పరమహంస చచ్చిపోయాడు.
కానిస్టేబుల్ పరమహంస దీనాతి దీనంగా, ఘోరాతి ఘోరంగా, హీనాతి హీనంగా పోయాడు.
అత్యంత చౌకబారుగా, అడుక్కునే వాడి చేతిలో అర్థరాత్రి అసువులు బాపాడు.
ఫుట్ పాత్ మీద ఆడ్డంగా బోర్లాపడివుంది శవం.
టాటాసుమో ఇంకా ఆగకుండానే దూకి వచ్చాడు డీసీపీ తాండవ్. గౌరవసూచకంగా తన ‘టోపీ’
తియ్యబోయాడు.
దాని మీద వున్న మూడు సింహాలూ గర్జించటం మాని, ముక్తకంఠంతో ‘మ్యావ’్ మన్నట్లు
అనిపించింది
‘ఛీ…ఛీ…’ అనుకుని మళ్ళీ తల మీద పెట్టేసుకున్నాడు.
‘ముఖం చూస్తారా సార్! గుర్తు పట్టకుండా నుజ్జునుజ్జు చేశాడు సార్’ ,వెంట ఆయనకన్నా
ముందుగా దూకి ఎదురుగా నిలబడ్డ ఒక ఇన్స్పెక్టర్ చెప్పాడు.
‘రాయి సార్… మామూలు బండ రాయితో చంపేశాడు.’ ఇంకొక ఇన్సెక్టర్ చెప్పాడు.
అసహనంతో, కోపంతో ఉడుక్కుంటున్న డీసీపీ తాండవ్ అలవాటు ప్రకారం కుడిచేత్తో మీసాలు
మెలివేసి…. ‘పోయింది పోలీసు పరువే’నని స్ఫురణ కొచ్చి సాపు చేసేశాడు.
అప్పటికే పది మంది కానిస్టేబుళ్ళు బిచ్చగాణ్ణి ఉతికేసి, ఆరేసే స్థలం కోసం ఎదురు
చూస్తున్నారు.
బిచ్చగాడు నడవలేక పోతున్నాడు. కానీ నవ్వగలగుతున్నాడు.
డీసీపీ వాడి మీదకి ఉరక బోయాడు… కానీ తమాయించుకున్నాడు. దర్యాప్తు కు వాడి నవ్వు
కూడా పనికొచ్చేలా వుంది.
విద్యుద్దీపం వెలుగులో, కాళ్ళ దగ్గర బిచ్చగాడినీ, ఫుట్ పాత్ మీద కానిస్టేబుల్ పరమహంస
శవాన్నీ మార్చి మార్చి చూశాడు డీసీపీ తాండవ్.
చనిపోయన పరమహంసకు ముఖమే లేదు. బిచ్చగాడికి ముఖమున్నా అది ముఖం కాదు.
అంతవెలుతురులోనూ బిచ్చగాడిది ముఖమని చెప్పటానికీ రెండే రెండు ఆధారాలు
కనిపిస్తున్నాయి: గుంటల్లో మెరిసిన కళ్ళూ, గార పట్టిన పళ్ళూ…! (వాడు నవ్వకపోతే బయిటపడేవి కావు.)
‘ ఇప్పుడు విసిరెయ్యండి’ అన్నాడు తాండవ్ ఊగిపోతూ.
అంతే…! ఉతికిన బిచ్చగాణ్ణి పైకెత్తి పోలీస్ వ్యాన్‌లోకి ఆరేసారు.
‘వాణ్ణి కూడా!’ అంటూ టాటా సుమో ఎక్కేశాడు డిసీపీ తాండవ్ పరమహంస శవంవైపు
అసహ్యంగా చూస్తూ
కానీ, పరమహంస శవాన్ని పదిలంగానే ఎత్తుకెళ్ళి, వ్యాన్‌లో పడుకోబెట్టారు కానిస్టేబుళ్ళు.
వ్యాన్ కదలింది. శవాన్ని చూస్తూ బిచ్చగాడు నవ్వును పెద్దది చేసుకున్నాడు. తనని తాను
కవ్వించుకుంటూ, రెచ్చగొట్టుకుంటూ కులుకుతున్నాడు.
లాఠీల దెబ్బలకూ ఒళ్ళంతా సలుపుతున్నా.. హాయిగా వుంది. సుఖంగా వుంది. సమ్మగా
వుంది.
అదో విలాసం. ఇన్నాళ్ళూ ఆకలి తీరినప్పుడు మాత్రమే ఆ అనందం కలిగేది. ఇప్పుడు పగ తీరాక
కూడా లుగుతోంది.
పగ కూడా ఆకలే.
నెల రోజుల పగ పదినిమిషాల్లో తీరిపోయింది బిచ్చగాడికి.
మనసంతా పరమ అహింసాయుతంగా వుంది. అనుకున్న హింస చేసేశాక ఎవడయినా అహింసా వాదే. ఇప్పుడిక
చీమను చంపమన్నా చంపలేడు. అందుకే…వొంటి మీద అన్ని లాఠీలు పడ్డా…ఉలక లేదు. పలక లేదు.
అసలు తన శరీరం తనదనుకుంటే కదా!
