ప్రేమగా కలిస్తే.. ‘పరువు’గా చావాలా..?

మూడు ప్రేమలు. మూడు పరువులు. మూడు దాడులు. మూడూ తెలంగాణ రాష్ట్రంలోనే. మూడూ దేశవ్యాపిత సంచలనాలే. చిత్రం. మూడు చోట్లా ప్రియుళ్ళు దళితులు. ప్రియురాళ్ళు ‘ఇతర’ కులస్తులు. అన్ని కథలకూ ముగింపు ఒక్కటే: నెత్తురు కళ్ళ చూడటం. తొలిఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. మిగిలిన రెండు ఘటనలూ గత వారం రోజుల్లో జరిగాయి. మూడు స్థలాలు ‘పరువు దాడుల’కు సాక్ష్యాలుగా నిలిచాయి. ఒకటి: మంథని, రెండు: మిర్యాలగూడ మూడు: ఎర్రగడ్డ.

మంథని ఘటనలో మధుకర్‌ అనే దళిత (మాదిగ) యువకుడు, మున్నూరు కాపు కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. మధుకర్‌ని అమ్మాయి తండ్రి, బంధువులు బెదరించారు. ఆ అమ్మాయికి తమ సొంత కులం(మున్నూరు కాపు)లో సంబంధాలు చూస్తుంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటానన్నది. సీన్‌ కట్‌ చేస్తే, (14 మార్చి 2017నాటికి) మధుకర్‌ తోటలో శవమై పడివున్నాడు. అతని మర్మాంగాన్ని కోసి కారం పెట్టి చంపినట్లుగా ధ్రువపరచటానికి వీలున్న ఫోటోలను అప్పట్లో మధుకర్‌ తల్లిదండ్రులు, సోదరులూ పోలీసులకు అంద చేశారు. పాతి పెట్టిన శవాన్ని మళ్ళీవెలికి తీసి ‘రీ పోస్ట్‌మార్టెమ్‌’ కూడా చేశారు. తొలుత ఆత్మహత్యగానూ, తర్వాత అనుమానాస్పద మృతిగానూ దర్యాప్తు అధికారులు గుర్తించినా, ఇది ‘ముమ్మాటికీ హత్యే’నని వివిధ ప్రజా సంఘాలు గొంతెత్తి అరిచాయి.

ఏడాది దాటి పోయింది. వారం క్రితం (14 సెప్టెంబరు 2018న) మిర్యాలగూడలో పెరమాళ్ళ ప్రణయ్‌ కుమార్‌ అనే యువకుడిని ‘పరువు’ పేరు మీద హత్య చేశారు. ఇతడు వైశ్య కులానికి చెందిన అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. తన ఇంటి వద్దే కాపురం పెట్టి ఎనిమిది నెలలు అయ్యింది.ప్రణయ్‌ మీద దాడి జరిగేసరికి, ఆమె ఆరు నెలల గర్భవతి. ఆమెను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువచ్చినప్పడు, తన తండ్రి మారుతీ రావు పథకం పన్ని కిరాయి హంతకుడితో నరికించేశాడు. ఇదో పెద్ద సంచలనం.

ఇంకా ఈ పరిణామాన్ని నాగరీక సమాజం జీర్ణించుకోక ముందే, అయిదు రోజుల్లో(19 సెప్టెంబరు 2018న) ఎర్రగడ్డలో ఇంతే క్రూరమైన దాడి జరిగింది. దళిత(మాల) కులస్తుడైన సందీప్‌, విశ్వబ్రాహ్మణ (కంసాలి) కులానికి చెందిన మాధవిని ప్రేమించాడు. వీళ్ళిద్దరూ ఇలాగే పెళ్ళి చేసుకున్నారు. సందీప్‌ ఇంటికి మాధవి వెళ్ళి పోయింది. అందుకు ఆమె తండ్రి నరసింహాచారి అవమానంగా భావించాడు. ‘పరువు’ పోయిందనుకున్నాడు. కొన్ని రాజులు ఆగి, ‘బిడ్డా నిన్ను చూడాలని వుందిరా’ అని మాధవిని నమ్మించాడు. మాధవి, సందీప్‌లు బయిటకు వచ్చాక నడి రోడ్డు మీద కొడవలితో ఇద్దరి మీద దాడి చేశాడు. మాధవి మీద వేటు వేసి, అడ్డు వచ్చిన మాధవిని విచక్షణా రహితంగా నరికాడు. ఆమె దాదాపు చెయ్యి దాదాపు విరిగి వేలాడింది. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మూడింటినీ ‘పరువు’ హత్యలు అంటున్నారు. ఈ మాట తెలుగు నాట వినటం, మరీ ముఖ్యంగా తెలంగాణ నాట వినటం ఈ మధ్యనే. ఇంతవరకూ ముందు పరువు హత్యలంటే, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి చోట్ల మాత్రమే జరగుతాయని తెలుసు. అక్కడ పెద్దగా చదువులేని గ్రామ పెద్దలు ‘కాప్‌ పంచాయితీ’లు నిర్వహించి, ఇలా కులం దాటి, వంశాచారాలను దాటి పెళ్ళిళ్ళు చేసుకుంటే ‘చంపాలని నిర్ణయిస్తారు’ . దంపతులిద్దరనీ నరికి చంపేస్తారు. ఒక్కొక్క సారి ఈ హత్యా కార్యక్రమాన్ని, అమ్మాయి తండ్రే స్వహస్తాలతో నిర్వహిస్తాడు. కానీ ఈ తరహా హత్యలు దక్షిణాది రాష్ట్రాలలో అరుదు. అయితే దళిత కులస్తుల పై దాడులన్నవి అన్ని దేశం నలుమూలలా జరిగేవి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసివున్నప్పుడు, కోస్తాఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువగా దాడులు జరుగుతుండేవి, దేశవ్యాపితంగా అట్టుడికిపోయిన కారంచేడు, చుండూరు దాడులు ఈ ప్రాంతంలోనే 1980, 90దశకాల్లో జరిగాయి. అలాగే, అర్ధదశాబ్దం క్రితం ఉత్తరాంధ్ర లోని లక్ష్మీ పేటలో కూడా దాడులు జరిగాయి. ఇవి కమ్మ, రెడ్డి, కాపు కులాల్లోని కేవలం భూస్వామ్య వర్గాలు మాత్రమే దాడి చేశాయి. కర్నూలు జిల్లాలోని వేంపెంటలో కూడా దళితుల మీద ఈ తరహా దాడులు జరిగిన నేపథ్యం. కానీ తెలంగాణ ప్రాంతంలో జరగలేదు.

