‘టిప్పు’లాడి- ‘మనీ’హరుడు

ఒక ఐడియా కాదు,

చిన్న పొగడ్త మీ జీవితాన్నే ఆర్పేస్తుంది.

ఓ సగటు పిల్ల- పెద్ద అందగత్తె కాదు, పెద్ద చదువరీకాదు- పడి పోయింది. ప్రేమలో కాదు. పొగడ్తలో.

ఆమె అసలే. ‘టిప్పు’లాడి. నలభయి రూపాయిల కాఫీ తాగి, అరవయి రూపాయిలు ‘టిప్పి’స్తుంది. కారణం ఎవరో చూస్తారని కాదు. ‘మీరు దేవత మేడమ్‌’ అన్న ఒక్క మాట కోసం.

ఇది చూసిన ఓ ‘మనీ’హరుడు (అసలు పేరు మనోహరుడు లెండి) ఆమెను సులభవాయిదాల్లో పొగడుదామని నిర్ణయించేసుకున్నాడు. ఏముంది? మూడు రోజలు వెంటపడ్డాడు.

ఓ రోజు తెగించేశాడు. ‘నేను మీకు నచ్చని మాట ఒకటి అనబోతున్నాను. ముందుగా నన్ను శిక్షించేయండి. మీ మెత్తని మీ చెప్పుతో కొట్టేయండి.’

వాణ్ణి తేరి పారి చూసింది ఆ ఆమ్మాయి. ఒక యాంగిల్‌ సంస్కారిలాగా, ఇంకో యాంగిల్‌లో బికారిలాగా కనిపిస్తున్నాడు. కానీ పోకిరీ అంతా గొప్పగా లేడు లెండి. (పోకిరీలూ, జులాయిలూ హీరోలకు పర్యాయపదాలు కదా!)

‘చెప్పు.’ అంది. కానీ తీయలేదు లెండి చెప్పు.

‘అప్పు’ అన్నాడు ‘మనీ’ హరుడు

అనుమానంలేదు. వీడు బికారే అనుకుంది.

‘ఎంత?’

‘ఒక్క నవ్వు.’

ఆమె నవ్వేసింది.

‘చాలు. దీంతో బిటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ అంగా బతికేస్తాను. అదేమిటండి బాబూ, అంత మెత్తగా.. మరీ మల్లె పువ్వులాగా నవ్వేశారు!?’ అని ఆశ్చర్య పోయాడు.

చెక్కును నగదు గా మార్చుకున్నంత తేలిగ్గా ఆ నవ్వును లవ్వుగా మార్చేసుకున్నాడు. ఆ లవ్వే, తన మధ్యతరగతి విద్యార్థి బతుక్కి సంక్షేమ పథకమయింది.

తన వంట తాను చేసుకునే ‘మనీ’ మోహనుడికి గ్యాస్‌ బండ ఖాళీ అయితే చాలు, టిప్పులాడికి మొబైల్‌ కొట్టేవాడు. ‘నేను జస్ట్‌ మాట్లాడమన్నాను. ముత్యాలు రాలుస్తావేమిటి?’ అనేవాడు. అంతే మరుక్షణం ‘టిప్పు’లాడి గ్యాస్‌తో ప్రత్యక్షమయ్యేది.

కాలేజీకి వస్తుండగా నడిరోడ్డు మీద పెట్రోలు లేక బైక్‌ ఆగిపోతే, మళ్లీ టిప్పులాడికి ఫోను. ‘ఎండలో వున్నాను. నీ కురులతో గొడుగు పట్టవా?’ అంటాడు. ఆమె సీసానిండా పెట్రోలు నింపుకుని కారు మీద నడిరోడ్డు మీదకు వస్తుంది.

ఒక్కో పొగడ్తకు ఒక్కో ఒక్కో వరం. ‘ప్రియాకర్షక’ వరం- ఇస్తూ పోతుంది.

ఇలా ఇవ్వక పోతే ఏం కొంప మునుగుతుంది? తాను ఇచ్చిన వరాల లెక్క చూసుకున్నప్పుడు ఇలాంటి చిలిపి ఆలోచన వచ్చింది.

తానూ ఫైనలియరే చదువుతుంది. విద్యాసంవత్సరం ముగియటానికీ పరీక్షలు రావటానికీ ఇంకా ఆరు నెలలు వుంది. ఆ తర్వాతే కదా పెళ్ళి! కొన్నాళ్ళు ఈ వరాలను ఆపి, పరీక్షలకు నెలముందు మళ్ళీ పరాల పునరుధ్దరణ చేయాలనుకుని ‘టిప్పు’లాడి నిర్ణయించుకుంది.

అతడిలో పెద్ద మార్పేమీ రాలేదు. అదే ఫోను. అవే పొగడ్తలు. కాకుంటే చిన్న తేడా: ‘హలో డియర్‌! ఒక్క సారి స్పీకర్‌ ఆన్‌ చేసి మొబైల్‌ మీపక్కనున్న రోజాకి ఇస్తారా?’ అని చెప్పి మరీ పొగడే వాడు ‘టిప్పు’లాడి వినేలా.

‘ఒక్క నవ్వు అప్పుకావాలండీ. మీ పేరు రోజా కావచ్చు. కానీ మీరు నవ్వితే రోజాలు రాలవు. మల్లెలే రాలతాయి.’

అప్పుడు చూడాలి ‘టిప్పు’లాడి ముఖం. ఉప ఎన్నికలో ఓడిపోయిన ‘సిట్టింగ్‌ కేండిడేట్‌’ ముఖం లాగే వుండేది.

