తెర మీదకు తమిళ ప్రధాని?

రాజు రాజే, మంత్రి మంత్రే!

రాహులే రాజు, చిదంబరమే మంత్రి!!

దేశం లో అత్యున్నత పదవి ఏది?

పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగితే పిల్లలు ఈ సారి తెల్ల ముఖం వెయ్యాల్సిందే.

గతంలో లాగా, హోదాకు రాష్ట్రపతి, అధికారానికి ప్రధానమంత్రి- అని రాస్తే తప్పయ్యే ప్రమాదం వుంది. ఎలా తప్పూ- అంటే చెప్పలేం. చాలాకాలం పదవుల ఔన్నత్యాన్ని రాజ్యాంగమే నిర్ణయించింది. ఇప్పుడు రాజకీయమే నిర్ణయిస్తుంది.

రాష్ట్రపతి, ప్రధాని పదవులను మించిన పదవొకటి తొమ్మిదేళ్ల క్రితం తన్నుకొచ్చింది. ఆ పోస్టు పేరే ‘యూపీయే ఛైర్‌ పర్సన్‌’. ఈ పదవిలో వున్న వారే, రాష్ట్రపతిగా ఎవరు వుండాలో, ప్రధానిగా ఎవరు వుండాలో నిర్ణయించారు.

ఇంత కీలకమైన పదవిని అలంకరించాలంటే, పై నుంచి దిగి రావాలి.

దేవుడంటూ లేకుంటే, దేవుణ్ణి సృష్టించాలీ- అన్నది లోకోక్తి. తెల్లవాళ్ళు వెళ్ళిపోయాక, మనదేశాన్ని మనం పాలించుకోవాల్సి వచ్చింది. కానీ రాచరికానికి అలవాటు పడి పోయిన ప్రజలకు ఒక్కసారిగా ఈ విషయం మింగుడు పడలేదు. రాజంటూ లేకుంటే, రాజుని సృష్టించాలీ- అనుకున్నారు. దాంతో తొలి ప్రధానిగా పదవిని అలంకరించిన నెహ్రూలో రాజును చూసుకున్నారు. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్‌ రాజనీతిజ్ఞులు కాల క్రమేణా ‘నెహ్రూ కుటుంబాన్నే’ ‘రాజకుటుంబం’ గా మార్చి జనం మీద రుద్దేశారు. మధ్య మధ్యలో ఇతర పార్టీలు ఈ భ్రమను తాత్కాలికంగా తొలగించి ప్రభుత్వాలను ఏర్పరుస్తున్నా, తిరిగి మళ్ళీ ఈ ‘రాజకుటుంబం’ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కుటుంబంలో మూడో తరం (రాజీవ్‌-సోనియాల) నుంచి నాలుగో తరానికి ( రాహుల్‌ గాంధీకి) ఈ వారసత్వం బదిలీ కానున్నది.

అయితే మూడో తరం సగం వరకూ రాజంటే ప్రధానే. కానీ సోనియా గాంధీ వచ్చాక రాణి అన్నా, రాజు అన్నా ప్రధాని కాదనీ, యూపీయే ఛైర్‌ పర్సన్‌ అని నిరూపించేశారు.

ఏది పెద్ద కుర్చీ?

ఇప్పుడు కాంగ్రెస్‌ పొరపాటున ( ఇతరుల మద్దతుతోనే) యూపీయే-3 ప్రభుత్వాన్ని స్థాపించాల్సి వస్తే, రాహుల్‌ ఏ కుర్చీలో కూర్చోవాలి? ప్రధాని కుర్చీలోనా? లేక యూపీయే చైర్‌ పర్సన్‌ సింహాసనం మీదా?

సమాధానం ఇచ్చేశారు ‘యువరాజు’ రాహుల్‌ గాంధీ. ప్రధాని సీట్లో కూర్చోను కాక కూర్చోను- అని తెగేసి చెప్పేశారు. అంటే, యూపీయే ఛైర్‌పర్సన్‌ సీట్లో కూర్చుంటానని చెప్పినట్లే కదా! కానీ అలా చటుక్కున అనేస్తే- ‘యువ రాజు’కి నచ్చదు. ముందు తనది ‘పదవీ త్యాగం’ గుర్తించ మని కోరతారు. తల్లిలాగా, అంతకు ముందు మహత్మాగాంధీలాగా, ప్రధాని పదవిని తృణప్రాయంగా భావించానన్న కీర్తీ కావాలి. అంతకు మించిన పదవీ కావాలి.

