నేతల్లో నిత్య పెళ్ళికొడుకులు!

రోజూ పెళ్ళయితే, పెళ్ళిలేని రోజే పండగ రోజవుతుంది. ఆ లెక్కన చూస్తే తెలుగు వోటరు నిత్యపెళ్ళికొడుకే. తెలుగు నేలను చూడండి. నిత్యకళ్యాణం పచ్చతోరణంలాగా కళకళ లాడిపోవటం లేదూ? అసలు అసెంబ్లీయే కళ్యాణ మంటపం లా వుంది.( ఇంతటి శోభను చూసి కూడాకొందరు గౌరవ నేతలు చట్ట సభల్ని అగౌరవపరుస్తూ, ‘ఆ దొడ్డీ.. ఈ దొడ్డీ’ అంటూ వ్యాఖ్యలు ఎలా చెయ్యగలుగుతున్నారో అర్థం కావటం లేదు.). పెళ్ళి ప్రమాణం చేసినంత గొప్పగా, ఏదో ఒక వ్యక్తి శాసన సభ్యుడిగా ప్రమాణం చేస్తూనే వున్నాడు. అదే పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ. అదే శాసనసభ్యుడు తిరిగి తిరిగి అదే సభకు. 2009లో కొత్త అసెంబ్లీ వచ్చాక, అన్నీ ఉపఎన్నికలే.

ఎంత పెళ్ళయితే మాత్రం రోజూ చూడాలంటే బోరు కొట్టదూ. రోజూ పప్నన్నాలే. రోజూ బూరెలూ, గారెలే. తినీ తినీ విసుకు పుట్టదూ. ‘ఈ ఒక్క రోజూ పెరుగన్నం తిని పడుకుంటే ఎంత హాయిగా వుంటుంది!’ అని అనిపించదా? వోటరు పరిస్థితి అంతే. ‘వోటుకు వెయ్యి’ ఇస్తే మాత్రం, ఎన్సిసార్లని క్యూల్లో నిలబడతారు? అయినా అయిదేళ్ళూ కాపురం చెయ్యమని ‘హౌస్‌’ కి పంపిస్తే, ఏడాది తిరగకుండా పుట్టింటికి వచ్చేస్తే ఎలా?

ఎన్నికలకీ, ఉప ఎన్నికలకీ ఒక్కటే తేడా: ఎన్నికలు ప్రేమ వివాహాలయితే, ఉప ఎన్నికలు కుదిర్చిన పెళ్ళిళ్ళు (అరేంజ్డ్‌ మేరేజెస్‌) లాంటివి. ప్రేమ వివాహంలో వున్న ఉత్కంఠ, కుదిర్చిన పెళ్ళికి వుండదు.

ప్రేమ వివాహం చివరి వరకూ గోప్యంగా వుంటుంది. వధువెవరో, వధువెవడో చివరి వరకూ అయోమయంగా వుంటుంది. అంతవరకూ ఫ్రెండ్‌ అనుకున్నవాడే, హఠాత్తుగా ప్రియుడి గా మారి మెడలో తాళి కట్టివెయ వచ్చు. లేదా ‘మోసగించి ఉడాయించాలనుకున్న వాడిని చిరంజీవి ఫోర్‌ట్వంటీగా పెళ్ళి దుస్తులు కట్టించి, చిరంజీవి సౌభాగ్యవతి విధివంచిత ముందు నిలబెట్టి, పోలీసు వాయిద్యాలతో, పోలీసు స్టేషన్లో దండలు మార్పించవచ్చు. ఈ సస్పెస్సులూ, ట్విస్టులూ ఎన్నికకే చెల్లుతుంది.

ఎన్నికలు చూడండి అందే రంజుగా వుంటాయి. చివరి వరకూ వరుడెవరో తెలియనట్లుగానే, అభ్యర్థి ఎవడో తెలీదు. ప్రేమ లేఖలో వున్న వారి పేరే శుభలేఖలో వుండాలని రూలేమీ లేదు. పది మంది ప్రేమ లేఖలు రాయొచ్చు. కానీ శుభలేఖకు ఎక్కేది ఒక్కడే. పేపర్లో పది మంది ఆశావహుల పేర్లు రాయవచ్చు. కానీ బీఫాంలోకి ఎక్కేది ఒక్కడే. రోమియోలు వంద. ప్రియడు ఒక్కడే. అలాగన్నమాట. తెల్లవారితే నామినేషన్‌ అన్నంత వరకూ ఎవరు ప్రియుడో ఉత్కంఠ కొనసాగుతూనే వుంటుంది. నిశ్చితార్థం కాగానే పెళ్ళయినట్టు కాదు. నామినేషన్‌ కాగానే ఎన్నికయినట్లు కాదు. భంగ పడ్డ రోమియోలు- ఏదయినా చెయ్య వచ్చు. పెళ్ళికూతురుని కిడ్నాప్‌ చెయ్యవచ్చు. లేదా ‘ఆపండి’ అని సరిగా తాళి కట్టే వేళ పీటల మీద పెళ్ళి ఆపనూ వచ్చు. ఇవన్నీ దాటుకుని పెళ్ళి పూర్తయితే ఆ థ్రిల్లే వేరు. ఎన్నికల్లోనూ అంతే. అభ్యర్థుల్ని ఎత్తుకుపోవచ్చు. లేదా, భంగపడ్డ ఆశావహులు రోమియోల్లాగానే ‘ఆపండి’ అనే పధ్ధతి లో ‘రెబెల్‌ కేండిడేట్ల’లాగా ఎదురు పోటీకి దిగవచ్చు. ఈ ‘తిరుగుబాటు’ను కూడా ఎదుర్కొని విజయం పొందితే, ఆ ఎన్నిక ఇచ్చే కిక్కే వేరు.

అరేంజ్డ్‌ మేరేజ్‌దే ముంది? అదే మేనమేమ కొడుకు. అదే రిజిస్టేషన్‌ ఆఫీసు. ఉన్న అయిదెకరాల ఆస్తీ,, ఈ ఇంటినుంచి ఆ ఇంటికి. అన్నీ ముందే తెలిసి పోతాయి. ఏ మార్పూ వుండదు. అన్నీ ఊహించినట్టే వుంటాయి. హానీమూన్‌ కి అదే ఊటీ, అదే కొడయ్‌కెనాల్‌.

ఉప ఎన్నికలదీ అదే పరిస్థితి. అన్నీ ముందే తెలిసిపోతాయి. మేనరికాల్లాంటి అభ్యర్థిత్వాలు. ఏ మార్పూ వుండదు. ఈ ముసలావిడో, ముసలాయనో- పోతూ, పోతూ ‘నా మనవరాల్ని, దాని మేనమామకే ఇచ్చి పెళ్ళి చెయ్యి’ అనే చేతిలో చేయి వేయించుకునే ఏ సెంటిమెంటో, అరేంజ్డ్‌ మేరేజ్‌ లాంటి ఉప ఎన్నికకు కారణమవుతుంది. సెంటిమెంటులేనిదే ఉప ఎన్నికలదే. ఒక చోట (వైయస్‌ రాజశేఖర రెడ్డి మృతికి) సానుభూతి, ఇంకొక చోట( ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పదవీ) త్యాగం. సెంటి మెంటు ఉన్న చోట వధూవరులూ మారనట్లే, ఉపఎన్నికల్లో అభ్యర్థులూ మారరు. ఎన్నికల ఫలితం కూడా ముందే నిర్ణయించ బడుతుంది.(ఎంతమంది తిని వెళ్ళిపోయారో నన్న )’ఆకుల లెక్క’ లో తప్ప ఎందులోనూ ఉత్కంఠ వుండదు. ఉప ఎన్నికల్లోనూ అంతే, గెలిచే అభ్యర్థి ఎవరో ముందే తేలిపోతాడు. ఎటొచ్చీ, ఎంత ఎక్కువ మెజారిటీ వచ్చిందన్నదే ముఖ్యం. అంతకు మించి ఆసక్తి కలిగించే అంశం ఏమీ వుండదు.

ఆలోచించే పెళ్ళిళ్ళు చేస్తారు- అని ఒక నమ్మకం వుంది. (ఆలోచిస్తే, అసలు పెళ్ళనేది చేస్తారా? అది వేరే విషయం.) వోటరూ అంతే. ఆలోచించే వోటు వేస్తాడనేది ఒక విశ్వాసం.(నిజంగా ఆలోచిస్తే, అసలు అతడు వోటు వేస్తాడా? అయిదుగురు దొంగల్లో ఒక ఉత్తమ దొంగను ఎంపి చేయండీ అని పరీక్ష పెడితే, సమాధానం ఏమి రాస్తాం? దొంగల్లోనూ, ఖూనీ కోర్లలోనూ, అవినీతీ పరుల్లోనూ, రేపిస్టుల్లోనూ( అన్నాహజారే అనుచరుడు కేజ్రీవాల్‌ ప్రజాప్రతినిథులను అభివర్ణిస్తూ చేేసిన పోలికలు కావు.) ఉత్తముణ్ణి ఎంపిక చేయమని పరీక్ష పెడితే ఏం చేస్తాం? ఆలోచించకుండా వుంటేనే ఏదో ఒకటి టిక్‌ పెట్టగలం. ఆలోచిస్తే , పరీక్షను బహిష్కరించటం కన్నా వేరే మార్గం వుండదు. కానీ అదే బ్యాలెట్‌ పేపర్లో ఒక నలుగురి అవినీతి పరుల పేర్ల పక్కన ఒక్క నిజాయితీ పరుడి పేరు వుంటే…!అప్పుడు మాత్రం ఆలోచించేదేముంది. నిజాయితీ పరుడికే వోటేస్తాం.

ఉప ఎన్నికలల్లో ఎలా చూసినా ఆలోచించేదేమీ వుండదు. ‘సానూభూతీ’, ‘త్యాగమూ’- ప్రధాన ప్రచారాంశాలయిన చోట, ఆలోచించటానికీ ఏదీ వుండదు. అంతా ఆవేశమే. చిక్కేమిటంటే, ప్రజాస్వామ్యం లో ఆవేశానికీ, ఆలోచనకీ సమస్థానం వుండాలి.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 4-3-12 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply