దళిత ప్రేమ లేఖ

Photo By: gogoloopie

మరణిస్తున్నాను. మన్నించు సవర్ణ ప్రియా

మనసునొక సారి శరీరాన్నొక సారి సులభవాయిదాల్లో కాక

ఆకూ వక్కల్లా ఏకకాలంలో అందించిన దాన్ని

 

తడిపే వాన నా తనువు

కాల్చే మెరుపు నా మనసు

నీళ్ళల్లోని నులివెచ్చదనమే నా ప్రేమ

 

ముడుపు చెల్లించి మూడు ముళ్ళూ వెయ్యించుకున్నాకనే

దేహాన్ని ‘డోర్‌ డెలివరీ’ చేసే ఊర ప్రేమలు నాకు తెలీవు

 

కూలికి వెళ్ళి కమిలి పోవద్దంటూ

చక్కదనాల నా తల్లిని తిట్టుకుని, పట్టుకుని

నా తండ్రి తనివి తీరా ఏడ్చుకున్నప్పుడే

నేను గర్భంలో పడివుంటాను

 

రెండు శరీరాలూ రెండు మనసులైనప్పుడు మాత్రమే

ఏర్పడ్డ జన్మ నాది

పసుపు తాళ్ళకందని పవిత్రత

పస్తులతో హత్తుకున్న గుండెల మధ్య గుబాళిస్తుంది

 

మరణించటం మా కులధర్మం

పూవు పూస్తుందనీ

కోడి కూస్తుందనీ

పాప ఏడుస్తుందనీ

చెప్పటానికి మరణిస్తుంటాం

మాకివన్నీ భూమి గుండ్రంగా వుందన్నంతటి గొప్ప విషయాలు

 

నోరు తిరుగుతుందనడానికీ

నాజూకు తెలుస్తుందనడానికీ

నిజం పలుకుతామనటానికీ

శిలువలెక్కుతూ వుంటాం

 

ఉదాహరణకి నేనిప్పుడు

తనివి తీరా మనసివ్వడాన్నో లేక, మన:స్పూర్తిగా శరీరాన్నివ్వటాన్నో

ప్రేమని చెప్పడానికి మరణిస్తున్నాను

 

ముద్దంటే

వేడిమి, తేమల విచిత్రాద్వైతమని

చెప్పడానికి మరణిస్తున్నాను

 

రెండు శరీరాలకూ అంటుకట్టి

ఒకే ఒక ప్రాణాన్ని చిగురింప చెయ్యడమే

ఆలింగనమని చెప్పటానికి మరణిస్తున్నాను

 

ప్రయాణిస్తున్న పడవను పరమ సాహసవంతంగా తన్ని-

మునుగుతూ, తేలుతూ, పెనుగులాడుతూ

ఒకరినొకరు ఒడ్డుకు చేర్చుకోవడమే

అసలు సిసలు ప్రణయమని చెప్పడానికి మరణిస్తున్నాను

 

శిక్ష విధించి శిరసు వంచుకున్న పిరికి చక్రవర్తిలా

పండిన నాగర్భం ముందు ప్రాధేయ పడినందుకు మరణించడం లేదు

 

యోగివో, భోగివో తెలీదు కాని-

వడ్డించిన విస్తరిలో చొంగ కార్చుకున్న

అకాల వృధ్ధుడివి నీవు

క్కును కొట్టిన చేత్తోనే విస్తరినీ విసరి కొట్టగలను

 

కానీ, హఠాత్తుగా

నాకు మరణం జీవితమంత ముఖ్యమయిపోయింది

పార్వతి, లైలాల శరీరాల కన్నా

మాతంగి స్త్రీల మనసులు పరమ పవిత్రమైనవని చెప్పడానికి

ఒక మరణం అనివార్యమయిపోయింది

 

మన్నించు నా సవర్ణ ప్రియా, మన్నించు

శరీరంలేని నా మససును సమకూర్చలేక పోయాను

 

సొంత యింటికి కన్నం వెయ్యాలన్నా

కట్టుకున్న భార్యతో వ్యభిచరించాలన్నా

ఊరేమో కాని

వాడ అంత అనువైనది కాదు
-సతీష్ చందర్

(అనేకానేక సునీతల కోసం)

