ప్రకృతి బీభత్సం కాదు, వికృత వాణిజ్యం!

టాపు(లేని) స్టోరీ:

ప్రకృతిని ఎన్నయినా అనవచ్చు. ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతి ప్రకోపించింది. ప్రకృతి విలయతాండవం చేసింది. వరదలొచ్చినా, ఉప్పెనలొచ్చినా, సునామీలొచ్చినా, కడకు భూకంపాలొచ్చినా- ప్రకృతిని తిడుతూనే వుంటాం. పాపం! ప్రకృతి తన పై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు. పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. పరువు నష్టం దావా వేయలేదు. మౌనంగా అన్ని ఆరోపణలూ భరిస్తుంది. కేదార్‌ నాథ్‌, బదరీనాథ్‌ వంటి పుణ్య క్షేత్రాల వద్ద జరిగిన వరద విషాదం మొత్తం ప్రకృతి బీభత్సం ఖాతాలోనే వేసేశాం. ఇందులో ‘ఏలిన’ వారి తప్పిదం ఏమీ లేనట్టుగానే మాట్లాడుతున్నారు. ఈ మాట తప్పనిసరిగా అనాల్సి వస్తే ‘మానవ తప్పిదం’ కూడా వుందని సరిపెట్టుకుంటున్నారు. అంటే ఈ తప్పిదాన్ని ‘పౌరులందరి’ మీదా వేసేసి రుద్దటం అన్నమాట.

అలా మనుషులందరినీ బాధ్యులు చేయాల్సి వస్తే, తిరిగి ప్రకృతినే తప్పు పట్టినట్లవుతుంది. ఎందుకంటే మనిషి కూడా ప్రకృతిలో భాగమే. కానీ తానొచ్చిన ప్రకృతిలోని శక్తుల్ని చేసి తొలుత ఆశ్చర్యపోయాడు, ఆరాధించాడు, మచ్చిక చేసుకున్నాడు. ఇంకా చేసుకుంటూనే వున్నాడు. గాలి, నీరు, అగ్ని- దేన్ని చూసినా దండం పెట్టేశాడు- భయంతో. అవే వాటి ఆకలి తీరుస్తున్నప్పుడు మళ్ళీ పెట్టేశాడు దండం- భక్తితో. ఇప్పటికీ చేరువలేనిదన్నా, అందనిదన్నా, ఆశ్యర్యం గొలిపేశక్తులన్నా మనిషికి ‘భయ, భక్తులు’ ఏర్పడతాయి. కానీ తీరిక దొరికినప్పుడు, ఆసక్తి పెరిగినప్పుడు, ఆ శక్తుల రహస్యాలను ఛేదిస్తూ వెళ్తూ ‘యురేకా’ అంటూ శాస్త్రాలు రాసుకుంటూ వెళ్తాడు.

కొత్తగా తెలుసుకున్న వాస్తవం, పాత విశ్వాసాన్ని పాతరవెయ్యాలని రూలు లేదు. రెండూ పక్కపక్కనే నడిచి పోతుంటాయి. చంద్రుడిని చూశాక, కాలు కూడా మోపాక కూడా, చంద్రగ్రహణ మప్పుడు పురాణ గాథలు చదివి గుడికి వెళ్ళి పూజలూ చేస్తాం, ‘ప్లానిటోరియం’ కు వెళ్ళి శాస్త్ర పరికరాలతో చూసి కూడా వస్తాం. దేని దారి దానిదే. ‘నవమాసాలూ మోసి, కన్న’ తల్లి ఒక్కొక్క సారి (గర్భాన్ని అద్దెకిచ్చిన కారణంగా) అద్దె తల్లి (సర్రొగేట్‌ మదర్‌) అయిపోతుంది. సొంత తల్లి వేరే వుంటుంది. అలాగని ‘మాతృదేవోభవ’ అనటం మానేస్తామా? ఇప్పుడు ఇద్దరు తల్లులకూ మొక్కుతాం.

అందుకని శాస్త్ర విజ్ఞానం ఎంత పెరగినా, దుర్భేధ్యమైన క్షేత్రాలలో భగవంతుణ్ని వెతుక్కుంటూ వెళ్ళి, మనశ్శాంతిని పొందిరావటం అన్నది జరుగుతూనే వుంటుంది. వీరు అభం శుభం తెలియని పౌరులు.

కానీ, ఇటు శాస్త్రాన్నీ, అటు విశ్వాసాన్నీ- రెంటిమీదా ‘పైసలే’రుకునే దేశ, విదేశ బేహారులుంటారు. వారే అడవుల్ని నరుకుతారు, అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు కట్టేస్తారు. నదులనూ పూడ్చిపెడుతూ, వాణిజ్య సౌధాలు లేపేస్తారు. అంటేశాస్త్రంతో నిర్మాణాలు చెపడతారు. నమ్మకాల మీద వ్యాపారాలు చేన్తారు. దాంతో నదులూ, ప్రవాహాలూ తమ దారిన తాము పోవటం కష్టమౌతుంది. నాలుగు చినుకులు ఎక్కువ పడ్డా, వాగులు ఏరులై, ఏరులు సముద్రాలయిపోతాయి.

ఏ క్షేత్రాల్లో మనశ్శాంతి పొందటానికి వెళ్ళారో, ఆ క్షేత్రాల్లోనే మృత్యువును చూశారు.

ఈ వ్యాపారులకు లైసెన్సులిచ్చి, నేడు విషాదాన్ని చూడటానికి ఏరియల్‌ సర్వేలు నిర్వహిస్తున్న ప్రభుత్వాధినేతల వాటాయే ఈ ‘మానవ తప్పిదం’లో ప్రధాన భాగం.

కానీ, అదే ప్రభుత్వం నీడలో వున్న త్రివిధ (సైనిక, నౌకా, వాయు) దళాల సిబ్బంది మాత్రం బాధితులను అక్కున చేర్చుకుని రక్షిస్తోంది. ఇదే అసలు సిసలైన మానవాంశ. చేతులు జోడిద్దామా!!

 న్యూస్‌ బ్రేకులు

‘ప్యాకేజీ’ జోస్యం

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎగ్గొట్టినట్టే. ప్యాకేజీ ప్రకటన ఈ నెల 30 లోపు వస్తుంది.

-కె. చంద్రశేఖర రావు, టీఆర్‌ఎస్‌ అధినేత.

ఇన్నాళ్ళూ తెలంగాణ రాష్ట్రానికి ముహూర్తాలు పెట్టేవారు. ఇప్పుడు ప్యాకేజీలకు కూడా ముహూర్తాలు పెడుతున్నారా చంద్రశేఖర సిధ్ధాంతి గారూ!

సహజ వనరులను ఓ (తన) కుటుంబానికి ధారబోసే అధికారం వైయస్‌ కు ఎవరు ఇచ్చారు?

-సోమిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత.

భలే వారే. సహజ వనరులు, సహజ వారసులకే వెళ్ళాలి కదా! ఏ నేతకయినా అధికారంలో వున్నప్పుడు కుటుంబ సభ్యులకు మించిన సహజ వారసులు వుంటారా?

ట్విట్టోరియల్‌

డకౌట్‌- వాకౌట్‌

టీవీల్లో వచ్చే ఐపిఎల్‌ మ్యాచ్‌లూ, సినిమాలే కాదు, చివరికి అసెంబ్లీ సమావేశాలు కూడా బోరు కొట్టేస్తున్నాయి. అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. ఏ నేత మైకు పట్టుకుంటే ఏది మాట్లాడతారో తెలిసిపోతుంది. ఐపీఎల్‌ లో ఏ ఆటగాడు ఎప్పుడు ‘డకౌట్‌’ అవుతాడో ముందుగా ఎలా తెలిసిపోతుందో, అలాగే అసెంబ్లీలో ఏ సభ్యులు ఎప్పుడు ‘వాకౌట్‌ చేస్తారో ముందుగానే తెలిసి పోతుంది. అంతా ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’, కాకుంటే ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’. ఇంకేమీ చూస్తాం. సెన్సార్‌ వారు తొలగిస్తారని తెలిసి కూడా సినిమాడైలాగుల్లో బూతులు పెట్టినట్లు, రికార్డులనుంచి తొలగిస్తారని తెలిసి కూడా అసభ్యపదజాలాన్ని ప్రయోగిస్తారు. ఎవర్నన్నా తిట్టే టప్పుడు ‘నీ.. డాష్‌, డాష్‌’ అన్నామనుకోండి అది అసలు బూతు కన్నా ముందే అర్థమయిపోయి, మరింత చికాకు వేస్తుంది. కాబట్టి టీవీలు వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వినోద కార్యక్రమాలు ప్రసారం చేసుకోవటం మంచిది.

‘ట్వీట్‌ ఫర్‌ టాట్‌

‘ప్రిజమూ’ ప్రిజనే!

పలు ట్వీట్స్‌: ‘ప్రిజమ్‌’ సాఫ్ట్‌ వేర్‌ తో ఎన్‌ఎస్‌ఎ మన వ్యక్తిగత ‘వెబ్‌’ సమాచారాన్ని పట్టేస్తుందట. ఇది దారుణం

కౌంటర్‌ ట్వీట్‌: ‘జీవితం ప్రిజమ్‌ వంటిది. అది ఏ ఇజానికి లొంగదు’ అని కవి అన్నాడు ఒకప్పుడు. కానీ ఇంపీరియలిజానికి లొంగిపోయింది.

ఈ- తవిక

షటిలర్‌!

తెలంగాణకు

వచ్చి వుండి పోతే

సెటిలర్‌!

వస్తూ, పోతూ వుంటే

షటిలర్‌!!

ఎవరు ఎక్కువ

తీసుకు పోతారో..!?

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య లైంగిక బంధం వుంటే చాలు అది పెళ్ళే అంది ఓ కోర్టు.’

‘రెండు పార్టీల మధ్య మ్యాచ్‌ పిక్సింగ్‌ వుంటే అది పొత్తే- అని ఎప్పుడు తీర్పు చెబుతారో!?’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

ఏ కాంతా లేని తనమే ఏకాంతమనుకునుకున్నాడట, వెనకటికో బ్రహ్మచారి.

-సతీష్‌ చందర్‌

1 comment for “ప్రకృతి బీభత్సం కాదు, వికృత వాణిజ్యం!

  1. చాలా బగు౦ది. ప్రకృతిని మన౦ తప్పు పట్టినా ఆవిడ మన అమ్మలాగే నోరు విప్పదు. ఇదేమిటని అడగదు, తప్పులు ఎదుటవాళ్ళ మీద రుద్దడ౦ మానవ జన్మ హక్కు.

Leave a Reply