తెలుగు ‘జీరో’యిన్లు!

కాజల్

తెలుగు ‘జీరో’యిన్లు!
లవ్వాట మొదలయింది.
అలాగని, ‘అవ్‌ ఆల్‌’ అనే సర్వీస్‌ నడవదు కదా! ‘లవ్‌ వన్‌’ అనాల్సిందే.
ఆ ఒక్కమ్మాయినీ లైన్లో పెట్టాలి.
తెలుగు సినిమా హీరోకొచ్చిన కష్టాలు మొదలయ్యాయి. అద్దంలో చూసుకుంటే తన ముఖం తనకే నచ్చదు. తాత, తండ్రుల పోలికలయితే వచ్చాయి కానీ, వాళ్ళ అందం రాలేదు. సైజు చూస్తే వాళ్ళలో సగం కూడా లేడు. కుండీలో మర్రిచెట్టులా వుండిపోయాడు. కక్కుర్తి. తాత,తండ్రులు కట్నానికి కక్కుర్తి పడకుండా అందగత్తెల్ని చేసుకుని వుంటే. తనకీ మంచి ముఖం వచ్చి ఏడ్చేది.
ఈ ముఖాన్ని మర్చాలి. కోతిని కూడా ఖజురహో శిల్పంలా మార్చే ‘కాస్మెటిక్‌’ సర్జరీలు వుంటాయి. సినిమా హీరోలకయితే డబ్బున్న బాబులుంటారు. మరితని బాబు కనీసం ‘డబ్బింగ్‌’ ఆర్టిస్ట్‌ కూడా కాదు. అందుకని ఈ ముఖమే చూపించాలి.
ముఖమూ, సైజూ లేక పోతే ఏం? శరీరం ఉంది కదా-అనుకుంటే దానికి ‘ఉబ్బే’సిటి(అదేలెండి.. ఇంగ్లీషులో ‘ఒబేసిటి’). తెలుగు హీరో అయితే.. ఏళ్ళ తరబడి కష్టపడి అష్ట… కాదు, కాదు, షష్ఠ (ఆరు) వంకర్లు తిప్పేస్తాడు జిమ్ములో పడి. ‘సిక్స్‌ ప్యాక్‌’ కావాలి కదా మరి. తనకా..? అంత సమయమూ లేదు. సొమ్మూ లేదు.
గొంతంటారా..! చాలా మంది తెలుగు హీరోలకన్నా గొప్పగానే వుంటుంది. పాటకు పనికి రాదు, మాటకు పనికి వస్తుంది. అంత వరకూ నయం. ఒకరిద్దరు హీరోలున్నారు. తెర మీద కాకుండా, వారెప్పుడన్నా మీడియాతో మాట్లాడారో- గొట్టాలు(మైకులు) తడిసిపోతాయి. అంతా (నోటి) ‘తుంపర సేద్యం’! పాపం సహనటులు ఎలా భరిస్తారో..!
అవునూ, అమ్మాయిని లైన్లో పెట్టాలీ- అంటే ముందు మాట కలపాలి కదా! సినిమా హీరోకయితే, డైలాగ్‌ రైటర్స్‌ రాసి పెడతారు. కొందరు హీరోలు సొంతంగా మాట్లాడితే టీవీలో యాంకరమ్మకు కూడా నోరు పెగలదు.అంతటి ‘సభ్యత’ వుంటుంది. గురుడికి ఎవరు రాసిస్తారు?
ఫైట్లూ, స్టెప్పులూ, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్కులనేవి- నిజ జీవితంలో నడవవు. ఒక వేళ నడిచినా, పక్క రాష్ట్రాలనుంచి, పక్క దేశపు సినిమాలనుంచి దర్జాగా కొట్టేసేటంత తెలివి తేటలు గురుడికి లేవు.
అయినా, గురుడికేదో ఒక మొండి ధైర్యం.
ఆడపిల్ల అన్నాక, నాజూకయిన కాలేజీ చదివే పిల్ల- అన్నాక, తెలుగు సినిమాలు చూస్తుంది. సొట్టలు తీసిన సత్తు పాత్రల్లాంటి ముఖాలు కొన్నయినా చూసే వుంటుంది.
బ్రాండెడ్‌ షర్టూ, ఫ్యాంటూ, షూ వేసి, ముఖానికి అంగుళం మందంలో రంగు పూస్తే, గురుడి ముఖంలో, ఆమెకు ఏదో ఒక హీరో ముఖం కనిపించక పోదు- అని అనిపించింది.
