తెలుగు తెర మీద తొలి యాక్షన్‌ థ్రిల్లర్‌

Photo by: Kishen Chandar

Photo by: Kishen Chandar

‘1నేనొక్కడినే’ సినిమాపై డైరెక్టర్‌ సుకుమార్‌

ఈ సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్‌ సుకుమార్‌ను ‘గ్రేట్‌ ఆంధ్ర’ తరపున సతీష్‌ చందర్‌ ఇంటర్వ్యూ చేశారు:

ప్రశ్న: ఈ సినిమా (1నేనొక్కడినే) ఏ జోనర్‌ కిందకి వస్తుంది? ఆ తరహా సినిమాలు ఇంతకు ముందు తెలుగులో వచ్చాయా?

సుకుమార్‌: ఈ సినిమా ఒక ‘సెకలాజికల్‌ థ్రిల్లర్‌’. ఇంతవరకూ తెలుగులో ఈ జోనర్‌ను ఎవరూ ట్రై చెయ్యలేదు. ఈ సినిమా చూడటం ఒక కొత్త ఎక్స్పీరియన్స్‌. మహేష్‌ బాబు ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా ఇది సరిపోయింది. ఆయన సంతృప్తి చెందారు. ఆయన అభిమానులకు కూడా సంతృప్తినిస్తుంది.

ప్రశ్న: కామెడీ కేంద్రంగా వున్న ‘దూకుడు’, సెంటిమెంటుతో నిండిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాల్లో వచ్చిన హీరో ఇమేజ్‌కీ, ఈ సినిమా లో ఆయన హీరో ఇమేజ్‌కి మ్యాచ్‌ అవుతుందా?

సుకుమార్‌: ఈ సినిమా ఎంటర్‌టైనర్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే, ఒక్క కామెడీ మాత్రమే కాదు. అన్ని ఎమోషన్స్‌లోనూ ఎంటర్‌టైన్‌ మెంట్‌ వుంటుంది. ఒక్కొక్క సారి ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఏడుస్తుంటాడు. అది కూడా ఎంటర్‌టైన్‌ మెంటే. ప్రపంచంలోనే పాపులర్‌ అయినే ‘జడ్జిమెంట్‌ డే’, ‘అవతార్‌’, ‘టైటానిక్‌’ లాంటి సినిమాలను తీసుకోండి. ఎమోషనే సినిమాను నడిపిస్తుంది. మాస్‌ సినిమాలు మాత్రమే ఆడే థియేటర్లలో కూడా ఈ సినిమాలను విరగబడి చూశారు. ఒక్కసారి కాదు. ఒక్కొక్కరూ పదేసి సార్లు చూశారు.

వీటిల్లో ఎమోషన్స్‌ ఎలా వుంటాయి? ఎవర్నో ఒకరు కాపాడుతుంటారు; ఎవరో ఒకర్ని చంపటానికి ప్రయత్నిస్తుంటారు; ఎవరో చనిపోతూవుంటారు. ఇవేకదా!

ఈ సినిమా(1నేనొక్కడినే)లో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ బాగా వచ్చాయి. మహేష్‌ హీరోయిజం ఎక్కడా తగ్గలేదు.

 మహేష్‌ వెరీ గుడ్‌ పెర్‌ఫార్మర్‌

ప్రశ్న: మహేష్‌ బాబు ఎంత పెద్ద స్టారో, అంత గొప్పనటుడు. చిదిమితే నటన వస్తున్నట్టుంది. మీరు ఇతర హీరోలతో చేశారు. దర్శకుడిగా మహేష్‌ బాబుతో ఈ సినిమా వరకూ ఎలా ఫీలయ్యారు?

