నేనెరుగ, నేనేరుగ…నా నేత నడుగు!

botsa-kiran-chiruటాపు(లేని) స్టోరీ:

‘మీ ఇంట్లో దొంగలు పడ్డారట’

‘నాకు తెలియదే!’

‘మీకు ప్రాణాపాయం వచ్చిందట కదా!’

‘నాకు తెలియదే!’

‘మీ పేరేమిటన్నారూ..?’

‘నాకు తెలియదే!’

ఇలా మాట్లాడిన వారిని ఎక్కడకి పంపుతారు? హైదరాబాద్‌లో అయితే ఎర్రగడ్డ పంపుతారు.

‘బంద్‌లో పాల్గొన్న తెలంగాణ నేతల్ని జైల్లో పెట్టారట’

‘నాకు తెలియదే!’

‘ప్రతిపక్ష శాసన సభ్యులు చేసిన దీక్షను భగ్నం చేశారట!’

‘నాకు తెలియదే!’

‘మీ ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచిందట’

నాకు తెలియదే!’

ఇలా మాట్లాడిన వారు ఈ ప్రభుత్వాన్ని నడిపే వారే. వీరూ హైదరాబాద్‌లోనే వుంటారు. అయినా మనం వీరిని సెక్రటేరియట్‌ కే పంపుతాం.

ప్రజలకూ, ప్రతిపక్షాలకూ చార్జీలు పెంచే వరకూ తెలియక పోవచ్చు. కానీ పాలక పక్ష నేతలకు తెలియాలి కదా!

కానీ కాంగ్రెస్‌లో కీలక నేత చిరంజీవి ‘ఇది దారుణం’ అంటూ చిర్రుబుర్రులాడుతుంటారు. పోనీలే, ఎంతయినా కేంద్ర టూరిజం మంత్రి కదా!, ఏ టూర్‌ లో వున్నారో పాపం! అని ఊరుకోవచ్చు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఫోన్‌ చేసినప్పుడు ‘అవుట్‌ ఆఫ్‌ కాలింగ్‌ ఏరియా’ అని బదులొచ్చిందేమోనని సర్దిపెట్టుకోవచ్చు.

మరి ఏకంగా రాష్ట్రంలో పాలక పక్ష అధినేత బొత్స సత్యనారాయణ కూడా ‘ఏటీ! అంతంత పెంచేయటమే’ అని నోరు వెళ్ళబెట్టేస్తే ఏమనుకోవాలి. ఆయన కర్ణాటకలో పీసీసీ నేతా? లేక ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ నేతా? కించెత్తు అనుమానం ఎవరికయినా వస్తుంది.

అయినా ఏమిటీ ఈ ధైర్యం? ఎన్నికల ఎప్పుడొచ్చి మీద పడతాయోనని, పాలక పక్షాన్ని నమ్ముకున్న ఆశావహులూ, ప్రజాప్రతినిథులూ బిక్క చచ్చివుంటే, చార్జీలు ఎలా పెంచగలుగుతున్నారు? ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేక విసికి పోయి, కాంగ్రెస్‌కు వోటేస్తే ఏమిటీ గతి? ఈ ప్రశ్నలు అందర్నీ తొలిచేస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ముఖంలో చిరునవ్వు తొణకటం లేదు.

ఆయన ధైర్యానికి కారణం విద్యుత్‌ చార్జీలు ఎంతయినా పెరగవచ్చు. కానీ బిల్లు మాత్రం అంతే వుంటుంది. ఇంతకు మీద తక్కువ బిల్లు వచ్చినా రావచ్చు.

కారణం? అసలు కరెంటు ఇస్తే కదా!

ఇప్పుడు రోజులో ఎన్ని గంటలు కరెంటు తీస్తున్నారో వార్తల్లో చెబుతున్నారు. రాస్తున్నారు.

రేపటి నుంచి పరిస్థితి వేరు. రోజులో ఎన్ని నిమిషాల సేపు(గంట అంటే గొప్ప) కరెంటు ఇస్తారో చెబుతారు. ఇవి అమృత ఘడియల్లాంటి విద్యుత్ఘడియలు!

ఏదయినా అతి ముఖ్యమైన పనులు వుంటే ఈ ఘడియల్లోనే పూర్తి చెయ్యాలి.

ఈ మాత్రం వినియోగానికి ఎంత పెంచుకుంటే మాత్రం బిల్లు పెరుగుతుంది చెప్పండీ! అదీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ధీమా కావచ్చు.

 న్యూస్‌ బ్రేకులు:

పదే! పదే!

రాష్ట్రంలో విద్యుత్‌ విషయంలో 2004కు ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి తప్పుచేసిందో, అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోంది.

-వి.హనుమంత రావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత

ఒక పాఠం నేర్చుకోవటానికి పదేళ్ళు సరిపోయినట్లు లేదు. మళ్ళీ ఒక పదేళ్లు ప్రతిపక్షంలో వుంటే అర్థమవుతుంది.

విద్యుత్‌ లేదనీ, గ్యాస్‌ రాదనీ ముందు తెలియదా?

-ఎం. వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్‌ నేత

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని మాత్రం ముందుగా తెలుసుకున్నారు.

ట్విట్టోరియల్‌

ఎర్ర కమలం!

BV-Raghavuluకాషాయం, ఎరుపూ కలుస్తాయిని ఊహిస్తామా? కుడి ఎడమయి పోతుందని కలగన్నామా? ఎప్పుడో విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రధాని అయినప్పుడు కుడి, ఎడమలు ఏకమయ్యాయి. ఒప పక్క బీజేపీ, మరొక పక్క కమ్యూనిస్టులూ మద్దతు ఇచ్చారు. ఇది రాజకీయ రోదసి లో ఒక వింత. ఇప్పుడు ఈ వింతను మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇక్కడ రెండు ‘ఎరుపు’లు కలవటమే ఒక వింత. సిపిఐ, సిఎం చూడటానికి ఒకేలా కనిపిస్తారు. రెండు జెండాల మీద (కొడవళ్ళూ) సుత్తూలూ ఒకేలాగుంటాయి. కానీ (ఎన్నికల్లో ) పొత్తులే వేర్వేరుగా వుంటాయి. కానీ ఇప్పుడు కలిసిపోయారు. ఈ ఇద్దరూ కలిసి బీజేపితో కలసి పోయారు. ఇలా కలిస్తే విద్యుత్తీగల్లో ప్లస్సూ, మైనస్సూ కలిసి పోయినట్టే. అంటే ‘ఫ్యూజు’ కొట్టటం గ్యారంటీ అన్నమాట. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఒక వరమూ, ఒక శాపమూ వున్నాయి. కమ్యూనిస్టులూ ఇతరుల ‘పవరు’ కట్‌ చెయ్యగలరు. ఇది వరం. కానీ తమంతటతాము ‘పవర్‌’లోకి రాలేరు. ఇది శాపం.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

పిల్ల కన్నా గుడ్డు పెద్దది

పలు ట్వీట్స్‌: నరేంద్ర మోడీని మించిన వారు బీజేపీలో లేరు.

కౌంటర్‌ ట్వీట్‌:అసలు బీజేపీయే మోడీని మించి ఎదగలేదు.

ఈ- తవిక

‘హౌస్‌'(అ) రెస్ట్‌!

బరువు తగ్గు స్కీముల్లో

రోడ్లమీద నడకలు!

మెడిటేషన్‌ చెయ్యాలని

అసెంబ్లీలో పడకలు!!

 

ఆరోగ్యం కోసమే

ఒకరికొకరు పంతం!

జనానికి ఎప్పుడూ

జబ్బులే సొంతం!!

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘ఫ్యూజులో వేలు పెట్టావ్‌. షాకు కొడితే..?’

‘ఛా. కరెంటు వచ్చి, షాకు కొట్టేంత సేపు వుంటుందా?’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

పవరున్నప్పుడే బల్ల కింద సొమ్మును వెతుక్కో! లేకుంటే కనపడదు. అసలే అది నలుపు.

-సతీష్ చందర్ 

(సూర్య దినపత్రిక 4 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో వెలువడింది.)

Leave a Reply