ఆచరించేటంత పెద్ద పనీ ఎవరో కానీ పెట్టుకోరు. సుఖమైనదీ, సులభమైనదీ, గౌరవప్రదమైనదీ మరో పని వుంది: ఆరాధించటం.
పెద్దవాళ్ళనీ, గొప్పవాళ్ళనీ తలచుకోవటమంటే- వాళ్ళ ఫోటోలకు దండ వెయ్యటమో, లేక వాళ్ళ విగ్రహాలను ప్రతిష్టించటమో, లేదా వాళ్ళ పేరు మీద ఎవరికన్నా అవార్డు లివ్వటమో. ఇదంతా ఆరాధనా కార్యక్రమమే.
పెద్దవాళ్ళ వరకూ ఎందుకూ? స్త్రీ విషయమే తీసుకోండి. ఆమెను ఆరాదించటానికే అందరూ ముందుకొచ్చేస్తారు. దాన్నే వారు గౌరవించటమంటారు. సత్యజిత్ రే తీసిన సినిమా ఒకటి వుంది. స్త్రీలను అతిగా గౌరవించే ఓ పెద్దాయన ఇంట్లోకి కొత్త కోడలు వస్తుంది. ఆమెను కూడా గౌరవించుకోవాలని నిర్ణయించేసుకుంటాడాయన. ఆలోచనలకు తగ్గట్టుగానే ఆయనకు ఓ కల వస్తుంది. ఆ కలలో దుర్గాదేవి ప్రత్యక్షమౌతుంది. చిత్రం! దుర్గాదేవికి తన కొత్తకోడలు పోలికలే వుంటాయి. దాంతో తెల్లవారగానే కొత్త కోడలు కాళ్ళ మీద పడతాడు. సాక్షాత్తూ దేవి తన ఇంట్లోకి వస్తే ఆరాధించాలి కదా! అందుకని ఆమెను ప్రత్యేకం ఓగదిలో పెట్టి, పొద్దస్తమానం ధూపాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఆ కొత్త కోడలికి ఏడుపొకటే తక్కువ.
సమాజంలో అట్టడుగు వర్గాలనుంచి వచ్చి అసమానత్వం మీద యుధ్ధం చేసిన కొందరు మహానుభావుల జయంతులు వరసగా ఈ( ఏప్రిల్) నెలలోనే వచ్చాయి. బాబూ జగజ్జీవన్ రామ్, మహాత్మాఫూలే, బాబాసాహేబ్ అంబేద్కర్లు వరసగా పుట్టటం యాదృఛ్చికమే కావచ్చు. కానీ వీరిని ఏక బిగిన ఆరాధించే అవకాశం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కి వచ్చింది. వచ్చిందే తడవుగా ఎస్సీ,ఎస్టీ, బీసీలకు వరుసగా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్సీ కాలనీల్లో (యాభయి యూనిట్లలోపు) ఉచిత విద్యుత్తును ప్రకటించారు. ఇది కూడా ఆయన కొనుక్కుని రానక్కర్లేదు. ఎస్సీఎస్టీ ఉపప్రణాళిక నిధులనే వెచ్చించ వచ్చు. ఇంకా ఒక్కొక్కరి జయంతికి ఒక్క స్కీము వుందని చెబుతున్నారు.
కానీ సరిగ్గా ఈ ‘ఆరాధనా వారోత్సవం’ జరుగుతుండగానే, తెనాలిలో ఓ దారుణం జరిగి పోయింది. తల్లి పక్కనుండగానే కూతురి పై ఎనిమిదిమంది లైంగిక దాడికి పాల్పడబోయారు. తల్లి అడ్డుకోబోయి చెంప దెబ్బ కొట్టింది. దాంతో ఆ తల్లిని వేగంగా వస్తున్న లారీకిందకు తోసి వేశారు.ఆమె చనిపోయింది. ఈ మహిళలు దళిత మహిళలు. ఆ ఎనిమిది మందిలో ప్రధమ ముద్దాయి పాలక పక్షానికి చెందిన నేత కొడుకు. ఈ ముగ్గురు మహానుభావుల జయంతికీ నివాళిగా ఇచ్చింది ఏమిటి? ఎస్సీ, ఎస్టీల ఇళ్ళల్లో ఉచిత విద్యుత్తా? లేక ఒంటరిగా వీధుల్లో వెళ్ళే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ‘ఉచిత షాకా?’
