చీకటి ఎవరికి చేదు?

Photo By: Rana Usman

అక్కడికి అందరూ వెలుతురు మీదే బతికేస్తున్నట్టు, చీకటిని తెగ తిట్టిపోస్తున్నారు.

సమాజంలో చీకటిని కోరుకునే వారే లేరా? కరెంటు లేక పోతేనో, బల్బు వెలక్క పోతేనో జీవితంలో ఎంతో కోల్పోయినట్లు అందరూ ఫీలయిపోతున్నారు.

జనం ఖర్చుతో వీధిలైట్లు పెట్టిస్తారా? కాలనీకి వెళ్ళే కార్నర్‌లోనో, సిటీబస్సు స్టాండుకు దగ్గరగానో, పార్కు సమీపంలోనో వున్న లైట్లు పెట్టించిన రెండో రోజే పోతాయి. కారణం అక్కడి వారెవరో చీకటి కోసం తహతహ లాడటం. చైన్‌ స్నాచరో, ఈవ్‌ టీజరో, బెల్టుషాపు వాడో- ఎవడయితేనేం? ఒక్కొక్కడూ ఒక్కొక్క మహా విధ్వంసకుడు. దీపం ఆరితేనే కానీ, వాడి వృత్తి సాగదు.

ఇలాంటి పోకిరీ గాళ్ళు తప్ప, పధ్ధతి గల మనుషులందరూ వెలుతురునే కోరుకుంటారన్న అనుమానం అందరినీ పీకుతూనే వుంటుంది.

పరీక్షలొచ్చి మీదపడుతుంటాయి. కష్టపడే విద్యార్థికి ఎప్పుడూ ఓ సంకట స్థితి వుంటుంది. తెల్లవార్లూ చదవమని చెబుతుంది బుధ్ధి. కొత్తగా రిలీజయిన సినిమాకి వెళ్ళమంటుంది మనసు. బుధ్ధి మాటే వినాలనుకుంటాడు. కరెక్టుగా అదే సమయానికి కరెంటు పోతోంది. ‘అబ్బా! ఇక నేను చదివినట్లే!’ అని పైకి అంటాడు. కానీ లోన తెలియని ఆనందం. కరెంటు వచ్చేలోగా సినిమాకి పోయి రావచ్చు. నేరభావన లేకుండా ఆనందించి రావచ్చు. ఎందుకంటే ‘కరెంటు లేదుగా, మనమేం చేస్తాం.’ అని తనలో తాను అనుకోవచ్చు. మనసు చేత బుధ్ధికి నచ్చ చెప్పవచ్చు.

పైసా లంచం తీసుకోకుండా పనిచేసే ప్రభుత్వోద్యోగి కూడా ఒక్కొక్క సారి చీకటి కోరుకోవచ్చు. జనరేటర్లూ, ఇన్వెర్టర్లూ లేని సర్కారీ ఆఫీసులు కోకొల్లలు. ఆ పూట, ఓవర్‌టైమ్‌ చేసి, మరీ తన పని పూర్తి చేయాలని తనలోని బాధ్యత తనను ఆఫీసులో కూర్చుండబెడుతుంది. ఆలా క్యాంటీన్‌కి పోయి, అందరితో పాటు చాయ్‌ కొట్టే పేరు మీద, గంటఖర్చు చేసి రమ్మంటుంది సరదా. ఇప్పుడు కరెంటు దేని పక్షాన వుంటుందో తేలిపోయింది కదా? సరదా పక్షాన నిలబడి బాధ్యతను ఓడిస్తుంది. పుటుక్కున పవర్‌ కట్టయి కంప్యూటర్‌ ఆగిపోతుంది. లైటూ పోతుంది. ‘ఛీ.చీ. ఎప్పుడూ ఇంతే. పని చేద్దామంటేచాలు కరెంటు పోతుంది’ ఆనందంగా తిట్టుకుంటూ బయిటకు వెళ్ళిపోతాడు.

కట్నం యిచ్చి పెళ్ళిచేసుకున్న పెనిమిటే కాదు, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త కూడా చీకటినే కోరుకుంటాడు. ఆఫీసునుంచి వచ్చిన వెంటనే, సాయింత్రం పూట అలా షికారుకు తీసుకు వెళ్తానని మాట ఇస్తాడు. రోడ్డుకు చేర్చే వాళ్ళ ఫ్లాట్స్‌. వెళ్ళటం ఎంత పని అనుకుంటాడు. ఆఫీసునుంచి బయిలుదేరే ముందు, ఎటీఎమ్‌ కార్డు ‘గీకి’ చూస్తాడు. రెండు వేలకు మించి రాలవు. ఆమెతో షికారు అంటే, కనపడినవెల్లా కొనటమే. కానీ ఆమె అడిగింది కొనటానికి అతడెప్పుడూ వెనకాడడు. ఆ మాట కొస్తే, ఈ ప్రపంచంలోనే ఆమెకన్నా ఎవరూ ఎక్కువ కారు. కానీ జీతం రావటానికి ఇంకా వారం రోజులుంది. ఉన్న రెండువేలూ ఖర్చు చేస్తే ఎలా? అనుబంధం ఖర్చు పెట్టమంటుంది. అవసరం పొదుపు చేయమంటుంది. ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే కరెంటు పోయింది. అనుబంధం మీద అవసరం గెలుపు సాధించింది. ‘అసలే రోడ్డు మీద ఇల్లు. మనం బయిటకు వెళ్ళినప్పుడు దొంగలు పడరు కదా!’ అనగానే ఆమె ‘అవునండోయ్‌. వద్దు. ఎక్కడికీ వెళ్ళొద్దు.’ అని అనేస్తుంది.

ఏటా నష్టపోతున్నాం కదా, ఈ ఏడు నాట్లు వేద్దామా, వద్దా? అనుకుంటుంటాడు. నాట్లు వేస్తే కొత్త అప్పులు చెయ్యాలి. వెయ్యక పోతే పాత పస్తులు వుండాలి. అప్పులా? పస్తులా? పవరు పస్తుల వైపు మొగ్గుతుంది. ‘ఉచిత విద్యుత్‌ అంటే ఉచితంగా వేసే తీగలేనట కదా అన్నా! రోజుకి గంట కూడా కరెంటివ్వరట కదా!’ అంటాడు పక్క పొలం రైతు. అప్పుల వాళ్ళ బాధ పడలేక ఒకే రోజు చావటం కన్నా, ఆకలితో అలమటిస్తూ సులభ వాయిదాల్లో చావటం మేలని ధైర్యంగా నిర్ణయానికి వచ్చేస్తాడు రైతు. పైగా ఇంట్లోనూ కరెంటు వుండదు. చీకట్లో తిన్నామో లేదో, పక్కింటి వాడికి కూడా తెలియదు. పరువు కూడా దక్కుతుంది. చీకటి ఆమేరకు మేలు చేస్తుందని రైతు ఆలస్యంగా గ్రహిస్తాడు.

బల్బులు వెలక్క పోవటం వల్లా, మోటార్లు తిరక్క పోవటం వల్లా, అంతిమంగా కరెంటు లేక పోవటం వల్లా, ఇన్నేసి లాభాలుంటే, మన ప్రతిపక్షనేతలు ఎందుకనో కరెంటు కోసం, నిద్రా తిండీ తిప్పలూ మానేస్తున్నారు.

ఆ మాట కొస్తే వెలుతురులో కంటే చీకట్లోనే ప్రజాస్వామ్యం మొత్తం మహదానందకరంగా పనిచేస్తుంటుంది.

‘హత్య జరిగేటప్పుడు నువ్వున్నావా?’

‘ఉన్నాను. కానీ అప్పుడే కరెంటు పోయింది. చూడలేక పోయాను.’

కోర్టులో కేసు కొట్టేస్తారా? లేదా? ఇదీ న్యాయవ్యవస్థ.

ఎన్నికల్లో అభ్యర్థి వోటుకు వెయ్యి పంచేటప్పుడూ, అధికారి ఇష్టంలేని ఫైలు మీద సంతకం పెట్టేటప్పుడూ కరెంటు పోతే, శాసన నిర్మాణ, కార్య నిర్వాహక వ్యవస్థలూ సజావు గా సాగిపోతాయి.

టీవీ వార్తల్లో విలేకరికి ఇష్టంలేని నిజాలని రిపోర్టు చేస్తున్నప్పుడు, కరెంటుపోయిందనుకోండి. ‘ఎవడూ చూడలేడు కదా!’ అని ఎగిరి గెంతేస్తాడు.

చీకట్లు కమ్మితే నిజంగా చిన్నబుచ్చుకునే వెలుతురు మనుషులు ఎప్పుడూ కొందరే!!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక  31 మార్చి 2013 వ తేదీ సంచిక లో ప్రచురితం)

2 comments for “చీకటి ఎవరికి చేదు?

  1. వెలుతురులో కంటే చీకట్లోనే ప్రజాస్వామ్యం మొత్తం మహదానందకరంగా పనిచేస్తుంటుంది. ఈ వ్యాఖ్యలో రాజ్యం స్వభావ, స్వరూపాలన్నీ ద్యోతకమవుతున్నాయి.

Leave a Reply