బాపు సృష్టి రహస్యం
బాపూ,రమణలు మీడియాకు ఇంటర్య్యూలు ఇచ్చేవారు కారు. ప్రచారానికి పది కిలోమీటర్లలోనే ఇద్దరూ వుండేవారు. తమకి నచ్చని సంభాషణలు ఎవరయినా చేస్తే ఇద్దరూ ముడుచుకుపోతారు. బాపు అయితే పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోతారు. వారు ఎవరితో మాట్లాడినా పది,పదిహేను నిమిషాల్లోనే మౌనం లోకి వెళ్ళిపోతారు. అయితే అనుకోకుండా 2011జులై నెలాఖరున ఆయన్ని నేనూ, నా మిత్రుడూ కలిసినప్పుడు ఆయన ఎక్కువ సేపు మాతో ముచ్చటించారు. మా కలయకను సుసాధ్యం చేసింది ‘స్వాతి’ సంపాదకులు వేమూరి బలరామ్. మేం కలసి వచ్చాక, ఇలా, దాదాపు రెండు గంటల వరకూ మాతో బాపు మాట్లాడారని చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. ఇంటర్య్యూ అని మేమూ చెప్పలేదు, ఆయనా అనుకోలేదు. కేవలం సంభాషణలు మాత్రమే. బాపును తలచుకోవటానికి ఈ సంభాషణల్లోని కొన్నింటిని స్పురణకు తెచ్చుకునే ప్రయత్నమే చేశాను. అంతే తప్ప వృత్తిపరంగా, ఒక పత్రికా సంపాదకుడిగా చేసిన ఇంటర్వ్యూ ఎంత మాత్రమూ కాదని పాఠకులు భావించగలరు
‘కంచంలో మర్డర్ జరిగినట్లు లేదూ…!’
అన్నది హంతకుడు కాడు, ఓ పసివాడు. అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకున్నాక, అతడికి గలిగిన రసాత్మక భావన. ఆ పసివాడెవరో కాదు, ఓ సంపాదకుడి కొడుకు.
బాపు తీసిన ‘ముత్యాల ముగ్గు’ ప్రభావం. వాళ్ళ నాన్నకు చెప్పి చూశాడో, చెప్పకుండా ఎక్కువ చూశాడో, మొత్తానికి ఎక్కువ సార్లే చూసినట్టున్నాడు. రమణ రాసిన మాటల్ని కాంట్ట్రారు పాత్రలో వున్న రావుగోపాలరావు ఆగి ఆగి, నొక్కినొక్కి, తాపీగా, తీరిగ్గా, పొగ పీల్చి వదలుతూ, సంధ్యకేసి చూస్తూ పలికిన మాటలు వాడి మనసుకి పట్టేశాయి:
‘ఆకాశంలో మర్డర్ జరిగినట్లు లేదూ… సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ… ‘
‘ఎస్ సార్’
‘… ఎస్సార్ కాదు, కల్లెట్టుకు సూడు. మడిసయి పుట్టింతర్వాత, కాత్తంత కలాపోసనుండాల’
దాంతో భోజనం దగ్గర కూర్చున్న కుర్రాడికి ఈ మాటలకి అనురణ తన్నుకుంటూ వచ్చేసింది.
చిత్రం! ఈ ముచ్చట చెప్పింది కూడా బాపూయే.
IIII IIII IIII
అదో మిట్ట మధ్యాహ్నం. పాపం. ఆ వేళకు బాపు భోంచేశారో లేదో తెలీదు. నేనూ, నా మిత్రుడు పి.వి.సునీల్ కుమార్(వృత్తి రీత్యా పోలీసు అధికారి, ప్రవృత్తి రీత్యా రచయిత) కలిసి వెళ్ళి, హైదరాబాద్ , జూబిలీ హిల్స్ దస్పల్లా హొటల్ లో ఆయన బస చేసిన రూమ్ బెల్ నొక్కేశాం. తలుపు తెరుచుకుంది. చూసేశాం. బాపును చూసేశాం. కానీ కొత్తగా చూసినట్టులేదు. చప్పుడు లేని నిండయిన నవ్వు. ఎరిగినట్టే వుంది. కళను చూసేశాక కళకారూడూ, సృష్టిని దర్శించేశాక, సృష్టికర్తనూ, జన్మను అనుభవించేశాక అమ్మనూ చూస్తే కొత్త గా వుంటుందా? ఇదీ అంతే. రాతా, గీతా, (సినిమా) తీతా- అన్ని చూసేశాక, బాపు దగ్గర చనువు తీసుకోవటం మా జన్మహక్కుగా భావించేశాం. నిజానికి అది పునర్జన్మ హక్కులెండి. బాపు సృష్టి ‘కాత్తంత కలాపోసన’తో చూసిన వారెవరయినా మరోజన్మ యెత్తుతాడు.
ముందు ముక్తసరిగా మొదలు పెట్టారు కానీ, తర్వాత గోదావరిలో లాంచీ వేగం పెరగినట్లు ఆయన మాటల వేగం పుంజుకుంది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ‘ముత్యాల ముగ్గు’ ప్రస్తావన వచ్చినప్పుడు, ఇదుగో ఈ పసివాడి గురించి, ఆయనే మాతో చెప్పారు. ఆ కుర్రాడు ప్రఖ్యాత సంపాదకుడూ, రచయితా పురాణం సుబ్రహ్మణ్య శర్మ తనయుడు. బెజవాడ వెళ్ళినప్పుడు పురాణమే ఈ విషయాన్ని బాపుతో కలిసి పంచుకున్నారట. అంతా ‘రమణ గారి’ మహిమ- అంటారు.
మాకప్పుడు తెలిసిన రహస్యమేమిటంటే, బాపు గురించి తెలుసుకోవాలంటే రమణనీ, రమణ గురించి తెలుసుకోవాలంటే బాపునీ కలవాలి. బాపు నోరు విప్పితే ‘రమణ నామ స్మరణే’ . బహుశా రమణను కలిసి వుంటే ‘బాపు నామ స్మరణ’ చేసేవారేమో! కానీ మాకీ జ్ఞానోదయం కాస్త ఆలస్యంగా కలిగింది. అప్పటికే ఆయన వెళ్ళిపోయారు.
‘రామాయణం’ చుట్టూనే బాపు తిరిగాడని కొందరు ఆడిపోసుకుంటారు కానీ, ఆయన తిరిగింది ‘రమణాయణం’ చుట్టూనే. నిజమే. రామాయణాన్ని బాపు రకరకాలుగా తీశారు. పౌరాణికంగా నూ రామాయణమే. నిన్నమొన్నటి ‘శ్రీరామ రాజ్యమూ’ రామాయణమే, నాటి ‘ముత్యాల ముగ్గూ’ రామాయణమే. అందుకని, ఈ రామాయణం ప్రస్తావననే మేం తెచ్చాం. ఆప్పుడూ ఆయన రమణ గురించి చెప్పారూ.. అది మామూలు గాలేదు. తన ప్రాణ మిత్రుడే కావచ్చు, అయినా ఆకాశమంత యెత్తులో చూపించారు. ‘ఆయన ఒక్క వాల్మీకి రామాయణమే కాదండీ, మొల్ల రామాయణం దగ్గర నుంచి కొన్ని డజన్ల రామాయణాలను ముందు వేసుకుని అప్పుడు స్క్రిప్పు రాసేవారు.’ అందు చేత బాపు తీసిందంతా ఈ ‘రమణాయణమే’ మాకప్పుడు బోధపడింది.
IIII IIII IIII
నా వరకూ బాపు అంటే గీత, చేతి రాత. అమ్మా, నాన్నలు గుండ్రంగా నేర్పించిన తెలుగు అక్షరాలను, వయ్యారంగా రాయటం నేర్పించింది బాపునే. ఈ వయ్యారం ఎంత ముద్దుగా వుంటుందో, ప్రేమ లేఖ మీద ప్రయోగించినప్పుడు కానీ అర్థం కాలేదు. ఇక గీతా అంతే. బాపు రాతను చూసినా, గీతను చూసినా, ఒక్కటే అనిపించేది: ఒంపు, సొంపులు- అని రెండు మాటల్ని వేరు వేరుగా చెబుతారు కానీ ‘ఒంపే’, సొంపు. ఎంత పొడుగు జడయినా సరళ రేఖలాగా నిటారుగా వేళ్ళాడితే ఏం బావుంటుంది? ఒంపు తిరిగి భుజం మీద పడో, నడుము చుట్టూ తిరిగో ఒంపు తిరిగితే అందం. గీతను ఎక్కడ వంచాలో ఆయనకు తెలుసు కాబట్టే, అది ఆయన మాట వింటుంది. ఆ ఒంపే లేకుంటే, ఆ వొయ్యారమే లేకుంటే, కాలికి గజ్జె కట్టుకుంటున్న నర్తకి బొమ్మకీ, అదే రీతిలో స్వయంగా కాలికి బాండేజి వేసుకుంటున్న రోగికీ పెద్ద తేడా వుండదు. అందుకే బాపు బొమ్మలాగే కాదు, బాపు కథనాయికలాగా, మరొకరి సినిమాలో హీరోయిన్ వుండదు.
బాపు బొమ్మకీ, బాపు సినిమాకీ పెద్ద తేడా ఏమీ వుండదు. వొయ్యారంగా ఒక భంగిమలో బాపు బొమ్మ గీసేశాక, మళ్ళీ బాపూయే వచ్చి ఆ బొమ్మ చెవిలో ‘యాక్షన్’ అంటాడు, అంతే ఆ బొమ్మే కథానాయికయి మనముందుకు వస్తుంది. బాపు చిత్రాల్లో హీరోయిన్లు గోడకు చేరబడి కూర్చున్న తీరూ, నడుం వాల్చిన పధ్ధతీ, బోర్లా పడుకుని మోచేతుల మీద ఆనుకుని, గెడ్డాన్ని అరచేతుల్లో పెట్టుకున్న భంగిమా, మరొకరి చిత్రాల్లో మచ్చుకు సైతం కనిపించవు. కారణం ఒక్కటే. బాపు తెరకెక్కించే ముందు, ప్రతీ ఫ్రేమ్‌నూ చేత్తో గీసేస్తారు. ఈ పనిని ప్రసిధ్ద బెంగాలీ దర్శకుడు సత్యజిత్‌రే కూడా చేసేవారు. ఈ విషయాన్నే నేను ఆయన ముందు ప్రస్తావించాను. ఆయన ఈ విషయంలో ఏ మాత్రం ఖ్యాతిని తీసుకోవటానికి ఇష్టపడలేదు.
‘నేనే కాదండీ, కొంతమంది ఇతర దర్శకులూ ఇలా చేస్తారు. కాకపోతే, వారు ఆర్టిస్టులను పెట్టుకుని వారి చేత వేయించుకుంటారు. నాకు బొమ్మలు వచ్చి కాబట్టి నేను వేసుకుంటాను.’ అనేశారు. ఒక సన్నివేశాన్ని ముందు కాగితం మీద కదలని చిత్రంలా ఊహించుకుని, దాని స్థానంలో నటినో, నటుణ్ణో కూర్చోబెట్టటం వల్ల, వాళ్లు సైతం బాపు బొమ్మలుగా మారి వారు గొప్పగా కనిపిస్తారు. ( మిగిలిన సినిమాలో నయన తారకీ, శ్రీరామ రాజ్యంలో వుండే నయన తారకీ చాలా తేడా వుంటుంది) ఇది చిత్కళ. బాపు లాంటి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఇంద్రజాలం.
ఈ మ్యాజిక్‌కు గురయిన వారికి బాపు సినిమాలు చూడటం వ్యసనంగా మారిపోతుంది. వారికి హిట్టూ, ఫ్లాపులతో సంబంధం వుండదు. (1981లో) నేను బాపు తీసిన ‘త్యాగయ్య’ చూస్తున్నప్పుడు నాతో పాటు ధియేటర్లో అయిదుగురికి మించిలేరు. అయినా ప్రతీ ‘ఫ్రేమూ’ ఒక పెయింటింగ్ లాగా అనిపించింది.