సోనియా కుర్చీని సోనియా తర్వాత రాహుల్‌ అధిష్టిస్తే, మన్‌మోహన్‌ కుర్చీలో ఎవరు కూర్చుంటారు?

ఈ ప్రశ్న వచ్చినప్పుడు తక్షణం స్ఫురించే వ్యక్తులు అతి తక్కువ. ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి కాకుండా (ప్రధానిని కాకుండా చెయ్యటానికే ఆ పదవి ఇచ్చారన్న అపవాదు కూడా వుంది.) వుండి వుంటే, ఆయన పేరును పరిశీలించాల్సి వచ్చేది. ఆ తర్వాత పరిశీలనకు వచ్చే పేరు చిదంబరం.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రధాని అభ్యర్థి అంటే, అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు విధిగా వుండాలి.

అర్హతలు:

– సౌమ్యుడు, మిత్రపక్షాలకు మిత్రుడూ అయి వుండాలి.

– ప్రపంచ బ్యాంకుకూ, బహుళ జాతి సంస్థలకూ ప్రీతి పాత్రుడయి వుండాలి.

– నిజాయితీ పరుడూ, కళంకం లేని వాడూ అయి వుండాలి.

– ఇంత వరకూ విస్మృతికి గురయిన ప్రాంతం నుంచో, వర్గం నుంచో రావాలి.

– ఏదో ఒక రంగంలో అపారమైన జ్ఞానం కలిగిన వాడయి వుండాలి.

అనర్హతలు:

– జనాకర్షణ వున్న నేతయి వుండ కూడదు.( లోక్‌ సభ నుంచి కన్నా రాజ్యసభ నుంచి మాత్రమే ఎన్నిక కాగలిగిన వ్యక్తయితే మరీ మంచిది)

-సర్వకాల సర్వావస్థల యందూ, నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యులకు విధేయుడయి వుండాలి.

– సొంతంగా పార్టీలో గ్రూపు కట్టగల సామర్థ్యం వుండ కూడదు.

-ఏదన్నా విదేశీ విశ్వవిద్యాలయంలో చదివి వుంటే, అదనపు ‘అనర్హత’ కూడా అవుతుంది.

-తన సొంత కుటుంబం నుంచి వారసులు దించే ఆవకాశంకానీ, యోచన కానీ వుండ కూడదు.

వీటిని బట్టి చూసినప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌కు అసలు సిసలైన వారసుడిగా చిదంబరం సరిపోతారు.

కొన్ని అర్హతలు నిజాయితీకి నిలువుటద్దంగా పేరు పొందిన ఆంటోనీకి సరిపోతుంది కానీ, ఆయన జనాకర్షక నేత. సొంత రాష్ట్రం( కేరళ)లో ఆయన కున్న పేరు ఇప్పటికీ పదిలంగానే వుంది. అదీ కాక, కొన్ని విషయాల్లో మొండి పట్టు పట్టే మనిషి.

ఇద్దరూ ‘లెక్కల్లో’ మనుషులే!

కానీ చిదంబరం మాత్రం మన్‌మోహన్‌ లాగే ‘లెక్కలో’్ల మనిషి. ఇద్దరూ ఆర్థిక మంత్రులగా పనిచేసిన వారే. ఇటు దేశంలో వాణిజ్యవర్గాలకూ, అటు విదేశీ వాణిజ్యవేత్తలకూ ఇద్దరూ ప్రీతి పాత్రులు. మరీ ముఖ్యంగా ‘చిల్లర రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ‘అన్న కాంగ్రెస్‌ ఆకాంక్షను నిజం చేయటంలో చిదంబరం కీలక పాత్ర వహించారు. ఆర్థిక సంస్కరణల మలి దశను కొనసాగించాలంటే, మన్‌మోహన్‌ సింగ్‌కు అసలు సిసలైన వారసుడు చిదంబరమే కాగలరు.

అయితే బీజేపీ నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు దాదాపు ఖరారయిన తర్వాత, రాహుల్‌ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించటం వెనుక కాంగ్రెస్‌ అసలు వ్యూహం దాగి వుంది. చూడటానికి, రాహుల్‌ తత్తరపడి వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది. మరోవైపు చూస్తే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీతో, ఎప్పటి నుంచో జాతీయ నేతగా వున్న రాహుల్‌ గాంధీతో పోటీయా?

