‘చుక్కల్ని చూపించిన’ క్రిస్టఫర్‌ నోలాన్‌!

చిత్రం: ఇంటర్‌స్టెల్లార్‌

జోనర్‌: సైన్స్‌ ఫిక్షన్‌

దర్శకత్వం: క్రిస్టఫర్‌ నోలాన్‌

స్క్రీన్‌ప్లే: క్రిస్టఫర్‌ నోలాన్‌, జోనతాన్‌ నోలాన్‌

తారాగణం: మాథ్యూ మెక్‌కొనాఘే, ఆన్ని హతావే, జెస్సికా చాస్టెయిన్‌, వెన్‌ బెంట్లే, డేవిడ్‌ గ్యాసీ, మాట్‌ డామన్‌, మిఖాయెల్‌ కయీన్‌, కేసీ ఆఫ్లెక్‌, మాకెంజీ ఫోయ్‌, టోఫర్‌ గ్రేస్‌, తదితరులు

is1గూడు  చెదిరిన వాడు ఏం చేస్తాడు? ఇంకో గూడు వెతుక్కుంటాడు. మానవాళికి గూడు భూమి. భూమే చెదరిపోతే..? ఇంకో భూమిని వెతుక్కోవాలి. అవును. భూమిలాంటి గ్రహాన్ని వెతుక్కోవాలి. అలాంటి గ్రహం ఇంకొకటి వుంటుందా? మన సౌర కుటుంబంలో వుండక పోవచ్చు. గగనాంతర రోదసుల్లో, ఇతర తారల పరిధుల్లో వుండవచ్చు. ఇప్పటిదాకా వున్న ఖగోళ జ్ఞాన పరిమితి మేరకు మనం పోల్చుక్ను గ్రహాలు రెండువేలు. ఇందులో అత్యంత సమీపగ్రహం మనకు వెయ్యికాంతి సంవత్సరాల దూరం. అలాంటిది భూమిని పోలిన గ్రహం, భూమిలాంటి వాతావరణమున్న గ్రహం, మనిషి తనను కొనసాగించుకోవటానికి వీలున్న గ్రహాన్ని వెతుక్కుంటూ పోతే.. ఎలా వుంటుంది? ఎలా వుండమేమిటి? క్రిస్టఫర్‌ నోలాన్‌ తీసిన ‘ఇంటర్‌స్టెల్లార్‌’ లాగా వుంటుంది.

నోలాన్‌ ఎంచుకునే కథలెప్పుడూ ఇంతే విచిత్రంగా, ఇంతే భిన్నంగా, ఇంతే ఉత్సుకత కలిగించే విధంగా వుంటాయి. ఆయన చిత్రాల్లో ‘మానవుడే మహనీయుడు’. విశ్వచలనచిత్రసీమలో ఆయనొక మహా మాంత్రికుడు. ఒక నగరాన్నీ, నగరానికున్న సామాజికార్థిక వ్యవస్థనూ సృష్టించి, ఆ నగరం నేరస్తుల పాలు కాకుండా రక్షించేందుకు ఒక ‘బ్యాట్‌మ్యాన్‌’ సృష్టించి, మూడు వరస చిత్రాలను(ట్రైయాలజీ)ని తీసినా అది ఆయనకే చెల్లుతుంది. ‘కలలోపలకలలోపలకల’ ఎలా వుంటుంది? ఇదీ చిత్రమే. నోలాన్‌ తీసిన ‘ఇన్సెప్షన్‌’ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇలా ఆయన తీసిన ప్రతీ చిత్రమూ ముందు ఆశ్చర్యాన్నీ, తర్వాత వినోదాన్నిస్తాయి. ‘ఇంటర్‌స్టెల్లార్‌’ కూడా అంతే. దృశ్యం తర్వాత దృశ్యం కాదు, ఆశ్చర్యం తర్వాత ఆశ్చర్యం కదులుతున్నట్టుంటుంది. ఈ చిత్రం ‘సైన్స్‌ ఫిక్షన్‌’ అయినప్పటికీ జీవితానికి దగ్గరగా, చాలా సహజంగా వుంటుంది. దర్శకుడిగా నోలాన్‌ చేసిన ఊహ ఆకాశాన్ని దాటుతుంది కానీ, అవధుల్ని దాటదు.

