ప్రణబ్ ను పిలిచి తిట్టించుకున్నారా..?

కాంగ్రెస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేడు వైరిపక్షాలు. ఎప్పుడూ కలసి లేవు. రెంటి వయసూ ఒకటి కూడా కాదు. స్వరాజ్యానికి ముందు నుంచే కాదు, అసలు స్వరాజ్యమే తాను తెచ్చానని భావించే పార్టీ కాంగ్రెస్‌. కానీ బీజేపీ అన్నది ఎమర్జన్సీ తర్వాత ఏర్పడ్డ జనతాపార్టీ ప్రభుత్వ ప్రయోగం విఫలమయిన తర్వాత మొక్కతొడిగిన పార్టీ బీజేపీ. తారీఖులు, దస్తావేజులతో లెక్క చూస్తే అది నిజమే కానీ, బీజేపీ పుట్టక ముందు కూడా బీజేపీకి మనుగడ వుంది. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపు మేరకు, అన్ని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని పార్టీలు కలసి పోయాయి. పరస్పర విరుధ్ద భావజాలాలున్న పార్టీలు ఏకమయ్యాయి. వామపక్ష వాదులూ, యధాతధ వాదులూ, మధ్యేవాదులూ ఒక గూటిలోకి వచ్చారు. అలా వచ్చిన యధాతధవాదే జనసంఘ్‌. అవును. జనసంఘ్‌ గా వచ్చి జనతాపార్టీలో కలిసి, విడిపోయి భారతీయ జనతా పార్టీ గా ఏర్పడింది. అంటే అంతకు ముందు కూడా బీజేపీకి మనుగడ వుంది. ఇంకా వెనక్కి వెళ్ళితే కూడా జనసంఘ్‌ ఏర్పడ ముందు కూడా వేరే రూపంలో బీజేపీ వుంది. ఎందు కంటే బీజేపీ కేవలం ఒక రాజకీయ వేదిక. కానీ దానికంటూ ఒక సైధ్ధాంతిక వేదిక వుంది. అదే రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌).

ఇప్పుడు దేశంలో వున్నది పేరుకు నరేంద్ర మోడీ పాలన. 20 రాష్ట్రాల్లో వున్నది బీజేపీ పాలన. కానీ తీరులో మాత్రం ఆరెస్సెస్‌ పాలనే. ఈ సంస్థ కొన్ని సార్లు ఇదే దేశంలో నిషేధిత సంస్థ. గాంధీ హత్యానంతరమే కాదు, ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు కూడా ఈ సంస్థపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. కాంగ్రెస్‌ లో వున్న దీ అధిక శాతం హిందువులే. తిలక్‌, గాంధీ, నెహ్రూ… అందరూ హిందువులే. ఆరెస్సెస్‌ వ్యవస్థాపకులూ, సిధ్ధాంతకర్తలూ హిందువులే. హెగ్డేవార్‌, వీర్‌ సావర్కర్‌, గోల్‌వాల్కర్‌- హిందువులే. కానీ ఆ హిందువులకూ, ఈ హిందువులకూ చుక్కెదురు. ‘ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌’ అనీ ‘రామ్‌-రహీమ్‌’ అంటూ ఏ భగవంతుడయినా ఒక్కడే అన్నాడు. ఇలా అన్నందుకు ఏ ఇస్లాం మతస్తుడికి ఎంత కోపం వచ్చిందో తెలీదు కానీ, ఒక హిందువుకు తీవ్రంగా కోపం వచ్చి, ఏకంగా గాంధీని కాల్చి చంపేశాడు. ‘హేరామ్‌’ అని ఆయన ప్రాణాలు విడిచారు. ఈ దేశంలో గాంధీ హిందువే. గాంధీ హంతకుడూ హిందువే. ఇప్పుడు ఇలాంటి విచిత్రాన్ని మన పొరుగుదేశం పాకిస్తాన్‌లోనే కాదు, ఇతర ఇస్లామిక్‌ దేశాల్లో కూడా చూస్తున్నాం. బాంబులు విసిరే ఉగ్రవాదీ ముస్లిమే. బాంబుదాడుల్లో మరణిస్తున్నది ముస్లింలే. తనకు తానే అసలు సిసలైన ముస్లిం ననుకుంటాడు ముస్లిం ఉగ్రవాది. కానీ పలువురు ముస్లింలు వారిని సమర్థించరు.

అప్పుడు గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే కూడా తానే సిసలైన హిందువునని భావించాడు. కానీ కోటానుకోట్ల హిందువులు అతడిని వ్యతిరేకించారు. ఏ హిందూ సంస్థా అతడు తనవాడని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. వీర్‌సావర్కర్‌ ను కలిసేవాడనీ కొందరూ, ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలున్నాయని కొందరూ, ఆయన రచనలకు ప్రభావితుడయ్యాడని కొందరూ విమర్శలు చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. అయితే ఆరెస్సెన్‌ నుంచి ఇతర అన్ని సంస్థలూ వాటిని కొట్టి పారేశాయి. కానీ గాంధీని చంపిన ‘గాడ్సే’ ను కాంగ్రెస్‌ ఇతర సంస్థలు ప్రకటించిన ప్రకటించినట్లుగా ఏనాడూ ఆరెస్సెస్‌ ‘దేశద్రోహి’ గా ప్రకటించ లేదు. దేశాన్ని చీల్చాడని పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసిన మహ్మద్‌ ఆలీ జిన్నాను తిట్టినట్టయినా, కనీసం గాడ్సేను ఏ ఒక్క ఆరెస్సెస్‌ ప్రచారక్‌ తిట్టినట్లు దాఖలాలు లేవు. కానీ, పాకిస్తాన్‌ వెళ్ళి జిన్నాను పొగడి వచ్చినందుకు మాత్రం, బీజేపీ ప్రాణదాత ఎల్‌.కె. అద్వానీకి ఇదే ఆరెస్సెస్‌ రేవు పెట్టేసింది. అది అలా వుంచితే, గాడ్సే విగ్రహం చేయించి, ఆ మధ్య ఏకంగా గుడి కట్టేంత వరకూ వచ్చేశాడు ఈ దేశంలో ఓ పెద్దమనిషి. అతణ్ని ఎగబడి తిట్టిన వారిలో ఆరెస్సెస్‌ ప్రముఖులెవ్వరూ లేరు. కాంగ్రెస్‌ మాత్రం పూర్తిగా అతడి మీద విరుచుకు పడింది.

అందుకే ఇవాళ కాంగ్రెస్‌కూ, బీజేపీకీ వున్న దూరం కన్నా, కాంగ్రెస్‌కూ, ఆరెస్సెస్‌కూ వున్న వైరం పెద్దది. అలాంటి ఆరెస్సెస్‌ తృతీయ శిక్షా వర్గ్‌ ఉత్సవానికి కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా వుండి, రాష్ట్రపతి అయిన ప్రణబ్‌ ముఖర్జీ హాజరు అవుతున్నారంటే అంత హడావిడి జరిగింది. ఆయన శుక్రవారం( 8 జూన్‌) నాడు తన ఉపన్యాసం ఇచ్చేటంత వరకూ కాంగ్రెస్‌ వర్గాలు ఊపిరి బిగబట్టి ఎదురు చూశాయి.. ఏం మాట్లాడతారో అని.

హాజరు కావటం వరకూ ఉత్కంఠ రేపినా, ఆరెస్సెస్‌ కు ఏది చెప్పి రావాలో, ప్రణబ్‌ అదే చెప్పి వచ్చారని కాంగ్రెస్‌ ప్రముఖులు మెల్ల, మెల్లగా పెదవి విప్పటం మొదలు పెట్టారు. ఇతర మతస్తులు లేని, ఒక వేళ వున్నా వారి ప్రమేయం లేని హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యటం ‘జాతీయ వాదం’ కాదని ఆయన చెప్పకనే చెప్పారు. ‘రాజ్యాంగ బధ్ధ జాతీయ వాదం’ కావాలన్నారు. అన్ని మత విశ్వాసాలకూ సమస్థాయిలో చోటు కల్పించే ‘సెక్యులరిజం’ గురించి మాట్లాడారు. ద్వేషంతో మహిళల మీదా, పసిపిల్లల మీదా అత్యాచారాలను చేసి ద్వేషాన్ని ఎవరూ ప్రోత్సహించ కూడదన్నారు.

‘ఉన్నావ్‌’ లో తన కూతురు పై సామూహక అత్యాచారం జరిపారని ఫిర్యాదు చెయ్యటాని వెళ్ళిన వ్యక్తిని బీజేపీ కి చెందిన ప్రజాప్రతినిధి పోలీస్‌ స్టేషన్లో కొట్టి చంపటాన్ని కానీ, కతువాలో ఎనిమిదేళ్ల ఆసిఫా మీద, హిందూ దేవాలయంలో మత విద్వేషంతో అత్యాచారం చెయ్యటం కానీ దేశాన్ని ఎంత కుదిపేశాయో ప్రణబ్‌ ను కూడా అంతే ఇబ్బందికి గురిచేశాయని ఆయన ఉపన్యాసం ద్వారా అర్థమవుతుంది. దాద్రాలో గోహత్యకు పాల్పడ్డడాన్న అనుమానంతో (నిజంకాదు) అఖ్లాక్‌ అనే ముస్లింను కొట్టి చంపే భావజాలాన్ని కానీ, ఊనాలో గోవును చంపటానికి తీసుకు పోతున్నారని దళిత యువకుల్ని దుస్తులు విప్పేసి ఈడ్చుకు వెళ్ళిన ఉన్మాదాన్ని కానీ ఎవరూ ప్రోత్సహించ కూడదని ఎవరోఒకరు ఎలుగెత్తి చెబితే బాగుండునని అనుకుంటున్న తరుణంలో.. పేర్లూ, ఊర్లు ప్రస్తావించకుండా సరయిన సందేశమే ప్రణబ్‌ ఇవ్వగలిగారు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)

1 comment for “ప్రణబ్ ను పిలిచి తిట్టించుకున్నారా..?

Leave a Reply