దివాకర ‘రాయలు’!

కేరికేచర్: బలరాం


పేరు: జె.సి.దివాకర రెడ్డి
దరఖాస్తు చేయు ఉద్యోగం: రాయల తెలంగాణ ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : దివాకర ‘రాయలు'( రాయల తెలంగాణ వస్తే తానే శ్రీకృష్ణ దేవ రాయలు లాగా ‘భువన విజయం’ చేయవచ్చు.

విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ బ్రేకింగ్‌ అండ్‌ వెల్డింగ్‌( కలిసిన వాటిని విరచగలరు. విడిపోయిన వాటిని అతక గలరు. (ఆంధ్రప్రదేశ్‌ను మూడుగా విభజించి, రెంటిని అతికి- రాయల తెలంగాణ- చేయాలన్న సంకల్పం అలా వచ్చిందే)

హోదాలు : మాజీ మంత్రి, ‘రాజీ’ నేత (ఒకప్పుడు ‘సమైక్యాంధ్ర కోసం గొడవ పడ్డారు. ఇప్పుడు విభజన వైపునకు రాజీ కొచ్చారు.)

గుర్తింపు చిహ్నాలు : 1) నల్ల కళ్ళ జోడు( పసుపు కూడా నల్లగా కనబడుతుంది. అందుకే కాబోలు ఎటో వెళ్ళబోయి ఆ మధ్య తెలుగుదేశం లెజిస్లేచర్‌ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళిపోయారు.)

2) సందేహాల పుట్ట (ఇన్ని కేసుల్లో విచారణ జరుగుతున్నా, వైయస్‌కు ఆత్మీయ మిత్రుడు కె.వి.పి రామ చంద్రరావు ను ఎందుకు వదిలేస్తున్నారన్న ఎవరికీ రాని సందేహం ఆయనకు వచ్చింది.)

సిధ్ధాంతం : మిత్రులున్నా లేకున్నా, శత్రు శేషం వుండకూడదు. (అపార్థం చేసుకోకండి. అనంతపురంలో పాత కేసుల్ని తవ్వటం లేదు. శత్రువుని శత్రువుగా వుంచుకోకుండా మిత్రుడిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు లెండి. అందుకనే అప్పుడప్పుడూ ముఖ్యమంత్రి తరఫున కూడా మాట్లాడుతుంటారు.)

వృత్తి : రాజకీయ జోస్యాలు చెప్పటం( ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఓడతారో లగడపాటి రాజగోపాల్‌ ఎలా చెబుతారో, ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ ఎవరు అరెస్టు అవుతారో జేసీ చెబుతారు. కోవూరు ఉప ఎన్నిక ముందు కానీ, తర్వాత కానీ జగన్‌ అరెస్టు అవుతారని చెప్పారు. ఉప ఎన్నికయి చాలా కాలం అయింది. ప్రతీ జోస్యమూ నిజమవ్వాలని లేదు లెండి.)

హబీలు : 1) ‘శత్రు’ స్తుతి ( తెలుగుదేశం నేత మోత్కుపల్లి నరసింహుల్ని ప్రశంసించి వస్తారు. కేసీఆర్‌ను తిట్టినందుకు)

2) మిత్ర నింద(సొంత పార్టీ నేతల్ని కడిగి పారేస్తుంటారు.)

అనుభవం : ఉండబట్టే. ముఖ్యమంత్రి పోస్టు అర్హుణ్ణని, కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రి గా చేసినప్పుడే చెప్పాను. ( పార్టీ అధిష్ఠానాలు విచిత్రంగా వుంటాయి. అయితే రోశయ్య లాంటి వృధ్ధుల్నో, లేదా సెక్రటేరియటే చూడని కిరణ్‌ లాంటి బాగా జూనియర్స్‌ నో చూస్తాయి.)

మిత్రులు : ‘గులాబీ’ కోసం ‘చేయి’ చాపారు. ముల్లు గుచ్చుకుంది. ( చక్కగా రాయల తెలంగాణ పెట్టుకుని సుఖపడదామయ్యా- అని టీఆర్‌ఎస్‌ వాళ్ళను దువ్వ బోయారు. కానీ వారు అడ్డం తిరిగారు.)

శత్రువులు : ఉంటే బాగుండేదేమో. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాన్ని ఉంచుకోరు. కానీ ఈయన శతృత్వాన్ని బదులు, శత్రువుల్నే తుడిచేయగలరు.

మిత్రశత్రువులు : ఇంకెవరూ..? సాటి కాంగ్రెస్‌ వారే.

జీవిత ధ్యేయం : సిఎం గా ‘రాయల్‌’ లైఫ్‌ జీవించాలని ( అంటే మరేమీ కాదు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో ఎలాగూ అనుభవానికి గుర్తింపు రావటం లేదు. రాయల తెలంగాణలో అయితే కాస్త వేగవంతం అవుతుందని.)

-సతీష్ చందర్

Leave a Reply