పిట్ట ‘కథాం’బరం

caricature:balaram

caricature:balaram

పేరు : చిదంబరం

ముద్దు పే ర్లు :‘పదా’ంబరం( లెక్క ప్రకారం బడ్జెట్‌ లెక్కల్లో వుండాలి. కానీ ఈ సారి సంక్షేమం వరకూ మాటలు జాస్తి, అంకెలు నాస్తి) మహిళలనీ, యువతనీ, పేదల్నీ పొగడ్తల్లో ఆకాశంలోకి ఎత్తాను. కేటాయింపుల్లో కొంచెమే ఇవ్వగలనని నాకు ముందే తెలుసు.’కథ’ంబరం( బడ్జెట్‌ నిండా పిట్ట కథలే!)

విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ మ్యాజిక్‌(గోరంత పెట్టి కొండంత ఇచ్చినంత అనుభూతి తేగలను.)

హోదాలు : నిన్న తూటాల (హోం) మంత్రిని, నేడు పైసల(ఆర్థిక) మంత్రిని. తూటాలు పేలతాయి. పైసలు మోగుతాయి. కానీ అదేమిటో ఈసారి పైసలు పేలాయి. మార్కెట్‌కిది నచ్చలేదు.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: నా కళ్ళజోడులోకి సూటిగా చూడండి.( కనుపాపలుండవు. ‘ను రూపాయి’లుంటాయి. ఒకటి వచ్చే రూపాయి, ఇంకొకటి పోయే రూపాయి.)

రెండు: నా పేరు తలచుకుంటే మీ గుండె దగ్గర నొప్పి వస్తుంది. పొరపాటు పడకండి. చిల్లు మీ గుండెకు పడలేదు. చొక్కా జేబుకు మాత్రమే.

అనుభవం : ‘మీ నోట్లు మా చేతిలో.మా వోట్లు మీ చేతిలో’ నినాదం బాగుందా? కానీ ఇది ఒఠ్ఠి నినాదం కాదు. నా అనుభవం. ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి నోట్ల విలువ పడిపోయింది. వోట్ల విలువ పెరిగిపోయింది. రాజకీయాల్లో బతుకులీడుస్తున్న వాళ్ళు బతకాలా వద్దా? ఇలా ఆలోచించి ‘సంక్షేమ’ బడ్జెట్‌ను అందిస్తే, ‘ఎలక్షన్‌’ బడ్జెట్‌ అంటారేమిటి? తప్పు కదూ!

వేదాంతం : ‘సొల్లు వాగడానికి ఏ సెల్లయినా ఒక్కటే’ ( ఇలా సినిమాల్లో మాట్లాడితే, పంచ్‌ డైలాగంటారు) ఈ మాత్రం దానికి రెండు వేలు రూపాయిల సెల్లు చాలదా? అందుకే ఆ రేటు దాటిన సెల్లులకు బాగా వడ్డించాను.

వృత్తి : గరిటె తిప్పటం. అవును బడ్జెట్‌ తయారు చేయటమంటే, వంట చెయ్యటమే. ఎంత చెయ్యితిరిగిన పాకశాస్త్ర ప్రవీణుడయినా, వంట చేసినప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాడు. నేను ఈ ఏడాది వంటను అద్భుతంగా చేసి, అందరికీ వడ్డించేశా, నేను రుచిచూశాను. చిన్న పొరపాటే. ఉప్పు వేయటం మరిచాను. బడ్జెట్లో జనాకర్షణ, వంటలో ఉప్పులాంటిదే.

హాబీలు :1.రద్దీ రోడ్లమీద వాకింగ్‌ చెయ్యటం.( మీరు చూసి చూడండి. ఖరీదయిన ఇంపోర్టెడ్‌ మోటారు బైక్‌లు నడిపే కుర్రకారు వుంటారు. వయ్యారంగా టైర్ల చేత రోడ్ల మీద ముగ్గులు పెట్టించుకుంటూ బండి నడుపుతారు. పోనీ రోడ్డు పక్కనించి వెళ్ళ దామా- అంటే, పెద్ద పెద్ద సుమోలూ, క్వాలిస్‌లూ, స్పోర్పియోలూ అడ్డంగా పెడతారు. అందుకే ఆయా వాహనాల మీద నా ఇష్టం వచ్చినంత వడ్డించాను. )

2. వారాంతాల్లో కూడా ఇంటి భోజనమే తింటాను. జీతం వచ్చిన వెంటనే సకుటుంబ సమేతంగా ఏసీ రెస్టారెంట్లకు వెళ్లి పైసలు తగలేసుకోవటం నాకిష్టం వుండదు. (అందుకే ఏసీ రెస్టారెంట్లను కూడా మన చార్జీలతో మోతెక్కించేశాను.’

మిత్రులు : నా మీద ఒక ప్రచారం వుంది: ‘నేను పెట్టుబడి దారీ విధానానికి మిత్రుణ్ణి కాను. కానీ పెట్టుబడిదారులకు మిత్రుణ్ణి’. ఉదాహరణకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రేమ్‌జీ వున్నారు. ఆయనంటే నాకు అభిమానం. ఆయన అత్యంత సంపన్నుడయినప్పటికీ వితరణశీలి. గొప్పవాళ్ళ దగ్గర తీసుకుని పేద వాళ్ళకు పెట్టాలంటారు. అందుకేగా ఏడాది ఆర్జన కోటి రూపాయిలు దాటిన వాళ్ళనుంచి పదిశాతం సర్‌ చార్జ్‌ వేశాను.

శత్రువులు : దేశానికి శత్రువులెవరో పోల్చుకోలేరు కానీ, నాకు శత్రువులెవరో నిఘా సమాచారం లేకుండా గుర్తించగలను. మా పార్టీలోనే వుంటారు. నా వెంటే వుంటారు.

జపించే మంత్రం : విదేశీ పెట్టుబడి- స్వదేశీ కట్టుబడి (నేను పంచే కడతాను చూశారు కదా! యూపీయే నేతల్లో అధిక భాగం ఖద్దరే కడతారు. కానీ విదేశీ ధనమంటే ఆహ్వానిస్తారు. గాంధీ గారు విదేశీ వస్త్రాలు బహిష్కరించమన్నారు కానీ, విదేశీ పెట్టుబడులు కాదు కదా…! అర్థం చేసుకోరూ..!?)

విలాసం : ‘వైట్‌ హౌస్‌’. కాబట్టే ఆర్థిక మంత్రే నేను మాత్రమే కాదు, దేశంలో ప్రతీపౌరుడూ కడుపులో కాలినా సరే ‘డాలరె’త్తుకుని తిరగగలుగుతున్నాడు.

గురువు : ఇంకెవరు. అర్థశాస్త్రంలో ‘జగద్గురువు’ మనీ మోహనుడే. అయితే అంతటి మహానుభావుడికే మాయని మచ్చ వచ్చింది. విదేశీ మీడియా ఆయనను ‘అండర్‌ ఎచీవర్‌’ అని విమర్శించింది. దానికి సమాధానంగా చిల్లర రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాం. ఇప్పుడు ఏకంగా బడ్జెట్‌తోనే సమాధానం చెప్పాం.

జీవిత ధ్యేయం : ‘అర్థ’ మంత్రి పూర్తి మంత్రి ఎప్పుడవుతాడు? ‘ప్రధాన మంత్రి’ అయినప్పుడు. మన్‌ మోహన్‌ సింగే ఇందుకు తాజా ఉదాహరణ.

-సతీష్ చందర్

Leave a Reply