‘తాగే’ రూపాయి! ‘ఊగే’ రూపాయి!!

photo by Kevin H.

తాగటం వేరు. పుచ్చుకోవటం వేరు. రెండూ మందుకొట్టే ప్రక్రియలే. గ్లాసు ఒక్కటే. మాస్‌ వాడు కొడితే తాగాడంటారు. క్లాస్‌ వాడు కొడితే పుచ్చుకున్నాడంటారు.

తాగేవాడు వొళ్ళూ, ఇల్లూ గుల్ల చేసుకుంటే, పుచ్చుకునే వాడు జాగ్రత్తగా వొళ్ళుమాత్రమే గుల్ల చేసుకుంటాడు. ఇల్లు గుల్ల చేసుకునే వాడు ఏలిన వారికి ముద్దు. వాడే సర్కారును నడుపుతాడు. అధికారుల్నీ, అడపా దడపా మంత్రుల్నీ తడుపుతాడు. వాడే లేకుంటే ముడుపులూ లేవు, తడుపులూ లేవు. వాడి పేరు చెప్పుకునే.. కేట్లూ, డూప్లికేట్లూ, సిండికేట్లూ చక్రం తిప్పుతారు. తాగితే వాడికి పూట గడవక పోవచ్చు. అది వేరే సంగతి. కానీ, వాడు తాగక పోతే, ‘పార్టీ’యే లేదు. పార్టీలు లేకుంటే ప్రజాస్వామ్యమే లేదు.

ఒక్క తాగుబోతు మాత్రమే, మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎడా పెడా రక్షించగలడు. వాడు ఒక్క పూట తాగితే వోట్లు, అయిదేళ్ళూ తాగితే నోట్లే, నోట్లు. మన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కూడా, వాడు తూలితే నిలుస్తుంది; వాడు నిలిస్తే కూలుతుంది.

‘కిలోరూపాయి’ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కూడా ఈ రహస్యం తెలుసు. అందుకు 2012-13 బడ్జెట్టే సాక్ష్యం. బడ్జెట్‌ని వేళ్ళ మీద చెప్పేటప్పుడు ‘వచ్చే రూపాయి’, ‘పోయే రూపాయి’ అని చెప్పటం ఆనవాయితీ. కానీ మన రాష్ట్ర బడ్జెట్‌ని మాత్రం ‘తాగే రూపాయి’, ‘ఊగే రూపాయి’ అని చెప్పాల్సి వస్తుంది. పేద వాడు ఎంతగా తాగితే, బడ్జెట్‌ అంతగా వూగుతుంది. ఆర్థిక మంత్రి ఆనం మీద ఆన. ఈ బడ్జెట్‌ను చూస్తేనే ‘కిక్కొ’స్తుంది. జనం చేత తాగించి దండుకునే (ఎక్సైజ్‌) ఆదాయాన్ని ఈ ఏడాది 20 శాతం పెంచాలని ఒట్టేసుకున్నారు. అందుకు అందరూ కలిసి 10,820 కోట్ల ‘సరకు’ తాగిపెట్టాలి. సర్కారుకు ‘లిక్విడిటీ’ వుండాలంటే( చేతిలో డబ్బులాడాలంటే), పేదవాడు నోట్లో ‘లిక్విడ్‌’ పడాల్సిందే. ఖజానా కొచ్చే ఆదాయంలో అమ్మకం, వాణిజ్యపన్నుల తర్వాత, అతి ఎక్కువగా వచ్చేది ‘సీసా’లోంచే. ఈ ఆదాయంలో ‘పుచ్చుకునే’ సంపన్నులు ఇచ్చేది తక్కువే. ‘తాగే’ దరిద్రులిచ్చేదే ఎక్కువ.

మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇంత పారదర్శకం వుండటానికి కారణం ఒక్కటే: అది సీసాలో పుట్టి, గ్లాసులో పెరుగుతుంది. ఎక్కడా దాపరికం లేదు. ఒక వేళ ఈ గుట్టును కేట్లూ, డూప్లికేట్లూ దాచినా, సిండికేట్లు దాచేటట్టు లేరు. వాళ్ళు ‘లెక్కల్లో’ మనుషులు. పాపాలు… సారి పీపాలు లెక్క తీసే చిత్రగుప్తుడి చిట్టి తమ్ముళ్ళు. ఎవరి రుణమూ వుంచుకోరు. ముడుపులు తీసుకున్న ఎవరి పేర్లూ దాచుకోరు. డైరీలు రాసుకునే మంచి అలవాటును, డిజిటల్‌ యుగంలో కూడా పరిరక్షించుకున్న వాళ్ళు ఈ సిండికేట్లే. తమ పేర్లను పోలీసులు రాసే ఎఫ్‌ఐఆర్‌లో రాసినా వెరవని వాళ్ళు, సిబిఐ చార్జి షీట్లలో కనిపించినా జడవని వాళ్ళు.. ఈ డెయిరీలో తమ పేర్లనూ, హోదాలనూ చూసుకుని వణికి పోతున్నారు. టీవీ జర్నలిజం ద్వారా, డెయిలీ జర్నలిజం ద్వారా జనాన్ని భయభ్రాంతుల్ని చేయగల ‘సంచలన’ చిత్తులయిన పాత్రికేయులు సైతం, ఈ సిండికేట్ల ‘డెయిరీ’ జర్నలిజానికి గుండె ఆగి చస్తున్నారు.

పెద్దగా ఆశ్చర్యపోవలిసన పనేమీ లేదు. ‘సంక్షేమ’ ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుపోతున్నప్పుడు, ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. గుడిసెలో ‘కిలోరూపాయి’ బియ్యం పోసి, గుడిసె మొత్తాన్ని దోచేసే పుణ్యకార్యమే సంక్షేమం. ఈ గ ‘మ్మత్తు’ని జనం ఏనాడో కనిపెట్టారు. వారికి తేడాలు బాగా తెలుసు. డబ్బు లాగే, ఒకప్పుడు సరకు కూడా రెండు రకాలుగా వుండేది. చూపించే డబ్బు తెలుపు. దాచుకునేది నలుపు. అలాగే, తాగేది సారా. పుచ్చుకునేది మద్యం. తమ భర్తలు తాగే సారానే బందు చెయ్యమన్నారు కూలితల్లులు. కారణం భర్త వొళ్ళు గుల్లవుతుందని కాదు, బిడ్డల భవిష్యత్తు గుల్లవుతుందని. కలిగిన వాళ్ళు పుచ్చుకునే మద్యం గురించి వారేమీ అడగలేదు. అడగని దాన్నీ, అడిగిన దాన్నీ కలిపేసి మొత్తం ‘సరకు’ని బందు చేసినట్లు నటించారు అప్పటి నేతలు. ఎందుకని? తర్వాత మొత్తం నిషేధాన్ని ఎత్తి వెయ్యవచ్చని. అలాగే ఎత్తేసారు. సారా తాగేవాడికి ప్రమోషనిచ్చి మద్యం తాగించారు. ఇక డబ్బే డబ్బు. తాగించి, తాగించి తలనొప్పికి మందిచ్చినట్లు, జనానికి ‘కిలోరూపాయి’ బియ్యాలు, మహిళలకు వడ్డీలేని రుణాలూ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో సంక్షేమమే కాదు, చైతన్యం కూడా ‘సీసా’లోనే దాక్కుంది. నలుగురిని రోడ్డు మీదకు రప్పించేదే చైతన్యమయితే, ఆ శక్తి మద్యానికుంది. ధర్నాలలో, నిరసనలలో ఆవేశంతో ‘ఊగి’ పోయే కార్యకర్తలే లేకుంటే రాజకీయాలే లేవు. నామినేషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకూ నడిచే ఎన్నికల ప్రయాణానికి ఏకైక వాహనం మద్యం. ఇప్పుడొచ్చిన బడ్జెట్‌ సాక్షిగా మనం ప్రజాస్వామ్యాన్ని నిజాయితీగా నిర్వచించుకుందాం: సీసా కొరకు, సీసా వల్ల, సీసాలో దూరే సరకే ప్రజాస్వామ్యం!

-సతీష్‌ చందర్‌

2 comments for “‘తాగే’ రూపాయి! ‘ఊగే’ రూపాయి!!

  1. “సీసా కొరకు, సీసా వల్ల, సీసాలో దూరే సరకే ప్రజాస్వామ్యం!”
    ——————————————–
    అక్షర సత్యం.

  2. మహా బాగా చెప్పారు…! కాంగ్రెస్సు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దాని అర్ధం, ఇప్పటి వరకు ఎంతోకొంత ఉన్న అభివృద్దిని కనీసం పదేళ్ళు వెనక్కి తీసుకువేల్లడమే వారి లక్ష్యం అని…! అలా అని మిగతా పార్టీలు గొప్పవని నా ఉద్దేశం కాదు, ఇంత పెద్ద దేశానికి ప్రజాస్వామ్యం సరైనది కాదేమో..? Cigarate is injurious to health అన్నట్లు Congress is dangerous to state. 🙂

Leave a Reply