నవ్వేడ్పులు!

తీర్పులు ఎక్కడయినా ఒక్కటే. అవి ఓర్పునకు పరీక్షలు.

కోర్టులో న్యాయమూర్తి ఇచ్చే తీర్పుకూ, ఎన్నికల్లో వోటరు ఇచ్చే తీర్పుకూ పెద్ద తేడా వుండదు.

ఒకడు గెలుస్తాడు. ఇంకొకడు వోడిపోతాడు. కానీ చిత్రం. ఇద్దరూ ఏడుస్తారు. వోడిన వాడు కోర్టు ఆవరణలోనే ఏడ్చేస్తే, గెలిచిన వాడు ఇంటిక వెళ్ళి ఏడుస్తాడు. కారణం? కేసుఖర్చుల కోసం సమానంగా కొంపలు ఆర్పుకునే వుంటారు.

ఎన్నికల్లోనూ అంతే, ఒక పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. కానీ ఆ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. అదే నియోజకవర్గంలో మరో పార్టీ అభ్యర్థి వోడిపోతాడు. కానీ అతడి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి? ఎవరు ఏడ్వాలి. ఎవరు నవ్వాలి. సమస్యలేదు. ఇద్దరూ ఏడ్వాల్సిందే. ఇద్దరూ ఒకే రీతిలో నియోజకవర్గంలో బీరులు పొంగించి వుంటారు. బిర్యానీ పొట్లాలు పంచి వుంటారు. ‘వోటు వెయ్యి’ అని అడిగినప్పుడు ‘వెయ్యి’ ఇస్తానని ఎలాగూ కమిట్‌ అయివుంటారు కాబట్టి, ఆ మొత్తం కూడా ఇచ్చేసి వుంటారు. దీన్ని బట్టి ఇద్దరూ సమానంగా తగలేసి- పదవి వుండి అధికారం లేకుండా ఒకరూ, అధికారం వుండి పదవి లేకుండా మరొకరూ నియోజకవర్గంలో తిరుగుతూ అయిదేళ్ళూ ఒకరికి పడి ఒకరు ఏడుస్తాంటారు.

‘ఏడు’ అంటే గుర్తు కొచ్చింది. మొన్న(మార్చి18) న ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు కూడా ‘ఏడే’. ‘ఏడు’ ‘ఏడు’ అంటే ఎవరు నవ్వుతారు చెప్పండి? ఈ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది వర్తించేసింది. ఇక్కడ ‘ఏడుపు’ మామూలే కానీ- అది గెలిచినందుకో, లేక వోడినందుకో కాదు. ఫలితాలు వచ్చేసినా సరే, గెలుపు ఎవరిదో, వోటమి ఎవరిదో తేలక అన్నీ పార్టీలకూ ఏడుపు తన్నుకొచ్చింది.

వరసగా రాష్ట్రంలో రెండు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘జంట కమాలల'( ఇద్దరు సభ్యుల)తో సరిపుచ్చుకున్న బీజేపీ ఈ ఉప ఎన్నికలో (మహబూబ్‌ నగర్‌) నుంచి ‘మూడో కమలాన్ని’ తెచ్చుకుంది. ఇది విజయమనే అనుకొని ఆ పార్టీ వారు విపరీతంగా నవ్యేయబోయారు. కానీ ఇంతలోనే ఇతర రాష్ట్రాలలోని ఉప ఎన్నికల ఫలితాలు. బిజేపీ అధికారంలో వున్న గుజరాత్‌లో వరుసగా నాలుగు సార్లు గెలిచిన అసెంబ్లీ సీటును పుసుక్కున పోగొట్టేసుకుంది.అలాగే బీజేపీ అధికారంలో వున్న మరో రాష్ట్రం (కర్ణాటక)లో ముఖ్యమంత్రి ఖాళీ చేసిన నియోజకవర్గం జారిపోయింది. అంచేత మన రాష్ట్రంలోని ‘మూడో పువ్వు’ ఇవ్వాల్సినంత నవ్వును ఇవ్వలేదు.

