రాజకీయం ఖరీదయి పోయింది!
బహుశా ఈ మాట అనని పాలిటిష్యన్ వుండడు. ఎన్నికల బరిలోకి వచ్చాక అనకుండా వుండటం సాధ్యం కాదు.
కొనాలి. టిక్కెట్టు మాట దేవుడెరుగు. ముందు జనాన్ని కొనాలి. వోటు వెయ్యటానికి మాత్రమే జనమనుకుంటారు. కానీ ‘ఈ సారి పోటీ చేస్తే ఎలా వుంటుందీ’ అని ఆలోచన వచ్చిన నాటి నుంచీ జనం తో పని వుంటుంది.
ఆలోచన రాగానే, ‘సలహా’ తీసుకోవటానికి, నాలుగయిదు ‘సిట్టింగు’లు అవసరమవుతాయి. సిట్టింగు అంటేనే ‘మందీ’ వుండాలి, ‘మందూ’ వుండాలి. ఈ మంది ఎంతయినా వుండవచ్చు. పదిమంది కావచ్చు, ఇరవయి మంది కావచ్చు. ఇలా ‘సిట్టింగు’లో కూర్చున్న వారే తొలి అనుచరవర్గమన్న మాట.
పేరుకు ‘సలహా’ అంటాడు కానీ, అతడు అడిగేది ‘వోటే’ . హమ్మమ్మ! బూతులోకి వెళ్ళి ‘ఈవీఎం’ నొక్కి వేసే వోటు కాదు. రెండు పెగ్గులు బిగించాక ‘యస్. నువ్వు రాజకీయాల్లోకి దిగాలన్నా…!’ అంటాడే అదీ వోటు. పోయినోడు మంచోడు .. అంటారు. ఇది అచ్చు తప్పు అయివుంటుంది. ‘పోయించినోడు’ మంచోడు. ఇదీ కరెక్టు. ‘మంచోడు’ రాజకీయాల్లోకి రాక పోతే ఎలా? ‘సిట్టింగు’లో అనుచరులు ‘నువ్వు రాక పోతే నా మీద ఒట్టే’ అనేంత వరకూ వెళ్ళిపోతారు.
ఇక ఆ రోజు నుంచీ అనుచర బృందం తో వెళ్ళి, నియోజకవర్గంలో కార్యకర్తల్ని వెతుక్కుంటారు. నేత తలచుకోవాలి కానీ, కార్యకర్తల్ని ‘కాంట్రాక్టు కార్మికుల’ ను నియమించుకున్నంత సులభంగా తీసుకోవచ్చు. అయితే వీరికి రోజు కూలి తప్పని సరి. కానీ, కేవలం కూలి ఇస్తే సరిపోదు. ‘బీబీ’ కూడా ఇవ్వాలి. అపార్థం చేసుకోకండి. బీబీ- అంటే బీరు బిర్యానీ. ఏ రోజు ఇవ్వక పోతే, ఆ మరుసటి రోజు కార్యకర్త కనిపించడు. ఆ ఒక్కరోజూ ప్రత్యర్థి కార్యకర్తగా వున్నా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఇప్పుడు సదరు ‘ఆశావహుడి’కి అనుచరులూ వచ్చారు. కార్యకర్తలూ వచ్చారు. ఇప్పుడు పార్టీ టికెట్టు కావాలి. ముందు జిల్లాలో చక్రం తిప్పే పార్టీ నేత దగ్గరకు వెళ్ళాలి. ఉత్తినే వెళ్ళితే ఆయన గుర్తిస్తాడా? జనంతో వెళ్ళాలి. ‘సిట్టింగు’ అనుచరులూ, ‘బీబీ’ కార్యకర్తలు మాత్రమే సరిపోరు. జనం కావాలి. లారీలు కావాలి. జనం ఉత్తినే రారు. కూలితో పాటు, కనీసం మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి. ఈ మాత్రం ఇస్తే వచ్చి నిలబడతారు. కానీ నినాదాలు ఇవ్వరు. అందుకు ‘చైతన్యం’ అవసరం. ఎంత ‘చైతన్యం’ కావాలి అంటే అంత ‘చైతన్యమే’ ఇవ్వవచ్చు. పావు చైతన్యం కావాలంటే, ‘క్వార్టర్’ ఇవ్వవచ్చు, అర చైతన్యం కావాలంటే ‘హాఫ్’ ఇవ్వవచ్చు. భూత వైద్యులు దయ్యాల్ని సీసాల్లో బంధించి వుంచినట్లు , మద్యం వ్యాపారులు కూడా ‘చైతన్యాన్ని’ సీసాల్లోనే బంధించి వుంచుతారు. ఇలాంటప్పుడే వాటి ‘మూత’లు విప్పుతారు. అప్పుడు చూడాలి జనాలు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలిస్తారు. ‘అన్న ఎందులో దూక మంటే అందులో దూకుతాం’ అని జిల్లా నేత ముందు ప్రతినలు చేస్తారు.
జిల్లా నేత సంతృప్తి చెంది ‘సరే పార్టీ నేత రోడ్డు షో చేస్తాడు. నువ్వు చెప్పినప్పుడు ఇదే జనాన్ని వేసుకుని రా. ఆయన దృష్టిలో పడవచ్చు’ అని సలహా ఇస్తారు.
‘ఆశావహుడు’ ఆలాగేనని చెప్పి, పార్టీ నేత వచ్చినప్పుడు లారీల సంఖ్య పెంచి, ‘చైతన్యాన్ని’ కూడా జనాన్ని తీసుకు వస్తాడు. ‘అఫ్ కోర్స్. ఈ జనాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని జిల్లా నేత, పార్టీ నేత దగ్గర బిల్డప్ ‘ ఇచ్చుకుంటాడు.
ఇక టికెట్టు విషయం వస్తుంది. తీరా, ‘సిట్టింగు’ అనుచరుల్నీ, ‘బీబీ’ కార్యకర్తల్ని ‘చైతన్యం’ గలిగిన జనాన్ని వేసుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళే సరికి అక్కడ ‘హౌస్ ఫుల్’ బోర్డు పెట్టి వుంటుంది. అలా పెట్టినంత మాత్రాన టిక్కెట్లు అయిపోయినట్టు కాదు. ‘టిక్కెట్లను బ్లాకులో పొందవచ్చనే సూచన’. మామూలు ధర రు. 20 కోట్లయితే, ఓ రు.30 కోట్లిచ్చి కొనుక్కోవచ్చు.
సినిమా హాలు వరకూ వచ్చేశాక, సినిమా చూడకుండా వెళ్తాడా? పార్టీ ఆఫీసు వరకూ వచ్చాక టిక్కెట్టు లేకుండా వెళ్తాడా? బ్లాకులో కొనుక్కుని మరీ వెళ్తాడు.
ఇప్పుడు ప్రచారం హోరెత్తించాలి. అంటే మళ్ళీ జనం కావాలి. పార్టీ అధినేత ప్రచారానికి వచ్చినప్పుడు ‘చైతన్యాన్ని’ పెంచయినా సరే జనాన్ని తీసుకురావాలి. సొంత ప్రచారంలో జనం వుండాలి.
ఇక ఎన్నికల తేదీ రానే వస్తుంది.
అప్పుడు వెంట తిరిగే జనం కాకుండా, ఇంటి దగ్గర వుండే జనంతో కూడా పనిపడుతుంది. అక్కడ మాత్రం వోటు ధర మార్కెట్లో ఎంత పలికితే అంత చెల్లించాలి. ఒక్కొక్క సారి, పార్టీ గాలి ఎక్కువ వుంటే వెయ్యికి బదులు అయిదు వందలివ్వవచ్చు. కాబట్టి మర్యాదగా మార్కెట్ ధరను చాలా జాగ్రత్తగా చెల్లించాలి.
ఇలా ఎన్నికలంటేనే జనం. జనమంటేనే ధనం.
కానీ, ఎవ్వడో, ఎప్పుడో ఓ కొంటె వాడు బయిల్దేరతాడు. ఈ మొత్తం నాటకాన్ని ‘రూపాయి’ ఖర్చులేకుండా నడిపించేస్తాడు. వాడే అసలు సిసలయిన నాయకుడు. ఇలాంటి వాడు కనిపించినప్పుడు, జనం సొంత ఖర్చుల మీద వెళ్ళి వోటు వేసి వస్తారు ఇదే జనం. తేడా జనం లో లేదు, నేతలో వుంది.
-సతీష్ చందర్
(ఆంద్రభూమి దిన పత్రికలో ప్రచురితం)
అవును. జనం లో తేడా రాదు…….నేతలకే అన్నీ చచ్చుబడతాయి…..త్వరలో!