సుకుమార్‌: ఒక్క ‘జగడం’లో తప్ప నా సినిమాల్లో హీరోయిజం లేదు. అంటే అందరూ మాట్లాడే హీరోయిజం లేదు. హీరోయిజం అంటే అది ఒక్కటే కాదనుకోండి. మహేష్‌ వెరీ గుడ్‌ పెర్‌ఫార్మర్‌. అంతే కాదు ఆయన పెర్‌ఫెక్షనిస్టు. పెర్‌ఫెక్షన్‌ వచ్చే వరకూ చేస్తారు. నా మీదే ఒక టాక్‌ వుంటుంది. పెర్‌ఫెక్షన్‌ కోసం పది పదిహేను టేక్‌లు చేయిస్తానని. కానీ ఈ సినిమాలో ఆ పని ఆయనే చేశారు. నేను సాటిస్‌ఫై అయినా, ఆయన అయ్యేవారు కారు. ‘ఇంకొక్క సారి చేద్దాం’ అంటూండేవారు. ‘కోపంతోనే ఈ సీక్వెన్స్‌ ఎండ్‌ చేశాను. ఇక్కడ సింపతీ కూడా వుంటే బావుంటుంది కదా’ అని మళ్ళీ తనే పట్టుపట్టి చేసిన సందర్భాలు ఈ సినిమాలో చాలా వున్నాయి.

 

ప్రశ్న: మన డైరెక్టర్స్‌ అప్పుడప్పుడూ హాలీవుడ్‌ లేదా బాలీవుడ్‌ సినిమా చూసో, ఇన్‌స్పయిరయి సినిమా ప్లాన్‌ చేస్తుంటారనే టాక్‌ వుంది. ‘1 నేనొక్కడినే’ సినిమాకు కూడా అలాంటి ఇన్‌స్పిరేషన్‌ ఏదయినా వుందా? ఇప్పటికే మీడియాలో కొన్ని సినిమాల పేర్లను కూడా చెబుతున్నారు!?

సుకుమార్‌: నా బ్యాక్‌ గ్రౌండ్‌ అంతా పుస్తకాలే. నేను పొయెట్రీ చదువుకున్నాను. మీ పొయెట్రీ చదివాను. పుస్తకాల్లో వచ్చేసిన పాత్రల కన్నా, గొప్ప పాత్రలేవీ నాకు సినిమాల్లో కనపడవు. కొన్ని పాత్రల్ని చిత్రించినప్పుడు- ఎక్కడో చదివినట్లు అనిపిస్తుంది కానీ, ఎక్కడో( ఏసినిమాలోనో) చూసినట్లు అనిపించదు. మీరు నన్నడగాల్సి వస్తే, ‘ఏ పుస్తకంలో కాపీ చేశావు?’ అని అడగండి.(నవ్వారు.) ‘ఏసినిమానుంచి తీసుకున్నావు?’ అని మాత్రం అడక్కండి. ఇక ఈ సినిమా ‘1 నేనొక్కడినే’ అంటారా! ఇది పూర్తిగా ఒరిజినల్‌ థాట్‌. ఎక్కడి నుంచీ తీసుకోలేదు.

ఇలాంటి అనుమానం జోనర్‌ వల్ల కూడా వస్తుంది. తెలుగు సినిమాల్లో ‘లవ్‌ స్టోరీస్‌’ ఎక్కువ వచ్చాయి. ఈ జోనర్‌లో మరో లవ్‌ స్టోరీ తీస్తే, ఏ మాత్రంగా భిన్నంగా వున్నా కొత్తగా వుందంటారు. దేన్నో పోలి వుందనరు. అలా కాకుండా, ఓ కొత్త జోనర్‌లో సినిమా తీస్తే, అది తెలుగుకు కొత్త కావటం వల్ల, మూలాలున్నాయేమోనని వెతకటం మొదలు పెడతారు. నా వరకూ అయితే, నేను చదివిన పుస్తకాలూ, నేనెరిగిన జీవితమూ చాలు. వేరే సినిమాలవైపు చూడనవసరం లేదు. ఎప్పుడయినా కొన్ని సన్నివేశాలను తీయటానికి ఇంతకు మించి అవకాశం లేదనుకున్నప్పుడు తీసిన ఒకటి రెండు ‘మాంటేజెస్‌’ ను చూసి అలా అనిపిస్తే, అనిపించవచ్చు.

ఈ థీమ్స్‌ పుస్తకాల్లో ఎప్పుడో వచ్చాయి!

ప్రశ్న: మీ థీమ్సూ, స్టోరీలైన్సూ, భిన్నంగా ‘అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌’ ఐడియాస్‌లాగా వుంటాయి. ‘ఆర్య’లోని ‘వన్‌సైడ్‌లవ్‌’ అలాంటిదే కదా!? ఈ సినిమా(1నేనొక్కడినే) థీమ్‌ కూడా అలా భిన్నమయినదేనా?

