‘ప్రారంభం’ మీ వంతు! ప్రయాణం నవల వంతు!

photo by: kishen chandar

photo by: kishen chandar

ఆవిడొస్తే, ఈవిడ వుండదు!

అమ్మకానికో టైటిల్‌ కాదు. నమ్మకానికో నానుడి. వీళ్ళిద్దర్నీ కేవలంతోడికోడళ్ళనుకునేరు. తోబుట్టువులు కూడా. ఒకావిడ లక్ష్మి, ఇంకొకావిడ సరస్వతి. వీళ్ళద్దరికీ పడిచావదంటారు. తప్పు. చచ్చినట్టుపడాలి. సరస్వతి అంటే చదువే కదా! మరి పెళ్ళినాడు వచ్చి సొమ్ములు మాత్రం ‘చదివింపులు’ కావా? ఆలోచిస్తే సగం నమ్మకాలు ‘చెవిలో పువ్వులే’. ఆమాట కొస్తే ‘చెవిలో పువ్వూ’ ఒక నమ్మకమే.

చక్రం తిప్పటం చదువు. దాంతో ‘యంత్రి’ంచటం( మంత్రించటం కాదు సుమా!) ఉత్పత్తి.సాధన కష్టమనీ, ఫలితం ఇష్టమనీ ‘సుఖపడి చచ్చే’ చిన్ని చిన్ని బుర్రలు అనుకోవటం వల్ల సరస్వతినీ, లక్ష్మినీ వేరు చేసేశారు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అని లక్ష్మీ దేవిని మాత్రమే గదుల్లో బంధించేశారు.

లక్ష్మీ, సరస్వతుల్లాంటి తోబుట్టువులే మరో ఇద్దరున్నారు. వాళ్ళే రూపవతి, సారమతులు. ఇక్కడా అంతే. ‘ఏవండోయ్‌! ఆవిడొచ్చింద’ని సృష్టికర్త కు చెప్పి, ఈవిడ చల్లగా జారుకుంటుంది. దాంతో సృష్టికర్త ఎవరో ఒకరినే నమ్ముకోవాలి. రూపం వుంటే సారం వుండదు, సారముంటే రూపం వుండదు. నేలబారుగా చెప్పాలంటే, ‘బిల్డప్‌’ వుంటే విషయం వుండదు. విషయం వుంటే ‘బిల్డప్‌’ వుండదు. దాంతో సృష్టి కర్త అనబడే రచయిత ఏం చేస్తాడు? ఎవరో ఒకరితోనే సెటిలయపోతాడు. అయితే రూపవతీ, లేకపోతే సారమతి.

వెంటనే పేరూ, డబ్బూ, దస్కం- కావాలనుకున్నవాడు రూపవతిని చేరదీస్తాడు. సహజత్వం, శాశ్వతత్వం, సార్వజనీనత-ఇలాంటివేవో వెతుక్కునే వాడు సారమతిని వరిస్తాడు. క్రైం, థ్రిల్లర్‌, సస్పెన్స్‌, డిటెక్టివ్‌, క్షుద్ర, సెక్సు నవలల్లో వుండే స్టయిలే వేరు. వందల పేజీలు వున్నా… అలా, అలా క్షణల్లో అయిపోతాయి. ఆ వాక్యాల్లే వుండే వేగమే వేరు. ఆ ట్విస్ట్‌లూ, ఆ పంచ్‌లూ…వామ్మో ..!వెర్రెత్తించేస్తాయి. రూపం అంటే అది. విషయం పాతదే కావచ్చు. వేరే రచనల్లోంచి కొట్టుకొచ్చిందే కావచ్చు. వేల, లక్షల కాపీలు అమ్ముడుపోయే ‘బెస్ట్‌ సెల్లర్స్‌’ ఇవే. అంతా రూపవతి మహిమ!