ఇక మా సంభాషణలో నేను పెయింటింగ్ ప్రస్తావన కూడా చేశాను. ఆయనది గోదావరి ప్రాంతం కావటం వల్ల అక్కడి పెయింటర్లయిన దామెర్ల రామారావు, భగీరథలు ప్రస్తావన తీసుకొచ్చాను. అయిదారుగురు స్త్రీలను ఒకే చోట వేర్వేరు పనుల్లో నిమగ్నమయి వున్న జీవితాన్ని ‘కంపోజిషన్’ గా వేసే రామారావు చిత్రాలపట్ల ఆయనకు అమితమైన ఆరాధన వుందని, ఆయన మాటల్ని బట్టి అర్థమయింది. అలాగే ప్రకృతి రమణీయతను, మరీ ముఖ్యంగా విరిగిన కొండల్ని పెయింట్ చేసిన తీరు పట్ల కూడా ఆయన తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు. అంతలోనే ఆయనలో చిన్న దిగులు. మాటల ప్రస్తావనలో దామెర్ల వంటి వారు పెయింటింగ్ నేర్చుకున్న ‘జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’ గురించిన చర్చ వచ్చింది. ‘
నేనూ అక్కడ చేరి పెయింటింగ్ నేర్చుకోవాలని అనుకునే వాణ్ణి. కానీ అందులో చేర లేక పోయాను.’
సృష్టికి కళాత్మకంగా ప్రతిసృష్టి చేసిన మహా చిత్రకారుడు బాపు ఇలా అంటారని ఊహించగలమా? ఎంతో సాధించి కూడా ‘ఇంకా ఏదో తెలుసుకోలేక పోయాను’ అని అన్న ఆయన జిజ్ఞాస చూస్తే భయం కూడా వేసింది. విజ్ఞుల వినయం ఈ స్థాయిలో కూడా వుంటుందని, నాకయితే అప్పటి వరకూ తెలియదు.
ఇదే సందర్భంలో దేశ, విదేశీ చిత్రకారుల వైపు కూడా కబుర్లు వెళ్ళాయి. ఎందుకనో ఎం.ఎఫ్. హుస్సేన్ వైపు చర్చ వెళ్ళింది. తాను వేసిన చిత్రాలపై కొందరు దుమారం లేపటమూ, కడకు హుస్సేన్ దేశం విడిచి వెళ్ళటమూ ఆయన దృష్టికి తెచ్చాం. కళాకారుడి మీద ఆంక్షలు విధించ కూడదని చెబుతూనే. హుస్సేన్ హిందూ దేవతల్నీ, పురాణ స్త్రీలనీ కించపరిచే విధంగా కొన్ని చిత్రాలు గీశారని కించెత్తు అభ్యంతరం కూడా చెప్పారు. కొన్ని క్షణాల పాటు ఆయనలోని భక్తుడు బయిటకు వచ్చాడు.
అలాగని బాపుని ఒక మతానికో, ఒక కులానికో పరిధులు గీసి కూర్చోబెట్టలేం. అంతే కాదు. ఒక తత్వానికి కూడా ఆయన్ని పరిమితం చేయలేం. విప్లవకారులూ, హేతువాదులూ అయిన కవులు శ్రీశ్రీ, ఆరుద్ర రచనలు బాపు బొమ్మలు వేశారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలకు ఆంధ్రజ్యోతి వారపత్రికలో బొమ్మలు వేశారు. అలాగే ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘అరబ్బీ మురబ్బాల’కు బొమ్మలు వేశారు.
రామాయణాన్నే కాదు, భారతాన్ని సాంఘిక చిత్రాలుగా మలచటంలో ఆయన చూపిన ప్రతిభ ఇంతా అంతాకాదు. ‘ముత్యాల ముగ్గు’ లో రామాయణం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ‘మనవూరి పాండవుల్లో’ భారతం అదే తీరులో కనిపిస్తుంది. మంచికి వ్యూహం చేర్చిన వాడు కృష్ణుడయితే, చెడుకు వ్యూహం జోడించిన వాడు శకుని. ఈ రెండు పాత్రల్నీ ‘మనవూరి పాండవుల్లో’ కృష్ణంరాజు, అల్లు రామలింగయ్య పోషిస్తారు. అంతిమంగా కృష్ణుడి వ్యూహం ముందు, శకుని వ్యూహం గజగా వణికి పోతుంది.
‘కన్నప్పా(శకునీ)! కాకేమంటుందీ..?’
‘కావ్…కావ్.. కావ్..’
‘పిల్లీ?’
‘మ్యావ్ .. మ్యావ్.. మ్యావ్..’
‘కుక్కా?’
‘భౌ.. భౌ.. భౌ’
‘ఇవన్నీ దేని కూతలు అవి కూస్తాయి. కానీ, నువ్వు అన్ని కూతలూ కూస్తాయి.’
ఈ సన్నివేశం చిత్రించేటప్పుడు కృష్ణుడి విశ్వరూపం ముందు, శకుని నలుసులా కనిపిస్తాడు. ఈ విద్య బాపునకు మాత్రమే తెలుసు.
అలా సౌమ్యుడిలా కనిపిస్తారు కానీ ఆగ్రహాన్ని కళాత్మకంగా ప్రకటించటంలో బాపు ఉగ్రరూపం దాల్చుతారు. ‘వంశవృక్షం’ లో కుల వ్యవస్థను ఎండగట్టినప్పుడూ, ‘మిస్టర్ పెళ్ళాం’లో పురుషాధిక్యతను చీల్చి చెండాడినప్పుడూ, ‘బాపురే’ అని అనాల్సింది.
మేం 2011 జులై నెలాఖరున కలిశాం. ‘మీరు తర్వాత ఏం సినిమా తీస్తున్నారు?’ అంటే ‘కథ రాసేవారేరీ?’ అనేశారు. అప్పటికే ఆయన రమణను కోల్పోయారు. అలా తన చిత్రదర్శకత్వానికి రమణ చేతనే ‘శుభం కార్డు’ వేయించారు. ‘శుభం కార్డు’ అంటే బాపు ‘కార్టూన్’ ఒకటి గుర్తు కొస్తుంది. సినిమా అయిపోయింది. సినిమా హాల్లో రెండు తలలు మాట్లాడు కుంటున్నాయి: ‘ఇంత కంగాళీ సినిమాను నా జీవితంలో చూడలేదు’ అంది ఓ తల. అప్పటికి తెరమీద శుభం కార్డు పడింది. అది ఎలా రాసి వుందో తెలుసా? ‘భశుం’. బాపు అంటనే నవ్వు. నవ్వే ఆయన జీవితానికి శుభం కార్డు.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 6-12 సెప్టెంబరు 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)
BAAPU BOMMAKI CHAKKATI RAATHA NI JODINCHE SAAMARTHYAM UNNAVAARU maa sri SATISH CHANDAR GARU,,,
E storyline lo krishnapuraju…allu ramalingaiah madya jarigina sambashana chala baga ardhamyndhi….superb sir…
చాలా అద్భుతం సర్! బాపుగారి గురించి తెలుసుకోవాలంటే రమణగారినడగాలి. రమణగారి గురించి తెలుసుకోవాలంటే బాపుగారినడగాలి అనడం అందంగా వుంది. చాలాకాలం క్రితం బాపు-రమణ గార్ల గురించి నేను ఒక వ్యాసం రాస్తూంటే ఒకావిడ నన్ను అమాయకంగా అడిగింది, ‘బపు – రమణ అంటే ఇద్దరూనా? నేను ఒక్కరే అనుకున్నానే!’ అని… అప్పుడు ఆవిడ ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాను నేను. తెలీక అన్నా నిజమే అంది. బ్రహ్మ బాపు – రమణలను కిందకు పంపుతున్నప్పుడు ఆత్మ ఒక్కటే వుందేమో… అందుకే, రెండు శరీరాల్లో ఒకే ఆత్మను అమర్చాడు. ఆయన ఏ పరిస్థితుల్లో, ఏ ఉద్దేశంతో చేసినా మంచిపనే చేశాడు. బాపు – రమణలు నభూతో న భవిష్యతి, అజరామరం, చిరస్మరణీయం! ఎన్నని చెప్తాం!