పంచమ వేదం

Photo By: mediafury

నూరేళ్ళకీ పదిహేడు మార్కులే వేసి

జీవితంలో తప్పించిన గురుదేవులకు

చేతులు జోడించి వ్రాయునది

 

‘నీకు చచ్చినా అర్థం కాదురా’- అని

మీరు తిట్టుకుంటూ చెప్పిన వేళ్ళ మీద లెక్క

నాకు చచ్చాకనే అర్థమయ్యింది.

నేనెన్నిసార్లు లెక్కపెట్టుకున్నా

నాచేతికి నాలుగు వేళ్ళే వుండేవి.

నాన్నకి కూడా అయిదోవేలు లేకనే

మీరు గుండుసున్నలు చుట్టిన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద

ఎప్పుడూ వేలి ముద్ర వెయ్యలేదు.

పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల రోజున కూడా

అవేలు లేకనే,

అమ్మ గోరుముద్దలు తినిపించలేదు.

నేను తెల్లముఖం వేసినప్పుడెల్లా

మీరదేదో అమృతభాషలో తిట్టేవారు.

నాకన్నం తప్ప అమృతం సయించదు.

నిజం చెప్పండి

పంచముడంటే అయిదోవేలు లేని వాడనేనా అర్థం?

 

మా ముత్తాత ఏకలవ్వుడు చెప్పాడు

III

మీకు ఫీజు ఇవ్వకుండా మరణించినందుకు మన్నించండి.

ఏమివ్వమంటారు?

ప్రాణాలే యిద్దామంటే-

ఇంతవరకూ నా బొందిలో తలదాచుకుని మైలపడ్డాయి.

అదీ కాక మీకు తలంటురోగం!

పోనీ,

అతి సున్నితమైన నా మనోఫలకాన్ని మీకిచ్చేద్దామంటే

నా చావు మీకొచ్చి పడుతుంది.

ఎలా చూసినా మీకు నా దిష్టిబొమ్మనివ్వడమే

ధర్మమనిపిస్తోంది.

ఏ గాంధీ జయంతినాడో మీరు చేసే సహపంక్తి భోజనమ్మీద

చెడుచూపు పడకుండా కాపాడుతుంది.

 

ఏకలవ్యుడు కూడా

భారతంలో ఓ దిష్టిబొమ్మ

III

మా క్లాసులో పాండవుల్నీ,కౌరవుల్నీ

అడిగినట్లు చెప్పండి

కొత్తగా కేస్ట్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుని క్లాసులో చేరిన కర్ణుడికి

నా సానుభూతిని తెలియజేయండి.

ప్రతిభావంతులు వాళ్ళు

మీ శ్లోకాలకు చప్పట్లు కొట్టేవారు.

నాకు మాత్రం అవి తిట్లులా అనిపించేవి.

నిజం చెప్పొద్దూ

మనుధర్మాలు వాత్సాయన కామసూత్రాల్లా వినిపించేవి.

దేవుడి నాలుగు శరీరమర్మాలూ

అశ్లీల భావ చిత్రాల్లా కనిపించేవి.

నా జన్మరహస్యం మీ శాస్త్రాల్లో రాయనందుకు

నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణే.

నన్నేవగించుకోవడానికి మీ నిఘంటువుల్లో

శాపనార్థాలు దొరకనప్పుడెల్లా

నా తల్లి మాటే మీనోట్లో నానుతుండేది

పోనీలెండి, దూషణలోనైనా నా తల్లికే నేను పుట్టానని

ఖరారు చేశారు.

ముమ్మాటికీ మేం తల్లికి పుట్టిన బిడ్డలమే.

అమ్మే మాకు దైవం

గొప్పిళ్ళు వెలివేసిన కుంతెమ్మనయినా

మా యిళ్ళకొస్తే గొంతెమ్మను చేసి కొలుచుకుంటాం

 

ఏకలవ్యుడు దేవుళ్ళకు కాకుండా

తల్లికే పుట్టాడు

III

నన్ను దహించింది కిరోసిన్‌ కాదూ-

అభిమానమేనని పత్రికలవాళ్ళతో చెప్పండి

మంటల్లో కాలినప్పుడు నా శరీరమే

నాకు కంపు కొట్టింది.

అచ్చంగా బతికున్న మీ దగ్గర కొట్టే కంపే.

అప్పుడర్థమయ్యింది మాష్టారూ

మీకూ నాకూ వున్న తేడా.

కులం కాల్చకుండానే కంపుకొడుతుంది కదండీ!

మిమ్మల్ని చంపినా పాపం లేదని మావాళ్ళంటున్నారట

అసలు మీరు బతికున్నదెప్పుడు?

ఊపిరితో వుండి తన పిండాకూడు తనే తినేవాణ్ణి

‘సచ్చినోడ’నేది మా అమ్మ.

మీరు నన్ను చూసి నవ్వినప్పుడెల్లా

పెదవుల్లేని పుర్రెదంతాలు కనిపించేవి

 

వీరుడు ఏకలవ్యుడు

శవాలను చంపడు

III

చివరిగా ఒక్క మాట

నా అంతిమ యాత్రలో పాల్గొన్న

శకుని మామలకు ధన్యవాదాలు చెప్పండి

వాళ్ళ కన్నీటిధారలకు ఊళ్ళో వరదొచ్చిందట కదా!

నేను చూస్తూనే వున్నాను.

వాళ్ళ ఏడుపు ముఖాలమీద మేకప్‌ చెరిగిపోయి

పులిచారలు బయిటపడ్డాయి

వాళ్ళస్మారకోపన్యాసాల నిండా

బ్యాలెట్‌ పెట్టెల ముక్కవాసనే.

అయినా వాళ్ళు నాకెంతో మేలు చేశారు.

నా సజీవదహనానికి

బియ్యం కార్డు మీద కిరోసిన్‌ సరఫరా చేసింది వాళ్ళే.

 

రేపు అడవిలో ఏకలవ్యుడు

వాళ్ళను ఉచితంగా దహనపరచి

నా రుణం తీర్చుకుంటాడు.

-సతీష్ చందర్

(గురువుల కులపిచ్చికి బలయిపోయిన విద్యార్థులు దాకె బాలాజీ, డొక్కా పద్మనాభరావులకు)

1989

13 comments for “పంచమ వేదం

  1. Dear Satish Chander: I have shared with you the entire discussion I have lead on the Internet ages ago. I hope you still have copy of the printouts I sent you. It was heartening to re-read the poem over nad over again. Best wishes, — Veluri Venkateswara Rao

  2. బాగుంది అనలేను.. ఎందుకంటే అలా అంటే నాకూ ఆ గురువులకి తేడా ఉండదు….. బాలేదు అని కూడా అనలేను.. అలా అంటే మీ ఆవేదన ని అవమానించిన వాడినవుతాను.. ప్చ్.. ఓ నా దేశమా… ఈ కుల పిచ్చి ని కుదిర్చే వైద్యుడు ఎక్కడ?

  3. కంటి నిండా నీళ్ళు నిండి మసక మసకగా కనిపిస్తున్న కంప్యూటర్ స్క్రీన్ ని చూస్తూ .. ఎలా రాయాలో తెలియక … కనీళ్ళు తమ బాషని డీకోడ్ చేస్తే బాగుండు అనిపిస్తూ ఉండగా రాస్తున్నా..
    “నాచేతికి నాలుగు వేళ్ళే వుండేవి.
    నాన్నకి కూడా అయిదోవేలు లేకనే
    మీరు గుండుసున్నలు చుట్టిన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద
    ఎప్పుడూ వేలి ముద్ర వెయ్యలేదు.”
    ఈ మాటలు నాకు తెలియని విషయాలేవో చెప్తూ ఎక్కిరిస్తున్నట్టునాయి ..
    మొత్తం కవిత చదువుతున్నంత సేపు లో లోపల ఈ సమాజం మీద అసహ్యం వేసింది ..
    మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నా… చదివిన ప్రతి సారి ఏదో కొత్తదనం .. నాకు తెలియని
    నా అస్తిత్వ నిజం కనిపిస్తూనేవుంది

  4. IT IS BECAUSE OF NON-ACCEPTANCE OF CHANGING SOCIAL SCENARIO. NOW THE PRESENT SITUATION IS DIFFERENT FROM THAT OF MANUVU. NOW THEY ARE NOT APPLICABLE. BUT THIS TRUTH, THEY CUD NOT AND BELIEVE IN THEIR OLD AGED CULTURE. THEY DONT LIKE TO LOOSE THEIR IDENTITY AND NOT RECOGNISE THE OTHERS IDENTITY. NEW IDEOLOGY IS TO BE BROUGHT INTO SOCIETY BY THE EDUCATED. WITH THE PROGRESS IN ECONOMIC CONDITION ONLY ERADICATE THE PRESENT CULTURE. THE WEEK SHALL WIN THE RACE. THE REAL ENEMY IS THE SYSTEM AND NOT THE PEOPLE.

  5. నాచేతికి నాలుగు వేళ్ళే వుండేవి.
    నాన్నకి కూడా అయిదోవేలు లేకనే
    మీరు గుండుసున్నలు చుట్టిన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీ
    ఎప్పుడూ వేలి ముద్ర వెయ్యలేదు.”

    sorry naa vadda matallevu.. nee kavitha vatini laakellipoyindi..
    gunde pogilipoyi neeravuthondi..

    Mee kavithanu prasamsinchala..
    ippatiki kula pichi kammesukunna kuhana methavulanu choosi siggupadala..

    methavula killa Krishna, guntur lanti zillalo ippatiki colleges lo ‘C’ partylu (caste parties) jarugutunnayi.. intakante goramainademundi.
    ee vidyarthuau ye gamyalaku cherutaru..

    samadanam leni prashnale…

    Thank u sir…

  6. Naadu……”Vidya Nerpicha kundane “Ekalavuni Botana (Thumb) velu ni bali korina guruvu Dro(hi)nudu… !!! Nedu…….Kona leka chaduvu kunte…sahincha leni Tea(ch)sers…. Naa kodukulni colar pattu kuni ….Kaali cheppu tho kottali kasi theerali……Panchama vedam………parayanam cheyali…….Congrats 2MS !!!

  7. రేపు అడవిలో ఏకలవ్యుడు

    వాళ్ళను ఉచితంగా దహనపరచి

    నా రుణం తీర్చుకుంటాడు……………….. అడవిలో ఏకలవ్యుడు సూసుంటే బాగుండేది

Leave a Reply