అప్పుడు ఆమెకు తత్త్వం బోధపడింది. ప్రియుడు వరుడవ్వటం అంత ఈజీ కాదు. అసలు వరుడంటేనే అర్థం వేరు.

వరించు వాడు వరుడు కాడు; వరాన్ని స్వీకరించువాడే వరుడు.

వరమివ్వటం ఆపేసిన మరుక్షణం అతడు మాజీ ప్రియుడవుతాడు తప్ప, వరుడు కాలేడు.

కానీ, ఎంత ‘టిప్పు’ లాడయితే మాత్రం ఎలా శాశ్వత ప్రాతిపదికన ఎన్నాళ్ళివ్వగలదు.

మొత్తం మూడు నెలలకూ వాడి వంట గ్యాస్‌ మీదా, పెట్రోలు మీదా, కరెంటు మీదా, పప్పుల మీదా, ఉప్పుల మీదా ఖర్చుపెట్టినదంగా లెక్కవేస్తే ముఫ్పయి వేలు అయ్యింది.

వరమిద్దాం కానీ, వస్తురూపంలో కాదు; నగదు రూపంలోనే ఇచ్చేద్దాం.

నెలకి మూడువేలు నేరుగా నగదు ఇచ్చేస్తే, టిప్పుతీసుకున్న బేరర్లా శాశ్వతంగా వుంటాడు.

కరెంట్‌ ఫ్యూజ్‌ పీకేసిన ఇంట్లోని బ్యాచిలర్‌ చేతిలో మూడు వేలు పడవేస్తే, దాంతో బుద్దిగా కరెంటు బిల్లు కట్టాలని రూలెక్కడా లేదు. కొవ్వొత్తులు వెలిగించి, సాటి మిత్రులను పిలుచుకుని ఎంచక్కా ‘బీరులు’ కూడా పొంగించ వచ్చు. అప్పుడు వాడి ఆనందం మాములుగా వుండదు. ఎప్పుడూ పొంగుతూనే వుంటుంది.

ఒకటో తారీఖు వస్తే చాలు, ‘మనీ’ హరుడి అక్కౌంట్లో అలా మూడు వేలూ పడిపోయేవి.

నగదు బదలీ మహత్మ్యమే అంత.

సర్కారు చేసిన పనే ‘టిప్పు’లాడీ చేసింది. కానీ ప్రియుడు చూపిన విధేయతను రేపు వోటరు చూపిస్తాడో లేడో…!?

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 13-1-13 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “‘టిప్పు’లాడి- ‘మనీ’హరుడు

  1. ఓటరెప్పుడూ గ్రేటరే. టిప్పు’లాడి”కి బాడి తప్ప జోడీ ఉండదు. పొగడ్తల రైన్ లో తడిసి బ్రెయిన్ నాని పోతుంది. ఉబ్బి టబ్ అంత అవుతుంది. మనీ ట్రాన్స్ఫర్ కాదు చివరకు డాన్సర్ అయి అకౌంట్ లో చేరకుండా కౌంటర్ వద్దనే చెక్ కర్లు కొడుతుంటుంది. ఆల్ ‘ఫ్రీ’ డాం అంటుంది. రాయితీలుచ్చుకున్నోళ్ళే రాళ్ళతో కొడతారు. వంటింట్లో బండ పగుల్తుంది. ఇంటి రెంట్ పెరిగి కరెంట్ మంటపుడుతుంది.చదువుల ఫీజులు మాడిపోతాయి. జీతాలు చాలక జేవితాలు వాతలు తేలతాయి.వ్యాట్ బాటింగ్ తో అన్నీ సెక్సర్లే! ప్రాజెక్టులు రిజక్టవుతాయి. ఊర్లలో బీర్లు పారతాయి. ‘షి’కారుకు లోనిచ్చి విండోకు అప్పు నోటు అటుకుతారు. ఓడ్కాల ఓదార్పులు, సామాజిక న్యాయం చేతికి టిప్పవుతుంది. వస్తున్నానంటూ రాస్తాలన్నీ మూసేస్తారు.అసెంబ్లీ అంతా జంబ్లింగ్ గాంబ్లింగ్. ప్రత్యేకం సమైక్యంగా ఓడిపోతుంది.’తోకలు’ పీకుతాయి. సత్తా పత్తా ఉండదు. టిక్కెట్లు డిల్లీలో, ఇక్కట్లు గల్లీల్లో.అమూల్ బేబీకి అమ్మకాలుండవు. రాహుగండమే. పెళ్లవుతేకాని. పిచ్చికుదరదు. నాలుగోపడిలో పిల్లెక్కడ దొరకు(?)తుంది. ప్రధానం మరింత నిదానం. ఈలోగా మోడీ వేడికి మూడు మారి మాడుమాడిపోతుంది.. జన నేతగాళ్ళతో .జైళ్లన్నీ కిక్కిరిసి ఉక్కిరిబిక్కిరి.ముందుంది నో(వో)ట్ల పండగ.. ప్రయత్నాలన్నీ దండగ.. దండుకునే దండ్లు రోడ్లేక్కుతాయి.

  2. మనసు బదలీ పధకం ముందు నగదు బదలీ పధకం గల్లంతైపోతుందని గుడిసింటి ఓటరే అంటున్నాడండీ. “మూడు పార్టీల దగ్గరా ఇచ్చనంతా పుచ్చుకుని ఓటు బదలీ చేసేది ఒక్కరికే గదా! హ్హఁహ్ఙఁహ్హాఁ” అని ఎటగారంగా నవ్వుతున్నాడు కూడా.

Leave a Reply