పిడికెడు మట్టి కావాలి

ఇక్కడి మట్టినే
నాతల్లి పిడికెడు తీసి కడుపున పెట్టుకుంటే
నేను పుట్టాను
నా దేహాన్ని తొలగిస్తే అంతా దేశమే

నాకిప్పుడు పిడికెడు మట్టి కావాలి
కళ్ళకద్దుకోవటానికీ
కాలితో తొక్కుకోవటానికీ

ఏ పసిపిల్లకూ
తల్లి ప్రార్థనాస్థలం కాదు
ముద్దులయినా, చిందులయినా ముఖమ్మీదే
పాలయినా, ఒంటేలయినా ఒడిలోనే
అమ్మ అమ్మే, గుండెకు హత్తుకుంటుంది. ఈ దేశం లాగే

ఏ తల్లికీ
పసివాడు భక్తుడు కాడు
నీళ్ళు నేలకీ, బురద నుదుటికీ
నోటిలో మన్నూ, మూతిమీద మందహాసం
బిడ్డ,బిడ్డే. నవ్వుని బువ్వ చేస్తాడు. ఇక్కడి రైతులాగే

నాకిప్పుడు పిడికెడు మట్టికావాలి
నిర్మాణానికీ,
నిమజ్జనానికీ

ఏ వెన్నెల తునకా
అన్నం మెతుక్కి సాటి రాదు
నిలిచింది క్షణమైనా నాలుక జీవితం ధన్యం
నల్లని నేల తల్లి ప్రసాదించిన తెల్లని స్తన్యం

అన్నం అన్నమే.
తాను ఉడికి నన్ను చల్లబరుస్తుంది. ఈ దేశం లాగే

ఏ అమావాస్యా
ఆకలి రాత్రికి సాటి రాదు
ఎవరి తిన్న కంచమో- కడుగుతున్నప్పుడు
కడుపు కలుక్కుమన్న అనుభవం
శిలువకు ముందు కూడా,
పురుగుమందే చివరివిందయిన సందర్భం

ఆకలి ఆకలే.
తాను మండీ నన్ను వెలిగిస్తుంది. ఇక్కడి రైతులాగే

నాకిప్పుడు పిడికెడు మట్టి కావాలి
పుట్టటానికీ
గిట్టటానికీ

ఎంత మెత్తని పువ్వయినా
దూదినవ్వుకి సాటిరాదు
గుక్కపట్టిన ఒంటిమీద వస్త్రమై
గిలిగింతలు పెట్టినా
పుస్తులిచ్చిన భార్య పైటకొంగయి
పరిహసించినా

దూది దూదే
తాను నలిగి నన్ను సుఖపెడుతుంది. ఈ దేశం లాగే

అభిమానం మీద కప్పే ఏ వస్త్రమయినా
ఆత్మహత్యకు సాటి రాదు
మబ్బుల్ని వలిచేస్తే
ఆకాశం చీకటి తాగి చస్తుంది.
గుండెల మీది పచ్చిక ఓణీ తొలగిస్తే
కొండలు సజీవ దహనమవుతాయి

ఆత్మ ఆత్మే.
తాను పగిలి నాకు పడక వేస్తుంది. ఇక్కడి రైతులాగే

నాకిప్పుడు పిడికెడు మట్టి కావాలి
దాచుకోవటానికీ
రుణం తీర్చుకోవటానికీ

ఏ చక్రవర్తి చరిత్రకయినా
తొలి విజయం నేల మీద పాకటమే
పసితనంలో ప్రతీ వాడూ పుడమిని
అరచేతుల్తో మొక్కిన వాడే
పడ్డవాడెవడయినా మట్టిని
గుప్పిట పట్టినవాడే

పాకటం పాకటమే.
భూమిని తనివి తీరా ప్రేమించటమే. నాకు మట్టే దేశం

ఏ అంత్యక్రియా
చివరి అధ్యాయం కాదు
నాకని తవ్విన గొయ్యి
నేలతల్లికి ఖాళీకడుపు
అసలు నా సమాధే తెల్లని దూదిపరుపు

ఖననం జననమే.
బిడ్డను తల్లి కడుపున పెట్టుకోవటమే. నాకు తల్లే రైతు

నేనిప్పుడు గర్భస్థ శిశువుని
అయినా పుట్టను కాక పుట్టను
అన్నమిచ్చి ఆకలిని ముట్టను
వస్త్రమిచ్చి దిగంబరాన్ని కట్టను

మీకు
నిజంగా కడుపు మండినప్పుడో
సిగ్గొచ్చి పడినప్పుడో
నేలమీద రెండు కన్నీటి బొట్లను రాల్చండి
ఇద్దరు అమృత శిశువులు నేలను
పొడుచుకుని వస్తారు
ఒకడి పేరు: వరి. మరొకడి పేరు: పత్తి

రచనా కాలం:1997
(సతీష్ చందర్ కవితా సంకలనం ‘ఆదిపర్వం’ లోని కవిత ఇది. ఈ గ్రంథం 2008 వ సంవత్సరంలో ముద్రితమయినది. పుస్తకం కావలసినవారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగలరు. వెల: రు.60 లు)

3 comments for “పిడికెడు మట్టి కావాలి

Leave a Reply