దరిద్రం, ఆకలి, దగా, వంచన, కన్నీళ్ళూ, పీడన- ఈ అంశాలతో వుండే నవలల్ని చూడండి. అంతా సారమే. అంతా యధార్థజీవితమే. కానీ, చదువుతుంటే పేజీలు కదలవు. అవార్డు కోసం మాత్రమే తీసిన డాక్యుమెంటరీ సినిమాల్లాగా, ‘నంది’ బహుమతుల కోసమే ఆడిన నాటకాల్లాగా- ఏ మెరుపూ కనపడకుండా, ఏ విరుపూ వినపడకుండా- సాగుతుంటాయి. ఒక్కోపేజీ చదవటానికి ఒక్కో యుగం పడుతున్నట్లనిపిస్తుంది. అయినా, అతి కొద్దిమంది పాఠకులు జీవితం మీద వుండే మమకారంతో చెమటోడ్చి, నిద్రకాచి మరీ చదువుతారు. ఇదీ సారమితి ప్రభావం.

సాహిత్యంలోని ఈ రెండు స్రవంతులను చూసే, రూపాన్నీ- సారాన్నీ కలపటం కష్టమని తెంపు చేసుకుని అటురచయితలూ, ఇటు పాఠకులూ గిరులు గీసుకుని కూర్చున్నారు. కానీ హద్దులు మీరే, గీతలు చెరిపే తుంటరి ఎప్పుడోకప్పుడు రాకుండా పోతాడా? ఎప్పుడోకప్పుడు కాదు ఎప్పటికప్పుడు ఈ తుంటరులు పుడుతూనే వున్నారు. అలాంటి తుంటరుల్లో పెద్ద తుంటరి చలం. ‘మీ ఇద్దరూ ఎలా కొట్టుకు చస్తారో చూస్తాను’ అని చెప్పి రూపాన్నీ, సారాన్నీ కలిపి పారేశాడు- గదిలో కాదు- ‘మైదానం'(ఆయన నవల పేరు లెండి)లో. పురుషుడి కళ్ళతోస్త్రీని చూడటమే-సెక్సూ, శృంగారం, ప్రేమా- అని రాసుకుంటూ రచయితలు విర్రవీగుతున్న రోజులవి. ఆ భావనను తిరగేసి, అంతకు మించి వెర్రెత్తించే శైలితో(రూపం) నవలల్ని, కధల్నీ దేశం మీదకు వదిలారు. జనాకర్షకం(పాపులర్‌)గానూ వుంది. జనహితం(ఆబ్జెక్టివ్‌)గానూ వుంది. అలా తుంటరి రచయితలొచ్చినప్పుడల్లా రూపం-సారం ఏకమవుతూ వుంటాయి. నవలల్లో అలా చేసింది రావిశాస్త్రి కావచ్చు, బీనాదేవి కావచ్చు, వడ్డెర చండీదాస్‌ కావచ్చు, ఇంకెవరయినా కావచ్చు. అందరూ తుంటరులే. ఇంకో విషయం. తుంటరులెప్పుడూ ఒంటరులే, ఏటికి ఎదురెళ్ళే ఈతగాళ్ళే. ఇప్పటికీ అలాంటి తుంటరులున్నారు. అందులో ఒకరు పి.వి.సునీల్‌ కుమార్‌.

ఆయనకీ ఒక దురలవాటుంది. తిన్నగా మాట్లాడరు. రాసినా అంతే. వాచ్యంగా ఒక్క వాక్యమూసాగదు. ‘రాంభొట్ల వారి అమ్మాయి జాణ’ అని ఆయనదగ్గర అని చూడండి. ‘పోదురూ. అంత పొట్టిగా వుంటుందా? మరీ జానేనా? మూరెడయినా వుండదా?’ అని అనెయ్యగలరు.ఎక్కువ ఆలోచించిన వారికి అమాయకత్వంలాగానూ, అవసరమయినంత ఆలోచించిన వారికి వ్యంగ్యంలాగానూ అనిపిస్తుంది. చిత్రమేమిటంటే, అదే ఆయన శైలి అయి కూర్చుంది.

లక్ష్మీ సరస్వతులు కలవరన్న నోటితోనే, రూప-సారాలను వేర్వేరుగా చూసే కళ్ళతోనే,మంచినీ, తెలివినీ వేరు చెయ్యటం చూస్తూనే వుంటాం. చూడటమేమిటి? రచయితలు తమ పాత్రల్నికూడా అలా వేర్వేరుగానే సృష్టిస్తారు.

అమాయకుడయిన హీరో వుంటాడు కానీ, తింగరి విలన్‌ వుంటాడా? కమర్షియల్‌ సినిమాల్లోనూ,పాపులర్‌ నవలల్లోనూ వుండక పోవచ్చు. కానీ జీవితంలో వుంటారు. మంచివాడు అమాయకంగానూ, చెడ్డవాడు జిత్తులమారి(తెలివయిన వాడు)గానూ వుంటాడన్నస్థిరాభిప్రాయాన్ని ఎందుకో మనకి కలగచేసేశారు. కానీ సునీల్‌ కుమార్‌ ‘ప్రారంభం’లో ఈ సూత్రీకరణను భగ్నం చేసే మూడు పాత్రల్ని ప్రవేశ పెట్టారు.మొదటి వాడు: తింగర విలన్‌ .పేరు రాజేంద్ర. వీడికి చెరువంత ఆశ. కానీ ఏం లాభం? ఊరంత నోరు. బయిట పడిపోతూనే వుంటాడు. ఇలాంటి విలన్ని పెట్టుకుని కూడా సస్పెన్స్‌ చివరి వరకూ కాపాడుకొస్తాడు రచయిత. రెండవ వాడు: జిత్తుల హీరో. పేరు సుధాకర్‌. పాములతో చెలిమి చేస్తునే పడగల మీద కొడుతుంటాడు. ఈ పాత్ర చిత్రమయినదంటే, తన జిత్తులతో రచయితకే టోకరా వేసి, కథను తన వెంట పట్టుకు పోగలడు. మూడవ వాడు: పేరు రామం. నిజంగానే మీలోనూ, నాలోనూ వుండే మూడో మనిషి ఇతడు. భయాలూ, ప్రియాలూ; బలాలూ, బలహీనతలూ; అభిరుచులూ, ఏవగింపులూ- అన్నీ ఏకకాలంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఎంత తెలివయినవాడో, అంత తెలివి తక్కువ వాడు. ఇతడే నవలలో రచయిత ప్రతినిథి(ప్రాటగానిస్ట్‌) రామం కూడా తనను తాను నాయకుడిగా భావించడు. తనకోనాయకుడుంటే (ఆల్టర్‌ ఇగో) వుంటే బాగుండుననుకుంటాడు. ఆ స్థానంలో సుధాకర్‌ను పెట్టుకుంటాడు.

ఆడపిల్లల జీవితాల్లోకి వీళ్ళూ, వీళ్ళ జీవితాల్లోకి అవకాశాలు వచ్చి పోతున్నప్పుడు- ఎవరు ఎలాస్వీకరిస్తారో తెల్పటమూ, దాంతో వారి వారి మనస్తత్వాలనూ, ఆ మనస్తత్వాలకు ఆధారభూతమైన ఆర్థిక,సాంఘిక సంబంధాలను విప్పి చెప్పటమూ ఈ నవల లక్ష్యం. ‘నేను బెజవాడ వెళ్ళాలి. నాప్రేయసిని చూడాలి ‘ అది నాలక్ష్యం. ‘రైలు మీద వెళ్ళితే అయిదారు గంటలు పడుతుంది.’ ఇలా అనుకుంటే డీలా పడిపోతాను. ‘ఎంచక్కా అయిదారుగంటలు, రైల్లో కిటికీ పక్కన కూర్చొని, మ్యూజిక్‌ వింటూ, పల్లీలు తింటూ,పక్కవాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ గడపొచ్చు’. ఇలా అయితే లక్ష్యం ఎంత గొప్పగా వుందో, లక్ష్యాన్ని చేరే ప్రయాణం అంతే గొప్పగా వుంటుంది.

ఈ నవలలో మొదటి వాక్యం చదవండి, రైలెక్కినట్టే. ముందే చెబుతున్నాను. బెజవాడొచ్చినా మీరు రైలు దిగరు- మీకిష్టమైన వాళ్లు స్టేషన్‌కొచ్చి మిమ్మల్ని దించే దాకా. శుభ్‌ యాత్ర! హేపీ జర్నీ!!

సుఖ ప్రయాణ ప్రాప్తి రస్తు!!!

 -సతీష్‌ చందర్‌

(5జనవరి 2014నాడు  విడుదలయిన పి.వి.సునీల్ కుమార్ నవల ‘ప్రారంభం’ లో ప్రచురితమైన సతీష్ చందర్ ముందుమాట)

Leave a Reply