leave a Reply