గురుడు అమ్మాయిని కలవటానికి ఎలా వెళ్ళాలి. సైకిలా? మోటారు బైకా? కారా?
పిల్లను పడవెయ్యటానికి మూడు లక్షల బైకు కాదు.. మూడక్షరాల పొగడ్త చాలు!
ఇలా ఎవడన్నాడు? ఎవడో అనే వుంటాడు. లేక పోతే తానంటాడు. జీవితంలో ముదురు మాటల ‘పంచె’ డైలాగులు వుండక పోవచ్చు. కానీ, కుర్రకారు ‘ఫ్యాంటు’ డైలాగులు వుండొచ్చు కదా!
గురుడు మొత్తానికి పొగడ్త మీదే పోదామని సెటిలయి పోయాడు.
ఏమని పొగడాలి? ఇంకేముంటుంది? ఆమెకు దగ్గర పోలికలున్న హీరోయిన్‌ తో పోల్చాలి. ఎవరుంటారు?
త.త..తమన్నా, తా..తా..తాప్సీ…!
తడబడితే అంతే ఇలా ‘త’ గుణింతమే వస్తుంది.
కాదు.. కాదు.. అనుకుంటూ, పోనీ క..క..కత్రినా… కా…కా..కాజల్‌..!
మరీ ఇంత కష్టపడితే ‘క’ గుణింతం మిగులుతుంది.
అయినా వాళ్ళెక్కడ? గురుడు లైను వేసే పిల్ల ఎక్కడ? గురుడికి ఎలా చూసినా తాను కన్నేసిన పిల్లే వీళ్ళను మించిన అందగత్తె. ‘తా వలచినది రంభ…’ వామ్మో! ఆవిడతో పోలికా? పెద్దావిడయిపోయారు.
చురుకయిన చామన ఛాయ రంగు. కళ్ళు చిన్నగా చలాకీ గా వుండే కళ్ళు. మరీ ఎండిపోయేటంత ‘స్లిమ్‌’ కాదు. కదల్లేనంత ‘లావు’ కాదు.
ఎవరుంటారు? మొత్తం హీరోయిన్లందరి ఫోటోలూ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద ఆ పాద మస్తకం పరిశీలించాడు.
తన ఇష్ట సఖితో ఏ ఒక్కరికీ పోలికలు సరిపోవటం లేదు.
అప్పుడు గురుడికి బల్బెలిగింది.
తాను ప్రేమించబోయేది- ముంబయి ముద్దుగుమ్మ కాదు. బెంగాలీ భామ అసలే కాదు. కనీసం కేరళ కుట్టి కూడా కాదు. తానొక తేట తెలుగు అమ్మాయిని మనసు పడబోతున్నాడు.
కొంచెం ముందయితే లయ లాంటి వాళ్ళూ, అంతకు ముందయితే జయసుధ, జయప్రద పోలికలున్న వాళ్ళూ, ఇంకాస్త ముందుకు పోతే వాణిశ్రీ లాంటి వాళ్ళూ…ప్రతీ కాలేజీ క్యాంపస్‌లో కనిపించేవారు. తెలుగువాళ్ళని పోలిన తెలుగు వాళ్ళుంటటం విశేషం కాదు కదా! కాలేజీ అమ్మాయిలు కూడా తమలోని వాళ్ళపోలికలకు, కాసిన్ని హావ భావాలు అద్దుకుంటూ వుండేవారు. అప్పుడు వాళ్ళని పొగడటం సులభం అయ్యేది.
డబ్బింగ్‌ సినిమాలు వచ్చేస్తుంటే, తెలుగు నిర్మాతలు గుల్లయిపోతున్నారని గుండెలు బాదుకుంటున్న వారు తెలుగు హీరోయిన్ల గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది. పక్క రాష్ట్రాల హీరోయిన్లే తెలుగు తెరను కమ్మేస్తే, తెలుగు అమ్మాయిలేం చెయ్యాలి. చెల్లి, పిన్ని పాత్రలతో సర్దుకు పోవాలా?
-సతీష్‌ చందర్‌

Leave a Reply