దూకమంటే దూకేదీ దూకుడు కాదు!

kadiyam-srihari30-300టాపు(లేని) స్టోరీ:

దూకు.. దూకు… దూకుడు! ఇది సినిమా కాదు. రాజకీయం. ఈ ‘దూకుడు’లోనూ సారం అదే. కథ తక్కువ. కామెడీ ఎక్కువ. రాజకీయమన్నాక ఎప్పుడూ ఒక పార్టీలోనుంచి ఒక పార్టీలోకి దూకుతూ వుంటారు.

ఎవరికి వారు తమంతట తాము దూకితే, అందులో కామెడీ వుంటుంది. కానీ, తీరా దూకేసి, వెనక్కి తిరిగి ‘ఎవడ్రా నన్ను తోసిందీ?’ అని వెనక్కి తిరిగితే కామెడీగా వుంటుంది.

నిజంకూడా అంతే. కొత్త పార్టీల్లో అవకాశాలు ఎక్కువ గా వున్నాయిని వెళ్ళే వాళ్ళు కొందరయితే, ఉన్న పార్టీల్లో ఉక్క బోసి వెళ్ళే వాళ్ళు మరికొందరు. నిజం చెప్పాలంటే దూకటం పెద్ద కామెడీ కాదు కానీ, దూకేటప్పుడు పలికే పలుకులుంటాయే, అవి మాత్రం నిజంగానే కితకితలు పెడతాయి.

భార్యకి విడాకులు ఇచ్చేసి వెళ్ళుతూ, ‘నేను కట్టిన మంగళ సూత్రం జాగ్రత్త’ అన్నాడు బాధ్యత గల భర్త ఒకడు. ‘ఆ మాట నాకెందుకు చెబుతారూ, నేను చేసుకోబోయే రెండో భర్తకు చెప్పండి. నేను ఎంత చెప్పినా వినటం లేదు. కొత్త మంగళసూత్రం కొంటానంటున్నాడు. నేనేమో, మీరు కట్టింది వుంది కదా- అని చెబుతున్నాను.’ అని ఆమె అనగానే ఆ మాజీ భర్త ఎంతో ముచ్చట పడ్డాడు. ‘అవును. మళ్ళీ అదనపు ఖర్చు ఎందుకూ? అన్నట్టు. మనకి పెళ్ళికి నువ్వు కట్టుకున్న చీర కోసం వెతుక్కుంటావేమో! నేను తీసుకువెళ్తున్నాను. నా రెండో పెళ్ళికి పనికి వస్తుందని.’ అని ముక్తాయించాడు కూడా.

మారు మనువు వెళ్ళినా, మరో పార్టీకి మారినా- ఈ మాత్రం పరస్పర సహకారం వుండాలి. కానీ ఈ మధ్య ‘దూకే’ నేతల్లో అలాంటి సదవగాహన రవ్వంత కూడా కనిపించటం లేదు.

ఈ మధ్య ఇద్దరు ప్రముఖ నేతలు ‘దూకారు’. ఒకరు ఉత్తరాంధ్ర నుంచి, మరొకరు తెలంగాణ నుంచి. ఒకాయన పేరు: దాడి వీరభద్రరావు, మరొకాయన పేరు:కడియం శ్రీహరి. ఒకే పార్టీని (తెలుగుదేశం) వీడారు కానీ, చెరో పార్టీలో దూకారు. దాడి వైయస్సార్‌ కాంగ్రెస్‌ లో దూకితే, కడియం టీఆర్‌ఎస్‌లో దూకారు. ఇద్దరూ ఒకే దాంట్లోకి దూకితే ఇంకా బాగుండేది. కానీ అందుకు ఆ పార్టీలు సహకరించవు. టీఆర్‌ఎస్‌కు ఉత్తరాంధ్ర శాఖ వుండదు. వైయస్సార్‌కాంగ్రెస్‌కు తెలంగాణలో జోరు వుండదు. (ఉన్న ఒక్క విలాసం ‘కొండా’ దంపతులు. వారు కూడా వేరే చిరునామాను వెతుక్కుంటున్నారు.)

ఇద్దరూ దాదాపు మూడేసి దశాబ్దాలు తెలుగుదేశం తో పయినించిన వారే. అంతే కాదు, తెలుగుదేశం పక్షాన తాము చేరిన పార్టీలను, వాటి నేతలనూ తూర్పారబట్టిన వారే. దాడి అయితే పేరుకు తగ్గట్టు వైయస్సార్‌ కాంగ్రెస్‌ మీద దాడి చేస్తూనే వున్నారు. ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ అనే వైయస్‌ మీద అవినీతి ఆరోపణలతో కూడిన అభియోగ గ్రంథ రచనలో మైసూరా రెడ్డికి సమాచార సహకారాన్ని అందించినట్టు భోగట్టా. ( అయితే మైసూరా కూడా వెయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంకాస్త ముందు వెళ్ళారు. అది వేరే విషయం.) కానీ, అదే దాడి జగన్‌ను కలిసి వ’చ్చాక, ‘నేను ఊహించిన వ్యక్తి వేరు. నేను చూసిన వ్యక్తి వేరు’ అన్న తరహాలో సరికొత్తగా ఆశ్చర్య పోయారు. అలాగే కడియం కూడా టీఆర్‌ఎస్‌నూ, ఆ పార్టీ చంద్రశేఖరరావునీ తనదైన శైలిలో విమర్శిస్తూనే వున్నారు. కానీ ఇప్పుడు- ఆయనలో ఒక గొప్పనేతను చూస్తున్నారు. మరి వదిలేసిన పార్టీ నేత చంద్రబాబు ఎవరు? ఒక నియంత. అదే నిజమైతే నియంతృత్వాన్ని ముఫ్పయ్యేళ్ళు గౌరవించారా? ప్రజస్వామ్యం మీద ఇన్నాళ్ళకు గాని మక్కువ కలగ లేదన్నమాట! దాడిని మరోమారు ‘ఎమ్మెల్సీ’ ని చేసి వుంటే బాబు ప్రజాస్వామిక వాది తప్పకుండా అయ్యేవారు. కడియానికి కూడా గుర్తింపు లభించి వుంటే, బాబు ‘రెండు కళ్ళ’ సిధ్ధాంత అభ్యంతర కరంగా వుండేది కాదు. అలా కాకుండా ‘అందలాలు’న్న చోటనే వుంటామని చెప్పి ‘దూకితే’ ఎంత నిజాయితీగా వుండేదీ!! అఫ్‌ కోర్స్‌! అలా చేస్తే ఇంత కామెడీ వుండేది కాదనుకోండి.

 న్యూస్‌ బ్రేకులు

వన్స్‌ మోర్‌’!

తెలంగాణకు అనుకూలంగా మరోమారు తీర్మానం చేయమని కడియం కోరటం పిల్ల చేష్టలా అనిపిస్తోంది.

-నామా నాగేశ్వరరావు, ఎం.పి. తెలుగుదేశం

‘వన్స్‌ మోర్‌! అన్నారు. అంటే తీర్మానాన్ని మెచ్చుకున్నట్టే కదా! నొచ్చుకుంటారేమిటి?

రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించేంత వరకూ ఆందోళన చేస్తాం.

-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

కాంగ్రెస్‌ పార్టీని మీరు ప్రక్షాళన చేస్తానంటారేమిటి? మీ పార్టీ ‘తెలుగుదేశం’. మరచిపోయారా?

ట్విట్టోరియల్‌

చిన్నబోయిన ‘బూటు’ హక్కు

పాకిస్తాన్‌లో పౌరులకు ‘వోటు’ హక్కు వున్నట్టే, సైనికులకు ‘బూటు’ హక్కు వుంటుంది. ప్రజలు తమ ‘వోటు’ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకు, సైన్యం తన ‘బూటు’ హక్కును వినియోగించుకుని సైనిక నియంతృత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అలా అక్కడ పౌరులు ‘ఎన్నికల’ మీదా, సైనికులు ‘కూ'( సైనిక తిరుగు బాటు) మీదా తమ తమ విశ్వాసాలను ప్రకటిస్తుంటారు. ఇదీ అక్కడ వరస. కానీ ఇప్పుడు వరస మారింది. ‘వోటు’ తో ఏర్పడ ప్రభుత్వం తిరిగి (బూటు తో కాకుండా) వోటు తోనే కూలింది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ సర్కారు ముగిసి పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ సర్కారు వస్తోంది. అంటే జర్దారీ ఏలుబడిలోంచి, నవాజ్‌ షరీఫ్‌ ఏలుబడిలోకి వస్తుందన్నమాట. కానీ పాకిస్తాన్‌కు అలవాటు లేని పని. ‘కూ’ అనకుండా ‘సైనికులు’ వుండలరో మరి! సైనికులు ఇంతే ఓరిమితో వుండి పోతే మన పక్క దేశంలో కూడా ప్రజస్వామ్యం వుందని మనం కూడా గొప్పలు పోవచ్చు.

‘ట్వీట్‌ ఫర్‌ టాట్‌

‘మోడి’ సాయం!

పలు ట్వీట్స్‌: కర్ణాటకలో కాంగ్రెస్‌కు యెడ్యూరప్ప చేసిన మేలు, ఇంతా అంతా కాదు.

కౌంటర్‌ ట్వీట్‌: భలే వారే. ఒక్క యెడ్యూరప్ప ఏమిటి? మోడీ మాత్రం మేలు చేయలేదూ? అయన బీజేపీ తరపున చేసి నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ గెలిచిందిట.

ఈ- తవిక

‘నేల’ బారు పరిశోధన

కోబ్రా పోస్టులకూ

తెహల్కాలకూ

వొంటి నిండా కళ్ళే.

కానీ అవి చూసేవి మాత్రం

నేల చూపులే.

ఎప్పుడూ అట్టడుగు నేతలే

వాటి కెమరాలకు

చిక్కుతారు.

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘ఎండలు మండి పోతున్నాయి!’

‘ధరల కన్నానా?’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

ఎవరి సినిమాలనో ఎందుకు అనుకరించాలని, తన సినిమానే తాను కాపీ కొట్టాడు ఒరిజినల్‌ దర్శకుడు!

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 14 మే 2013 వ తేదీ సంచికలో  ప్రచురణ )

Leave a Reply