పిలిచి పదవులిస్తానన్నా పారిపోతున్నారు ఎమ్మెల్యేలూ, ఎంపీలు. ఇదెక్కడి విడ్డూరం- అంటూ విస్తుపోతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్.
ఇవ్వాలనుకుంటే, నామినేటెడ్ పదవులు చాలా వున్నాయి. మంత్రి వర్గంలో కూడా మరికొన్ని బెర్తుల్ని సృష్టించ వచ్చు. ఇన్ని తాయిలాలు వున్నా, కాంగ్రెస్ ప్రజాప్రతినిథులు, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ వైపూ, తెలంగాణలో టీఆర్ఎస్ వైపూ పరుగులు తీస్తున్నారు.
‘బతికుంటే బలిసాకు తినొచ్చు’ అన్న చందంగా, ‘మళ్ళీ ఎన్నికయితే మాజీ కాకుండా బతకొచ్చు’ అనుకుంటూ దూకేస్తున్నారు.
ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజకీయాలనే చూస్తే చూడొచ్చు కానీ, ఎంపీలు మాత్రం దేశ రాజకీయాలు చూస్తారు. వైయస్సార్ కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా కేంద్రంలో ఎలాగూ (కాంగ్రెస్ నేతృత్వంలోని) యుపీయే కే కదా – మద్దతు ఇచ్చేదీ – అన్న భరోసా వుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ వైఖరిలో పెద్ద మార్పేమీ రాక పోయినా, టీఆర్ఎస్ మాత్రం మెల్లగా (బీజేపీ నేతృత్వంలోని) ఎన్డీయే వైపు మొగ్గు చూపుతోంది.
విచిత్రం! టీఆర్ఎస్ అధినేత, కొన్ని రోజుల క్రితం వరకూ రాష్ట్రంలో బీజేపీని తిట్టి పోశారు. అంతే కాదు మహబూబ్ నగర్ ఉప ఎన్నికప్పుడు, బీజేపీకి మద్దతు పలికారని జీజాక్ నేత కోదండరామ్‌ను తప్పు పట్టారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రియమయి పోయింది.
ఈ మార్పునకు ప్రధాన కారణం వైయస్సార్ కాంగ్రెస్సే. ఈ పార్టీ తెలంగాణలో చొరబడితే (ఇప్పటీకే చాలా దూరం వచ్చేసింది) వాతావరణం తల్లకిందులయినా కావచ్చు- అనే అంచనాకు కేసీఆర్ వచ్చేశారు. దానికి తోడు కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెస్ వైపునకు వచ్చేసింది. వీరిద్దరూ కలిస్తే, ఇటు హైదరాబాద్‌లోనూ, అటు తెలంగాణలోనూ పాతుకు పోతారని కూడా కేసీఆర్ ఆందోళన చెందినట్టున్నారు. అదీకాక తెలంగాణ సమస్యకు ఇప్పుడూ, ఎప్పుడూ హైదరాబాద్ కీలకమవుతుంది. ఇలా భావించిన మరుక్షణం- ముస్లిం మైనారిటీల వోట్ల మీద ఆయన ఆశలు వదలుకొని వుంటారు. ముస్లిం మైనారిటీల వోట్ల కోసం, మహబూబ్‌నగర్‌లో మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టటమే కాకుండా, ఒక దశలో నిజాం నవాబును ను కూడా కేసీఆర్ పొగిడారు. ఇప్పుడు ఇందుకు పూర్తి విరుధ్దంగా మెజారిటీ హిందూత్వ మతతత్వ ముద్ర వున్న బీజేపీ వైపు జరిగారు. టీఆర్ఎస్ తర్వాత, నిర్ద్వంద్వంగా ప్రత్యేక తెలంగాణ కోరుతున్న పార్టీ బీజేపీ. ఎందుకంటే, ఈ రెండు పార్టీలకూ సీమాంధ్ర వోట్లతో సంబంధం లేదు. బీజేపీకి ఆ ప్రాంతపు వోట్ల మీద మోజు వున్నా, బలం లేదు. ఇప్పుడు ఈ రెండూ కలవటం వల్ల, ‘సీమాంధ్ర’ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టటం సులభం అవుతుందని భావించి వుంటారు. మైనారిటీల మీద ద్వేషం పెంచి మెజారిటీ హిందువుల వోట్లను మూటగట్టుకోవాలనుకునే రాజకీయాలను చార్మినార్ పక్కన వివాదస్పద ‘భాగ్యలక్ష్మి’ ఆలయ వివాదం తో రాష్ట్రంలో తెరలేపింది.
కేసీఆర్ ‘ఖద్దరు’ తీసి, ‘కాషాయం’ ప్పుకునే సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వం లో ఎక్కువ భాగం నరేంద్ర మోడీ వైపు మొగ్గింది. గుజరాత్ అల్లర్ల సాక్షిగా ఆయన ‘ముస్లిం వ్యతిరేకత’ ను పెంచి మెజారిటీ హిందువుల వోట్లను మూట గట్టుకున్న చరిత్ర ఆయనకున్నది. ఆయనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అయితే, దేశమంతటా ఇదే తంతు నడుస్తుంది.
టీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణ గురించి ఏదో ఒక్కటి చెప్పాలని నిర్ణయించుకున్నట్టున్నది. అందుకోసమే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశ వెయ్యటానికి అంగీకరించారు. అయితే కేవలం ఈ సమావేశం వల్ల ‘వలసలు’ పూర్తిగా ఆగవు. ఏదో ఒక కార్యచరణ అనివార్యమవుతుంది.
ఈ స్థితిలో తెలంగాణలో కాంగ్రెస్ నేతల వలసల్ని ఆపటానికి ‘తెలంగాణకు ప్యాకేజీ’ పేరు మీద పెద్ద యెత్తున నిధులను విడుదల చేయవచ్చు. వీటిని ముందు అందరూ వ్యతిరేకించినా, ఈ నిధులు వేర్వేరు రూపాల్లో ప్రజలకు చేరే సరికి కొంత అనుకూల స్థితి ఏర్పడవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక సీమాంధ్రలో వైయస్సార్పార్టీ వైపు వెళ్ళకుండా వుండేందుకు, పెద్ద యెత్తున ‘సంక్షేమ పథకాల’ను ప్రకటించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళికు చట్ట బధ్ధతతో పాటు, మెస్ చార్జీలు పెంచారు. అంతే కాకుండా, సీమాంధ్ర జిల్లాలలో కొన్ని తుపాను బారిన పడ్డాయనో, కొన్ని కరవు బాధ పడ్డాయనో నిధులను కుమ్మరించే అవకాశం వుందని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అంటే పైసలు చిమ్మటంలో ‘చేతి’కి ఎముక వుండదన్నమాట!
అయితే అక్కడ సానుభూతినీ, ఇక్కడ సెంటిమెంటునీ- కేవలం పథకాలతోనూ, ప్యాకేజీలతోనూ ఎదుర్కోవటం సాధ్యమేనా?
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంద్ర వార పత్రిక 8-16 డిశంబరు 2012 సంచికలో ప్రచురితం)
rupayi palasanaipoyindi..patalaniki jaaripotondi..prajalu pakka swardaparuluga maararu..masipusi mareyudukaya antene jai kottela vunnaru sir