ఈ పార్టీ అధికారంలో వుంది కాబట్టి, అనుకోకుండా ఈ మచ్చ ఆ పార్టీ మీద పడింది. కానీ ఏ పార్టీ అధికారంలో వున్నా ఇలాగే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీల ఆరాధనా, ఎస్సీ,ఎస్టీల పై దాడులూ పక్కపక్కనే జరిగిపోతుంటాయి.
అయితే ఇప్పుడున్న అణగారిన వర్గాల నేతలయినా జగజ్జీవన్‌రామ్, ఫూలే, అంబేద్కర్ల సిధ్దాంతాలను ఆచరిస్తారా? లేక వారు కూడా ఆరాధించి ఊరుకుంటారా?
తండ్రిని ఆరాధించటమంటే, తండ్రి చెప్పులకు పూజ చేయటం కాదు, తండ్రి చెప్పుల్లో కాళ్ళు పెట్టటం. అంటే తండ్రి మార్గాన నడవటం.
బాబూ జగజ్జీవన్ రామ్‌ను ఆచరించటమంటే, విధేయతకు విలువనివ్వని నియంతృత్వాన్ని ఎదరించటం. ఇందిరాగాంధీ కేబినెట్లో ఎంతో విధేయంగా పనిచేసిన ఆయన, ఎమర్జన్సీ సమయంలో కూడా సహనం వహించి, ఆ తర్వాత వెలుపలకు వచ్చారు. ఆయన వెంట జనం నిలిచారు. ఆయన ఢిల్లీలో పెద్ద ర్యాలీని నిర్వహించ దలచినప్పుడు, అప్పటి ఇందిరా సర్కారులో కొందరు ఈ ర్యాలీని భగ్నం చెయ్యాలని ప్రయత్నించారు. ఆ రోజు దూరదర్శన్‌లో కొన్ని రోజుల క్రితమే విడుదలయిన (రిషీ కపూర్-డింపుల్ కపాడియా నటించిన) ‘బాబీ’ సినిమాను ప్రసారం చేశారు. ఆ రోజుల్లో మంచి చిత్రాలు దూరదర్వన్లో చాలా అరుదుగా ప్రసారమవుతూ వుండేవి. కాబట్టి జనమంతా టీవీలకు అతుక్కు పోతారనీ, ఫలితంగా బాబూ జగజ్జీవన్ రామ్ ర్యాలీ విఫలమవుతుందనీ ఆశించారు. కానీ జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ వార్తను ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బాబూ బీట్స్ బాబీ'( బాబీని ఓడించిన బాబూ) అని రాశారు. ఈ తెగువ నేటి అట్టడుగు వర్గాల నేతల్లో ఎంత మందికి వుంటుంది? ఆ తెగువ ను ప్రదర్శించటమే జగజ్జీవన్ రామ్‌ను ఆచరించటం.
మహాత్మా ఫూలే సంస్కరణను తన ఇంటినుంచే మొదలు పెట్టారు. నిరక్షరాస్యులయిన తన భార్య సావిత్రీ బాయి ఫూలేకు విద్యావంతురాలి గా మార్చారు. అక్కడితో ఆగలేదు. తమ కంటే (ఫూలే బీసీ వర్గాలకు చెందిన వారు.) సామాజికంగా కింద వున్న ‘అస్పృశ్య’ స్త్రీల కు చదువు చెప్పమని ఆమెను ఊరువెలుపల వున్న వాడలకు పంపించారు. వారికి చదువు చెబుతున్నందుకు, కోపం తెచ్చుకున్న ఊరి పెద్దలు ఆమెను రాళ్ళతో కొట్టించారు. ఆమె చీర మీద బురద వేయించారు. అప్పుడామె ఒక చీర కట్టుకొని, ఒక చీర సంచిలో పెట్టుకుని మరీ వెళ్ళి చదువు చెప్పారు. కానీ చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు ఎక్కువ మంది తమ స్త్రీలను ఉద్యమంలో భాగం చేయరు. కానీ ఆయన బొమ్మకు దండలు వేయటానికి ముందుకు వస్తారు.
ఇలాంటి పని తన విషయంలో చేస్తారని ముందుగానే శంకించిన అంబేద్కర్ ‘వ్యక్తిపూజ’ ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. మేలు చేసినందుకు మరొకరికి కృతజ్ఞత కలిగి వుండవచ్చు కానీ, ఆ కృతజ్ఞత మన వ్యక్తిత్వాన్ని కోల్పోయేంతగా వుండకూడని చెప్పారు. అయినా సరే. ఆయన్ని ఆచరించేవారు కన్నా ఆరాధించే వారే ఎక్కువ మిగిలారు. ఏం చేస్తాం?!
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 14 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)