1995

(సునీత ఒక దళిత విద్యార్థిని. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్( పెంట్రల్ యూనివర్శిటీ)లో చదువుతూ వుండేది.అక్కడే చదువుతున్నయోగేశ్వర రెడ్డి అనే అగ్రవర్ణ యువకుణ్ణి ప్రేమించింది. అతడి కారణంగా ఆమె మూడుసార్లు గర్భవతియై అతని సలహా మేరకు అబార్షన్ చేయించుకుంది. కడకు అతడు ఒక రోజున ఆమెకు ఓ వార్త చెప్పాడు తనకు తన వాళ్ళు వేరే రెడ్ల అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారని.  ఈ వార్త విన్న సునీత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన 1995 లో జరిగింది.  ఆమె చనిపోతూ ఒక ఉత్తరం రాసి పెట్టింది. అప్పుడు నేను వార్త దిన పత్రికకు అసోసియేట్  ఎడిటర్ గా వున్నాను. ఈ లేఖను చదివాను. వాడినేమీ చెయ్యలేమా అనిపించింది. ఆమె మరణ వార్తను ప్రముఖంగానే ప్రచురించాను. కానీ ఏదో తెలియని అవమానం. ఇలాంటి సునీతలు  ప్రతీ క్యాంపస్ లోనూ రహస్య వేదనను అనుభవిస్తుంటారు కదా- అని పించింది. ఫలితమే ఈ కవిత. తొలుత  ఇండియాటుడే సాహిత్య సంచికలో వెలువడింది. నా ’ఆదిపర్వం‘ కవితా సంకలనం ఈ కవితతో ముగుస్తుంది. ఈ పోస్ట్ లో ప్రచురించింది సునీత చిత్రం కాదు. )

12 comments for “దళిత ప్రేమ లేఖ

 1. చదివినదే, దుఃఖించినదే అయినా
  మళ్ళీ ఇప్పుడె జరినట్లు
  బాధ గుండెను పిండేస్తుంది

  ఇంకా మారినట్లు లేదు కాలక్ర్రమం

 2. “రెండు మనసులు కలవటమేప్రేమ”
  అనుకునే అమాయక సునీతలు వేనవేలు.
  “రెండు శరీరాలు కలవటమే ప్రేమకు గుర్తింపు”గా చూసే
  సుఖయోగీశ్వరులు మన సోదరులు.

  ఏంచేస్తాం?ఇలా చెప్పటం తప్ప?

  ఒంటరిగా కాలేజికొచ్చే అక్కచెల్లెల్లారా,
  ఇక్కడ మగవాడి ముసుగులో..
  పులులుంటాయ్, సిహాలుంటాయ్.
  తీయని మాటలు చెప్పి మచ్చిక చేసుకునే
  నక్కలుంటాయ్, తోడేళ్లుంటాయ్.

  మీ మనసును ముక్కలు చేసి,
  శరీరాన్ని నమిలి ఊసేసేందుకు
  వేచి చూస్తుంటాయ్!
  ఆదమరిచి వారితో అడుగు కలిపారా..?
  ఇక మీ పయనం అధఃపాతాళానికే!

  లోకం చూడని మీ పసిగుడ్డుల
  కుళ్లిన శవాల పక్కన మీకోసం కొంత చోటుంటుంది.
  అంతే.. పారాహుషార్!

  మీ మనసుకి కళ్లెం వేయండి..
  మీరు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే,
  ఒక్కసారైనా ఆలోచించి అడుగు వేయండి.

  • Really it is unacceptable to any humanbeing but many young boys are bringing disrepute to their cast,actually dirty fellows are there in every cast..but one should not do like yogeshwar reddy.but if any thinks that yogeshwar will lead happy life ..no not yet all life long sunithas memories will kill him..he will fear for his health one day…because god will punish for our sins may be late but he will do it that is my beleaf..

 3. నేను అదేసంవత్సరం ఎం.ఏ. పూర్తి చేశాను. అక్కడే ఉన్నాను. ఆ రాత్రి సునీత ఉరిపోసుకున్న సంఘటన ఇప్పటికీ మదిలో మెదులుతుంది. నాకు తెలిసి ఆ మోసగాడు, అగ్రవర్ణ దురహంకారి ఇప్పుడు మరో స్త్రీతో హాయిగా సిగ్గు లేకుండా బతికేస్తుంటాడు. అటువంటి వెధవను, లుచ్చాను తన భర్తగా పొందానని ఆ రెడ్డి గారి భార్య రెడ్డిది కూడా నిస్సిగ్గుగా గర్విస్తూ ఉంటుందేమో !~ Dr.Talathoti Prithvi Raj