‘ఇలాంటప్పుడు… ఒక్క బీడీ వెలిగిస్తే… అబ్బో!… ఆ భోగమే వేరు!’ అనుకున్నాడు. కానీ..
తన చేతులకు బేడీలు…!
అంత తృప్తిలోనూ… చిన్న అసంతృప్తి. అది నచ్చలేదు.
అందుకే గంట క్రితంలోకి వెళ్ళిపోయాడు.
xxx
xxx xxx
పదకొండు గంటలు. డిశంబరు 31. ఇప్పుడు పన్నెండు దాటిపోయింది. అంటే తనని
పోలీసులు చితక్కొడుతున్నప్పుడు సరిగ్గా పన్నెండు గంటలయ్యివుండాలి.
తాను గత ఏడాది బిచ్చగాడు. ఈ ఏడు నేరగాడు.
ఈ నేరానికి కారణం ఆరడుగుల నేల. చచ్చాక పూడ్చిపెట్టటానికి అవసరమయ్యేటంత జాగా.
తనకి బతుకు నిచ్చింది. అది నలుగురి నడిచే దారే కావచ్చు. పేరుకు ఫుట్ పాతే కావచ్చు. కానీ తనకి
జన్మస్థలం. మెయిన్ రోడ్డునుంచి రైల్వేస్టేషన్ రోడ్డుకు తిరిగే వంపు దగ్గర ఫుట్‌పాత్ మీద తనకు సంక్రమించిన
చోటు.
చేతులు చాపి అడుక్కునేది అక్కడే. కాళ్ళు చాపి పడుకునేదీ అక్కడే. తన తల్లి తనను కన్నదీ
అక్కడే. పేరు పెట్టిందీ అక్కడే. పెంచిందీ అక్కడే. కన్నుమూసిందీ అక్కడే.
బాగా అచ్చొచ్చిన చోటు. కమల్‌హాసన్ ‘గురు’ సినిమా సెకండ్ షో చూసొచ్చాక తన తల్లి
తనకు ఇక్కడే జన్మనిచ్చింది. అందుకే తన పేరు ‘గురు’.
ఆరడుగుల పొడవూ, నాలుగడుగుల వెడల్పూ వుండే నల్లటి కంబళి ఎప్పుడూ తన జన్మస్థలం
మీద పరచి వుంటుంది. దాని మీద ఒక్క రూపాయి నాణెం పడ్డా, ధగ ధగ మెరుస్తూ కనిపించి పోతుంది.
తనకు బాగా గుర్తు. తన ఆరేళ్ళ వయసులోనే తన తల్లి చనిపోయింది. ఇదే కంబళి మీద వున్న
ఆమె శవాన్ని చూపిస్తూ తాను ఆడుక్కుంటున్నప్పుడు, రూపాయిల వర్షం కురిసింది. ఈ చోటుకు వాస్తు
బాగుందనే వాడు చెప్పులు కుట్టే గాబ్రియేలు తాత. తల్లి శవాన్ని బండ్లో వేసుకుపోతున్నప్పుడు, కంబళితో
చుట్టమన్నారు మునిసిపాలిటీ వాళ్ళు. కానీ గాబ్రియేలు తాత అందుకు ఒప్పుకోలేదు. కంబళిని కదప నివ్వలేదు.
గురు చోటు పక్కనే, గాబ్రియేలుకూ ఆరడుగుల నేల వుంది. దాన్ని తాటాకు గొడుగుతో కప్పుతాడు.
గురు తల్లి తన చివరియాత్రను మునిసిపాలిటీ బండిలోనే చేసివుండవచ్చు. కానీ అది పెళ్ళి
ఊరేగింపులా సాగింది. పెళ్ళికూతురు లాగే వుంది ఆమె అప్పుడు. అందుకు కారణం సంపంగి. సంపంగి ఎవరో
కాదు. గాబ్రియేలు పెంపుడు కూతురు. తన కున్న ఎర్ర నైలాన్ చీరను శవానికి చుట్టింది. తను రాసుకునే
పొడరు పూసింది. సెంటు కూడా కొట్టింది. సంపంగికి కూడా అదే పేవ్‌మెంటు మీద, గాబ్రియేలు తాత గొడుకు
పక్కన ఇంకో ఆరడుగుల నేల వుంది. సంపంగికి కళ ఎక్కువ. దానిని ప్లాసిక్ షీట్లతోనూ, ఇనువ చువ్వలతోనూ
టాపులేని గదిలా మార్చుకుంది.
ఆరోజు గురు తల్లి పోతూ, పోతూ కూడా ఆర్జించి పెట్టింది. ఆమె శవం వల్ల, ఆ పూట కంబళి
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలాగా రూపాయిబిళ్ళలతో కళకళ లాడిపోయింది.
‘బిడ్డా! నన్నొదిలినా ఈ బూదేవి నొదలకు.బువ్వకు లోటుండదు’ అని తన తల్లి పోయే ముందు
రోజు దీవించింది కూడా.
గురు తల్లిని పూడ్చి పెట్టి వచ్చాక, గురూ, గాబ్రియేలు తాతా, సంపంగీ- ముగ్గురూ ఒకే
దు:ఖాన్ని సమానంగా పంచుకోవాలనుకున్నారు. అమ్మ ఆఖరి ఆర్జనతో బ్రాందీ కొనుక్కొచ్చారు. సమానంగానే
తాగారు.
‘ మీ యమ్మే లేకపోతే.. నేనూ లేనూ.. సంపంగీ లేదురా..!’ ‘సెప్పులు తెగే సెంటర్రా యిది.
ఈ సోటు వదలమాకురా అయ్యా!’- అని యేడిసేది. ఏ పోలీసెదవొచ్చినా.. అదే సేతులు తడిపేది.. నాకు
సంపంగిదెంతో… నీ యమ్మా… అంతేరా…!’ అన్నాడు మద్యంతో తడిసిన తెల్ల మీసాలను దువ్వుకుంటూ
గాబ్రియేలు తాత.
‘అయ్యా! నువ్వట్టా అనమాకురా. నాకు ఏడుపొత్తది. ఈడమ్మే లేకపోతే…యియ్యాల నా
మొకమే ఎవుడూ సూసేవోడు కాదు… ‘నా మాట యినవే సెల్లే… ఈ లైటెలుగు నొదలకే…! నదరగా
ఆగుపడతావ్’- అనేది!’ అంటూ, కాటుక చెరగకుండా కళ్ళు తుడుచుకుంది సంపంగి.
నిజమే! ఫుట్ పాత్ ఆ ముగ్గురికీ ‘ఫుడ్’ పాత్! గురుకి కంబళి మీద కూర్చుంటే చాలు
కడుపు నిండిపోయేది. రైలు దిగి ఆటోలోనో, కార్లోనో వెళ్ళిపోతున్న వారు ఆగి, తాము తినగా మిగిలిన ఆహార
పొట్లాలను తన మీద విసరి వెళ్ళేవారు. రోజుకు డజను తెగిన చెప్పులన్నా గాబ్రియేల్ తాత చేతుల్లో పడేవి.
కనీసం ఒక గ్యాంగ్ కూలీయో, ఆటో డ్రైవరో కన్ను గీటి, సంపంగి పర్సు నింపేవాడు. అన్ని ఫుట్ పాత్‌లకీ ఈ
లక్ష్మీ కళ వుండదు. రైల్వే స్టేషన్‌కు దగ్గరగా రోడ్డు వొంపులో వుంది కాబట్టి ఈ బతుకు.
తాగినప్పుడు ఈ ముగ్గురికీ ఏదీ దాగదు. కృతజ్ఞత కూడా. అందుకే ‘అమ్మ మాట అన్నం
మూట కదా’ అని ముచ్చట పడుతూ ఆ రాత్రి తలచుకున్నారు.
xxx xxx xxx
గురు ప్రయాణిస్తున్న పోలీసు వ్యాన్… పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎక్కిందో ఏమో… ఓ పెద్ద కుదుపు.
ఎదురుగా వున్న పరమహంస శవం ఎగిరి పడింది.
xxx xxx xxx
ఇలాగే గురు మీద ఎగిరిపడ్డాడు -పోలీసు కానిస్టేబుల్ పరమహంస.
సెకండ్‌షో సినిమా అయ్యాక, కంబళి మీద జనం వేసిన పైసలు లెక్కపెట్టుకుంటుంటే వచ్చి..
‘ ఇక్కడ్నుంచి లేరా! … కొడకా! ఇదేమన్నా నీ బాబుగాడి ఆస్తి అనుకుంటున్నావా?’ అని
లాఠీ ఎత్తబోయాడు పరమహంస..
చిత్రం! తన మీద ఎత్తిన లాఠీ వణకుతోంది. అప్పటికే పరమహంస బాగా తాగివున్నాడు. ఎక్కడో
అడుక్కుని వుంటాడు. తనకీ పరమహంసకీ ఒక్కటే తేడా. తాను అడుక్కుని తింటాడు. కొనుక్కుని తాగుతాడు(
సారా ఎవడూ భిక్షగా పోయడు కదా!) కానీ, పరమహంస అలా కాదు. అడుక్కునే తింటాడు. అడుక్కొనే
తాగుతాడు.
తాను దండం పెట్టి, కంబళి తీసుకుని పక్కకు తొలగిపోయాడు.
‘ ఫుట్ పాత్ ఈడి బాబుగాడిదనుకుంటాడు…ఎదవ.. ఎదవని…!’ అని ఊగుతూ, తిడుతూ;
తిడుతూ ఊగుతూ , పక్కనే తాటాకు గొడుగు కింద నిద్రపోతున్న గాబ్రియేలు ముఖం మీద బూటు కాలుతో
తన్ని కింద పడిపోయాడు. తాత ఉలిక్కి పడిలేచి. పడిపోయిన కానిస్టేబుల్ పరమహంసను చేతులు పట్టుకుని
లేవదీయ బోయాడు.
‘జాతి తక్కువ నా కొడకా! నన్నే తోసేస్తావా!’ అని తనకు తానుగా తూలుతూ లేచి, ‘ఈ
ఫుట్‌పాతే మన్నా నీ పేటనుకుంటున్నావా’ అని గొడుగు విసిరేసి మరో మారు బూటు కాలుతోతన్నబోయాడు.