కథన కుతూహలం:

భూమి మీద కాలుష్యం పెరిగి, ధూళి తుపానులా వచ్చి, వ్యవసాయం మట్టికొట్టుకు పోతుంది. భూగోళం మీద మావనజాతి మనుగడ వీలుకాకుండే పోయే స్థితి వచ్చేస్తుంది. ఇది ముందుగా గమనించిన ‘నాసా’ శాస్త్రజ్జుడు ప్రొఫెసర్‌ బ్రాండ్‌ అజ్ఞాతస్థలంలో ప్రత్యామ్నాయాల్ని తయారు చేస్తుంటాడు. అంతిమంగా అతడు రెండు ప్రత్యామ్నాయాలను తయారు చేస్తాడు. ప్లాన్‌ ఎ: కొంతమంది మానవుల్ని అయినా రక్షించటానికి భూమికి దూరంగా ఓ అంతరిక్షశిబిరాన్ని తయారు చేయటం. ప్లాన్‌ బి: అండదశలోని మానవ ప్రాణాలను భూమిలాంటి వేరే గ్రహానికి తరలించటం. ఈ స్థితిలోనే, తనంతట తానుగా ఒకప్పుడు నాసాలో ఇంజనీర్‌గా పనిచేసిన కూపర్‌, బ్రాండ్‌ అజ్జాత స్థావరం దగ్గరకి చేరుకుంటాడు. అప్పటికతడు వ్యవసాయం చేస్తుంటాడు. మ్యాన్‌ను ప్లాన్‌ బిలో భాగంగా భూమిలాంటి మరో గ్రహానికి వెళ్ళే యాత్రకు సిధ్ధం చేస్తాడు. అయితే కూపర్‌కు మర్ఫ్‌ అనే పదేళ్ళ కూతురు వుంటుంది. ఆమె తో పాటు ఓ కొడుకు, మామయ్య ఒకే నివాసంలో వుంటారు. ఇలా ఈ యాత్రకు వెళ్ళటానికి తన తండ్రి ఒప్పుకున్నాడని తెలిసి తండ్రి మీద అలుగుతుంది. ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ తాను మళ్ళీ తిరిగి వస్తానని హామీ ఇచ్చి యాత్రకు సిధ్ధమౌతాడు. ఈ యాత్రలో శాస్త్రజ్జుడు ప్రొఫెసర్‌ బ్రాండ్‌ తన కూతురు ఎమెలియా ను, ఇతర వ్యోమగాముల్నీ పంపుతాడు. ఈ కథలో కూపర్‌ వెళ్తూ వెళ్తూ తన పదేళ్ళ కూతురుకి ‘నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను వచ్చేటప్పటికీ నీ వయసూ. నా వయసూ ఒక్కటే వుంటుంది.’ అని చెబుతాడు. ‘గ్రావిటీయే’ లేని చోట ‘వార్మ్‌హోల్‌’ లోనుంచి ఇతర రోదసిలోని గ్రహాలను వెతుక్కునే టప్పుడు భూమ్మీద కాలానికి, వీరి ప్రయాణంలో వున్న కాలానికి వ్యత్యాసం పెరిగిపోతుంది. భూమ్మీద ఒక యేడు గడిస్తే, వారికి దాదాపు ఒక రోజుగడిచినట్టు అనిపిస్తుంది. భూమ్మీద తన కూతురు ఎదగటం, ఆమెకు పెళ్ళికావటం, పిల్లలు పుట్టటం- మొత్తం వీడియో ‘ఫుటేజ్‌’ ను దఫదఫాలుగా నాసా నుంచి పంపిస్తుంటే, కూపర్‌ తానున్న వయసులోనే వుండి పోయి అంతరిక్ష నౌకనుంచి చూడటం ఒక కొత్త అనుభవాన్నిస్తుంది. ఏయే గ్రహాలకు ఎలా చేరారు? అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? కడకు తన కూతుర్ని చేరుకునేటప్పటికి, ఆమె పండు ముదుసలిగా వుండటమూ, కూపర్‌ అలా వెళ్ళినప్పటి వయసు(40ల)లోనే వుండటమూ కొంత థ్రిల్‌ను కలిగిస్తాయి.