 4. It’s also the matter of money. ప్రేమించేటప్పుడు కులం, గోత్రం గుర్తుకి రావు. ఆ సమయంలో గుర్తుండేది శారీరక ఆకర్షణే. ప్రేమకి గమ్యం పెళ్ళి అని నమ్మేవాళ్ళు ప్రేమ విషయంలో కులం గురించి పట్టించుకోకుండా కేవలం పెళ్ళి విషయంలో కులం గురించి ఎందుకు పట్టించుకుంటున్నట్టు? కులాంతర వివాహం చేసుకుంటే కట్నం రాదు. ఆ వివాహానికి కట్నం ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఉండదు. తన కులానికే చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే లక్ష రూపాయలైనా కట్నం వస్తుంది. ఫ్రీగా లక్ష రూపాయలు వస్తే ఎవడు వదులుకుంటాడు అని అనుకునే సమాజం మనది.

 5. Sunitha siluva vesadu vadu. She has taken and believed ( bharama ) that his is love. A girl ( any community )specifically from “down ward caste” ( i cudnt say that word as it is such a humilitaing word ) should be very careful when a man, especially, when he is from forward caste, is approaching her. love is a small part of life. life is for loving but not love is life. every girl should know this fact. If Suneetha shared her feelings with some one, her death had been avoided. twhen one avoided her friend shop and cheated and fixed marriage with some one, girl should hate him and forget him immediately from the moment when she came to know and delete that VEDHAVA from his mind and not suffer for it.She sud feel sorry for having friendship with such A DROHI . EVEN SHE SHOULD NOT FEEL FOR HAVING RELATION WITH HIM. SHE SUD TAKE IT BAD INCIDENCE IN HER LIFE AND LEAVE IT AND LEARN FROM IT AND COME OUT OF IT AND MOVE FORWARD. SHE LOST HER LIFE FOR A SELFISH FELLOW. THE PRESENT GENERATION HAS NOT WORLDLY KNOWLEDGE EXCEPT BOOKISH KNOWLEDGE. PERSONALITY DEVELOPMENT CLASSES should be given, from the beginning from school.college, and also university stage TO FACE THE LIFE and it should be added in the syllabus for all. SUNEETHA IS INNOCENT EMOTIONAL AND SUCCUMBED TO THE STRESS. SHE SACRIFICED HER LIFE FOR A FALSE LOVE.

 6. the incident is quite worst. one should not cheat any one whether upper or lower caste He / She must be punished brutally who ever cheats Most of the students going to Higher education with the purpose of studying. A lot of efforts are put to get a seat in University. After joining in the university, they forget all the things and think of petty things like this. there is a lot of time to thing of life not in universities while studying.

 7. I always feel that poetry accentuates the emotional component and fails to point in the direction of of a solution. This story could be the story of any two young people – one gullible, one exploiting. It is not only women, but men also could be gullible and hence victims. By painting this situation as a caste problem, and by giving it a tone of martyrdom, this poem exploits the common social sentiments, but doesn’t help in getting to the root of the problem. The root of the problem is gullibility. We need social structures to identity and help gullible people so that they don’t give up themselves for exploitation. However, I should say the poem has nice punch lines. They are good in isolation !

 8. ఇతిహాసాలనుండి ఈనాటివరకు, ఏనాటికైనా నిర్భయంగా నమ్మగర్భంగా..నరుడ్ని నమ్మే కాలం కాదని యవ్వనవర్ణాల మాయలోపడే నా దళిత రత్నాలు తెలుసుకోనంతవరకూ…..ఈ దాత్రిఒడిలో నిర్బలంగా తనువు చాలించాల్సిందేనా.. మాయల్లో పడకండమ్మా… మా మసులంత వికలమౌతున్నయో మీకేం..మీ గాధలు వింటుంటే…

 9. ఇతిహాసాలనుండి ఈనాటివరకు, ఏనాటికైనా నిర్భయంగా నమ్మగర్భంగా..నరుడ్ని నమ్మే కాలం కాదని యవ్వనవర్ణాల మాయలోపడే నా దళిత రత్నాలు తెలుసుకోనంతవరకూ…..ఈ దాత్రిఒడిలో నిర్బలంగా తనువు చాలించాల్సిందేనా.. మాయల్లో పడకండమ్మా… మా మసులంత వికలమౌతున్నయో మీకేం తెలుసు ..మీ గాధలు వింటుంటే…

Leave a Reply