సుకుమార్‌: ముందే చెప్పాను కదా- నాది పుస్తకాల నేపథ్యమని. ఇలా భిన్నంగా వుండే ఆలోచనలు కవిత్వలో ఎప్పుడో వచ్చేశాయి. కృష్ణ శాస్త్రి కవిత్వం చూడండి. ‘నేను చెట్లను ప్రేమిస్తాను. అవి నన్ను తిరిగి ప్రేమించాలని లేదు.’ అన్నది ఆయన ధోరణి. దానిని నేను ఓ కమర్షియల్‌ సినిమా గా మలిచాను. అయితే ‘ఆర్య’ లో ‘వన్‌సైడ్‌ లవ్‌’ థీమ్‌ను నేను తీసుకోవటానికి ఇంకో కారణం కూడా వుంది. జీవితంలో ఎవరయినా తాను ప్రేమించి, అవతలి వ్యక్తి తనను ప్రేమించనప్పుడు, సూసైడ్‌ చేసుకోవటం’లేదా, తనను తాను హింసించుకోవటం వంటివి చేస్తుంటారు. అంత అవసరం లేదని చెప్పటానికి కూడా ఈ థీమ్‌ తీసుకున్నాను. ఈ సినిమా అలాంటిది. ఇది పూర్తిగా డిఫరెంట్‌ జోనర్‌.

ప్రశ్న: మీ సినిమా చూస్తే, అన్ని క్రాఫ్ట్‌లలనో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ వుంటుంది. చివరకు ‘ఫైట్స్‌’ లో కూడా ఆ ముద్ర కనిపిస్తుంటుంది. ‘ఆర్య’లో హీరో విలన్‌ మనుషుల్ని కొట్టకుండా, పక్కనున్న వస్తువుల్ని కొడుతుంటాడు. ఈ సినిమా (1నేనొక్కడినే)లో కూడా ఫైట్స్‌ డిఫరెంట్‌ గా వున్నాయా?

సుకుమార్‌: ఫైట్స్‌ అని అనను కానీ, డిఫరెంట్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ వున్నాయి. చాలా డిఫరెంట్‌గా వున్నాయి.

‘జాణ’ పదాలే నా మార్కు ‘ఐటెమ్‌ సాంగ్స్‌’!

ప్రశ్న: తెలుగులో ‘ఐటెమ్‌ సాంగ్స్‌’ అనగానే మీ సినిమాలు గుర్తుకొస్తాయి. మీరు ‘ఐటెమ్స్‌ సాంగ్స్‌’ కు ప్రాచుర్యాన్ని, ఒక ప్రత్యేకతనీ తెచ్చారు. వీటిని మీరెలా ప్లాన్‌ చేస్తారు?

సుకుమార్‌: నేను పొయెట్రీ నుంచి వచ్చాను కాబట్టి, పాట మీద శ్రధ్ధ వుంటుంది. సినిమాలో ఏదయినా కమర్షియల్‌ దృష్టితోనే చూస్తాం. సినిమాలో డబ్బులు పెడతారు. వెనక్కి రావాలి. సినిమా అన్నది బిజినెస్‌.కాబట్టి కవిత్వానికి కూడా కమర్షియల్‌ టచ్‌ అవసరమవుతుంది.

ప్రశ్న: పేరుకు ఐటెమ్‌ సాంగ్‌ అయినా, మీ సినిమాలో సాంగ్‌ లైన్‌ టు లైన్‌ గుర్తుండి పోయేలా వుంటుంది. అదెలా? ‘100% లవ్‌’లో ‘దుడ్డు కావాలన్నాడో…’ పాట అలాంటిదే!

సుకుమార్‌: నేను పల్లెటూరులో పెరిగిన వాణ్ణి. జానపద గీతాలు విన్నవాణ్ణి. బహుశా వాటి ప్రభావం నా మీద వుండవచ్చు.

ప్రశ్న: హద్దుమీరని శృంగారమే తప్ప, రెచ్చగొట్టే బూతు వుండ కుండా విధంగా జాగ్రత్త తీసుకుంటారా?

సుకుమార్‌: అలాంటి కేర్‌ ఏమీ తీసుకోను కానీ, పొయెట్రీ డామినేట్‌ చెయ్యటం వల్ల, రెచ్చగొట్టే విధంగా వుండక పోవచ్చు.

కథలో భాగమే కామెడీ కూడా!