ఏడింటిలోనూ నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచేసింది. నవ్వేయొచ్చుకదా? కానీ అది గెలుపులా కనిపించటం లేదు. మహబూబ్‌నగర్‌లో వోడిపోయారు కదా! ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి శాశ్యత హక్కుదారు ఇన్నాళ్ళూ ఆ పార్టీ భావించింది. అలాంటిది ఆ పార్టీని కాదని, తెలంగాణ సెంటి మెంటు ఇంకో పార్టీకి వెళ్ళి పోతే ఎలా? సందేహంలేదు. ఏడింటిలోనూ, ఆరుస్థానాల్లో, జనం ప్రత్యేక తెలంగాణ డిమాండుకే వోటేశారు. కానీ ఒక చోట ఇండిపెండెంటుకీ, ఇంకో చోట జాతీయ స్థాయి( బిజెపి) పార్టీకి వోటు వేశారు. అంటే తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్‌ తో పాటు ‘మార్గాంతరాల’ను కూ తెలంంగాణా వోటరు వెతుకుతున్నాడు. ఈ తెలంగాణ సాధనలో చిత్త శుధ్ధిని చూసి ‘ఇండిపెండెంటు'( నాగం జనార్థన రెడ్డి) కి వేస్తే, తేగలిగే సత్తాను చూసి ‘జాతీయ పార్టీ’ కి వేశారు. (ఇండిపెండెంటుకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందనుకోండి. అది వేరే విషయం.) కాబట్టి, గత ‘ఉప ఎన్నికల్లో’ చవి చూసిన తిరుగులేని గెలుపును టీఆర్‌ఎస్‌ చవి చూడ లేక పోయింది.

ఇక తెలుగుదేశం కొన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసుకున్నా, కొన్ని చోట్ల కాంగ్రెస్‌ను మూడో స్థానంలోకి నెట్టి, తాను రెండోస్థానంలో నిలిచింది. ఒక్క సీటునూ గెలవలేదు కదా, వోటమికి కుమిలి కుమిలి ఏడ్చేస్తుందేమోనని ప్రత్యర్థులు ఆశించారు. కానీ ఆపార్టీ వారు ఏడ్వలేదు. అలాగని నవ్వనూ లేదు. తెలంగాణలో చంద్రబాబు ‘రెండు కళ్ళ’ సిధ్ధాంతం కారణంగా, ఇటీవలి కాలం వరకూ ప్రవేశించ లేక పోయారు. కానీ ఇప్పుడు ప్రవేశించి, ఎన్నికలలో పోటీ చేసి, కొన్ని చోట్ల గతం కంటె ఎక్కువ వోట్లను పొందామని చెబుతున్నారు. నిజం కూడా అంతే. త ‘వెలంగాణ ఉద్యమం రాజుకున్నాక, చాలాకాలాని ఈ గడ్డ మీద కాలు మోపినప్పుడు బహుశా తెలుగుదేశం అధినేత ఎలా ఫీలయి వుంటారు? చంద్రమండలం మీద మానవుడు తొలిసారిగా పాదం మోపినట్లు భావించి వుంటారు.

ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలలో నిఖార్సుగా ఏడ్వాల్సిన పార్టీ- కాంగ్రెస్‌ పార్టీ అని అందరూ భావించేసి వుంటారు. ఎందుకంటే కాంగ్రెస్‌ ఖాతాలో వున్న స్థానాన్ని (మహబూబ్‌ నగర్‌ని) ‘చే’ జేతులా జారవిడుచుకుంది. కోవూరు సరే’సరి. ఘోరంగా వోడిపోయింది. కానీ, ఆనందమేమిటంటే, తెలంగాణలో పోటీ చేసిన నియోజకవర్గాలలో గతంలో కంటె వోట్లను పెంచుకున్నాయన్న తృప్తిలో వున్నాయి. అదీ కాక దేశంలోని ఇతర రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో గెలుపును చవి చూసింది.

గెలుస్తానని చెప్పిన ఒకే ఒక్క స్థానాన్ని( కోవూరుని) గెలిచేసుకున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ నవ్వేసుకోవచ్చు కదా! కానీ ‘వైయస్సార్‌’ మృతికి రాష్ట్రంలో ఒక పక్కనే (సీమాంధ్ర) ఓదార్చగలిగాను, రెండో పక్క (తెలంగాణను)ఓదార్చలేక పోయానన్న బెంగ ఆయనకు మిగిలిపోయింది. ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ వైయస్సార్‌ కాంగ్రెష్‌ నామినేషన్‌ వేయలేదు. అలాగని తెలంగాణ సెంటిమెంటు గౌరవిస్తూ తప్పుకున్నట్టు కూడా ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి ఆ పార్టీ వారు మాత్రం ఇది పూర్తి గెలుపు అని ఎలా భావించగలరు?

ఎవరికీ పూర్తి గెలుపుల్నీ, పూర్తి వోటమిల్నీ ఇవ్వకుండా, పూర్తి నవ్వుల్నీ, పూర్తి ఏడుపుల్నీ దక్కనివ్వకుండా జాగ్రత్త పడిన తెలుగు వోటరు మాత్రం నిజంగానే జగన్నాటక సూత్రధారి.

-సతీష్‌ చందర్‌

Leave a Reply