కానీ ఇప్పుడు ‘పరువు’ పేరిట దళితుల మీద కోపం తో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆప్పుడు ఆంధ్రలో జరిగినవి మూకుమ్మడి దాడులు. డజన్ల సంఖ్యలో దళితులను ఊచకోత కోశారు. కానీ ఇప్పుడలా కాదు. వ్యక్తి మీద, లేదా జంట మీద జరుపుతున్నారు.

అప్పట్లో ఆంధ్రలో దళితుల మీద దాడులు జరపటానికి కారణం, దళితులు చదువుకుని శిరసెత్తి జీవించటం. పల్లెల్లో చదువుకున్న దళితులను చూస్తే, పట్టణాలు వెళ్ళిపోగా వుండి పోయిన ‘అగ్రవర్ణ’ భూస్వాముల్లోని ‘డాప్‌ అవుట్స్‌’ (చదువు మధ్యలో నిలిపివేసినవారి)కి కోపం వచ్చి దాడి చేసేవారు.

మరి తెలంగాణలో ఈ ‘పరువు దాడుల’ను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ శ్రమను విశ్లేషకులకు ఇవ్వకుండానే, పోలీసులూ, కొందరు మీడియా ప్రతినిథులూ, తమ ‘ముందస్తు’ అభిప్రాయాలను వెలిబుచ్చేస్తున్నారు. ఈ దాడులకు పాల్పడ్డ అమ్మాయి తండ్రులు( మిర్యాల గూడ లో మారుతీ రావు, ఎర్రగడ్డలో మనోహరాచారిలు) తమ కూతుళ్ళను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, గొప్పగా చదివించుకుంటున్నారనీ, అలాంటి వాళ్ళకు ‘చదువుల్లేని’ ‘ఆర్థిక స్థోమత’ లేని భర్తలు రావటం జీవించుకోలేకే ఈ పని చేస్తున్నారనే నిర్ధారణలు చేస్తున్నారు. సరిగా చూస్తే అమృత ఎంత చదివిందో, ప్రణయ్‌ అంతే చదివాడు, మాధవి ఎంత చదివిందో, సందీప్‌ అంతే చదివాడు. అంతే కాదు, ఇద్దరూ కుర్రాళ్ళూ తమ ఆర్జన తాము చేసుకోగలిగన వాళ్ళే. కాబట్టి ఈ తండ్రులు దృష్టిలో ‘పరువు’ అంటే తాము అత్యంత ‘హీనంగా’ చూసే కులవ్వవస్థలో చివరి అంచున వున్న ఎస్సీలను భర్తలుగా స్వీకరించటమే.

సభ్యసమాజంలో పరువు పోవటం అంటే వేరే అర్థం కదా? నీతి బాహ్యంగా జీవించటమో, దోపిడీలూ, మోసాలూ, కబ్జాలూ చెయ్యటమో ‘పరువు తక్కువ’ పని. అలాంటప్పుడు అమృత తండ్రి మారుతీ రావునే తీసుకోండి. అతని మీద ఇలాంటి అభియోగాలన్నీ వున్నాయి. అలాంటి వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు, బంధుత్వం కలుపుకునే టప్పుడూ తమ పరువు పోతుందని మర్యాదస్తులెవరయినా భావించాలి. కానీ అతనికే ‘పరువు పోవటమేమిటి? తమ కష్టార్జితం మీద తాము జీవిస్తూ, నిజాయితీగా జీవించేవారి వద్దకు తమ అమ్మాయివెళ్ళిందని అతను ‘గింజుకోవటమేమిటి?’ పరువు అంటే నీతి కాదూ- కులం- అని చెప్పటానికి ముద్దాయిలు ఎలాగూ వెనకాడరు. వారితో (కొందరు) పోలీసులూ, (కొన్ని) మాధ్యమాలూ గొంతుకలపటం సబబేనా..?

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్రలో ప్రచురితం)

3 comments for “ప్రేమగా కలిస్తే.. ‘పరువు’గా చావాలా..?

  1. We can not blame anybody for this. The moment child is born this society is telling about his religion and caste. Why dont we fight for removal of caste and religion column on the first day of joininng in the school.?

Leave a Reply