చెప్పింది చెయ్యరు: చేసింది చెప్పరు
అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.
పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:
పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ ‘లేవరు’.
కుటుంబ సంక్షేమం: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబూ, తెలంగాణలో కేసీఆర్ తమకున్న ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు, అదనంగా ‘కుటుంబ సంక్షేమ’ శాఖను నిర్వహిస్తారు. ఇదేదో ‘సాంఘిక సంక్షేమ’ శాఖ లాంటిది కాదు. సొంత కుటుంబ సభ్యుల నందరినీ వీలయినంత సమానంగా చూసుకోవటానికి ప్రయత్నిస్తారు. బాబు ఒక్క లోకేష్ బాబు క్షేమాన్నే కాదు, బాలయ్య బాబు సంక్షేమాన్ని కూడా ఎంతో కొంత చూడాలి కదా! కేసీఆర్ కూడా అంతే. కేటీఆర్‌నే కాదు, హరీష్ రావును కూడా అంతో ఇంతో చూసుకోవాలి. స్వంత కుటుంబసభ్యుల్లో అసంతృప్తి వస్తే, పార్టీ సభ్యుల్లో వచ్చిన అసంతృప్తి కన్నా తీవ్రంగా వుంటుందని తెలిసిన విజ్ఞులు వీరిద్దరూ.
ద్విపాత్రాభినయం: ఇద్దరూ చంద్రులూ ద్విపాత్రాభినయం చేస్తానంటారు. పాలక పక్ష నేతగా వుంటూ, ప్రతిపక్ష నేత పాత్రను కూడా ఫ్రీగా చేసి పెడతానంటారు. రాజధానికి రైతుల భూములను తన దైన ‘శైలి’ ( భూసమీకరణ ద్వారానే, భూసేకరణ ద్వారా కాదు.)లో రైతులనుంచి భూములను ఒక పక్క తీసుకునేదీ బాబే. దెబ్బతిన్న రైతులు ప్రతిపక్షంగా వున్న వైయస్సార్ కాంగ్రెస్‌ను ఆశ్రయించకుండా, సకాలంలో వారి పక్షాన నిలచి పోరాడటానికి ‘పవన్ కల్యాళ్’కు వీలుకలిపించేది బాబే.
ఇంతటి తెలివి కేసీఆర్‌కు వుంటుందా? అని కొందరు ఆశ్చర్య పోవచ్చు. వారి ఆశ్చర్యంలో నిజం వుంది. ఇంతటి తెలివి కేసీఆర్‌కు లేదు. ఇంతకు మించిన తెలివి మాత్రం పుష్కలంగా వుంది. తెలంగాణ ఆసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు, ‘జాతీయ గీతం’ ఆలపిస్తుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆల్లరి చేశారన్నది కేసీఆరే. కానీ ప్రతిపక్ష ఖ్యాతి తెలుగుదేశం పార్టీకి దక్కకుండా చూడాలి. ఎలా? కాంగ్రెస్ పట్ల కాస్త మెతక గా వుంటే చాలు. దానికి మెత్తబడి కాంగ్రెస్ సభా పక్ష నేత జానా రెడ్డే స్వయంగా తన పార్టీ సభ్యుడి చేత క్షమాపణ చెప్పించారు. ( ఆ తర్వాత ఆయన విమర్శలు పాలయ్యారనుకోండి. అది వేరే విషయం.)
ఒంటెత్తు పోకడ: ఇద్దరూ ప్రజాస్వామ్యవాదులే. కానీ నిర్ణయం తీసుకునే సహచరులతో చెబుతారు. నిర్ణయానికి ముందు పెద్దగా చర్చించరు. కాకుంటే చంద్రబాబు చుట్టూరా ఒక ‘కోటరీ’ వుంటుందని వినికిడి. వారి అభిప్రాయాలకు ఆయన ఎక్కువ విలువ నిస్తారని చెబుతుంటారు. కానీ ఎక్కువ నిర్ణయాలు ఆయన అంతట ఆయనే తీసుకుంటారు. గోదావరి నుంచి కృష్ణా కు నీళ్ళు మళ్ళించే పట్టిసీమ ప్రాజెక్టు సంబంధించిన నిర్ణయం చంద్రబాబు తనంతట తానే తీసుకున్నారు.
ఇక కేసీఆర్ విషయంలో అలాంటి అపప్రదలేవీ లేవు. ‘కోటరీ’ వున్నట్టే తెలీదు. ఆ మాట కొస్తే, ఆయన తన కేబినెట్ సమావేశాలను చిటికెలో తేల్చేస్తారు. సహచర మంత్రులతో చర్చిస్తే కదా, సమయం పట్టేదీ..! వారినెందుకు ఇబ్బంది పెట్టటమని, అన్నీ తానే నిర్ణయించి, మంత్రులతో ‘మమ’ అని అనిపించేస్తారు. కాదనే సాహసం ఎవరన్నా చేస్తే కదా!
అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇద్దరు చంద్రులూ ఈ విషయంలో సహచర మంత్రులకన్నా, అధికారుల సూచనలకే ఎక్కువ విలువనిస్తారు. పైకి మాత్రం ‘ఎమ్మెల్యేల మాటలు అధికారులు వినాల్సిందే’అని మాత్రం నేరుగా ఒకరూ, ఆ అర్థం వచ్చేటట్టు మరొకరూ చెబుతారు.
‘షేమ్’ టు ‘షేమ్’!
ఇన్ని సామాన్య లక్షణాలున్న ‘చంద్రుల’ తొమ్మిదేళ్ళ పాలనా ఒక్క తీరుగా కాకుండా, వేరుగా ఎలాగుంటుంది? అంతే కాదు, పైకి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నట్లు కనిపించినా, అవసరం వస్తే క్షణాల్లో కలసి పోతారు. అంతెందుకు? ఈ మధ్య నీటికోసం నాగార్జున సాగర్ వద్ద ‘కుడి’, ‘ఎడమల’ డాల్‌కత్తులు మెరయగ.. రెండు రాష్ట్రాల పోలీసులూ ‘సరిహద్దు సేనల్లా’ గొడవ పడ్డారు. ఈ తగువు తెగేది కాదనుకున్నారు. బాబు, కేసీఆర్ కు ఒక్క ఫోన్ కాల్ కొట్టారు. మరుసటి రోజు గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరూ కలసి ‘ఛాయా’ గ్రహణం చేశారు. ( ఛాయీ తాగారు, కలసి ఫోటోలూ దిగారు.)
ఒకరేం చేస్తే, మరొకరూ అదే చేస్తారు. ‘రైతుల రుణ మాఫీ’ విషయంలో తొలుత ఇద్దరూ షరతులు పెట్టారు. బంగారు రుణాలకూ, పంట రుణాలకూ వర్తించవని ఒకరూ, ఇంత మొత్తం దాటితే వర్తించదని ఇంకొకరూ ఒకరి తర్వాత ఒకరు నసిగారు. మళ్లీ దారి కొచ్చేశారు.
తనది ‘మిగులు’ రాష్ట్రమని కేసీఆర్ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంటు ఇస్తే, తనది ‘తరుగు’ రాష్ట్రమయినా సరే అంతే ఇస్తానని బాబు ‘కమిట్’ అయిపోయారు.
ఇద్దరూ హామీలిచ్చేసి, సహాయం కోసం కేంద్రం వైపు చూస్తారు. ఒక చంద్రుడు ఢిల్లీ పర్యటించి వచ్చేస్తే, ఇంకో చంద్రుడు వెను వెంటనే విమానం ఎక్కేస్తాడు.
రాజులు వెడలె ‘రభస’కు!
ఇన్ని పోలికలు వున్న ఇద్దరు చంద్రులూ ఇంచు మించు ఏకకాలంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఇన్నింటిలో పోలికలు వున్నప్పుడు ఈ సమావేశాల నిర్వహణలో మాత్రం పోలికలుండవా? అయితే సమావేశాలయితే పెట్టారు కానీ, ఇద్దరికీ రెండు దిగుళ్ళు వున్నాయి. అవే గండాలయి కూర్చున్నాయి. బాబుది ‘భూమి’ గండం. కేసీఆర్‌ది ‘విద్యుత్’ గండం. ఈ రెంటి గురించీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు విరుచుకు పడటం ఖాయం. ఈ గండాల నుంచి బయిట పడటానికి, ఎవరికి వారు ద్విముఖ వ్యూహాలు రచించుకున్నారు. సమావేశాలకు వెళ్ళే ముందే, ఆయా సమస్యలు పరిష్కారమయినట్టు భ్రమ కల్పించాలి. సమావేశాలొచ్చేసరికి, ఈ సమస్యల్ని మింగేసే సమస్యలు తామే సృష్టించాలి.
సమస్యల్ని ఎలా చిన్నబుచ్చారు?
చంద్రబాబు: రాజధానికి తుళ్ళూరు సమీపంలో దాదాపు 32,500 ఎకరాల భూమి అవసరం కాగా, 30,000 ఎకరాలను ‘లాండ్ పూలింగ్’ కింద రైతులే ఐఛ్చికంగా ఇచ్చినట్లు చూపించారు. ఇక మిగిలినవి కొంచమే.
కేసీఆర్: ఆంద్రప్రదేశ్ నుంచి విద్యుత్‌ను అమ్ముతామన్నా కొనుక్కోము- అని తెగేసి చెప్పారు. అంతవరకూ విద్యుత్తు ఇవ్వటానికి బాబు మోకాలు అడ్డుతున్నారన్న వాదనకి ఇది భిన్నమైనది. విద్యుత్తుకు అన్ని ఏర్పాట్లు చేశాననీ, కేవలం ఏప్రిల్ నెలలో రైతుల నుంచి వచ్చే డిమాండ్ రీత్యా పట్టణాలలో కోతలు వుంటాయనీ, మే నెలలో కోతలుండవనీ చెప్పేశారు.
సృష్టించిన కొత్త సమస్యలేవి?
పట్టిసీమ: ఆంధ్రప్రదేశ్‌లో నదుల (వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నాల)అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నట్లూ, సీమకు నీళ్ళందించటానికి గోదావరి నుంచి కృష్ణాలోకి నీళ్ళను ఎత్తిపోయటానికి పట్టిసీమ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. దీనిగురించి ప్రతిపక్షాలు మాట్లాడితే, వారికి రాయలసీమ కరువు ప్రాంతాల పట్ల భక్తి లేదని చెప్పవచ్చని వ్యూహం పన్నారు. దాంతో ప్రతిపక్షాలు నిజంగానే ‘పట్టిసీమ’ చుట్టూ తిరిగాయి. పోలవరం వుండగా ఈ ప్రాజెక్టు దేనికని ప్రశ్నించాయి. గోదావరి, కృష్ణకు ఏక కాలంలో వరదలు వచ్చినప్పుడు, మార్గ మధ్యంలో స్టోరేజీకి ఆస్కారమేదని వైయస్సార్ కాంగ్రెస్ ప్రశ్నించటానికి ప్రయత్నించారు. ఆయినా అడ్డుకున్నారు. దీంతో ‘భూమి’ గండం బాబుకి తాత్కాలికంగా తప్పినట్లయింది.
హైకోర్టు విభజన: కేసీఆరే స్వయంగా హైకోర్టు విభజన ఎజెండాను తెర మీదకు తెచ్చారు. సీమాంధ్ర వ్యతిరకేతను ముందుకు తెస్తే, తెలంగాణలోని ప్రతిపక్షాలు నోరుమెదప లేవు. ఈ వ్యతిరేకతను ప్రతిబింబించటానికి చిట్టచివరి గురుతుగా హైకోర్టు వుండిపోయింది. దాని మీద కేసీఆర్ దృష్టి సారించారు. అయినా, రైతుల సమస్యలతో పాటు, ఇతర సమస్యలతో ప్రతిపక్షాలు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాధ్ధాంతం చేశాయి. అయితే ఇక్కడి ప్రతిపక్షాలు కేసీఆర్ ఉచ్చులో మరీ నేరుగా పడకుండా కొంచెం తెలివిగా వ్యవహరించాయి. ఏ ‘సీమాంధ్ర వ్యతిరేకత’ను ప్రదర్శించి, ప్రధాన సమస్య నుంచి దృష్టి మళ్ళిద్దామని కేసీఆర్ ప్రయత్నించారో, అదే ‘సీమాంధ్ర వ్యతిరేకతను’ మరో సమస్య లో చూపగలిగారు. సీమాంధ్రలో కలిపిసి భద్రాచలం లోని ఏడు మండలాలను ప్రస్తావించారు. ఏదయితేనేం, అసలు విద్యుత్ సమస్య గాలికి వెళ్ళిపోయింది కదా!
ఇద్దరూ తమ తమ అసెంబ్లీలో ప్రతిపక్షాలను సస్పెన్షన్లకు గురి చేసి, సభలు నిర్వహించి బడ్జెట్ సమావేశాలను తమ తమ సభాపతులద్వారా నిర్వహించేసుకున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ దొందూ, దొందే.
-సతీష్ చందర్
‘తిట్టు’ సభ! ‘కొట్టు’ సభ?
న్యూసెన్స్ చెయ్యటం అంత ఈజీ కాదు. దానికీ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వుండాలి. అందులోనూ అసెంబ్లీలలో న్యూసెన్స్ అంటే చిన్న విషయమా? రిహార్సల్స్ కూడా గట్టిగా వుండాలి. ఈ న్యూసెన్స్‌ను ప్రతిపక్షాలూ ప్లాన్ చెయ్యవచ్చు. అధికార పక్షాలూ ప్లాన్ చెయ్యవచ్చు. ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తే, పాక్షికంగానే సక్సెన్ అవుతుంది. ఎందుకంటే ‘నిష్పాక్షికంగా వ్యహరించాల్సిన’ సభాపతులు ఎప్పుడూ అధికార పక్షం నుంచే వస్తారు కాబట్టి, వారి సహకారం వుంటుందన్న గ్యారంటీ వుండదు. కానీ అధికార పక్షమే ప్లాన్ చేస్తే ‘హిట్టే’. సాధారణంగా అసలు సమస్య నుంచి దృష్టి మళ్ళించటానికి అధికార పక్షాలకు ఈ ‘న్యూనెస్స్’ అవసరమవుతుంది. కానీ కొంచెం ఊతం ఇవ్వాలి కానీ, ప్రతిపక్షాలు కూడా ‘న్యూసెన్స్’ కు ‘కౌంటర్ న్యూసెన్స్’ కూడా చేసేస్తారు.
బడ్జెట్ సమావేశాలప్పుడు రెండు రాష్ట్రాల అసెంబ్లీలనో న్యూసెన్స్ జరిగింది. కానీ, కేసీఆర్ నాయకత్వంలోని పాలక పక్షం తెలంగాణ అసెంబ్లీలో ‘సిగపట్ల’ను ప్రయోగిస్తే, బాబు నేతృత్వంలోని అధికార పక్షం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ‘తిట్ల’ను ప్రయోగించింది.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు ప్రసంగం ప్రతులను గవర్నర్ మీదకు విసిరితే, అధికార టీఆర్‌ఎస్ సభ్యులు ‘మార్షల్:’ అవతారమెత్తి, భౌతికంగా నిలుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది ముమ్మాటికీ దాడి అని ప్రతిపక్షంలోని తెలుగుదేశం సభ్యులు ఆరోపించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికారంలో వున్న తెలుగుదేశం సభ్యులయితే, పట్టిసీమ ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్నపుడు ‘తిట్టు’ ను ఆయుధంగా మార్చేసుకున్నారు. ఒక సభ్యుడయితే వైయస్సార్ సభ్యురాలు రోజాను ‘ఆంటీ’ అని సంబోధించేశారు. మగసభ్యులనయితే ‘పాతేస్తానని’ అన్నారు. అయితే ప్రతిపక్షం కూడా ఊరుకోలేదు.
ఈ ఒక్క ‘న్యూసెన్స్’ విషయంలోనే ఇద్దరి చంద్రుల వ్యూహాలకి కొంచెం తేడా వుంది.
-సర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 21-27 మార్చి 2015 వ తేదీ సంచికలో ప్రచురితం)