నీటి చుక్కలూ, నిప్పు రవ్వలే!

Photo by Hari_Menon

ప్రేలుడు పదార్థాలెక్కడో వుండవు. మన చుట్టూరా వుంటాయి. ఊరూ, చెట్టూ, చేమా, గడ్డీ, గాదం-ఏదయినా పేలుతుంది. కాకపోతే కాస్త పాలిటిక్సు దట్టించాలంతే. రాజకీయం సోకితే నీరు కూడా భగ్గు మంటుంది. ఒక్కసారి మంటలొచ్చాక, దాన్ని ఆర్పడం ఎవరి వల్లా కాదు. మళ్ళీ వాటి మీద కాస్త పాలిటిక్సు చిమ్మాల్సిందే.

రాజకీయమంటే ఇంతేనా? తగల(బ)డి నట్లు లేదూ! అని చటుక్కున అనకండి. తగలబెట్టినట్లు లేదూ- అనాలి. తగలడటమంటే రాజకీయానికి బలికావటం. అందుకు కోట్లకు కోట్లు ఆమాయకపు జనం సిధ్ధంగా వుంటారు.

ఏదయినా గుంపు ఊరేగింపుగా వచ్చి మా నేత ‘నిప్పు’ అంటూంటే ఉడుక్కోకండి. వాళ్లు నిజమే చెబుతున్నాడు. ఆ నేత ఒక్కడు చాలన్న మాట రాష్ట్రం మొత్తాన్ని తగలబెట్టెయ్యటానికి.

చిచ్చు పెట్టటం చేతకాని వాడు, ఎన్నాళ్ళు రాజకీయాల్లో వున్నా ఒక్కటే.

వెనకటికిలాగే ఒక ముదురు నేతా, ఒక లేత నేతా కలిసి దేవుడికి దండం పెట్టుకుని, గుడి మెట్లు దిగుతూ వస్తున్నారు.

‘తంబీ, నేను పాలిటిక్సులోకి వచ్చి, పాతికేళ్ళయింది. కనీసం మాజీ ఎంపీటీసీను కూడా కాలేక పోయాను. కానీ నువ్వు వచ్చి ఏడేళ్ళు కూడా కాలేదు. ఏకంగా మాజీ ఎమ్మెల్యేవీ, మాజీ మంత్రివి కూడా అయిపోయావు. రహస్యం చెప్పవా? మెట్ల మీద నిలబడి అడుగుతున్నాను. అబధ్ధం చెప్పకు.’ అన్నాడు ముదురు నేత.

‘ఆ మాటనకు అన్నా. మెట్లమీద నిలబడి కాదు, ఒక్కొక్క మెట్టు దిగుతూ అడుగుతున్నావు. అందుకే నచ్చావు. ముప్పయ్యేళ్లున్నా నీకు పాలిటిక్సు అర్థం కాలేదన్నా.’ అన్నాడు లేత నేత.

‘ఒప్పుకుంటాను. ఆ సీక్రెట్‌ చెప్పు. వయుసు ముదిరినా. నీ వెనక అనుచరుడిలాగా తిరుగుతా.’

‘వెనక ఉండకు. పొడవాలనిపిస్తుంది వెన్ను మీద. పక్కకు రా చెబుతా. నీకు ఇవ్వటం వచ్చా అన్నా?’

‘ఇవ్వటం ఏమిటి తంబీ? ఎలక్షన్లొస్తే నా చేతికి ఎముకుండదు. వోటరుకి వెయ్యికి తక్కువ కాకుండా పంచుతా.’

‘ఇంకేం? పద్మవ్యూహంలోకి వెళ్ళటం వచ్చేసింది అన్నా.’ అన్నాడు లేత నేత

‘బాగా చెప్పావ్‌ తంబీ. అందుకే ప్రతీ సారీ అభిమన్యుడి మాదిరి ప్రతీ ఎన్నికల్లో ఖర్చయి పోతున్నాను.’ బేలగా చెప్పాఆడు ముదురు నేత.

‘మరి పుచ్చుకోవటం?’

‘పదవి వుంటే కదా తంబీ. పుచ్చుకోవడానికి.’ అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు అంత పెద్ద ముదురు నేత.

అప్పటికే దాదాపు గుడి మెట్లన్నీ దిగిపోయారిద్దరూ. ఇంకా పది మెట్లే వున్నాయి. అయితేనేం? ఆత్మజ్ఞానం పొందటానికి ఒక్క మెట్టు చాలు.

‘ధర్మప్రభువులు. బాబూ! మా లాంటి దరిద్రులకు దానం చేసి పుణ్యం పొందండి నాయనా.’ ఇంచు మించు ఇదే స్థాయిలో మెట్లకు ఎడా, పెడా బిచ్చగాళ్లు అరిచేస్తున్నారు. అందులో కుడి వైపు కండ పుష్టిగల బిచ్చగాడు నినాదాలిచ్చినంత బిగ్గరగా అరుస్తున్నాడు.

