నేత గీత దాటితే…!

గీత గీసెయ్యటం తేలికే. దానికి కాపలా కాయటమే కష్టం.

కోపంతో గీసిన గీత కోపం చల్లారేటంత వరకే వుంటుంది.

నిప్పుతో గీసేదే గీత. నీళ్ళు తెస్తే చెరిపి వేతే.

కోపం రగిలి లక్ష్మణుడు గీత గీస్తే,, కోపం రగిలించటానికి కృష్ణుడు గీత చెప్పాడు.

స్పష్టత తెచ్చేది గీత. తనవారికీ, పగవారికీ తేడా చెప్పేది గీత. ఈ గీత చెరిగి పోతే-చెంగు చాచే వాడెవడో, కొంగు లాగే వాడెవడో సీతకూ తెలియదు; బంధువెవడో, శత్రువెవడో అర్జునుడికీ తెలియదు.

photo by Aeioux


గీత ఒక విభజన మాత్రమే కాదు. గీత ఒక స్పష్టత, ఒక ఆగ్రహ సంకేతం.

పగ లేని వాడు పతనమయిపోతాడు. పగ అంటే ప్రేమకు ప్రతిరూపం. అప్పుడే పిల్లల్ని పెట్టిన పులికెంత కోపం! అది గీసిన గీత దాటి ఎవరయినా లోపలికి వెళ్ళితే ప్రాణాలు తోడేస్తుంది. ఇదంతా పగ కాదు. దానికి దాని పిల్లల మీద వుండే ప్రేమ. ప్రేమ తెలీని వాడికి పగ కూడా తెలీదు.

ఇప్పుడు ప్రేమలో ప్రేమ లేదు. కవి చెప్పినట్లు, ‘ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమించటం’ లేదు. రూపాయి వున్న పాపాయిని రూపంలేక పోయినా, రూపాయి కన్నా ఎక్కువగా ప్రేమించటమే- నేడు ప్రేమ అంటే. ఈ నకిలీ ప్రేమకు రెండో వైపు వుండదు. అంటే పగ వుండదు. అందుకే ఈ నకిలీ ప్రియుడికి రూపాయే పాపాయి. వీడు ఆ రెంటి మధ్యా గీత గీయ లేడు. ఒక వేళ గీసినా ఆ గీతను రక్షించలేడు.

మనిషి మనిషి మీద వుండేది ప్రేమ. సమూహం మీద వుంటే ఉద్యమం. మహా సమూహం మీద వుంటే మహోద్యమం. ఉద్యమానికి వంద రూపాలు. ఏ రూపం తీసుకున్నా అందులో ఒక గీత వుంటుంది.

నిరాహార దీక్ష చేసేవారు ఆకలికీ అన్నానికీ మధ్యగీత గీస్తారు. శత్రువు దిగివచ్చేవరకూ ఆ గీతకు కాపలా కాస్తారు. రాస్తా రోకో చేసేవారు. రోడ్డు మీద మనుషులనే గీతగా మలుస్తారు. అరెస్టయినా అవుతారు కానీ, తమంతట తాము తాము గీసిన గీత చెరపరు.

రెండేళ్ళ పాటు రాష్ట్రంలో ప్రాంతం కోసం ఉద్యమాలు నడిచాయి. విడిపోదామన్న వారిదొకటీ, కలిసి వుందామన్న వారిది ఒకటీ. రెండు ఉద్యమాలూ గీతలు గీసాయి. ఈ గీతల ముందు రాజకీయ పార్టీలు గీసిన గీతలు చిన్నవయిపోయాయి. నీదే పార్టీ అయినా కావచ్చు. నువ్వు తెలంగాణ ప్రాంతానికి చెంది ప్రతినిధివయితే- ప్రత్యేక తెలంగాణ గీత లోపలే వుండు: ఇది ఉద్యమ శాసనం. ఈ గీతను తొలుత ఈ ప్రాంతపు విద్యార్థులు గీశారు.

తొలుత నిరాహార దీక్ష ను ముగిస్తూ, పళ్ళరసం గ్లాసును చేతపట్టి, గీత దాటినందు, ఒక అగ్రనేత దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు విద్యార్థులు. ఇది ఆయన మీద పగ లాగా అనిపిస్తుంది. కానీ కాదు. తమ ప్రాంతం మీద తమకున్న ప్రేమ.

సీమాంధ్రలోనూ అంతే, అక్కడ వుంటూ సమైక్యకాంధ్రను కాదని, రాష్ట్ర విభజనకే వత్తాసు పలికాడని ఉత్తరాంధ్రకు చెందిన మరో ముఖ్యనేత దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ పని చేసింది అక్కడి విద్యార్థులే. అదికూడా ఆయన మీద కోపం తో కాకుండా సమైక్యాంధ్ర మీద ఇష్టంతో చేశారు.

ఈ ‘గీతాసారం’ ఒంటబట్టించుకున్న ఇతర నేతలు గీతను దాటే పనిచేయలేదు. కానీ కొందరు మాత్రం ఈ గీతలకు అటో కాలూ, ఇటో కాలూ వెయ్యబోయారు. వారినీ ఇటీవల కాలం వరకూ ప్రతిఘటిస్తూనే వున్నారు. ఇప్పుడిప్పుడే ఈ గీతలు చిన్నబోతున్నాయి. మొండిగా, ధైర్యంగా గీతలు దాటేస్తున్నారు. అంటే గీతలకు కాపలా దారులు మారిపోయారన్నమాట. విద్యార్థులే కాదు. ప్రజలు కూడా అయిదేళ్ళ కోసారి కొన్ని గీతల్ని గీస్తుంటారు. వాటికి మాత్రం కాపలా కాసే నాథుడే కనపడడు.

ప్రతిపక్షంలో నువ్వు వుండాలీ, పాలక పక్షంలో నువ్వుండాలీ- అని గీత గీసేంది ఎన్నికల్లో ప్రజలే. దీనినే ముచ్చటగా తీర్పు అని అంటున్నాం.

ఈ గీత దాటకుండా పార్టీలున్నాయా? వారికి వారే- ఎలా దాటారో బయిట పెట్టుకుంటున్నారు. అయితే వారు ఈ గీత దాటడానికి ఓ ముద్దుపేరు పెట్టుకున్నారు. దాని పేరే- మ్యాచ్‌ ఫిక్సింగ్‌.

తెలుగుదేశానికీ కాంగ్రెస్‌కీ,

కాంగ్రెస్‌కీ టీఆర్‌ఎస్‌కీ,

వైయస్సార్‌ కాంగ్రెస్‌ కీ, టీఆర్‌ఎస్‌కీ

కాంగ్రస్‌కకీ, టీఆర్‌ఎస్‌కీ… ఇలా ఎన్నో రకాల మ్యాచ్‌ఫిక్సింగ్‌ ల గురించీ ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకుంటున్నారు.

పిఆర్‌పి నేత అయితే నాడు ఎవరిని చూసి ‘తొడ కొట్టి మీసం మెలివేశారో’ వారితోనే(కాంగ్రెస్‌ వారితోనే కలిసిపోయారు.)

గీతలు చెరిగిపోతున్నాయంటే, ప్రజలు పార్టీలతో చేసుకున్న బాసలు చెరిగిపోతున్నాయన్నమాట.

గీతాకారుడే శంఖం పూరించాలి. గీతలు గీసిన ప్రజలే గీతల్ని కాపాడు కోవాలి. ఉద్యమాలంటే పాలపొంగులూ, పోటెత్తిన అలలూ కాకూడదు. నిత్యమూ దూకగలిగే సజీవ జలపాతాలు కావాలి. అంత వరకూ జనాన్ని వాడుకుని వదిలేసే నేతలు నిర్భయంగా గీతల్ని దాటుతూనే వుంటారు.

సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రికలో 15జనవరి 2012 నాడు ప్రచురితం)

3 comments for “నేత గీత దాటితే…!

Leave a Reply