తెల్లమీసాల గాబ్రియేలు తాత తన అనుభవంలో ఇలాంటి బూటు కాళ్ళను ఎన్నింటిని చూసి
వున్నాడేమో, చటుక్కున పరమహంస కాలు పట్టేసుకున్నాడు. ‘ ఇంత మాసిపోయాయేటి సామి.. బూట్లు!’
అని వాటిని తన ఒళ్ళో పెట్టుకున్నాడు. పక్కనే వున్న బ్రష్ తీసుకుని పాలిష్ చేసాడు. నిజంగానే విద్యుత్
కాంతిలో మెరిసాయి.
కానీ ఆ మెరుపును చూడలేదు పరమహంస. అప్పుడే ఓ ఆటోదిగి, వాడి దగ్గర పైసలు
తీసుకుంటున్న సంపంగి ఒంటి మెరుపును చూశాడు.
గాబ్రియేల్ తాతను వదిలేసి, ఆమె దగ్గరకు వెళ్ళాడు పరమహంస
‘ఏంటే! ఆటో ఎక్కితే వాడికి నువ్వు డబ్బులివ్వాలి కానీ, వాడు నీకివ్వటమేమిటీ? అంటే ఫుట్
పాత్ నే రెడ్ లైట్ ఏరియా చేసేసేవా?’ అని సంపంగి నడుము మీద చెయ్యివేశాడు.
పరమహంసను విసుగ్గా వదలించుకుని తన చేతిలో వున్న యాభయిరూపాయిల నోటూ, అతడి
చేతిలో పెట్టింది.
అయినా సంతృప్తి చెందక ఫుట్‌పాత్ మీద సంపంగి గూడును కూల్చేసి, అదే ఆటోలో ఆమెను
ఎక్కించుకు వెళ్ళి పోయాడు
పరమహంస అలా వెళ్ళగానే, తాను ఇలా వచ్చి కంబళి పరిచేశాడు గురు.
విసిరేసిన గొడుగును తెచ్చుకుని పడుకున్నాడు గాబ్రియేలు తాత.
గంటలోనే తిరిగి వచ్చి గూడు సర్దుకుంది సంపంగి.
వారం గడిచిపోయాక, ఒక రోజు తెల్లవారు ఝామున కంబళితో ముసుగుతన్నిన గురుని
లాఠీతో కొట్టి లేపాడు పరమహంస.
ఏ అనాధకయినా, నిద్రను మించిన నెచ్చెలి వుండదు.
పరమహంస అంత పాశవికంగా నిద్ర లేపేసరికి, కౌగిట్లోని ప్రియురాలిని ఎవరో లేపుకు
పోయినట్లే ఫీలయ్యాడు తను.
వచ్చింది పరమహంస- అని పోల్చుకునే లోపుగానే.. గురు తన నోటికి పచ్చిన పచ్చితిట్లన్నీ
తిట్టేశాడు.
అంతే.. పరమహంస తన ఎముకల్ని ఏరేశాడు.
‘ఇంకొక్క సారి నిన్నిక్కడ చూశానంటే… ఇక్కడే పాతేస్తాను’ అని విరిగిన లాఠీకర్రను అవతల
పారేసి, ఆమడ దూరంలో ఆపివున్న టిఫిన్ బండి దగ్గరకు వెళ్ళి, బాగా మెక్కాడు.
పోలీసు వాడి మాట కూడా అమ్మ ఆశీస్సు లాగే వుంది.
ఇక్కడుంటే బతుకు ఖాయమన్నది తల్లి. ఇక్కడే వుంటే చావు తప్పదన్నాడు పరమహంస.
పరమహంస ఆదేశాల ప్రకారం లేవాలనుకున్నాడు. కానీ తన శరీరంలో ఎముకలు నిజంగా
మాయమయ్యాయో ఏమో, లేవబోయి స్పృహ తప్పి కుప్ప కూలిపోయాడు గురు.
మళ్ళీ మెలకువ వచ్చింది ప్రభుత్వాసుపత్రి వరండా మీదే. స్పృహయితే వచ్చింది కానీ,
ఎదురుగా వున్న మనిషి నీడలాగా కనిపించాడు.
నీడ చెయ్యి తన నదురు మీద పడింది. తన తల్లి స్పర్శలాగా అనిపించింది.
ఇదెలా సాధ్యం? చనిపోయిన తల్లి తిరిగి రాలేదు కదా! పోనీ తన తల్లి దగ్గరకే తాను వెళ్ళి
పోయాడా?
‘గురూ!’ అది మగ గొంతు. కొద్ది సేపటికి, నీడ మనిషయ్యాడు. మనిషి గాబ్రియేల్‌తాత
అయ్యాడు.
కొంచెం తేరిపార చూశాడు దూరంగా నడవ లేక నడవలేక నడచి వస్తోంది ఇంకో నీడ.
ఈ నీడయినా తల్లి అయితే బాగుండుననుకున్నాడు. కానీ ఆ నీడ సంపంగి అయ్యింది. ప్లాస్టిక్
కప్పులో టీ తెచ్చి నోటికి ఇచ్చింది.
‘పిన్నీ!’ ఆమెను అలాగే పిలుస్తాడు. ‘నీ కేమయింది?’ ఆమె నడవలేని తనాన్ని పసిగట్టి
ఆడిగాడు.
‘ఆడే! ఆ పోలీసు సచ్చినోడు! నన్నెట్టికెల్లి.. ఆరుగురు యెదవల్దగ్గర పడేశాడు. అంతా
బేవార్సే…నన్ను సరే! మా అయ్యకి పాతిక జతల బూట్లుచ్చి పాలిస్ సేయించాడు… పాలిస్‌కి పైసలడిగాడని
నడుమిరగ్గొట్టాడు.’ అని తన చీర కొంగుతో ముఖం మీద కారుతున్న చెమట్లను తుడుచుకుంది.
గాబ్రియేల్ తాతకు ఏదో ఆలోచనొచ్చినట్లుంది. గురు నుదుటి మీద చెయ్యి తీసేశాడు. ‘గురూ!
ఈ పోలీసోడు మనల్ని ఈడుంటే బతకనిచ్చేలాగ లేడు… ఏరే సోటకి పోతేనో..?’
ఈ మాటకు ఓపిక ఎక్కడనుంచి వచ్చిందో ఒక్క సారిగా లేచి కూర్చున్నాడు గురు.
సంపంగి గిరుక్కున తిరిగింది.
‘సెస్..! ఫుట్‌పాత్ దిగామా? సచ్చామే! ఈడమ్మ ఎప్పుడో తేల్చేసింది. అయ్యా!
నువ్వేడనుంచొచ్చావ్..! నీ ఊళ్ళో అరెకరం సెక్కా ఎస్సీజెడ్‌లో కలిపేత్తేనే కదా! నా యమ్మ నన్ను పుట్టగానే
పదిరూపాయిలకమ్మేద్దామని ఈడకెందుకు తెచ్చింది? పాజెక్టు గంగలో దానిల్లు మునిగిపోతేనే కదా!
నన్నమ్ముకోలేక అదే వొదిలి పోయింది. మీరో ముద్దా, మీరో ముద్దా పెడితే తిన్నా.. నా బతుకు దెరువు నేను
సూసుకున్నా…’ అని సంపంగి ఇంకా ఏదో చెప్పబోతుంది.
ఈ రహస్యాలన్నీ గాబ్రియేల్ తాతకు తెలియనివి కావు.
‘సంపంగే! ఇవన్నీ నాకు తెలవని వేంటే? గురు మాత్రం సుకంగా అడవి నీడన పెరగాల్సినోడు
కాడా..? అడవిని తవ్వి పోత్తన్నారని ముందే తెలిసి ఉరేసుకున్నాడు. ఈడు కడుపుతోటుండగానే కదా…
ఈడమ్మ రైలెక్కిచ్చొసేందీ..?’ అన్నాడు.
‘తాతా! ఓనాడు బూదేవే మనల్నొదిలేసింది. ఇయ్యాల మనమే బూదేవినొదిలేద్దామా?’ గురు
వేసిన ప్రశ్నకు ఇద్దరూ మౌనంలోకి వెళ్ళిపోయారు
అడవిలో పుట్టినె వాడికి, అడవే భృతి: అడవే చితి.
యేటివొడ్డున వున్న వాడికి, గంగే ఉపాధి: గంగే సమాధి.
ఈ ఫుట్‌పాత్ అలాంటిదే. దిగితే, బతక లేరు, చావలేరు.
గురుకి మాత్రం తలలో ఒక్క సారిగా నొప్పి పుట్టింది.
తన నుదుటి మీద రెండు చేతులూ పెట్టుకుంటే, పెద్ద కట్టు తగిలింది. అప్పుడు కానీ తెలియలేదు- తలకేదో
తగిలిందని.
పరమహంస కొట్టింది ఒంటి మీద కదా… తలకెలా తగిలిందీ…?’ఆ ఎదవ ఎల్తా, ఎల్తా నీ బుర్ర
బద్దలు గొట్టాడ్లే..!’ అని గాబ్రియేలు తాత గురు నోటికి బీడీ అందించి, వెలిగించాడు..
గురు బీడీ కాల్చాడు. పీల్చాడు. పొగలు బదులు పగలు కక్కాడు
‘ఆడు రైటేరా పెద్దయ్యా… పొగరుండేది తలకాయలోనే..!’ అని అంటూ గుండెనిండా
పీల్చుకున్న పొగను శూన్యంలోకి వదిలాడు గురు.
xxx xxx xxx
ఈ సారి పోలీసు వ్యాన్ కుదుపు కుదప కుండానే వర్తమానంలోకి వచ్చేశాడు గురు. కారణం
బీడీ. బీడీ మళ్ళీ వుంటే బాగుండేది. చిన్న కోరికే..! వెనువెంటనే దిగులు..! ఛీ..ఛీ.. కోరికే దిగులు! తన
తృప్తిని నాశనం చేసే దిగులు!
అందుకే, ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవటం కోసం పరమహంస శవం మీద దృష్టి సారించాడు.
ప్రయాణపు తూగుకి, చీకట్లో అది ఊగుతోంది. తలభాగం కూడా ఊగుతోంది. ‘ఈడి
తలకాయలోనూ పొగరే వుంటాదా..?’ అనుమానపడ్డాడు. అయితే తాను కూడా వాడి పుర్రెను బద్దలు
కొట్టాల్సింది. కానీ ఆ పుర్రెనే మిగిల్చి, ముఖాన్ని పచ్చడి చేశాడు. బేవార్సుగా తాగితాగి ఉబ్బిన ముఖం…
ఫుట్ పాత్ కింద, టిఫిన్ బండి వాడి దగ్గర తిని బలిసిన ముఖం…వాడి ముఖానికి అన్నీ వున్నాయి…
మీసాలు కూడా! లేనిది ఒక్కటే… సిగ్గు! సిగ్గులేని ముఖం చూశాక తనకి వొళ్ళు తెలీలేదు..!
xxx xxx xxx
చివరి సారిగా ఈ సిగ్గుమాలిన ముఖంతోనే వచ్చాడు కానిస్టేబుల్ పరమహంస.
అప్పుడు గురుకి పండగ నడుస్తోంది.
వారం రోజుల చాలీ చాలని చప్పచప్పని పెరుగన్నం తర్వాత… తన చేతుల్లోకి కోడి పలావు
ప్యాకెట్..!
అది కూడా విప్పని, ఎంగిలిచేయని పొట్లాం. తినలేక పోయిన దాత కాదు…తినటానికి
బధ్ధకించిన ‘పుణ్యాత్ముడె’వడో విసిరాడు.
తన బతుకులోనే తొలిసారిగా ఎంగిలిచేయని భోజనం చేయబోతున్నాడు. పొందిగ్గా బాసంపట్టు
వేసుకొని, తన నల్లని పళ్ళతో మెరిసే ప్యాకెట్‌ను కొరికి, గుప్పున వచ్చిన మసాలా వాసనను పీల్చాడు. పైన
కనిపిస్తున్న చికెన్ ముక్కను తీసి నోట్లో పెట్టుకోబోయాడు.
‘పెంటనాకొడకా…! సిగ్గూ, ఎగ్గూ లేదేంట్రా…! ‘ లాఠీతోతన భుజాలమీద పలకరించాడు
పరమహంస.
ఉలిక్కిపడ్డాడు కానీ, జారిపోబోయిన పలావు ప్యాకెట్టును ఒడుపుగా పట్టుకుని, తలపైకెత్తి
చూశాడు. పరమఅసహ్యకరమైన పరమహంస ముఖం.
చేతులు ఖాళీగా లేక పోవటం వల్ల, పలావు ప్యాకెట్టుతోనే దండం పెట్టి, తినటానికి
ఉపక్రమించాడు. గబగబా చికెన్ ముక్కను కొరికాడు.
చప్పబడ్డ నాలుకకు జీవమొచ్చింది. జివ్వుమంది.
‘నీతీ, జాతీలేని నా కొడకా! నీ యమ్మ ఎంతమందితో పడుకుంటే పుట్టావురా..?’ అంటూ
లాఠీతో ఇంకొకటిచ్చాడు పరమహంస
ఈ సారి దెబ్బకంటె, తిట్టే ఎక్కువగా గురు ఒంట్లో సలిపింది. అయినా నాలుక మీద అప్పుడే
పుట్టిన రుచి ఓర్చుకునేటట్లు చేసింది.
ఒక ముద్దతీసుకుని నోట్లో పెట్టుకొన్నాడు.
పరమహింస మూడో సారి లాఠీ ఝళిపించాడు. ఈ సారి గురు భరించలేక పోయాడు.
లాఠీ తన ఒంటి మీద పడలేదు. గతంలో లాగా తల మీదా పడలేదు. చేతిలోని పలావు మీద
పడింది. అది రోడ్డు మీద చెల్లా చెదరయింది. గతుకుల రోడ్డు కాస్తా, మెతుకుల రోడ్డయ్యింది.
పరమహంస నవ్వాడు. అసలే వికారంగా ఉబ్బిన ముఖం. దాని మీద ఈ నవ్వు. సిగ్గులేని
ముఖమంటే అదే…!
ఆ ముఖాన్ని చూసి గురు ఉడుక్కున్నాడు. ఏడుపొచ్చింది. బావురుమని ఏడ్చేశాడు.
అమ్మను తిట్టినా రాని ఆక్రోశం, అన్నాన్ని కొడితే వచ్చేసింది.
ఉగ్రుడై లేవబోయాడు. అంతలోనే చతికిల బడ్డాడు. కారణం? తన కాళ్ళకింద కంబళిని
తీసిపారేసి బిగ్గరగా నవ్వుతున్నాడు పరమహంస. అతడి ముఖం మరింత అసహ్యంగా.. .
ఎగిరి ఎంగిలి చేత్తో పరమహంస ముఖం మీద కొట్టాడు. కూలిపోయాడు పరమహంస. ఫుట్‌పాత్
పక్కనే వున్న బండరాయిని, రెండుచేతుల్తో ఎత్తుకుని వచ్చి అతడి గుండెల మీద కూర్చున్నాడు గురు.
పరమహంస ముఖం మీద అసహ్యంతో కొట్టాడు. ఏడుస్తూ కొట్టాడు.. చెల్లాచెదురయిన
మెతుకులను చూస్తూ కొట్టాడు.
పరమహంస చనిపోతున్నప్పుడు ఏడ్చాడో లేదో తెలీదు కానీ, గురు మాత్రం అతణ్ణి ఏడుస్తూనే
చంపాడు. ఎప్పుడూ ఏడ్వనంత ఏడుపు ఏడ్చాడు అప్పుడు. ఇక జీవితంలో ఏడ్వాడ్సిన పనిలేదన్నంతగా
ఏడ్చాడు. ఏడ్చి ఏడ్చి తేరుకున్నాడు. ఈ దృశ్యాన్నంతా గుమిగూడిన జనమందరితో పాటు చూసిన గాబ్రియేలు
తాత లయబధ్ధంగా ఈల వేశాడు. సంపంగిి డ్యాన్సు చేసింది.
ఫుట్ పాత్ మీద ఇతర బిచ్చగాళ్ళంతా పారిపోయారు. చచ్చిన కానిస్టేబుల్ పరమహంస ఖాకీ
జేబుల్లో చేతులు పెడితే.. రెండు అయిదు వందల రూపాయిల నోట్లు దొరికాయి. గాబ్రియేల్ కు ఒకటీ, సంపంగికీ
ఒకటీ ఇచ్చేశాడు గురు. తన చొక్కా జేబు తాను తడుముకుంటే రెండు బీడీలు, అగ్గిపెట్టె. వెలిగించాడు.
హింసను పీల్చాడు. శాంతిని వదిలాడు.
xxx xxx xxx
వ్యాన్ ఆగింది. పోలీసులు తనని చంపటం ఖాయం. చంపే ముందు ‘సివరాకరి కోరిక’
అడుగుతారేమో! ‘ఒక బీడీ అడుగుతాను. దమ్ము కొడుతూ సచ్చి పోతాను’. చావు తనకిప్పుడు బతుకంత పెద్ద
విషయం కాదు. ‘వస్తే రానీయ్ లే’ అనుకున్నాడు.
వ్యాన్ తలుపులు తెరుచుకున్నాయి. ముందు పరమహింస శవాన్ని దించారు. తర్వాత తనని
కిందకు విసరేస్తే ముద్దలా పడ్డాడు. అలా దొర్లించుకుంటూనే, లాకప్ వరకూ తన్నుకుంటూ వెళ్ళిలోపల వేశారు.
ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడ్డట్లు.. నీళ్ళు.. కుంభవృష్టిలా… బకెట్ల కొద్దీ నీళ్ళు.. నీళ్ళల్లో
సుగంధం..’పైకి అంపటానికి, పన్నీటి జలకాలు కామోసు’ అనుకున్నాడు.
‘కంపు నా కొడుకా!’ అని ఆఖరి బకెట్ వేసి వెళ్ళి పోయాడు స్టేషన్‌లో వున్న
కానిస్టేబులొకతను.
లాకప్‌లోనుంచి బయిటకు చూశాడు. పరమహంస శవాన్ని టేబుల్ మీద బెడ్‌షీట్ వేసి,
పడుకోబెట్టారు.
దూసుకుని వచ్చాడు లాకప్‌లోపలికి -కర్చీఫ్ తో ముక్కు మూసుకుంటూ డీసీపీ తాండవ్.
అతని వెనకాలే ఇన్స్పెక్టర్ వచ్చి గురు ఎదురుగా కుర్చీ వేస్తే కూర్చున్నాడు.
తాండవ్ గురుని, కొట్టలేదు. జరిగింది చెప్పమన్నాడంతే.
నిండా తడిసిన వాడికి చలేమిటి? పూసగుచ్చినట్టు చెప్పాడు. తాండవ్ నమ్మాడో, లేదో తెలీదు
కానీ, ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు.
‘ఇప్పుడు చంపుతారు కాబోలు. ‘సివరాకరి కోరిక’ ఏంటని అడగరా!’ అని అనుకుంటూ డీసీపీ
తాండవ్ వెళ్ళినవైపు చూశాడు. పరమహంస శవం దగ్గర నిలబడి చాలా అసహనంగా తననీ,
పరమహంసశవాన్నీ ఒకేలా చూశాడు
‘సిగ్గులేదా ఈ పరమహంస గాడికి?’ అన్నాడు తాండవ్
లాకప్‌లోనుంచి ఈ మాట విన్న గురుకి కొంచెం గర్వం కలిగింది. పరమహంస ముఖంలో
సిగ్గులేదని డీసీపీ కన్నా తానే ముందు కని పెట్టాడు.
‘గూండాల చేతుల్లో చావచ్చు. ఫ్యాక్షనిస్టుల చేతుల్లో చావచ్చు. ఉగ్రవాదుల చేతుల్లో
చావచ్చు. గొప్పగా వుంటుంది. గౌరవంగా వుంటుంది. కానీ ఒక పోలీసు వాడు. బిచ్చగాడి చేతుల్లో చస్తాడా?
చచ్చినోడికి సరే.. నాకు సిగ్గుగా వుందే..!.’ అంటూ, శవం వున్న టేబుల్ సొరుగు తెరచి, రివాల్వర్ తీసాడు
గురు వైపూ, పరమహంస శవం వైపూ మళ్ళీ అలాగే మార్చి మార్చి చూశాడు డీసీపీ.
గురు చేతులకు బంధనాలు లేవిప్పుడు.
గురు తన జేబు తడుముకున్నాడు. తడిసిన బీడీ ముక్క. చచ్చినా వెలగదు.
‘బీడీ కాల్చకుండానే పోతాను కాబోలు.’ అనుకుని కళ్ళు మూసుకున్నాడు.
రివాల్వర్ మూడు సార్లు పేలింది.
గురు కళ్ళు తెరిచాడు. తాను బతికే వున్నాడు. తాండవ్ కాల్చింది పరమహంస శవాన్ని.
‘ ఇతని భార్య వస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో పోయాడని చెప్పండి. ముందు ఏడ్చినా తర్వాత
గర్వపడుతుంది.’ అని తాండవ్ తన సిబ్బందికి చెప్పి, గురు వైపు చూశాడు.
‘ఫో!’ అన్నాడు విసుగ్గా.
కోపాన్నంతా దిగమింగుకుంటూ తాండవ్ వైపు చూశారు అక్కడ వున్న మొత్తం పోలీసు
సిబ్బంది.
xxx xxx xxx
గురు తన చోటు కు తాను వచ్చాడు.
తడిసిన బట్టల్ని తనువు మీదనే అరేసుకుంటూ వచ్చాడు.
గాబ్రియేల్ తాత తలనిమిరాడు. సంపంగి తల్లిలా హత్తుకుంది.
గురు ఆనంద పడలేదు; దు:ఖపడలేదు . అన్నికోరికలూ చచ్చిపోయాయి- బీడీ కాల్చాలన్న
కోరిక కూదా.
పరమహంస విసిరేసిన చోటే, తన కంబళి పడి వుంది. జాగ్రత్తగా తీసి, తన ఆరడుగుల చోటు
మీదా పరిచాడు.
ముడుచుకుని పడుకున్నాడు… అమ్మ డుపులోని శిశువులా.
ఎప్పుడు నిద్రలోకి వెళ్ళాడో తెలియదు కానీ, తెలతెల వారుతుండగా చిన్న చప్పుడుతో మెలకువ
వచ్చింది. కంబళి మీద ప్యాకెట్!
‘ఈ బూదేవినొదలకురా కొడుకా’ అని అమ్మ అన్న మాట మరో మారు గుర్తుకొచ్చింది.
కొన్ని యుగాల ఆకలి కడుపులోంచి పుట్టుకొచ్చింది.
లేచి కూర్చొని, ఆత్రంగా ప్యాకెట్ తెరిచాడు గురు.
అది అన్నం కాదు. ఆయుధం. అవును. నల్లటి రివాల్వర్.
చేతిలో రివాల్వర్ చేతిలో వుండగానే… తన మీద తూటాల వర్షం కురిసింది.
పొగ..కళ్ళ చుట్టూ మసక… ఎదురుగా తన మీద కాల్పులు జరుపుతున్న డీసీపీ తాండవ్!
కడుపు మీద కొట్టే వాడు గురి తప్పడు. తూటాలతో గురు కడుపు నిండిపోయింది.
గంట తర్వాత టీవీల్లో బిచ్చగాడు గురు…, ఉగ్రవాది గురుగా దేశానికి పరిచయమయ్యాడు.
తన ఆరడుగల నేల మీదకు టిఫిన్ బండి వచ్చింది. పట్టణంలో అన్ని ఫుట్ పాత్ ల మీదకూ
బహు(ళ) వ్యాపారశాలలు ఎక్కేశాయి. శాంతి భద్రతలు చచ్చినట్లు అదుపులోకి వచ్చాయి.
-సతీష్ చందర్
(సతీష్ చందర్ ’సిగ్గు‘ కథల సంపుటి నుంచి)
Fantastic story sir. After a long time I could read your story.
Das
Goodstory
oka araganta kritam !amway business meating ki velli vastu footpath chusaanu!………………….naaku akkada gaabriyelu taata,sampangi,guru,inka paramahimsa andaru kannipincharu………………
.
.
.
kaani DCP tandav guru chetilo jonnapottu pedutunnadu kanipinchaadu! tupaakito kaadu………………………………………
the story greatly depicts the inhuman nature n hypocracy prevailed in the society. even If any one who reads the story, to look at the sampangis, gurus and gabriyals, the victims differently as humans and changes in attitudes towards them, the story is successfull in reaching the readers.
కడుపు మీద కొట్టే వాడు గురి తప్పడు… ………….చావు తనకిప్పుడు బతుకంత పెద్ద
విషయం కాదు. ……….. తినలేక పోయిన దాత కాదు…తినటానికి
బధ్ధకించిన ‘పుణ్యాత్ముడె’వడో విసిరాడు.