తొందరపడి ‘చంద్రులు’ ముందే వెలిగారు!

ద్వేషాలూ, అవసరాలూ- ఈ రెండే ఎన్నికల్లో అమ్మకపు సరకులు. ద్వేషం ఇలా పుట్టి అలా చల్లారిపోతుంది. ఒక అవసరం తీరిన వెంటనే ఇంకొకటి పుట్టుకొస్తుంది. అందుకే ద్వేషాన్ని రగులుస్తూ వుండాలి; మైనారిటీ వోటర్ల మీద మెజారిటీ వోటర్లను ఎగదోస్తూ వుండాలి. తీర్చిన అవసరాలను గుర్తు చేస్తూ వుండాలి; ‘అమవాస్య నాడు అట్టు పెట్టాను, పౌర్ణమి నాడు బూరె పెట్టాను’ అని జాబితా చదువుతూ వుండాలి. రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవటానికి ఇదొక అనుదిన చర్యగా మారిపోయింది. పూర్వం ఎన్నికల ముందు మాత్రమే ఈ పని చేసేవారు. వోటరు నామ స్మరణ అప్పుడు మాత్రమే వినిపించేది. ఇప్పుడు అలా లేదు. పేరుకు అయిదేళ్ళ పదవీ కాలమయినా… అందులో సగభాగం ప్రచార కాలమే..! సినిమాలో ఇంటర్వెల్‌ రాకుండా క్లయిమాక్స్‌ ఛాయలు మొదలయినట్లు.. ఇదేమి విడ్డూరం..!? అని ఏ పార్టీకా పార్టీ బుగ్గలు నొక్కుకుంటోంది. అయినా ప్రచారార్భాటాలు కొనసాగిస్తూనే వుంది. అది అంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కావచ్చు; తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కావచ్చు; కేంద్రంలో బీజేపీ కావచ్చు. మహానాడులూ, ప్లీనరీలూ మాత్రమే కాకుండా… భారీ భారీ బహిరంగ సభలూ, బల ప్రదర్శనలూ అందుకే.

పండగలే… పండగలు

ఇందుకు తాజా ఉదాహరణ: వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’. లక్షల్లో జనాన్ని తరలించారు. ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి’ అన్నట్లు ఎర్రటి వేసవి ఎండలో జనాన్ని ఎద్దుల బళ్ళ మీద తీసుకొచ్చారు; మంత్రులు తామే స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ వచ్చారు. ఈ సభ చూస్తే, ఇంకా రెండేళ్ళున్నా సరే, ఇప్పటికిప్పుడే ఎన్నికలు మీద పడ్డాయేమో- అనిపిస్తుంది. ప్లీనరీ జరిగిన వెంటనే ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే. కృష్ణా పుష్కరాల దగ్గర నుంచి, మహిళా పార్లమెంటు వరకూ తెలుగుదేశం పార్టీ దేనినీ వదల్లేదు. తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబూ.. నిత్యమూ ఇలాంటి ఉత్సవాలనే చేస్తున్నారు. రాబోయే రెండేళ్ళలో ఈ పండగల జోరు ఇంకా పెరుగుతుంది కూడా.

పాత పగకు కొత్త పదును

కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల ప్రచారంలోనూ రెండు అంశాలు కనిపించాయి. ఒకటి: ఆంధ్ర పాలకుల (ఆయన భాషలో ఆంధ్రోళ్ళ) మీద ద్వేషం; రెండు: అవసరాలు. తెలంగాణ వచ్చేసి మూడేళ్ళయి పోయాక, సీమాంధ్రులు అధికంగా వుండే హైదరాబాద్‌లో కూడా గెలిచేశాక కూడా అలనాటి ఆంధ్రనేతల్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం వుందా? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మీదనే దృష్టి పెట్టాలి కదా? కానీ అలనాటి ముఖ్యమంత్రులు వై.యస్‌ రాజశేఖర రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలను కేసీఆర్‌ గుర్తుచేసి మరీ తిట్టారు. ‘నేను తెలంగాణకు నిలువూ కాదు; అడ్డమూ కాదు’ అని వైయస్‌ వెటకారంగా అంటే, తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలు ‘ముసి ముసి నవ్వులు నవ్వే వారు’ అంటూ ఫ్లాష్‌ బ్యాక్‌ కొట్టారు. అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, తెలంగాణ వ్యతిరేకంగా చిత్రించటంతో పాటు, ‘ఆంధ్ర వ్యతిరేకత’ను ప్రజల్లో చల్లారి పోకుండా చూడాలనే ఎత్తుగడ కేసీఆర్‌ ఉపన్యాసంలో స్పష్టంగానే కనిపించింది.