సాంకేతికం

క్రిస్టఫర్ నోలాన్

క్రిస్టఫర్ నోలాన్

దాదాపు మూడుగంటల పాటు ఈ సినిమా నడిచినా ఊపిరి బిగబట్టే ప్రేక్షకుడు చూస్తాడు. ఇందులో హోయితే వాన్‌ హోయితేమా సినిమాటోగ్రఫీ ఊహకు అందదు. కొత్త గ్రహాలను పరిచయం చేసినప్పుడు, ఆగ్రహంలోకి ప్రేక్షకుడు వెళ్ళిన భావనే కలుగుతుంది. ఒక చోట మొత్తం మంచే వుంటుంది. మరొక చోట నీళ్ళే వుంటాయి. సముద్రంలానే వుంటుంది. కానీ లోతు వుండదు. ఇంకొక చోట చిత్రమైన రాళ్ళే వుంటాయి. ‘కృత్రిమ మేధస్సు’ ను ఉపయోగించి జ్ఞాపకాలు భూతాల్లాగా పరిచయమయ్యే సన్నివేశాలకు సినిమాటోగ్రఫీయే ప్రాణం పోసింది. నోలాన్‌ సహజంగానే ‘సిజిఐ'(కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) ని తక్కువగా ఉపయోగించుకుంటాడు. కెమెరాతో తీసిన దృశ్యాలను అభివృధ్ది పరచటానికి అవసరమయినంత మేర ఎక్కువ వుపయోగించనని నోలానే పలు సందర్భాలలో చెప్పారు. అంతేకాదు, ఆయనకు ఇప్పటికీ ‘డిజిటల్‌ వీడియో’ మీద కన్నా, ‘ఫిల్మ్‌’ మీదనే మక్కువ ఎక్కువ. అందుకనే ఆయన చిత్రాలు ప్రేక్షకుల్ని వాస్తవానికి దగ్గరగా వున్న అనుభూతిని ఇస్తుంటాయి.

ఇంత సంక్లిష్టమైన ‘సైన్స్‌ ఫిక్షన్‌’ చిత్రాన్ని తండ్రీ కూతుళ్ళ మధ్య వున్న అనుబంధం చుట్టూ అల్లి, ఏమాత్రం సైన్సు పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యే అంత సరళంగా నోలాన్‌ స్క్రీన్‌ ప్లే రాశారు.

సంభాషణలు

నోలాన్‌ ఇతర చిత్రాలలోగా ఈ చిత్రంలోని సంభాషణల్లోనూ రవంత హాస్యం, కొంచెం తత్త్వమూ తొణికిస లాడుతుంటాయి. ప్రపంచంలో వున్న కోట్లాది మనుషుల్ని రక్షించలేకపోతున్నామన్న దు:ఖాన్ని ప్రొపెసర్‌ బ్రాండ్‌ చిన్న వాక్యంతో తీసి పారేస్తాడు: ‘నాకు మనుషులు కాదు, మనిషి జాతి ముఖ్యం. అది అంతరించ కూడదు’. అంటే ఒక్కణ్ణయినా బతికించాలి.

అంతరిక్ష నౌకలో బ్రాండ్‌ కూతురు ఎమెలియాకూ, కూపర్‌కూ మధ్య జరిగిన సంభాషణలు ఆసక్తి కరంగా వుంటాయి. ఇందులో నోలాన్‌ తన తత్వాన్నంతా అధికబాగం ప్రొ.బ్రాండ్‌ పాత్ర ద్వారా చెప్పించేస్తుంటాడు

‘స్థల,కాలాల్ని అధిగమించగలిగింది ఒక్కటే. అదే ప్రేమ’ ఈ మాటను ప్రొ.బ్రాండ్‌ ద్వారా చెప్పిస్తాడు. ఇక కూపర్‌ పాత్ర సరేసరి:

‘మానవజాతి భూమ్మీదే పుట్టింది; దానర్థం భూమ్మీదే అంతరించిపోవాలని కాదు.’

‘నువ్వు తండ్రివో, తల్లివో అయ్యాక ఒక విషయం అర్థమవుతుంది. పిల్లల్ని క్షేమంగా వుంచాలని.’

‘మనం ఒకప్పుడు నక్షత్రాలవైపు చూస్తూ ఇందులో మనచోటెక్కడా అని ఆశ్చర్యంతో వెతుక్కునే వాళ్ళం. ఇప్పుడు దుమ్ముతో నిండిన వైపు తొంగి చూస్తూ, ఇదా భూమి అని బాధ పడుతున్నాం.’

ఈ చిత్రాన్ని ‘బిగ్‌ స్క్రీన్‌’ మీద చూస్తేనే నోలాన్‌ మనకి ఇవ్వాలన్న అనుభవం తెలుస్తుంది. అతడు నిజంగానే ఈ సినిమాలో ప్రేక్షకులకు ‘చుక్కల్ని చూపిస్తాడు’. ఇంటర్‌స్టెల్లార్‌ అనే మాట అప్పుడే సార్థకమవుతుంది. ‘తారాంతరం’ లోకి మనం నిజంగానే వెళ్ళిపోతాం.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 15-21 నవంబరు 2014 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply