నిగ్రహం కోల్పోయిన ‘విగ్రహ’ వాక్యం!

ntr statue

ఉలకని, పలకని వాళ్ళని పట్టుకుని- ‘అలా బొమ్మలా నిలుచున్నావేమిటి?’ అని అనకండి. బొమ్మలు కదలగలవు. కదిలించగలవు. కొంపలు అంటించగలవు.

మనిషి విగ్రహమయ్యాక వంద రెట్లు శక్తిమంతుడయిపోతాడు. మనిషిగా వున్నంతకాలం అతణ్ణి ప్రేమించే వాళ్ళూ ద్వేషించే వాళ్లు మాత్రమే కాకుండా, మధ్యస్తంగా వుండేవాళ్ళు కూడా వుంటారరు. ఒక్కసారి రాతి(పోనీ సిమెంటు) బొమ్మయి పోయాక అతడి చుట్టూ భక్తీ, లేదా ద్వేషం వుంటాయి. మనిషికయితే ఆలింగనాలు, కరచాలనాలూ చెయ్యవచ్చు. బొమ్మదగ్గర ఆ పప్పులుడకవు. కాళ్ళకు మొక్కాలి. లేదా మీ మెడలు ఎత్తి (అది మొడ దించలేదు కాబట్టి) దాని మెడలో పూలదండలు వెయ్యాలి. ఇంకా ముచ్చట తీరక పోతే, వంద లీటర్ల వెన్నతీసిన పాలతో( వెన్న వుంటే జిడ్డు ఎక్కువ) అభిషేకం చేయాలి. ఇదంతా భక్తి వున్న వాళ్ళు చేసి పని.

మరి ద్వేషం వుంటేనో..? తిట్టటానికి కుదరదు. వాటికి సహనం అపారం. తమంతట తాము స్పందించవు. కొట్టటానికి కుదరవు. ఒక చెంప మీద కొట్టాక, మరోచెంప చూపుతుందా, లేదా అని, దాని అహింసావాదానికి పరీక్ష పెట్టనవసరం లేదు. బొమ్మ మనిషిని మించిన అహింసా వాది. కావాలంటే కొట్టిన చెంపనే మళ్ళీ కొట్టుకున్నా, అది సహనం వీడదు. ఇంకా ద్వేషం ముదిరిపోయిన వారు- చెప్పుల్ని గుదిగుచ్చి దండగా మార్చి అలంకరిస్తారు. ఇదీ ద్వేష ప్రకటన.

మనిషిని మర్డర్‌ చెయ్యవచ్చు. కానీ బొమ్మను చెయ్యలేరు. అలా చేస్తే, వెంటనే మరో జన్మ నెత్తేస్తుంది. రాతి జన్మ వదలి సిమెంటు జన్మ నెత్తుతుంది. లేదా సిమెంటు జన్మ వదలి కంచు జన్మనెత్తుతుంది. కొన్ని పుణ్యం చేసుకున్న బొమ్మలుంటాయి. అవి మైనపు జన్మనెత్తి మ్యూజియంలలో మురిపిస్తుంటాయి. ఎలా చూసినా బొమ్మకు జన్మరాహిత్యం వుండదు.

మనిషి పోయాకే బొమ్మవ్వాలని రూలు లేదు. బతికి వుండగా కూడా బొమ్మగా మారవచ్చు. అయితే పోయినోళ్ళ బొమ్మలకున్న విలువ, బతికున్న వాళ్ళ బొమ్మలకు వుండవు.

మనుషుల కొచ్చే చిన్న చిన్న రోగాలూ, రొష్టులూ రావు కానీ, పెద్ద పెద్ద జాడ్యాలు మాత్రం మనుషుల్ని సులువుగా సంక్రమిస్తాయి. కులం, మతం, ప్రాంతం, జెండర్‌, భాష, రంగూ- ఇలాంటి దీర్ఘ రోగాలు బొమ్మలకు పునాదుల్లోనే సంక్రమిస్తాయి. వెనుకబడ్డ కులం వాడో, మతం వాడో, ప్రాంతం వాడో ఎంతగొప్పవాడయినా చనిపోతే వెంటనే బొమ్మవ్వాలన్న రూలు లేదు. స్త్రీలయతే సమస్యే లేదు. వారి బొమ్మలు తక్కువగానే వుంటాయి.( బతికుండగానే బొమ్మను చేసి ఆడిస్తారు కాబట్టి, మళ్ళీ వీరికి బొమ్మలు ఎందుకనుకుంటారో… ఏమో!)

అందుకేనేమో… అసలే అట్టడుగునుంచి వచ్చి ముమ్మారు ముఖ్యమంత్రి చేసిన మహిళ… ఆమెను తర్వాత గుర్తుపెట్టుకుని ఒక విగ్రహం చేయిస్తారన్న నమ్మకం లేదు. అందుకే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి తన విగ్రహాన్ని తానే చేయించుకున్నారు. కానీ ఆమె శత్రువులకు ఆమెను చూస్తే ద్వేషం కలగటం లేదు కానీ, ఆమె విగ్రహం చూస్తే కోపం వచ్చేస్తుంది. రాదా మరి? వ్యక్తి విశ్వరూపమే విగ్రహం. భక్తులు ఆనందాన్ని, శత్రువులు ఉక్రోషాన్నీ ఆపుకోలేరు.

దాదాపు దశాబ్దానికి పైగా రాష్ట్ర శాసన సభలో (సగ భాగం ఒకరి పాత్రలు ఒకరు మార్చుకుని కూడా ) ఎదురెదురుగా కూర్చున్నారు. ఒకరినొకరు విమర్శించుకున్నారు. కానీ ఒకరి మీద ఒకరు సభ్యత మీరి నోరు జార లేదు. కానీ వైయస్‌ అకాల మృత్యువు బారిన పడ్డాక, రాష్ట్రం నాలుగు చెరగులా విగ్రహంగా మారారు. బాబు నిగ్రహం కోల్పోయారు. వైయస్‌ను పోల్చటానికి ‘నీచోపమానాల’ను తెచ్చారు. విగ్రహం ముందు మనిషెప్పుడూ చిన్నబోతాడు. ఇలాంటప్పుడే కూల్చాలన్న ఆలోచనలొస్తాయి. విగ్రహానికి మనిషెప్పుడూ పోటీ కాదు. అందుకని, మళ్ళీ విగ్రహాన్నే ఎదురు నిలపాలనుకుని, రాష్ట్రమంతటా ఎన్టీఆర్‌ విగ్రహాలు పెట్టగలమని సవాలు విసిరారు.

బొమ్మల జనాభా పెరిగిపోతుందంటే- జనంలో వారి మీద భక్తి శ్రధ్ధలు పెరుగుతన్నాయని మురిసిపోనవసరం లేదు. రాగ ద్వేషాలు పెరిగిపోతున్నాయని చెప్పటానికి కూడా ఇది ఒక సంకేతం. పూర్వం చనిపోయిన పెద్దవాళ్ళు ‘మూల’ పురుషులుగా మిగిలే వారు. అందుకు కారణం వారి పట్ల ప్రజలకున్న భక్తి. కానీ ఇప్పుడు ఎవరన్నా చనిపోతే వారు ‘కేంద్ర’ పురుషులయి పోతున్నారు. అంటే విగ్రహాలను ఏదో ‘మూల’ను పెట్టకుండా, ‘సెంటర్ల'(కేంద్రాలల)లో పెట్టేస్తున్నారు. తేడా పాడాలొస్తే,, అవే ‘ఉద్రిక్త’ కేంద్రాలు మారిపోతున్నాయి.

భక్తితో పెట్టినా, రాజకీయ ప్రయోజనం కోరి పెట్టినా, బొమ్మ బొమ్మే. బొమ్మన్నాక బలికూడా కోరుతుంది. భక్తితోనే ద్రోణుడి బొమ్మ చేసి ఎదురుగా పెట్టుకుని విలు విద్య నేర్చుకున్నాడు. కానీ తీరా ఆ బొమ్మ మనిషిగా వచ్చేసి ఏకలవ్యుడి బొటన వేలును బలికోరింది.

ప్రేమయినా, పగయినా మనుషులతోనే పెట్టుకోండి- బొమ్మలతో కాదు. ఇదే ‘నేటి రాజకీయానికి’ విగ్రహవాక్యం!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 21-1-12 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply