నాన్న సైకిలు

ఒకటి

పెంగ్విన్‌ పిల్లలా నాన్న సైకిల్‌ మీద నేను

చక్రాల కింద చిన్నబుచ్చుకున్న

సముద్రాలు

కన్ననేరానికి కాళ్ళాడిస్తున్నారాయన

నడుపుతున్నానన్న భ్రమలో

రెక్కలాడిస్తూనేను

”ఎక్కడికిరా కన్నా?”

నా శిరస్సునడిగింది నాన్న గెడ్డం

”ఊరవతలకి!”

దిక్సూచిలా నా చూపుడువేలు

ఛెళ్ళుమన్నది సముద్రం

నాన్న చెక్కిళ్ళన్నీ నీళ్ళే

మలుపు తిరిగామో లేదో

నా బుగ్గలమీదా అవే నీళ్ళు

”నాన్నా! ఉప్పగా వున్నాయి”

”తప్పురా కన్నా! ఊరంటే సముద్రమే”

దప్పిగొన్న ఓడను

ఎప్పటికీ సముద్రం ఊరడించదు

రెండు

సూర్యుడికింద చంద్రుడిలా కేరియర్‌ మీద నేను

చక్రాల వెంటపడుతున్న చీకటి

నాన్న కాళ్ళసత్తువకొద్దీ వెలుతురు

విద్యుద్దేహాన్ని ఆనుకుని

వెలిగిపోతున్నానన్న బడాయితో నేను

”వాలుకి వెళ్తున్నాం.కదలకురా కన్నా!”

కాళ్ళుకదపకుండా చక్రాలు కదిలితే నాన్నకు భయమే

”నాన్నా! నా కాలు”

చక్రవ్యూహంలో చిక్కుకున్న నా పాదం

కాలం పీకమీద కత్తిపెట్టిన నాన్న

నిలువు కాళ్ళమీద నిలిచిన సౌరకుటుంబం

”వృత్తం లోపల పాదం జాగ్రత్త!”

నాన్న వచనోపదేశం.

”ఊచల్ని తన్నమంటారా నాన్నా!”

చీకటితో చేతులు కలిపిన చక్రాన్ని

ఏ పాదమూ క్షమించదు

మూడు

తరగని చీకటిలాంటి తారురోడ్డు చూస్తూ నేను

ముగ్గుపెట్టుకుంటూ డైనమా వెలుతురు

ముందుకు దారివేస్తున్నానుకుంటున్నాడాయన

వెనక చెరుపుకొస్తున్న ‘ఛండాలపు’ నీడ

డేంజరెరుపు మిణుగురునన్న ధీమాతో నేను

”రోడ్డు పక్క వల్లకాడు. భయపడకురా కన్నా!”

పేరుకు చితికాని ప్రతిఫలం వెలుతురే

”ఊరుకన్నా నయమే నాన్నా!”

దగాలేని దహనాన్ని చూసినందుకు ధైర్యం

”నీడల్తో గొడవలెందుకు కన్నా?”

ఝల్లుమన్న సైకిల్‌ బెల్లు

”నీడల నిజస్వరూపాలు గోడలే నాన్నా!”

నీతిమాలిన నీడకోసం

ఏ నిప్పూ పరితపించదు

నాలుగు

చీలుతున్న ఎర్రసముద్రాన్ని దాటుతూ నేను

కంకర రోడ్డును ఖండిస్తున్న సైకిలు టైర్లు

ఊరనీటి వీపు చీలుస్తున్నానుకుంటున్నాడాయన

వెనక ముంచుకొస్తున్న వెయ్యేళ్ళ బురద

జేబులో వానచినుకుల్ని దాచుకున్న సంబరంలో నేను

”చినుకులు చిరంజీవులు కాదురా కన్నా!”

చినుకు క్షణికమైనా స్వఛ్ఛత శాశ్వతం

”చినుకులు కావు. చెక్కిలిగింతలు నాన్నా!”

చేతులు తాకని చెక్కిళ్ళకి కన్నీళ్ళే కరస్పర్శలు

”వాడిచినుకులు గుచ్చుకుంటాయి కన్నా!”

మెడను గొడుగులా పడుతూ నాన్న

”తనివి తీరా తాకేవి- సూదులయినా సిధ్ధమే నాన్నా!”

పెదవినివ్వని ప్రేమలోపల

ఏ పవిత్రతా పరిమళించదు

అయిదు

షాపుల నుదుటిరాతల్ని చదువుతూ నేను

రెండు కంటిపాపలూ రెండు చక్రాల్లాగ

నాన్న సైకిల్‌తో పెరిగిన నా పఠన వేగం

సకల వర్ణాల్లో కనిపిస్తున్న ఒకనాటి తాటాకు రాతలు

”ఒత్తులు పలకవేమిరా కన్నా?”

ముళ్ళతలకట్లు పెట్టి, మేకులు కొట్టి శిలువకెక్కించిన

అక్షరాలు

” పదాలు ఒళ్ళు విరుచుకుంటున్నాయి నాన్నా!”

స్పీడు బ్రేకర్లను అధిగమించిన నాన్న

మరణించి తిరిగిలేచిన అమృత భాష

సామాన్యుడి ఎంగిలితో పునీతమైన సారస్వతం

మట్టితో పొర్లనిదే

ఏ విత్తనమూ మళ్ళీ జన్మించదు

ఆరు

తెల్లమంచు దయ్యాన్ని తరుమూకుంటూ నేను

పళ్ళచక్రాన్ని పటపటలాడిస్తున్న నాన్న

వాడలో సూర్యుడు ఉదయిస్తాడనుకుంటున్నాడాయన

వెనక కమ్ముకొస్తున్న ఊరు మబ్బులు

నోటి నుంచి పొగలు కక్కుతూ నేను

”నిప్పులేని పొగలు. ఎందుకురా కన్నా!”

తగలబడుతున్నది తడిసిన కట్టె

”మబ్బుల్ని వెక్కిరిస్తున్నాను నాన్నా!!”

యుధ్ధసమయంలో పరిహాసమూ పరాక్రమమే

”పొగల్తో పగలు తీరవు కన్నా!”

నా నోటికడ్డుపడుతూ నాన్న

”మంటల అజ్ఞాత రూపాలు పొగలే నాన్నా!”

ముఖం మీది ముసుగును

ఏ సుందరీ ప్రేమించదు

ఏడు

మిట్ట మధ్యాహ్నపు మా మరగుజ్జు నీడల్ని చూస్తూ నేను

సైకిల్‌ మీద సాగుతున్న నాన్న సహజ స్వరూపం

ఊరి పొలిమేర పంచాయితీ స్వాగతం తనకేననుకుంటున్నాడాయన

వెనుక తరుముకొస్తున్న తారు నలుపు

కుళ్ళిన శవాన్ని చూసినట్టు తలతిప్పుకుంటూ నేను

”స్వా..గతాన్ని చదవమేమిరా కన్నా?”

సున్నకొట్టిన సమాధిరాతి మీద చెక్కిన ఊరి పాతివ్రత్యం

”-గతం ఒక్కటే కనిపిస్తుంది నాన్నా!”

చదవడానిక్కూడా అర్హంకాని అశ్లీలాగ్రహార పురాణం

‘మన చరిత్రలు నాల్కల మీదే మరణించాయి కన్నా!”

నా మూతిమీద ముచ్చెమట్లును తుడుస్తూ నాన్న

” అయితే ఆ.. అనండి. ఏడు తరాల చరిత్రను చూడాలి నేను”

శతాబ్దాల తర్వాత తవ్వినా

అవమానాలు ప్రాణాలతోనే బయిల్పడతాయి

ఎనిమిది

మేల్కొన్న కన్నుల్లాంటి మిణుగురుల్ని చూస్తూ నేను

చీకట్లో తళుక్కుమన్న అమ్మనవ్వు

విశ్వాన్ని జయంచాననుకున్నాడాయన

అంతలోనే రాలిన అమ్మ కన్నీటి ఉల్కలు

”ఏడుస్తుందేమిరా కన్నా?”

సైకిల్‌ సాహసయాత్రకు బ్రేకు వేస్తూ నాన్న

”నవ్వులో రతనాలు రాల్చటం అమ్మకే చెల్లు నాన్నా!”

అమ్మ ఒడిలో విశ్రమిస్తూ నేను

”ఊరంతా తిప్పినా ఒడి వదలవేమిరా?”

ముచ్చటగా ఉడుక్కుంటూ నాన్న

‘ఒడే కాదు- వాడనూ వదల్ను”

వాడను కాలదన్నిన ఏవూరూ

బతికి బట్టకట్టదు

తొమ్మిది

కుర్ర చక్రవర్తిలా సీటు మీద కెగురుతూ నేను

పక్కకు తప్పుకున్న సైకిల్‌ చైను

నాన్న రెండు చేతుల్లో నా చలన సింహాసనం

ఊర కుక్కుల్ని ఢీకొన్న నా పరిపాలన నాలుగుక్షణాలే

”విశ్వాసం కలవి. తప్పురా కన్నా!”

తోకముడిచిన శునకాలు మలుపుతిరిగి మొరిగాయి

”నమ్మకానికి నాలుగు కాళ్ళుండకూడదు నాన్నా!”

ప్లేట్లు మార్చే పెడల్స్‌ను అణగదొక్కుతూ నేను

”మొరిగే కుక్క కరవదురా కన్నా!”

శిలువ దిగబోయిన నాన్న క్షమాగుణం

”తాను మొరిగిందే సారస్వతమంటుంది నాన్నా!”

కళ్ళు చెమర్చనిదే

ఏ పదమూ కవిత్వం కాలేదు

(నవ రత్నాలూ నాన్న జ్ఞాన ప్రకాశం గారికే)

-సతీష్‌ చందర్‌

20 ఆగస్టు 1995

5 comments for “నాన్న సైకిలు

  1. దళిత కవిత్వానికి ఆదికవి సతీష్ చందర్ గారీకి అభినందనలు

  2. జ్ఞాపకాలు తట్టి లేపిన
    రసమయ కావ్యం
    సతీష్ చందర్
    కవిత్వం ఆ చంద్ర తారార్కం

Leave a Reply