లేత నేత ఒక్కసారి ఆ బిచ్చగాణ్ణి పరికించి చూసి, ముదురు నేత వైపు తిరిగి ‘అన్నా! ఏమీ అనుకోకు.’ అంటూ అతడి భుజం మీదనున్న కండువాను తీసి కండ పుష్టిగల బిచ్చగాడి వైపు విసిరాడు. వాడు అందుకొని, మెడలో వేసుకుని కొత్త పార్టీ తీర్థం పొందినంత గొప్పగా మురిసి పోయాడు.

ఈ సన్నివేశం చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు ముదురు నేత.

‘అన్నా! కండువా ఇచ్చేశాం కదా. ఇప్పుడు పుచ్చుకోవాలి. తీసుకో వాడి డగ్గర్నుంచి ఆ కండువా లాక్కో.’ అన్నాడు లేత నేత.

అందుకా ముదురు నేత ఇబ్బందిగా ముఖం పెట్టి, ‘బాగుండదేమో తంబీ!’ అన్నాడు. అందుకు రెండు కారణాలు. ఒకటి: బిచ్చగాడికిచ్చింది వెనక్కి తీసుకోవటం నీచంగా వుంటుందని. రెండు: ఆ బిచ్చగాడు కండ పుష్టి కలిగి వున్నాడు. కొట్టినా కొట్ట గలడు.

ముదురు నేత తటపటాయింపు చూసి లేత నేత పకాలున నవ్వాడు. ‘అందుకే అన్నా! కనీసం నువ్వు మాజీ ఎంపీటీసీ కూడా కాలేక పోయావ్‌.’ అని ఆ బిచ్చగాడి దగ్గరగా వెళ్ళి ‘ఏరా! ఎక్కడయినా పైసలు ధర్మం చేస్తారు కానీ, కండువా ధర్మం చేస్రారట్రా?’ అన్నాడు. అంతే. వాడు వెంటనే కండువా లేత నేత చేతుల్లో పెట్టాడు. అది తీసుకుని వెంటనే, ఎడమ వైపున ఒక లావు బిచ్చగాడికి ఇచ్చేసి, ‘ఉంచుకో’ అన్నాడు. వాడు దండం పెట్టాడు.

‘అన్నా! ఇక మనం దిగటానికి ఆరు మెట్లే వున్నాయి. మొత్తం మెటన్నీ దిగిపోయాక వెనక్కి చూడు. రాజకీయం తెలిసిపోతుంది.’ అని లేతనేత ముదురు నేతకు సెలవిచ్చాడు.

మెట్లన్నీ దిగిపోయాక ముదురు వెనక్కి చూస్తే- అక్కడ యుధ్ధం కనిపించింది. రెండు వైపులా వున్న బిచ్చగాళ్లు కొట్టుకు చస్తున్నారు. ఇప్పుడు కండువా అక్కడ ప్రేలుడు పదార్థమయ్యింది.

‘ధన్యుణ్ణి తంబీ. ధన్యుణ్ణి’ అంటూ ముదురు నేత, లేత నేత పాదాల మీద పడ్డాడు. ‘నాకు రాజకీయం బోధ పడింది తంబీ. బోధపడింది. ఇవ్వటం పుచ్చుకోవటమే రాజకీయమనుకున్నాను. ఇచ్చింది లాక్కొని మరొకరికివ్వటం రాజకీయం. అదే నిప్పు. అదే చిచ్చు.’ అని అపస్మారకంగా మాట్లాడాడు.

లేత నేత విశ్వరూపం దాల్చి ‘లే అర్జునా లే.’ అని అనేసి చిన్నగా నాలుక కరచుకుని ‘అన్నా, అర్జునా నిన్ను ఎందుకన్నానంటే నీకు ఇప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళటమూ తెలుసు. వెనక్కి రావటమూ తెలుసు.’ అన్నాడు.

‘అవును తంబీ. మొత్తం రాష్ట్రంలో జరగుతున్న రాజకీయమంతా నాకు గిర్రున తిరుగుతోంది. ప్రాంతాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కొని మరొకరికి ఇవ్వ జూపారు. రాష్ట్రం భగ్గుమంది.’ అన్నాడు ముదురు నేత.

‘అన్నా. అంతే కాదు. ఇప్పుడు నీటిని ఒకరికి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుని ఇంకొకరికి ఇచ్చి వెనక్కి తీసుకున్నారనుకో. నీరు కూడా భగ్గుమంటుంది. ఊగు కండువా, సాగు నీరూ కావేవి పాలిటిక్సు కనర్హం. ‘ అంటూ లేత నేత తన విశ్వరూపం చాలించాడు.

-సతీష్‌ చందర్‌

 

2 comments for “నీటి చుక్కలూ, నిప్పు రవ్వలే!

  1. నిప్పు పుట్టించాలన్నా, పాలిటిక్స్ దట్టించాలన్నా, పాళీలు పెన్నులూ కూడా అవసరమే కదండీ….

Leave a Reply