కరెంటు అవసరాలు తీర్చామంటూ గుర్తు చేస్తూ, ఎకరాకి ఎరువులకోసం రు.4వేలు ఇస్తాననీ, సంఘాలు పెడతాననీ కొత్త హామీలు గుప్పించేశారు.(బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి, మాఫీ చెయ్యటానికి ఇంతకు మించే ఖర్చవుతుంది. అందుకే నేరుగా నగదు జమ అనే కొత్త రూటు కనిపెట్టారు.) ఇక చంద్రబాబయితే, రాజధాని( అమరావతి) జపాన్నే విడతలు, విడతలుగా చేస్తారు. కొబ్టరికాయ కొట్టానని ఒక సారీ, బిల్డింగులు కట్టానని ఇంకొకసారీ, లోన కుర్చీలు వేశాననీ మరో సారీ.. ఉత్సవాలు చేస్తూనే వుంటారు. కాకపోతే ఆయనకు ‘ద్వేషాన్ని’ రగిలించే అవకాశం తక్కువ వుంటుంది.

బహుజన బలి

సినిమాలకు గ్రాఫిక్స్‌ వచ్చాక ‘బాహుబలు’లూ, ‘శాతకర్ణులూ’ తీయటం సులభమయినట్లుగా.., రాజకీయ పార్టీలకు ‘ఈవెంట్‌ మ్యానేజ్‌మెంట్‌'( ఉత్సవ నిర్వహణ) సామర్థ్యాలు పెరిగిపోయాక, జనసమీకరణ సులభమయిపోయింది. లక్షలజనంతో మైదానాలను నింపేస్తున్నారు. కానీ, ఎవరి భయాలూ, బలహీనతలూ వారికి వున్నాయి. నిరుద్యోగులు తరపున కోదండరామ్‌ నిరసనలకు పిలుపు నిస్తే, తెల్లవారు ఝామునే అరెస్టు చేస్తారు; తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఉస్మానియా యూనివర్శిటీ నూరేళ్ళ పండుగలో విద్యార్థుల నిరసనలు చేస్తారేమోనని ముఖ్యమంత్రి కేసీఆరే ప్రసంగించకుండా వచ్చేస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో సమస్యలు సమస్యలుగానే వున్నాయి. పల్లెల్లో ప్రజలు కష్టాలు కష్టాల్లాగే వున్నాయి. రైతులు మరణాలు ఎక్కడా ఆగటం లేదు. రెండు రాష్ట్రాలూ కలసి వున్నప్పుడు ఏ పారిశ్రామిక వేత్తలు ఆర్థిక పెత్తనం చేశారో, వారే ఇప్పుడు (వైద్య, విద్య, రోడ్డు రవాణా రంగాల్లో) విడివిడిగా రెండు రాష్ట్రాల్లో దండుకుంటున్నారు. కాకుంటే రెంటికీ తేడా ఒక్కటే: ఆంధ్రప్రదేశ్‌ లో బలమైన ప్రతిపక్షంగా ఒక (వైయస్సార్‌ కాంగ్రెస్‌)పార్టీ వున్నది. తెలంగాణ ఆ పాత్రను ఒకనాటి తెలంగాణ ఉద్యమ శక్తులే పోషిస్తున్నారు (ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ శక్తి పుంజుకోలేకపోయింది.) . కాబట్టి ఉన్న విపక్షాన్ని బలహీన పర్చాలని సీమాంధ్ర ‘చంద్రుడూ’, ఉద్యమశక్తులనుంచి ప్రతిపక్షం పుట్టకుండా చెయ్యాలని ‘తెలంగాణ’ చంద్రుడూ రెండేళ్ళ ముందే కత్తులు నూరుతున్నారు. రెండు చోట్లా ‘వారసుల్ని’ సిధ్ధం చేసుకుని ‘కుటుంబ కథా చిత్రాలే’ నడుపుతున్నారు. ఇందుకు నేతల ‘పుత్రవాత్సల్యం’ కన్నా, వెలువలి వారినీ, కనీసం ‘వేలు విడిచిన బంధువుల్ని’ కూడా నమ్మలేని నిస్సహాయతే ప్రధానం. తాము ఏ పధ్ధతిలో అధికారంలోకి వచ్చారో, ఆ పధ్ధతిలోనే ఇతరులు అధికారంనుంచి తమను దించుతారనే అభద్రత నేతల్ని వెంటాడం సహజమే.

అలాగని, ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారానికి ఇప్పటి నుంచి సిధ్ధంకావటంలేదా… అంటే అంతకు మించే చేస్తున్నాయి. కానీ అధికార పక్షాలకు ఆర్భాటం ఎక్కువ. ఇంత ముందు నుంచే పార్టీలు ప్రచారానికి ఎగబడటానికి కారణం సిధ్ధాంత రాహిత్యం. అవసరాలూ, పగలూ ఎప్పటికప్పుడు చల్లారి పోతుంటాయి. విలువలూ, సిధ్ధాంతాలే ప్రజల్లో శాశ్వతంగా నిలుస్తాయి.

-సతీష్ చందర్

27 ఏప్రిల్ 2017

Leave a Reply