చెప్పు కింద ‘ఆత్మ’!

బూటు(photo by penny_lane086)

జెండాలూ, ప్లకార్డులూ, బ్యానర్లే కాదు…
బూట్లూ, చెప్పులు కూడా ఉద్యమసంకేతాలుగా మారాయి.
తాను గీసిన గీతలో, తాను కోరిన రీతిలో తెలంగాణ ఉద్యమానికి సహకరించని నేతల్ని ‘బూట్‌ పాలిష్‌ గాళ్ళు’ అనేశారు ఓ పెద్దమనిషి. ఈ మాట ఇంకెవరయినా అంటే మరోలా వుండేదేమో. కానీ సామాజికంగా ‘అగ్ర’ స్థానంలో వుండి అనటం వల్ల అర్థాలు మారిపోయాయి.
ఏమిటీ ‘దొర’హంకారం.. సారీ… దురహంకారం…! అనిపించింది ఇంకో నేతకు. ఆయన అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన నేత.
పెద్ద గొడవ. టీవీ చానెళ్ళలో అరుపులూ కేకలూ.

అలాగే నిజమాబాద్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ పై ఆందోళనకారులు చెప్పుతో దాడి చేశారు.
రాజకీయాల్లో పాదరక్షలు వార్తలకెక్కటం కొత్త విషయం కాదు. అమెరికా అధ్యక్షుడిగా వుండగా జార్జి బుష్‌ మీద ఒక పాత్రికేయుడు బూటు విసిరి తన అరబ్బు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అప్పటినుంచి ఇదొక నిరసన రూపంగా మారి పలు దేశాలకు విస్తరించింది. ఇలాంటి వినూత్నపోకడలను స్వీకరించటంలో ఇండియా ఎప్పుడూ ముందే వుంటుంది.

కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం మీద ఇలాగే ఒక పాత్రికేయుడు బూటు విసిరి తన ‘సిక్కు’ కోపాన్ని ప్రకటించాడు.

ఒక ఎన్నికల ర్యాలీలో సాక్షాత్తూ భారత ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ మీదనే ఒక కుర్రాడు విసరబోతే అది దూరంగా పడింది. ఇది గుజరాత్‌ మార్కు ఆగ్రహం లెండి.

తర్వాత బూటు బరువుగా వుందని భావించారో ఏమో, చెప్పుల్ని విసరటం మొదలు పెట్టారు. యెడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా వుండగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఒక కుర్రాడు చెప్పు విసిరాడు. ఈ కుర్రాడికి ప్రత్యేకంగా ఆగ్రహం అంటూ ఏదీ లేదు కానీ, విసిరే సమయానికి ‘రససిధ్ధి’ పొంది వున్నాడు.(‘మందు’ మీద వున్నాడు.)

ఇక బి.జె.పి ఆగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీ మీద అదే పార్టీకి చెందిన వ్యక్తి చెప్పులు విసిరారు. కారణం ఏదో కడుపు మంట అయి వుండాలి.

బూటే కదా, చెప్పే కదా- అని తీసి పారేయనవసరం లేదు.
ఆ రెంటికిందా (స్పెల్లింగు వేరయినా) ‘సోల్‌’ (ఆత్మ) ఒకటి వుంటుంది- అని చెప్పాడు ఎప్పుడో ఓ ప్రసిధ్ధ రష్యన్‌ రచయిత.
కానీ, మన దేశంలో వీటికింద ‘ఆత్మ’ మాత్రమే కాదు, ‘ఆత్మ గౌరవం’ కూడా వుండిపోయింది.

కారణం చిన్నదే.
మిగిలిన దేశాలలో చెప్పులు కుటుకునేే వారిని శ్రామికుల్లాగానే చూశారు. కానీ మన దేశంలో మూడువేల సంవత్సరాల పాటు, ‘అంటరాని వారి’ గా చూశారు. చూస్తున్నారు. అడిగే నాథుడు లేక పోతే మరో మూడువేల ఏళ్ళపాటు చూస్తారు కూడా. అలాంటి భారతంలో ‘బూట్‌ పాలిష్‌ గాళ్ళు’ అని అన్నప్పుడు, అన్నవాడు ఎవరన్నది చూస్తారు. ఎవరిని అంటున్నారో కూడా చూస్తారు. పైనున్న వాళ్ళు కింద నున్న వాళ్ళని అన్నప్పుడు, ఖచ్చితంగా కింద వాళ్ళ గాయాలను రేపినట్లే అవుతుంది.

రెండు దశాబ్దాల క్రితం ఇదే ‘వర్ణ’ భారతంలో, ‘బూట్‌ పాలిష్‌ చెయ్యటం’ వార్తల్లోకి ఎక్కింది. మండల్‌ సిఫారసుల అమలు కారణంగా ఉద్యోగాలన్నీ కింది వర్ణాల వారికి వెళ్ళిపోతే, పై వర్ణాల వాళ్లు ఏం చెయ్యాలి? ఇదీ అప్పుడొచ్చిన ప్రశ్న. ‘ప్రతిభ’ను రక్షించాలంటూ, అగ్రవర్ణ విద్యార్థులు కొందరు రోడ్లెక్కారు. నిరసనగా దారిన పోయే వాళ్ళను ఆపి వాళ్ళ బూట్లకు పాలిష్‌ చేశారు.(అంటే, బూట్‌ పాలిష్‌ చేసుకునే మీరు మంచి మంచి ఉద్యోగాల్లోకి వచ్చేస్తే, మంచి మంచి ఉద్యోగాలకు పెట్టి పుట్టిన మేం బూట్‌ పాలిష్‌ చేసుకోవాలా- అన్న సంకేతాన్ని పంపారు) ఈ చర్య ఎవరిని కించపరచాలో వారినే కించ పరిచింది.అట్టడుగు వర్గాల వారు ఇదేమిటని- విస్తుబోయారు.

‘సకల జనుల’కూ నేతలమని చెప్పుకునే వారు, ఆ సకల జనుల్లో బహుజనులు అట్టడుగు వర్గాల వారు వుంటారనీ, సగానికి సగం స్త్రీ మూర్తులుంటారనీ స్పృహే వుండదు.
ఇంకా ‘గాజులు తొడిగించుకున్నామా..?’ అని అడిగే ‘మగ మహారాజులు’ మన నేతల్లో ఎంత మంది లేరు?( అంటే పౌరుషం పురుషులకే మాత్రమే వుంటుందనీ, పిరికితనం ఆడవాళ్ళకే చెల్లుతుందనీ మధ్యయుగాల విశ్వాసాలను వీరు ఇంకా మోసుకు తిరుగుతుంటారు.) వీరెవ్వరూ ఇలా అనటం ద్వారా స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నామని క్షణమైనా ఆలోచిస్తారా? అదేమంటే ‘ఉద్దేశ పూర్వకంగా అనలేదు’ అని సమర్థించుకుంటారు.

ఆ మధ్య ఇలాగే ఒక నేత ఎ.పి.భవన్‌లో అట్టడుగు వర్గాలకు చెందిన ఓ ఉద్యోగి మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన తీరిగ్గా చింతిస్తూ, ‘ఆ ఉద్యోగి ఆ వర్గాలకు చెందిన వాడు-అని నాకు కొట్టేటప్పుడు తెలీదు’ అన్నాడు.

అంటే ఉద్యోగుల్లో ఈ వర్గాల వారు కూడా వుంటారన్న స్పృహే సదరు నేతలకు వుండదన్నమాట.
ఇలాంటప్పుడే అనుమానం వస్తుంది- ఈ అసమ సమాజంలో ఉద్యమ ఫలితం ఎవరికి దక్కుతుందని..!?
(ఆంధ్రభూమి దినపత్రిక16 అక్టోబరు 2011సంచిక లోప్రచురితం)
-సతీష్‌ చందర్‌

1 comment for “చెప్పు కింద ‘ఆత్మ’!

Leave a Reply