టెలిగ్రామ్ ప్రేమలు వేరు

telegramటెలిగ్రామ్‌ చనిపోయింది.

అవును. టెలిగ్రామ్‌ ఎక్స్‌పైర్డ్‌.

టెలిగ్రామ్‌ మరణ వార్త అందించటమెలా? ఎవరయినా టెలిగ్రామ్‌ ఇస్తే బాగుండును.

టెలిగ్రామ్‌ ఉన్నదే అందుకు. టెలిగ్రామ్‌ అందుకున్న వారు షాక్‌ తినాల్సిందే. అందులో సందేశం అయితే అమితమైన దు:ఖమో, లేక అమితానందమో..!

‘టెలిగ్రామ్‌!’ అని అప్పటి ‘తంతి తపాలా శాఖ’ ఉద్యోగి గుమ్మం బయిట నిలబడితే, కుటుంబం కుటుంబం అంతా గుండెల్లో గుప్పెట్లో పెట్టుకునే వారు.

ఈ శాఖలో ఉద్యోగం చేయటం కూడా గొప్పగానే వుండేది. ‘తంతే, తపాలశాఖలో పడ్డాడు’ అని ఆ ఉద్యోగుల గురించి చెప్పుకునే వారు.

దూరప్రాంతాలనుంచి విలేకరులు వార్తల్ని టెలిగ్రామ్‌ల ద్వారానే పంపేవారు( వైర్‌ అనగా తంతి చేసేవారు.).

ఎప్పుడో 1855లో దేశంలో అధికారికంగా ప్రారంభమైన టెలిగ్రామ్‌ ఇక (15జులై 2013నుంచి)లేదని చెప్పటానికి విచారించాల్సి వస్తోంది. ఇప్పుడు ఎస్‌ఎమ్‌ఎస్‌లు వున్నాయి కదా, ఈ మెయిళ్ళు వున్నాయి కదా! అలా అంటే సినిమాలు వచ్చేశాయి కదా, ఇంకా నాటకాలు ఎందుకూ అన్నట్టుంది. రెంటిలోనూ నటన ఒక్కటి కానట్టే, నిన్నటి ‘తంతి’కీ, నేటి ఎస్‌ఎమ్‌ ఎస్‌కీ తేడా వుంది. రెంటిలోనూ పంపేది ‘సంక్షిప్త సందేశమే’.

అతి తక్కువ పదాలతో అనంతమైన సమాచారాన్ని టెలిగ్రామ్‌ ద్వారా పంపేవారు. పదానికింత- అని చార్జి వుంటుంది లేపేస్తే మొత్తం పదాన్ని లేపెయ్యాలి. కానీ ఎస్సెమ్మెస్‌ అలా కాదు. ఎస్సెమ్మెస్‌ ఇచ్చేవాళ్ళ మసనుల్లో చార్జీల సంగతే గుర్తుండదు. ఉన్నా నామ మాత్రం. అయినా సరే. తెలీకుండా సంక్షిప్తత వుంటుంది. దీని వల్ల వీరు లేపేది పదాలను కాదు. అక్షరాలను. దాంతో ప్రతీ (ఇంగ్లీషు) మాటకూ కొత్త వర్ణక్రమాలు(స్పెల్లింగులు) వచ్చేశాయి. అంతే కాదు. అక్షరాల్లోకి అంకెలు చొరపబడ్డాయి. ఇప్పుడంతా ‘లెక్కల్లో’ మనుషులు కదా! ‘ఫర్‌’ అనటానికి ‘నాలుగు'(4) అంకె, టీ,వో-టూ అనటానికి కూడా ‘రెండు'(2)అంకె వేసేస్తున్నాం. అలవాటు ప్రకారం విద్యార్థులు పరీక్షల్లో కూడా ఇవే స్పెల్లింగులు రాస్తున్నారని వీళ్ళ పేపర్లను దిద్దే ఆచార్యులు గగ్గోలు పెడుతుంటారు.

అయితే ఏమాటకా మాటే చెప్పుకోవాలి. టెలిగ్రామ్‌ స్పెల్లింగుల్లోనూ అప్పుడప్పుడూ తప్పులొచ్చేవి. మన పత్రికల్లో దొర్లే అచ్చుతప్పుల్లాగా.

భార్య లండన్‌లో రెండేళ్ళు వుండి తిరిగి వస్తోంది. భర్త బెజవాడలో వుంటున్నాడు. ముంబయి ఓడలో వచ్చిన ఆమె, అక్కడనుంచి రైలులో రావలసి వుంది. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న భర్తకు టెలిగ్రామ్‌ వచ్చింది. ‘గేవ్‌ బర్త్‌ టు ఎ చైల్డ్‌. నాట్‌ కమింగ్‌’ ( బిడ్డకు జన్మనిచ్చాను. రావటం లేదు). రెండేళ్ళ ఎడబాటు తర్వాత ఈ వార్త ఎంతటి ‘షాక్‌’ ఇస్తుంది? ఎలాంటి అపార్థాలకి తావిస్తుంది? భర్త కోలుకుని విడాకులివ్వాలని నిర్ణయించేసుకుని, అదే పనిలో వున్నాడు. కానీ మూడు రోజులు తిరక్కుండానే భార్య వచ్చేసింది. కానీ ఆమె చేతిలో బిడ్డలేదు. ‘బిడ్డ ఏమయిందీ?’ అని ఆమె ఆరా తీస్తే ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆమె పంపిన టెలిగ్రామ్‌ తీసి ఆమెకే చూపాడు. అప్పుడు ఆమె ఒక్కటే నవ్వు. ‘బెర్త్‌’ (దీజు=ున) అని రాయటానికి బదులు ‘బర్త్‌’ (దీI=ున ) అని రాసివుంది. జరిగిందేమిటంటే, ఆమె ముంబయిలో రెలు ఎక్కేసరికి, ఓ కుర్రవాడు(చైల్డ్‌) బెజవాడ పరీక్ష నిమిత్తం అర్జెంటుగా వెళ్ళవలసి వస్తే, ఈమె తనకు రిజర్వ్‌ అయిన రెల్వే బోగీలోని ‘బెర్త్‌’ను అతడికి ఇచ్చేసింది.

అంతెందుకు? ఉద్యోగ నిమిత్తమో, పెళ్ళిళ్ళు చేసుకునో దూర ప్రాంతాల్లో వుండి పోయిన మనుమల్నీ, మనుమరాళ్ళనీ చూసుకోవాలనున్నప్పుడు, బామ్మలూ, తాతయ్యలూ టెలిగ్రామ్‌నే వాడుకునే వారు.

వారు ముందు మర్యాదగానే ‘పోస్టు కార్డో’, ‘ఇన్‌లాండ్‌ లెటరో’ రాసేవారు. (చూశారా! ఇవికూడా టెలిగ్రామ్‌ కన్నా ముందుగానే అంతర్థానమయి పోయాయి.) వాటిల్లో మాత్రం- ‘నేను క్షేమం. నువ్వు అక్కడ క్షేమంగా వుంటావని తలుస్తాను’ అని ఇలా ‘క్షేమ సమాచారం’తోనే మొదలయ్యేది. క్షేమంగా వుంటే చూడ్డానికి వస్తారా? రారు కదా! అంతే అప్పుడు ‘తంతి’ పంపేవారు. అది కూడా వేరేవారెవరో ఇచ్చేవారు. ఏమనీ..? ‘గ్రాండ్‌ మదర్‌ సీరియస్‌. స్టార్ట్‌ ఇమ్మిడియట్లీ’-అని. ఆరోజుల్లో ‘సీరియస్‌’ అన్నారంటే అంతే సంగతులు. దాంతో ‘బామ్మా! నన్ను వదలి వెళ్ళిపోతావటే బామ్మా!’ అని బస్సుస్టాండునుంచే ఏడ్చుకుంటూ వచ్చేవాడు మనవడు. బామ్మ మాత్రం బోసి నవ్వుల్తో వాడిని ఆహ్వానించేది. మనవడి చేత తిట్లూ, తన్నులూ కూడా తినేదనుకోండి. ఇలా బెంగలు తీర్చిన టెలిగ్రామ్‌ ఇక ఉండబోదంటే, వెలితిగా వుండదూ..!

టెలిగ్రామ్‌ సర్వీసును ఇతర దేశాల్లో( న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా,జర్మనీ) వంటి దేశాల్లో ముందే మూస్తే మూసి వుండవచ్చు. మనదేశంలో ఈ సర్వీసు ఇప్పటి బిఎస్‌ఎస్‌ఎల్‌కు కిట్టుబాటు కాక పోయి కూడా వుండవచ్చు. ఈ పరిణామం మన దేశానికీ అనివార్యం కావచ్చు.

కానీ, టెలిగ్రామ్‌ పోతుందంటే, మన కన్నీళ్ళలోనూ, నవ్వుల్లోనూ కొన్నింటిని ఎవరో అపహరించుకు పోతున్నట్లే అనిపిస్తోంది..!!

-సతీష్ చందర్

(ఆంధ్రభూమి దినపత్రిక 16 జూన్ 2013 సంచికలో ప్రచురితం)

 

2 comments for “టెలిగ్రామ్ ప్రేమలు వేరు

Leave a Reply