‘చెయ్యి’ ఊపండి! ‘కారు’ ఆగుతుంది


kcrపాత ఫ్రిజ్జు
తెచ్చుకోండి. కొత్త ఫ్రిజ్జు తీసుకు వెళ్ళండి. ఇది వాణిజ్య ప్రకటన.

పాత కారు తెచ్చుకోండి. కొత్త కారు తీసుకువెళ్ళండి. ఇదీ వాణిజ్య ప్రకటనే అనుకుంటున్నారా? కాదు. ఇది రాజకీయ ప్రకటన.

III III III

మీ మొబైల్‌ నెంబరు అదే వుంటుంది. మీరు ఏ సర్వీస్‌ ప్రొవైడర్‌ దగ్గర వున్నా వెంటనే ‘టాటా డొకోమో’కు మారండి. ఇది వాణిజ్య ప్రకటన.

మీరు కూర్చున్న కుర్చీ మారదు. కాకుంటే కుర్చీ మీద వున్న స్టిక్కర్‌ మారుతుంది. మీరు ఏ స్టిక్కర్‌ తో వున్నా, ‘గులాబీ’ స్టిక్కర్‌లోకి మారండి. ఇదీ రాజకీయ ప్రకటనే.

III III III

‘తాతా! నడిచి వెళ్తున్నావే! రా నేను దిగబెడతాను’

‘లేదు బాబూ! నేనూ టీఆర్‌ఎస్‌లో చేరాను. ఓ ‘కారు’కు యజమానినయ్యాను.’

ఇది రాజకీయ వాణిజ్య ప్రకటన.

నేడు మార్కెటింగ్‌ లేకుండా ఏ వస్తువునూ విక్రయించలేం. కడకు రాజకీయాన్ని కూడా. ఈ రహస్యాన్ని అన్ని పార్టీల వారూ గుర్తించి ఊరుకున్నారు. కానీ, టీఆర్‌ఎస్‌ అధినేత అమలు చేశారు.

ఓ బంపర్‌ స్కీమ్‌ పెట్టారు. ఈ స్కీము కాంగ్రెస్‌ ఎంపీలకు వర్తిస్తుంది. తాము కనుక ‘చేతి’కి చెయ్యిచ్చేసి. ఎకాఎకిన వచ్చేసి టీఆర్‌ఎస్‌ ‘కారు’ ఎక్కేస్తే, వారిదే ఏ నియోజకవర్గమో, ఆ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారవుతుంది.

‘ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 27 వరకే! ఆలస్యం చేస్తే ఆశాభంగం!!’ అని కూడా ప్రకటన చివర్లో వివరించారు.( ఆ తేదీనే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు లెండి.)

ఈ ప్రకటనకు స్పందన లేకుండా పోలేదు. కేకే ఎలియాస్‌ కే.కేశవరావు అయితే ముందే వున్నారు. మంద జగన్నాథం కొంచెం ఊగారు. ఇంకొందరుగా తొంగి చూశారు. మరి కొందరు వాలి చూసినట్టుగా భ్రమ కల్పించారు.

అయితే కేసీఆర్‌ మదిలో ఇలాంటి మెరుపులాంటి ఆలోచన రావటానికి కారణమేమిటి? కేవలం వచ్చే లోక్‌సభలో తన పార్టీ సంఖ్య పెంచుకోవటానికేనా? ఇలా చేస్తే నిజంగా పెరిగి పోతుందా? మరి శాసన సభ్యుల మాటో? అందుకు కూడా ఇదే స్కీము వర్తిస్తుందా? వర్తించ వచ్చు కూడా.

ఎందుకంటే తెలంగాణ ‘సెంటిమెంటు’ పై వచ్చే వోటు మీద టీఆర్‌ఎస్‌ గుత్తాధి పత్యాన్ని కోల్పోయింది. అందుకు నిదర్శనాలు అనేకం:

– మహబూబ్‌ నగర్‌ శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలిచారు

-కడకు స్వతంత్ర అభ్యర్థి గా నాగం జనార్థనరెడ్డి ‘సెంటిమెంటు’కు వారసుడయ్యారు.

– పరకాల స్థానంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ దాదాపు టీఆర్‌ఎస్‌ పీక మీద కత్తి పెట్టేసింది.

– టీఆర్‌ఎస్‌ కు మద్దతును ఇస్తూనే ‘టీజాక్‌’ రాజకీయ స్వయం ప్రతిపత్తిని నిలుపుకుని ‘సెంటిమెంటు’లో సింహభాగాన్ని స్వీకరించింది.

-ఇటీవల అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా, కాంగ్రెస్‌నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ, ‘జంప్‌’ చేసిన వారంతా వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి దూకారు కానీ, తెలంగాణ నుంచి ఒక్క శాసన సభ్యుడూ టీఆర్‌ఎస్‌లోకి దూక లేదు.

– తెలంగాణ ఏర్పాటు పై టీఆర్‌ఎస్‌ కొత్త తేదీలను ప్రకటించే స్థితిలోలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ఉలకటం లేదు. పలకటం లేదు.

ఇలా గిరాకీ తగ్గుముఖం పడుతున్నప్పుడు, ఇలాంటి ‘దగ్గర పధ్ధతుల్ని’ సహజంగానే పార్టీ అధినేతలు ఆశ్రయిస్తారు. అందుకే ఈ పథకాన్ని ముందు పార్లమెంటు సభ్యులతో ప్రారంభించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకూ ఎలంటి స్కీమూ ప్రవేశపెట్టలేదు. ‘అందులోకి వెళ్ళినా ఇందులో వున్నట్లే’ అని భావిస్తుందేమో!!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 20-26 ఏప్రిల్ 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “‘చెయ్యి’ ఊపండి! ‘కారు’ ఆగుతుంది

Leave a Reply