ప్రశ్న: మీ సినిమాల్లో హాస్యం – ఇవిగో ఇవీ ‘కామెడీ ట్రాక్స్‌’ – అని వేరు చేసి చూపేవిధంగా కాకుండా, సినిమాలో అంతర్భాగంగానే వుండి పోతుంది. ఈ సినిమా(1నేనొక్కడినే)లో కామెడీ అలాగే వుంటుందా?

సుకుమార్‌: కామెడీ ట్రాక్‌లను వేర్వేరుగా ప్లాన్‌ చేసి మధ్యలో పెడుతుంటే, అంతవరకూ నడిపిన కథను ఆపి, కామెడీ ట్రాక్‌ తర్వాత, మళ్ళీ కంటిన్యూ చెయ్యాల్సి వుంటుంది. ఇలా చెయ్యటం వల్ల నా వరకయితే కథను ‘హోల్డ్‌’ చెయ్యటం కష్టమనిపిస్తుంది. అదే హాస్యం కథలో భాగమనుకోండి. కథ బిగింపు ఎక్కడా దెబ్బ తినదు.

ప్రశ్న: అంటే మీరు ‘సిట్‌ కామ్‌'( సిట్యుయేషన్‌ కామెడీ) మీదనే ఎక్కువ ఆధారపడతారన్నమాట?

సుకుమార్‌: అవును. కథసాగుతుండగా ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో, ప్రేక్షకుడికి పరిచయమయి వుంటుంది. సందర్భమూ తెలుస్తుంది. ప్రత్యేకించి సందర్భాన్ని సృష్టించనవసరం లేదు. ఇలా చెయ్యటం వల్ల హాస్యమూ పండుతుంది. కథా ముందుకు నడుస్తుంది.

ప్రశ్న: ఇవాళ హీరో అనగానే ప్రేక్షకులు డైలాగుల్లో కొన్ని ‘పంచ్‌’ లు కోరుతుంటారు. అందులోనూ మహేష్‌ బాబు సినిమాల్లో పంచ్‌ డైలాగులకో ప్రత్యేకత వుంది. ఈ సినిమా(1 నేనొక్కడినే)లో అలాంటి డైలాగ్స్‌ వున్నాయా?

సుకుమార్‌: ఈ సినిమా వేరు. ఈ సినిమాలో ఆ తరహా డైలాగ్స్‌కు వీలు కుదర్లేదు. మహేష్‌ బాబు గారితో చర్చించినప్పుడు, ఈ సినిమా వర్జినిటీని అలాగే వుంచండి- అన్నారు. ఈ సినిమాకు యాక్షన్‌ ప్రాణం. అలాగే ప్రేక్షకుల్ని కూడా ముందుగా ప్రిపేర్‌ చేశాం.

సైకాలజీ నా కిష్టం!

ప్రశ్న: మీ సినిమా ప్లాట్‌ ఏదయినా, అంతర్గతంగా ఒక థీమ్‌ ఆద్యంతం నడుస్తుంటుంది. ఆ థీమ్‌కోసం సినిమా తీసినట్లుంటుంది. అదీ కాకుండా, మీ పాత్రలు ఒకదానికొకటి ‘రిపార్టీ’ (మాటకు మాట) చెప్పేటప్పుడు. పాత్ర అన్న మాటకు బదులిచ్చినట్టు కాకుండా, ఆ మాట వెనుక వున్న ఉద్దేశ్యానికి బదులిచ్చినట్టుంటుంది. మనస్తత్వ చిత్రణ మీద ఎక్కువ దృష్టి పెడతారా?

సుకుమార్‌: అవును. మానసిక సంఘర్షణ మీద నాకు ఆసక్తి ఎక్కువ. చెప్పాను కదా! పుస్తకాల ప్రభావమని. చాలా రచనల్లో మానసిక సంఘర్షణను చిత్రిస్తారు. నా మీద నేరుగా సైకాలజీ మీద రాసిన పుస్తకాలతో పాటు, నేను చిన్నప్పుడు చదువుకున్న పత్రికలు కూడా ప్రభావం చూపాయి. మరీ ముఖ్యంగా ‘హోమియో పతి చికిత్స’ పేరు మీద రోగుల ప్రశ్నలకు వైద్యుడిచ్చే సమాధానాలు చదివినప్పుడు, ఆశ్చర్యంగా వుండేది. రోగులు తమ మానసిక సంఘర్షణల గురించీ, ప్రవర్తన గురించీ మాట్లాడేవారు. అవి నన్ను ఆకట్టుకునేవి. నేను ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు కాడు, వాళ్ళ ‘సైకాలజీ’ మీద జోకులు వేస్తుంటాను.

ప్రశ్న: ఈ సినిమాలో అలాంటి థీమ్‌ ఏదయినా వుందా?

సుకుమార్‌: నేను థీమ్‌ అనుకుని హీరో దగ్గరకు వెళ్ళలేదు. హీరో దగ్గరకు వెళ్ళాక సినిమా తయారు చేసుకున్నాను. కాబట్టి అలాంటి ప్రయోగాలేమీ చెయ్యలేదు. కాకపోతే ఈ సినిమాలోకూడా మానసిక ఘర్షణ వుంటుంది. తన గురించి తానేమనుకుంటున్నాడో అన్నదానికీ, తనగురించి లోకం అనుకునేదానికీ మధ్య సంఘర్షణ వుంటుంది. ఇది చూడాల్సిందే.

మెస్సేజ్‌, సందేశం లాంటి పెద్ద మాటలు వాడను కానీ, కొన్ని ప్రయోగాలు స్టార్స్‌తో కూడా తీయవచ్చు. ‘త్రీ ఇడియట్స్‌’ లాంటి సినిమాను స్టార్స్‌తో తీయటం వల్ల వచ్చే ఇంపాక్ట్‌ వేరుగా వుంటుంది. కానీ ఈ సినిమా వేరు.

కృతి సైనన్ మార్కులు 89%

ప్రశ్న: ఈ సినిమా అనుకున్నప్పటి నుంచీ హీరోయిన్స్‌ మారుతూ వచ్చారు. ఫైనల్‌గా కృతి సైనన్‌ ను ఎలా ఎంచుకున్నారు?

సుకుమార్‌: ముందుగా కాజల్‌ అగర్‌ వాల్‌ అనుకున్నాం. కానీ విదేశాల్లో షూటింగ్‌ కు ఏకబిగిన 65 రోజులు వుండటానికి బీజీ హీరోయిన్‌గా ఆమెకు కష్టం. దాంతో కొత్త అమ్మాయి అయితే బాగుంటుందీ అనుకున్నాం. కృతీ సైనన్‌ ఈ సినిమాకు సరిపోయింది. ఆమెకు స్టడీస్‌లో 89%. మెమరీ బాగుంటుంది. డైలాగ్స్‌ బాగా గుర్తు పెట్టుకునేది( నవ్వారు.)

‘నెట్‌’ వచ్చి నా మీద పడింది!

ప్రశ్న: ఈ సినిమాకు విడుదల చేసిన ఓ పోస్టర్‌( హీరో నడుస్తూ వెళ్తుంటే, వెనక హీరోయిన్‌ పాకుతున్నట్లుగా వున్నది) మీద సోషల్‌ మీడియా నెటవర్క్‌లో దుమారం రేగినట్లుంది?

సుకుమార్‌: ఈ విషయంలో చాలా మంది తమ టైమ్‌ వేస్ట్‌ చేసుకోవటమే కాకుండా, ఇతరుల టైమ్‌ను కూడా వేస్ట్‌ చేశారు. సమంత నాకు బాగా క్లోజ్‌. ఈ పోస్టర్‌ గురించి నేరుగా నాతోనే మాట్లాడి. తన అభ్యంతరాన్ని చెప్పవచ్చు. నా సినిమాల్లో ఎప్పుడూ ఎక్కడా స్త్రీని కించపరచలేదు.

ఇక ఈ పోస్టర్‌ అంటారా? చేపల్ని వేటాడే సీన్‌లో, హీరోయిన్‌ హీరో వెనకాలే వేటాడుతూ వచ్చి, అతని కాలు లాగే ప్రయత్నం చేస్తుంది. లాగితే పడిపోతాడు కూడా.

కానీ ఎవరి అర్థాలు వారు తీసేస్కున్నారు. అయినా నా తల్లీ, భార్యా, కూతురూ స్త్రీలే కదా! నేను ఇంటినుంచి వచ్చేటప్పుడు, నా కూతురు పాదాలు ముద్దు పెట్టుకుంటాను. భార్యా, భర్తలు ఒకరి నొకరు ‘ఏరా’ అని పిలుచుకోవచ్చు ‘ఏమేవ్‌’ అని పిలుచుకోవచ్చు. అంతమాత్రాన ఒకరినొకరు తక్కువ చేసి చూసుకోవటం కాదు. అలిగినప్పుడు నా భార్య కాళ్ళు పట్టుకుంటాను. ఆమెను ఆనందింప చేయటానికి ఆపని తప్పుకాదు అనుకుంటాను. తాము తక్కువ అన్న భావాన్ని ఎవరిలోనూ కలిగించకూడదు.

కానీ ‘నెట్‌’ వచ్చాక, అందరూ మాట్లాడుతున్నారు. మంచిదే.

కానీ ‘ఒక గంటా ఫిష్‌ పడదామంటే’ ‘నెట్‌’ వచ్చి నా మీద పడింది.

మహేష్‌ ముఖంలో కవిత్వం పలుకుతుంది!

ప్రశ్న: ఈ సినిమా చెయ్యక ముందూ, చేసిన తర్వాతా మహేష్‌ బాబు పై మీకున్న అంచనాలూ, అభిప్రాయాలూ మారాయా?

సుకుమార్‌: ఓ తటాకంలో ఓ చిన్న ఆకు రాలి పడ్డాక నీళ్ళలో వచ్చే వేనవేల ప్రకంపనలు ఎలా వుంటాయో, ఆయన ముఖంలో అన్ని ‘వేరియేషన్స్‌’ పలుకుతాయి. అమాయకంగా కనిపించే ముఖంలో అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ పలుకుతాయి. ఆయన ముఖం నాకు ఒక తెల్లకాగితంలాగా అనిపిస్తుంది. దాని మీద రాసేదంతా కవిత్వమే. ముఖం అలాగే వుంటుంది. ఎక్స్‌ప్రెషన్స్‌ మారుతుంటాయి. ఆయన ఎంతో ఇన్వాల్వ్‌ అయ్యి, ఎనలైజ్‌ చేసుకుని మరీ చేస్తారని తర్వాత, తర్వాత అర్థం చేసుకున్నాను.

ప్రశ్న: ఈ సినిమా కోసం మహేష్‌ బాబు లుక్‌ను ఎందుకు చేంజ్‌ చెయ్యాలనుకున్నారు?

సుకుమార్‌: ఈ సినిమా మొదలయ్యే సరికే ఆయన ఎక్స్‌ర్‌సైజెస్‌ మొదలుపెట్టారు. ఈ సినిమాలో కేరెక్టర్‌కు ఫిట్‌నెస్‌ కూడా అవసరం. వేగానికి సరిపోయే ఫిట్‌నెస్‌కోసం ఆయన కూడా వర్క్‌చేశారు.

 మహేషే గౌతమ్‌- గౌతమే మహేష్‌

ప్రశ్న: మహేష్‌ కుమారుడు గౌతమ్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు? ఇలా చెయ్యాలని ఎందుకు అనిపించింది.

సుకుమార్‌: గౌతమ్‌ ను చూస్తే, మహేష్‌ చిన్నప్పటి ఫోటోను చూసినట్టే వుంటుంది. ఈ సినిమాలో బాలుడిగా మహేష్‌ పాత్రను వేయటానికి గౌతమ్‌ అయితే బాగుంటుందనుకున్నాను. అడిగితే ఒప్పుకుంటారా-అని అనుకున్నాను. అయినా సరే అడిగి చూశాను. మహేష్‌ ఏ మూడ్‌లో వున్నారో ఒప్పేసుకున్నారు.

ప్రశ్న: ఈ సినిమా మీద మీ ఎక్పెక్టేషన్స్‌ ఏమిటి?

సుకుమార్‌: ముందు కాస్త సందేహపడినా, ఇప్పుడు అందరూ కాన్ఫిడెంట్‌ గా వున్నారు. ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాగా వుంటుందని, కాకుండా డిఫరెంట్‌ సినిమా- అని రమ్మని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. ఏ సీక్వెన్సూ మిస్‌ కాకుండా. అంత బిగింపుతో నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఒపినింగ్‌ సీన్‌ అస్సలు మిస్‌ కావద్దు.

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 10-6జనవరి2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply