డాక్టర్‌. డెత్‌. ఎం.బి.బి.యస్‌!

శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌లూ, మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌లూ తెరమీద నుంచి జీవితంలోకి వచ్చేస్తే ఎలావుంటుంది. హింసే ఔషధంగానూ, హత్యే చికిత్సగానూ మారిపోతుంది. ‘ఆయువు’ని పోయటం కాకుండా ‘ఆయువు’ని తీయటమే ఆయుర్వేదం అయిపోతుంది. ‘హోమ్‌’ నుంచి ‘టూంబ్‌’కి పంపించటమే హోమియో పతి అయిపోతుంది. వల్లకాడికి దారి చూపటమే అల్లోపతి అయిపోతుంది.

వైద్యుడే నారాయణుడంటారు. వీరు చెప్పేదీ కూడా అదే. తమ దగ్గరకు వచ్చినప్పుడెల్లా, దేవుణ్ణి తలచుకోండని. వెనకటికి గొప్ప రాజకీయ విశ్లేషకులూ, నటులూ, ‘తుగ్లక్‌’ పత్రిక సంపాదకులూ అయిన చో.ఎస్‌.రామస్వామి తన ‘గుండు’ గురించిన రహస్యం చెప్పారు. (ఆయనెప్పుడూ నున్న గొరిగిన గుండుతోనే వుంటారు.). ‘ఎందుకు మీరు ఎప్పుడూ గుండుతోనే వుంటారు?’ ఒకసారి ఎవరో ఆయన్ని పబ్లిగ్గా అడిగేశారు. అప్పుడు చేసేదీ లేక అంతవరకూ దాచిన ఆయన ‘గుండు గుట్టు’ని రట్టు చేశారు: ‘నా తలకు చుండ్రు వుండేది. అన్ని రకాల వైద్యాలూ ప్రయత్నించా. అలోపతి ప్రయత్నించా. పనిచెయ్యలేదు. నేచురోపతి ట్రై చేశా. అబ్బే. లాభంలేక పోయింది. హోమియో పతి వాడాను. తగ్గలేదు. ఇక లాభంలేదని ఫైనల్‌గా… ‘తిరు’..పతి వాడాను. ఇదుగో ఇలా సుఖంగా వున్నాను.

సంపూర్ణంగా దేవుడి మీద భారం వేసేసి, శంకర్‌ దాదా లేదా మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ ల దగ్గరకి లక్షల మంది క్యూలు గట్టి వెళ్తున్నారు. వీరినీ ఇంగ్లీషులో ‘క్వాక్‌’లు అంటారు. మనం తెలుగులో మరీ అంత ముద్దు పేరు పెట్టుకోలేక పోయాం. అందుకే ‘నకిలీ వైద్యులు’ అంటున్నాం. వీరి ఉనికి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వుంటుంది. ఇటీవల ఒక నకిలీ వైద్యుడు ఏం చేశాడో తెలుసా? తన వైద్యం తాను చేస్తున్న క్రమంలోనే మనిషి మరణించాడు. గుట్టు చప్పుడు కాకుండా సదరు పేషెంటు దేహాన్ని కాల్చేసి, తానే అంత్య క్రియలు నిర్వహించాడు. అప్పుడు కానీ, పోలీసులకు హైదరాబాద్‌లో నకిలీ వైద్యులున్నారన్న సంగతి గుర్తుకు రాలేదు. అంతే శాంపిల్‌ గా కొన్ని గల్లీల్లో దాడులు చేస్తే, వందకు పైగా దొరికారు.

వారు అరెస్టు చేసిన వివరాలు చాలా ఆసక్తిదాయకంగా వున్నాయి. ఏడు తప్పిన వాడు ఎంబీబీయస్‌. పది తప్పితే ఏకంగా ఎండినే. ఆ మేరకు బోర్డులు తగిలించుకుని వైద్యాలు చేసేస్తున్నారు. దీంతో పోలీసు శాఖ, తెలంగాణ ఆరోగ్య శాఖ సరికొత్తగా విస్తుబోయాయి. ఇలాంటి వింతలు ఇప్పుడు మాత్రమే చూస్తున్నామన్నట్లు ప్రకటనలు గుప్పించాయి. 2009లోనే ఒక స్వఛ్చంద సేవా సంస్థ నిర్వహించిన సర్వేలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో( ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలలో) మొత్తం 1.5 లక్షలమంది ‘నకిలీ వైద్యులు’ వున్నట్లు తేలింది.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ , మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా దేశం మొత్తం మీదనే ఈ ‘క్వాక్స్‌’ సమస్య పెద్ద సవాలుగా వుంది.

పల్లెల్లో, పట్నంలోని శ్రామిక వాడల్లో తారసిల్లే నకిలీ వైద్యులు మూడు రకాలుగా వుంటారు:

మొదటి రకం: వైద్యంలో ఎలాంటి పట్టా లేకుండా వైద్యం చేసేవారు.

రెండవ రకం: ఆయుర్వేదం, హోమియోపతి వంటి వైద్య విధానంలో డిగ్రీ పొంది, ఆయా వైద్య రీతుల్లో కాకుండా, అలోపతి చికిత్స చేసేవారు.

మూడవ రకం: గుర్తింపులేని, అడ్రసు లేని సంస్థల ఇచ్చిన వైద్య పట్టాలను పెట్టుకుని వైద్యం చేయటం.

ఈ మూడురకాల వారు దేశం నిండా వున్నారు. కానీ దొరికిన వారే దొంగల్లా, పట్టుపడ్డ వారే నకిలీ వైద్యులుగా వుంటున్నారు. ఇందుకు రకరకాల కారణాలు వున్నాయి:

దేశంలో కనీసం ఎంబిబిఎస్‌ పట్టా పొందిన వైద్యులు తక్కువ గావున్నారు. ఆ తక్కువలో కూడా పలువురు ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఒక వేళ దేశంలోవున్న వారు కూడా పేదలకు అందుబాటులో లేని కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో తలదాచుకుంటున్నారు. దాంతో పల్లెలకూ, పటణాల్లో శ్రామికులు వుండే గల్లీలలకు వెళ్లే వైద్యుడే కరవుయ్యాడు. దాంతో నకిలీ వైద్యులకు జాగా దొరికింది.

అలాగే నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చటంతో, నాలుగు ఔషధాల పేర్లు తెలుసుకుని, ఇలా వైద్యం చెయ్యటం ఉపాధికి ఒకానొక దగ్గర మార్గంగా కనిపిస్తుంది.

వీటన్నిటికంటే, కార్పోరేట్‌ ఆసుపత్రులకు ‘ఏజెంట్లు’గా కూడా ఈ నకిలీ వైద్యులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా తీవ్రంగా కనిపిస్తున్నాయి.

తాము వైద్యం చేస్తున్న పేరు మీద రోగాన్ని ముదరబెట్టి, అంతిమంగా కార్పోరేట్‌కు పంపించి, కమీషన్లు దండుకుంటున్నారే ఆరోపణ వీరి మీద వుంది.

చౌక వైద్యం కోసం అర్రులు చాస్తున్న పేదలకు మృత్యువును బహూకరించకుండా వుండాలంటే, వీలయినంత వరకూ నకిలీ వైద్యుల బెడదను వదలించాలి. ‘స్వఛ్చ భారతం’ ఎంత ముఖ్యమో, ‘ఆరోగ్య భారతమూ’ అంతే ముఖ్యమని కేంద్ర, రాష్ట్రాలు భావించి తీరాలి.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 5-11డిశంబరు2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply