తెలంగాణ కథ మొదలుకొస్తుందా?

సెప్టెంబరు 30, 2012 .ఇది తేదీ కాదు. ముహూర్తం. సాక్షాత్తూ ‘చంద్రశేఖర సిధ్దాంతి’ పెట్టిన అనేకానేక ముహూర్తాల్లో ఇది ఒకటి. ఆయన లెక్క ప్రకారం ఈ తేదీ లోగా తెలంగాణ సమస్యకు ‘శుభం’ కార్డు పడిపోతుంది. ఆయన ప్రత్యేక ‘పంచాంగం’లో ఇలాంటి తేదీలు ఇంతకు ముందు చాలా గడచిపోయాయి. అయితే ముహూర్త బలాన్ని ఏమాత్రం శంకించాల్సిన పనిలేదు. ఎటొచ్చీ ఆయన ముహూర్తం పెట్టే వాడే తప్ప, శుభకార్యం జరిపించే వాడు మాత్రం కాదు. ఆ తంతు కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్వహించాలి. ప్రతీ సారీ, ఈ తంతు భగ్నమవుతూనే వుంది. కానీ కేసీఆర్‌ అనబడే ఈ ‘చంద్రశేఖర సిధ్ధాంతి’- ఈ సారి ముహూర్తం తిరుగులేనిదంటున్నారు. అంటే ‘గ్రహ స్థితిని, ఉపగ్రహ స్థితిని’ బట్టీ గాక, కాంగ్రెస్‌ అధిష్ఠానం ‘అనుగ్రహ స్థితి’ ని బట్టి నిర్ణయించి వుండాలి.

బహుశా ఈ ‘ముహూర్త బలాన్ని’ ఇతర పార్టీల వారు కూడా నిజంగా నమ్మేశారో ఏమో, ఎవరి ‘పెళ్ళిపనుల్లో’ వారు నిమగ్నమయి పోయారు. ఉప ఎన్నికలలో తెలంగాణ పై టీఆర్‌ఎస్‌కున్న ‘ధర్మకర్తృత్వాన్ని’ తొలిసారిగా సవాలు చేసిన బీజేపీ కూడా, ఈ అంశాన్ని జాతీయ స్థాయి ఎజెండాగా మార్చేసింది. రాష్ట్ర నేత కిషన్‌ రెడ్డి ఉత్సాహం వల్ల పార్టీ నేతలు ‘తెలంగాణ’ను ‘అవినీతి నిర్మూలన’ తర్వాత రెండో నినాదంగా స్వీకరించేశారు. అంతే కాదు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, మూడు నెలల్లోనే(గతంలో ఆరు నెలలు అన్నారు లెండి.) తెలంగాణ ఏర్పాటు చేసేస్తామని ప్రకటించారు. ఇక చంద్రబాబు మామూలే. తెలంగాణ పట్ల తమ పార్టీ (అనుకూల?) వైఖరిని తెలియ జేస్తూ ‘లేఖ’ రాయలని ఉబలాట పడుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే వద్ద వత్తిడి పెంచారు.ఎటొచ్చీ, ఈ అంశం పట్ల పెద్దగా హడావిడి లేకుండా వున్నది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అయితే వరుసగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ దుర్గాలను( పరకాల, సిరిసిల్ల వగైరాలను) ముట్టడించే పనిలో నిమగ్నమయ్యాయి.

ఈ స్థితిలో తెలంగాణ అంశాన్ని కేంద్రం నిజంగా తేల్చాలనుకుంటే, ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. తేల్చేస్తే ఎక్కువ ప్రయోజనమా? తేల్చకుంటే ఎక్కువ ప్రయోజనమా? లేక తేల్చీ, తేల్చకుండా వుంటే మరింత ప్రయోజనమా? వీటి మీదనే నిర్ణయం వుంటుంది కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద ఆధారపడి వుండదు.

ఒక వేళ తేల్చేసే…!? పరిష్కార ప్రయత్నం ఎక్కడ వదలేస్తే, అక్కడనుంచి పట్టుకోవాలి. అనగనగా ఒక కమిషన్‌. దాని పేరు శ్రీకృష్ణ కమిషన్‌. అది ఒకటడిగితే అరడజను పరిష్కారాలు ముందు పెట్టింది. అనువయినదిగా ‘అధీకృత ప్రాంతీయ మండలి’నిఏర్పాటు’ చేయాలని అభిప్రాయం కూడా చెప్పింది. మొత్తం తెలంగాణ వాదులు ఈ ప్రతిపాదనను తిరస్కరించేశారు. ‘సమైక్యాంధ్ర వాదులు’ దాదాపుగా ఒప్పుకున్నారు. దీని మీద అందరి అభిప్రాయాలు కోరితే, ముందు కాంగ్రెస్‌ను చెప్పమన్నారు. అక్కడ ఆగింది బండి. అందుచేత కాంగ్రెస్‌ తన అభిప్రాయం చెప్పాలి. కాంగ్రెస్‌ ముందు ఒక్కటే లక్ష్యం. కేంద్రంలో మళ్ళీ యూపీయేని అధికారంలోకి తెచ్చి, రాహుల్‌ని ప్రధానిగా కూర్చోబెట్టటం. ఇందుకు రాష్ట్రం ఒక్కటయినా ఫర్వాలేదు. ముక్కలయినా ఇబ్బంది లేదు. వోట్లెలావున్నా, పార్లమెంటు సీట్లు ఎక్కువ రావాలి. ఇప్పుడయి వాటిని ఎక్కువగా గెలుచుకునే స్థితిలో సీమాంధ్రలో వైయస్సార్సీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వున్నాయి. అయితే కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ ఎక్కువ అనుకూలంగానూ, వైయస్సార్సీ (రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీయే అభ్యర్థికి వోటు వేసినప్పటికీ) తక్కువ అనుకూలంగానూ వుంది. వైయస్సార్సీని దారిలోకి తెచ్చుకోవటమే కాంగ్రెస్‌ తక్షణ కర్తవ్యం. ఇలాంటి స్థితిలో రాష్ట్ర విభజనకు అనుకూల నిర్ణయం కాంగ్రెస్‌ తీసుకుంటే, ఎప్పటిలాగానే జగన్‌( వైయస్సార్సీ) సీమాంధ్రకు పరిమితమవుతారు. ఆ పార్టీ ‘తెలంగాణ ముట్టడులు’ తగ్గిపోతాయి. కేసీఆర్‌కు ఈ నిర్ణయం ఆనంద దాయకంగా వుంటారు. కానీ, అంతిమంగా సీమాంధ్ర నుంచి వచ్చే పార్లమెంటు సీట్లు జగన్‌ గుప్పెట్లో వుంది పోతాయి. దీనికి విరుగుడుగా కాంగ్రెస్‌ సీమలో ఆందోళనలను పెంచ వచ్చు. హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సి వస్తే, సీమ లో చిచ్చు రేగుతుంది. అది సీమకు చెందిన జగన్‌కూ, చంద్రబాబుకు కూడా పరీక్షా సమయమవుతుంది. మూడు చోట్ల చిచ్చు రేపి చలి కాచుకోవటానికి – ఇది కాంగ్రెస్‌కు అవకాశ మవుతుంది.

తెలంగాణను తేల్చకుంటే…!? తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కోటకు మరిన్ని బీటలు పడతాయి. ఆ పార్టీ నేతలూ, జేయేసీ నేతలూ ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తారు. సీమాంధ్రలో ‘సమైక్యనినాదం’ కూడా పుంజుకుంటుంది. ఇప్పటి వరకూ ఈ నినాదానికి ప్రధాన ధర్మకర్తలు గా కాంగ్రెస్‌నేతలే (కావూరి, లగడపాటి తదితరులు) వున్నారు కాబట్టి, వారు మరింత బలపడతారు. జగన్‌కు మళ్ళీ సంకట స్థితి వస్తుంది. గతంలో లగా ‘సమైక్యాంధ్ర’ ప్లకార్డును అందుకోవటానికి వీలుండదు. తెలుగు దేశం ప్రకటిస్తున ‘తెలంగాణ’ భక్తి కూడా, ఆ పార్టీ సీమాంధ్ర నేతల్ని వెనక్కి లాగుతుంది.

తేల్చీ, తేల్చనట్లు వదలేస్తే..!? అంటే ‘శ్రీకృష్ణ’ భజన చేయటమన్నమాట. శ్రీకృష్ణకమిషన్‌ పరిష్కారాన్నే తిరిగి జపించటం. దీని వల్ల ఒక్క తెలంగాణలోనే వేడి పుడుతుంది. కేసీఆర్‌ బలపడతారు. తెలంగాణలో జగన్‌ ప్రవేశానికి గండి పడుతుంది. కానీ సీమాంధ్రలో వైయస్సార్సీ ప్రభంజనం కొనసాగుతుంది.

అంతిమంగా , కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయం మంటలను ఆర్పేదిగా కాకుండా, మంటల్ని పెంచేదిగానే వుంటుంది. అంతే తప్ప జనహితంగా మాత్రం వుండబోదు.

 

3 comments for “తెలంగాణ కథ మొదలుకొస్తుందా?

Leave a Reply