పురుషాధిక్యానంద బాబా(పు.బా)

caricature:balaram

caricature:balaram

పేరు : పురుషాధిక్యానంద బాబా(పుబా. తిరగేస్తే ‘బాపు’ కావచ్చు. నాకనవసరం కానీ నేను పు.బానే)

దరఖాస్తు చేయు ఉద్యోగం: రక్తిదాత, ముక్తిదాత, విరక్తి దాత.

ముద్దు పేర్లు :ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. మీరు ‘పోబే’ అన్నా నాకు ‘బాబా-అన్నట్లే వినపడుతుంది. ఒక్కో చోట ఒక్కో రూపంలో అవతరిస్తుంటాను. హంసతూలిక తూలికా తల్పంమీద వున్న అనునిత్యానందుణ్నీ నేనే. మనసారా మధువును గ్రోలినప్పుడు ‘పెగ్గు’బాబానీ నేనే, పట్టపగలు నా ఆశీస్సులకోసం వచ్చిన యువభక్తురాళ్ళకు వెచ్చని కౌగిలి నిచ్చే ‘హగ్గు’ బాబానీ నేనే. అంతెందుకు? ‘చేతి’తో దీవిస్తే రొటీన్‌ గా వుంటుందని కాలితో దీవిస్తాడు చూడూ… ఆ ‘తన్ను’ బాబానూ నేనే. పిల్లలకు ఇంగ్లీషు విద్యలో అక్షరాభ్యాసం నా పేరు మీదే జరుగుతుంది. ‘బాబా. బాబా బ్లాక్‌ షీప్‌’.

విద్యార్హతలు : ఉన్నత విద్యవుండి కూడా ‘బుర్ర గుంజు'( బుర్రల్లో తెల్లపదార్థం) లేని వారు నాశిష్యకోటిలో ఎందరో వున్నారు. సర్యవిద్యలూ నాలో మిళితమయ్యాయి నాయనా? నా అంతర్నేత్రమనే ‘సిసి’ కెమెరా సర్వవ్యాపితంగా వుంటుంది. కడకు ఇటీవలి ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కూడా నా కెమెరాలో నిక్షిప్తమయ్యింది. (ఆ బాలికకూడా తప్పు చేసింది నాయనా, తనపై అత్యాచారం తలపెట్టినప్పుడు ‘సోదరులా!’ అని సంబోధించలేదు.. ఈ మాట అన్నది వేరే బాబా కదా- పేర్లలో మార్పుకానీ, స్వరంలో మార్పుండదు నాయనా. తెలియని పామరులు ఈ మాటఅన్నందుకు మామీద విరుచుకు పడుతున్నారు.)

హోదాలు : భగవంతుణ్నే హోదా అడుగుతావా? కళ్ళు పోతాయి. ఆయన ముందు అందరూ చిన్నవారే. భగంతుడికి తన సృష్టి మీద బెంగ కలిగి భూమ్మీదకు రావాలనుకున్నప్పుడెల్లా, ఒక దేహంలో ప్రవేశిస్తాడు. నాలాగా హుక్కాలు పీల్చి, సమస్త వ్యసనాలను చవిచూసి( లేకుంటే తత్త్వం బోధపడదు కదా!), పరమ డొక్కులాగా వున్నదేహంలో జాగా ఎక్కువ వుంటుంది. ఆయనే ఆ దేహాన్ని పవిత్రపరచుకుని నివసిస్తారు. అందుకనే బాబా అంటే భూమ్మీద నడిచే దైవం. ఈ లోకంలో ఎంతటి అధికారంలో వున్నవాడయినా, బాబా పాదాల చెంతే తరించాలి. అలా తరించారు కూడా.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: కమండలంలో నీళ్ళు తీసి ఎవడు కొడితే ‘మైండ్‌ బ్లాకయి దిమ్మ తిరుగుద్దో’ ఆడే బాబా ‘గాడు'( గాడంటున్నానా, అలా చూస్తున్నావ్‌? గాడంటే ఎవరు దేవుడు?)

రెండు: సౌందర్యానికి ప్రతిరూపం బాబా. గడ్డాలూ, మీసాలు పెంచుకుని కాషాయం ధరించి, రుద్రాక్షలు వేసుకున్న ఈ శరీరాన్ని చూసి ఏ స్త్రీ వ్యామోహ పడుతుందనుకుంటున్నావా? అతివలు ఆత్మసౌందర్యాన్ని చూస్తార్రా వెర్రివాడా? ‘సిక్స్‌ప్యాక్‌’లు వేరు ‘సెక్స్‌ ప్యాక్‌’లు వేరు. ‘పత్రి’ వ్రతుడయిన బాబా గురించి మీ పత్రికలు రాశాయి చదవలేదా?!

అనుభవం :స్త్రీని అర్థం చేసుకోకపోవటం వల్లనే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. స్త్రీ వున్నది పురుషుడు కోసమే ఈ విషయం స్త్రీకి తెలియచేయాలి. ఆమెకు అర్థం కాకపోతే మనుధర్మాన్ని ‘మగ ధర్మం’ గా ఆంగ్లంలోకి అను’వధించి’ మరీ చెప్పాలి: ‘ఫుడ్డే’షు మాత, ‘బెడ్డే’షు రంభా, ‘క్లీనే’షు దాసి, ‘హెల్పే’షు మంత్రి- ఇలా చెప్పాలి. ‘మగ’ని కోరికకు ‘నో’ చెప్పకూడదు. అప్పుడు అత్యాచారం ఎందుకు జరుగుతుంది?! జరిగినా అది అత్యాచారం ఎందుకవుతుందీ!? (అన్నట్టు భర్తలు కూడా తమ సొంత భార్యలపై అత్యాచారాలు చేస్తారులే! ఆమె ఒప్పుకోని ప్రతీ సందర్భమూ అత్యాచారమే కదా! అందుకే మరి ఒప్పేసుకుంటూ వుండాలి.. అతడు మగ వాడయినా, పగవాడయినా…!)

సిధ్ధాంతం : విధేయత పెరగాలి. బాబా పట్ల భక్తులకూ, యజమాని పట్ల పనివాళ్ళకూ, పురుషుడి పట్ల స్రీలకూ విధేయత పెరగాలి. యజమాని ఏది చెబితే బానిస అది చెయ్యాలి. ఇలా జరిగినంత కాలం సమాజంలో శాంతి చేకూరుతుంది. ఇది తెలియ బానిసత్వం నుంచి స్త్రీకి విముక్తి నిస్తానంటున్నారు. ఏబానిస స్త్రీ అయినా భూస్వామి కోరికను కాదంటుందా? ఒప్పుకుంటుంది. అందుకే గ్రామాలలో జరిగేవి అత్యాచారాలను కావంటున్నాం. వినరెందుకు ఈ స్త్రీవాదులు?

వేదాంతం : కామి కాని వాడు మోక్షగామి కాదు.

వృత్తి : సమాజాన్ని వెనక్కి నడిపించటం

హాబీలు :1. నుదుటికి బూడిద పోసుకోవటం.

2. భక్తుల్ని గాడిదల్ని చేయటం.

మిత్రులు : అపరాధం? ఆ మాటే అనరాదు. భగవంతుడికీ, బాబాకీ భక్తులే వుంటారు. మిత్రులుండరు.

శత్రువులు : స్త్రీ పురుష సమానత్వాన్ని కోరే క్షుద్ర శక్తులు

జపించే మంత్రం : ‘ఓం ‘భూమ్‌’ ఫట్‌..ఫట్‌ ( ఆశ్రమాల కోసం భూములు కావాలి కదా!)

విలాసం : అన్నీ తెగించిన వాళ్ళం… సారీ త్యజించిన వాళ్ళం. మాకు విలాసాలేమిటి? భక్తులకు సుఖాన్ని ప్రసాదిస్తూ అతి సామాన్యంగా తిరుగుతాం.

గురువు : జగద్గురువునునేను. నాకు గురువులా?

జీవిత ధ్యేయం : జీవితం బుడగ వంటిది. అది ‘తుస్సు’ మనకుండానే ఆడేసుకోవాలి. అన్నీ వాడేసుకోవాలి.

-సతీష్ చందర్

ఈ రచన కేవలం నకిలీ బాబాలను ఉద్దేశించినదే.

 (గ్రేట్  ఆంధ్ర  వార పత్రిక 11-17  జనవరి 2013 వతేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply