బాబూ! ‘సైకిలు’ దిగుతారా?

అడుగులు ముందుకీ.., నడక వెనక్కీ…!

ఆశ్చర్యమే. బాధాకరమే.

కానీ, చేయగలిగిందేమీ లేదు.

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి చేపట్టిన చంద్రబాబు పాదయాత్ర ఇలాగే వుంది. ఇది, అక్కసుతోనో, ఉక్రోశంతోనో ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యకాదు.అలాగని, శత్రువర్గ మాధ్యమాలు తన మీద అకారణంగా కక్కుతున్న విషమూ కాదు.

పాదయాత్రల ఫలితాలు అలా వున్నాయి.

అవును. ఎన్నికలూ, ఉప ఎన్నికలకే కాదు- పాదయాత్రల్లో కూడా గెలుపు, ఓటములుంటాయి.

మధ్యంతరాన్నో, ముందస్తు ఎన్నికలనో మనసులో వుంచుకుని కానీ, 2014 ఎన్నికలను ఎదుర్కోవటానికి గానీ చేస్తున్న వే ఈ పాదయాత్రలు. వైయస్సార్‌ నాయకురాలు షర్మిల చేసినా, చంద్రబాబు చేసినా వారి వారి పాద యాత్రల పరమార్థమిదే.

అయితే వీటి ఫలితాలు యాత్రలోనే వెల్లడి అవుతుంటాయి. వేరే పార్టీనుంచి సీనియర్‌ నేతలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఎక్కడికక్కడ వచ్చి చేరుతుంటే, యాత్ర విజయవంతమవుతున్నట్టు లెక్క. షర్మిల యాత్ర కారణంగా ఇలా వచ్చి చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అటు కాంగ్రెస్‌ నుంచీ, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచీ వచ్చి చేరుతున్నారు.

కానీ చంద్రబాబు యాత్ర వల్ల కొత్త వాళ్ళు చేరక పోగా, ఉన్న వాళ్ళు జారిపోతున్నారు. ఇది నిశ్చయంగా ఓటమే. 2009 ఎన్నికలలో 92 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చున్న తెలుగుదేశం ఇప్పటికే డజను మందిని కోల్పోయింది. ఇంకా ముందు ముందు మరిన్ని వికెట్లు పడే అవకాశాలున్నాయని ఇప్పటికే వదంతులు మొదలయ్యాయి. విశేషమేమిటంటే, తాజాగా ఎంతో అనుభవం వున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీని వీడితే, నేరారోపరణలపై విచారణ ఎదుర్కొన్న కృష్ణ యాదవ్‌ పార్టీలోకి వచ్చారు. అంటే, ఆస్తి పోయి అప్పు వచ్చినట్లన్నమాట.

రాజకీయాల్లో పూర్తికాలం వెచ్చిస్తున్న నేత ఎవరయినా, జనం నాడి ఎప్పటికప్పుడు చూసుకుంటూ వుంటాడు. సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వీస్తున్న గాలి నానాటికీ ఉధ్ధృతమవుతోందని, వారు పసిగట్టే ఇలా చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ లో వుండటం వల్ల రెండు పదవీ కాలాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందన్న బెంగ కూడా, వారిని ఇతర పార్టీల వైపు చూసేటట్టు చేస్తోంది. మూడవ దఫా కూడా ఇదే స్థితి వుంటుందన్న అంచనాకు రావటం వల్ల ఈ ‘దూకుళ్ళు’ పెరిగిపోయాయి.

అవీ సర్వేలే!

ఇక ఈ ఏడాది జూన్‌ వరకూ రాష్ట్రంలో ‘ఉప ఎన్నికల’ సీజన్‌ నడిచింది. తెలంగాణ కోసం రాజీనామాలు చేయటం వల్ల తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ఉప ఎన్నికలలోనూ, తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. పోనీ సీమాంధ్రలో అయినా మెరుగు పడిందా అంటే, జూన్‌లో 18 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికలలో సింహభాగాన్ని(15అసెంబ్లీ సీట్లను, ఒక పార్లమెంటు స్థానాన్ని) వైయస్సార్‌ కాంగ్రెస్‌ దక్కించుకుంటే, కాంగ్రెస్‌ రెండు స్థానాలనూ, టీఆర్‌ఎస్‌ ఒక స్థానాన్ని గెలుచుకోగలిగాయి కానీ, తెలుగుదేశం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయాన్ని సాధించ లేక పోయింది.

అంటే గత మూడేళ్ళ కాలంలోనూ ప్రజాభిప్రాయం ఏదో రకంగా వెల్లడవుతునే వుంది. అది ఉప ఎన్నికల రూపంలో కావచ్చు, పాదయాత్రల రూపంలో కావచ్చు. తెలుగుదేశం పార్టీకి మొదటి రూపంలో వోటర్లు దూరం కావటం చూస్తే, రెండవ రూపంలో నాయకులూ, కార్యకర్తలూ జారుకోవటం చూస్తున్నాం.

మార్చాల్సింది బాబునే!

ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ గతవైభవం తీసుకురావాలంటే ఏమి చేయాలి?

సమాధానం చాలా మందికి తెలుసు. బహుశా ఆ పార్టీలో వున్న కొందరు సీనియర్లకూ తెలుసు.

కానీ, చెప్పలేరు. మరీ ముఖ్యంగా చంద్రబాబు ముందు అసలు చెప్పలేరు.

ఇంతకీ ఆ సమాధానం మరేమిటో కాదు: చంద్రబాబును అధినాయకత్వం నుంచి మార్చటం.

ఈ పనికాకుండా, మరే పనిచేసినా, పార్టీ పతనం ఆగదు.

ఈ సమాధానం తెలిసి వుండీ, చెప్పలేని వాళ్ళు ఎప్పటికప్పుడు పార్టీని వీడుతూనే వున్నారు.

ఈ పరిష్కారం కఠినంగానే వుంటుంది.

తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక దశలో ఈ దేశ ప్రధానిగా ఎవరు వుండాలో నిర్ణయంచిన జాతీయ స్థాయి నేతను, బిల్‌క్లింటన్‌, బిల్‌గేట్స్‌ స్థాయిలో వాణిజ్య చర్చలు నెరపిన మార్గదర్శకుణ్ణి, పార్టీ సారథ్యం నుంచి తప్పిస్తే, పార్టీ వుంటుందా?

ఇప్పుడు మాత్రం పార్టీలో ఏముంది?

రెండవ శ్రేణి నాయకత్వం దాదాపు లేదు. జనసమీకరణకు ఒక బృందమూ, వ్యూహ రచనకు ఒక బృందమూ వుండేది. జనాన్ని సమీకరించటంలోఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేత తెలుగుదేశం పార్టీకి ఆలంబనగా వుంటూ వుండేవారు. అలాగే వ్యూహ రచనలో ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కూడా వుండేవారు. ఎలిమినేటి మాధవ రెడ్డి, కోటగిరి విద్యాధర రావు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, దేవేందర్‌ గౌడ్‌, కడియం శ్రీహరి, జి.ఎం.సి బాలయోగి వంటివారికి ఆ విధంగానే స్థానం దొరికింది. అయితే వీరిలో దేవేందర్‌ గౌడ్‌, శ్రీహరి మినహా పార్టీలో ఎవరూ మిగలలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండగానే మాధవ రెడ్డి, బాలయోగి భౌతికంగా దూరమయ్యారు. ప్రతిపక్షంలోకి వచ్చాక మృత్యు వాత పడటం వల్ల రాయలసీమలో పరిటాల రవి, ఉత్తరాంధ్రలో యర్రన్నాయుడు వంటి నేతల్ని కోల్పోయారు. అంతే కాదు, ఒక దశలో ఒక నేత ఎదుగుతుంటే, అతనికి పోటీగా మరొకర్ని తెస్తూ వుండేవారు. గతంలో దేవేందర్‌ గౌడ్‌కు పోటీగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నిలిపారు. ఫలితంగా ఒక దశలో దేవేందర్‌ గౌడ్‌ పార్టీని వీడాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి. తెలంగాణలో నేతలు వున్నా, తెలంగాణ ప్రభంజనం ముందు నిలవ లేక పోయారు.

జనాకర్షణ అంటారా- అది మొదటి నుంచీ చంద్రబాబుకు లేదు. ఫలితంగా ఆయన పరాజయం పాలయినా సానుభూతి వుండదు.

అయితే పార్టీకి ఇవన్నీ పైకి కనిపించే బలాలు.

కానీ పార్టీ మనుగడకు వుండాల్సిన అసలు ‘కండ పుష్టి’ వేరు. అదే ఆర్థిక దన్ను. ఎంత కాదన్నా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలకు పారిశ్రామిక వేత్తల, బడావ్యాపారుల అండదండలు వుంటాయి. ఇది బహిరంగ రహస్యం. అయితే వీరు ఇలా తమ మద్దతునిచ్చేటప్పుడు, అనివార్యంగా కులప్రాతిపదిక వుంటుంది.

వాణిజ్యరంగంలో కమ్మ వారు తెలుగుదేశం పార్టీకీ, రెడ్లు కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటిదాకా మద్దతునిస్తూ వచ్చారు. అయితే ఇటీవల వచ్చిన ‘సానుభూతి’, ‘సెంటిమెంట్ల’ ఫలితంగా, రెడ్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు పయినం కట్టారు. వీరి స్థానాన్ని కాంగ్రెస్‌లో కాపులు భర్తీ చేయగా, టీఆర్‌ఎస్‌కు వెలమ కులానికి చెందిన వాణిజ్య వేత్తలు బాసటగా నిలిచారు.

అయితే చాలా సందర్బాలలో ఈ కులాల్లో వ్యాపారాభివృధ్ధి సాధించిన వారే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా ముందుకు వస్తూవుండటం చూస్తుంటాం. కానీ వాణిజ్య వేత్తల్లో రెండోతరం నుంచి మెల్లగా ప్రత్యక్ష రాజకీయాల పట్ల కొంత విముఖత వస్తుంటుంది. వీలుంటే తమ పనులను చేయించుకోవటానికి తమ తరపున వేరే వారిని రాజకీయాలకు దించుతారు కానీ, తామంతట తాము దిగరు. గత పదేళ్ళలో ఆంద్రప్రదేశ్‌ లోని ప్రముఖ పారిశ్రామిక గ్రూపులలో ఈ స్థితి కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెంద్రి పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలోని పలుదేశాలలో వాణిజ్యం చేస్తున్నారు. అందుకు వారికి కేంద్రంలో యూపీయే-1, యూపీయే-2 పాలన వల్ల సౌఖ్యాన్నే పొందారు.కానీ రాష్ట్రంలోనే, కాంగ్రెస్‌పాలనను జీర్ణించుకోలేక పోయారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేదని కూడా ఇప్పుడిప్పుడు గ్రహించారు. అయితే వారిలో ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటానికి ఇష్టం లేదు.

‘సత్తా’ సరిపోలేదు!

‘లోకసత్తా’ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఒక కులానికి కొమ్ముకాస్తున్నట్టుగా ఎప్పుడూ ప్రవర్తించక పోయినా, కమ్మ సామాజిక వర్గంలోని ఎగువ మధ్యతరగతికి చెందిన వారు, ఆయనను తమ ‘ఆశాజ్యోతి’ గా చూసుకున్నారు. ఆ వర్గానికి చెంది మాధ్యమాలు ఆయనకు విశేషప్రచారాన్ని కల్పించాయి. గత దశాబ్ద కాలంలో ఆయన కనుక, విజయం సాధించి వుంటే, ఆ కులంలోని సంపన్న వర్గం కూడా ఆయనకు తమ మద్దతును ఇచ్చివుండేవి. ఎన్టీఆర్‌ కన్నా, చంద్రబాబే తమ వర్గప్రయోజనాలు నెరవేరుస్తారనుకున్నప్పుడు, ఎన్టీఆర్‌ను వదలి, చంద్రబాబుకు అత్యంత సులభంగా తమ మద్దతును ఇవ్వగలిగారు. వారి వర్గానికి చెందిన మాధ్యమాలు కూడా అందుకు వంత పాడుతూ చంద్రబాబు చర్యను ‘వెన్నుపోటు’ గా కాకుండా ‘తిరుగుబాటు’గా చిత్రించాయి. అక్కడికి, జయప్రకాశ్‌ నారాయణ కుకుట్‌ పల్లి నియోజక వర్గం నుంచి గెలుపొందటంలో, అక్కడ స్థిరపడి వున్న ఆ సామాజిక వర్గం వారి తోడ్పాటు వుందన్న ప్రచారం అప్పట్లో బలంగా సాగింది. కానీ ఎంత చేసినా, ఆయన పార్టీకి ‘ఒక్క సీటు’కే పరిమితపోయారు.

చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయాన్ని ఇప్పటికీ ఆ వర్గం ప్రవేశ పెట్టలేక పోతోంది. అలా వచ్చిన నేత తెలుగుదేశం పార్టీకి పారంపర్యంగా వస్తున్న బీసీల, మైనారిటీల వోట్లను ఆకర్షించుకోగలగాలి. అది వీలు కాక పోవటం వల్లనే, ఈ వర్గం చంద్రబాబునే మొయ్యాల్సి వచ్చింది. కాదూ అంటే, జనాకర్షణ వున్నా రాజకీయ పరిణతి అంతగా లేని బాలయ్యనో, రెండూ వున్నా తగినంత వయసులేని జూనియర్‌ ఎన్టీఆర్‌నో- ఈ వర్గం పూర్తిగా నమ్ముకోలేని స్థితి వుంది.

పైపెచ్చు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొన్ని పార్లమెంటు సీట్లు దక్కించుకోగలిగినా, కేంద్రంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో అంతు పట్టని స్థితిలో, ఈ కులానికి చెందిన పారిశ్రామిక వర్గం యోచిస్తోంది. యూపీయే, ఎన్డీయే కాకుండా- ఒక స్పష్టమైన రూపం లేని ‘ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌’కు బాబు మద్దతును ప్రకటిస్తున్నారు. కానీ ఆ ‘ప్రంట్‌’ను నమ్ముకుని తమ వాణిజ్య భవిష్యుత్తును ఈ పారిశ్రామిక వేత్తలు నిర్మించుకోలేరు.

ఎలా చూసినా, చంద్రబాబుకు ప్రత్యామ్నాయం అవసరమన్న భావన వీరిలో నానాటికీ బలపడుతోంది. కానీ, ఆ ప్రత్యామ్నాయం 2014 లోగా కార్యరూపం దాలుస్తుందన్న నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. అందుకే మూడేళ్ళు తిరక్క ముందే ‘ప్రధాన ప్రతిపక్షం’ కాస్తా, ‘అప్రధాన ప్రతిపక్షం’ మారిపోయింది.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 30 నవంబరు 6డిశంబరు2012 వ సంచికలో ప్రచురితం

3 comments for “బాబూ! ‘సైకిలు’ దిగుతారా?

 1. Nara Chandrababu NAIDU chose politics as a career to make money for his family/caste.
  Jaganmohan REDDY chose politics as a career to make MORE money for his family/caste.
  BC/SC/ST/MC people should reject Lokesh babu/Jagan babu/KTR babu (Kamma/Reddy/Velama) hegemony.
  Their population in AP is less than 15%.
  90% of corrupt money is with them.
  Go and vote only for your Caste as per “Communal Award”.
  Otherwise your children/future generations will regret.

Leave a Reply