ఒక రకంగా చూస్తే, నరేంద్రమోడీయే కాంగ్రెస్‌ లో మార్పులను వేగవంతం చేశారు. మోడీ గుజరాత్‌లో ముఖ్యమంతిగా హ్యాట్రిక్‌ చేసిన తర్వాత, ఆయన ‘హిందూత్వ’ కే కాకుండా, ‘అభివృధ్ధి’కి కూడా ప్రతీకగా మారారు. రెండవ అంశం నేడు విద్యావంతులయిన యువతరాన్ని ఆకట్టుకుంటోంది.

ఇదే సమయంలో మోడీ నేరుగా కాంగ్రెస్‌కు ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబం తప్ప వేరే దిక్కులేదా? అన్న అంశాన్ని ముందుకు తెచ్చారు. అంతే కాదు. వారసత్వ రాజకీయాల మీద ధ్వజ మెత్తారు.

అయితే మోడీ కున్న పరిమితులు మోడీ కున్నాయి. ‘మండల్‌’ రాజకీయాలూ, ‘ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ’ వోట్ల రాజకీయాలూ వున్న చోటా మోడీకి తిరస్కారం వుంది. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా వున్న జనతా దళ్‌(యూ) బీహార్‌లో మోడీ ప్రచారానికి ‘నో’ చెప్పింది ఈ కారణం వల్లనే, మినీ భారతం లాంటి ఉత్తర ప్రదేశ్‌లో కూడా చుక్కెదురు కావచ్చు.

మోడీ దాడిని తిప్పికొట్టటానికి కాంగ్రెస్‌ ఇప్పటికిప్పుడు రెండు అస్త్రాలను సిధ్ధం చేస్తోంది.

ఒకటి: వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్‌ దూరమని చెప్పటం.

రెండు: అభివృద్ది మంత్రానికి విరుగుడు కనిపెట్టటం.

అందుకే, రాహుల్‌ తాను పెళ్ళిచేసుకోవటానికీ, కుటుంబం ఏర్పరచుకోవటానికీి సిధ్ధంగా లేనని ప్రకటించేశారు. అభివృధ్ధికీ, ఆర్థిక సంస్కరణలకీ సంకేతంగా ఎవర్నో ఒకర్ని తక్షణం చూపాలి. అందులో భాగంగానే చిదంబరం పేరు ముందుకు వచ్చింది.

గతంలో ఇందిరా గాంధీ హత్య తర్వాత ‘సిక్కుల మీద హింస’ జరిగింది. దాంతో సిక్కులకు కాంగ్రెస్‌ పట్ట వైముఖ్యం వచ్చింది. సిక్కులకు తమ పార్టీ పెద్ద పీట వేస్తుందని చెప్పటానికి కూడా మన్‌మోహన్‌ను ప్రధాని ని చేశారన్న ప్రచారం కాంగ్రెస్‌ చేసుకొంది. అలాగే రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన తర్వాత , ఈ మధ్య కాలంలో శ్రీలంక ప్రభుత్వం ఎల్‌టిటిఇ ని పూడ్చి పెట్టే పేరు మీద అక్కడి తమిళులను నిరాశ్రయులను చేసింది. ఇందుకు మన దేశ ప్రభుత్వ పరోక్ష సహకారం వుందనే అపవాదు కూడా వుంది. ఇప్పుడు తమిళులను కాంగ్రెస్‌ దగ్గరకు తీసుకోవటానికే చిదంబరానికి అగ్రాసనం వేశారన్న పేరు సంపాదించుకోవచ్చు.

అందరూ ఊహించినట్లుగా 2014 ఎన్నికలలో నగర, పట్టణ విద్యావంతులయిన యువత వోటు కీలకమయితే, కాంగ్రెస్‌ కు ఉన్నవారిలో మంచి ప్రత్యామ్నాయం కాగలరు. ఒక సర్వే ప్రకారం, రాహుల్‌ ప్రధాని పదవినుంచి తప్పుకున్నప్పడు ఆ పదవికి సరిపోయే నేత ఎవరంటే సగానికి సగం చిదంబరం పేరే సూచించారు.

అందు చేత, రాజు రాజే; మంత్రి మంత్రే!

రాహుల్‌ రాజు! చిదంబరం మంత్రి!!

కాకుంటే, చిదంబరానికి యూపీయే భాగస్వాములు ఎంతమంది అభ్యంతరం చెబుతారన్నది వేచి చూడాలి.

– సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 9-16 మార్చి2013 వ తేదీ సంచికలో వెలువడింది)

1 comment for “తెర మీదకు తమిళ ప్రధాని?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *