భూగర్భశోకం

(వెలి అంటే- ఊరికి మాత్రమే వెలుపల కాదు, ఉత్పత్తికి కూడా వెలుపల వుంచటం . అంటరానితనమంటే, వొంటిని తాకనివ్వకపోవటం మాత్రమే కాదు, వృత్తిని తాకనివ్వక పోవటం కూడా. వ్యవసాయమే ఉత్పత్తి అయిన చోట, దానికి చెందిన ఏ వృత్తినీ అస్పృశ్యులకు మిగల్చలేదు. అందుకే వారు ఇతరులు చేయటానికి భయపడే (కాటికాపరి లాంటి) వృత్తులూ, చేయటానికి అసహ్యించుకునే(మృతకళేబరాలను తొలగించే) వృత్తులూ చేపట్టాల్సివచ్చింది. అందుకే గుడిలో ప్రవేశించటమే కాదు, మడి(చేను)లోకి చొరబడటమూ తిరుగుబాటే అయింది. ఈ పనిచేసినందుకు లక్ష్మీపేట దళితులను అక్కడి కాపు కులస్తులు నరికి చంపారు. వారి పోరాటస్పూర్తితో వచ్చిందే ‘భూగర్భశోకం’ కవిత.)

Illustration:AKBAR

ప్రతీ చరణమూ మరణమేనా

ఎవడు కట్టాడ్రా ఈ పాటని

ఏడ్చిన ఏడ్పునే ఏడ్వమంటున్నారు

చచ్చిన చావునే చచ్చినంత సులువు కాదురా ఇది.

నన్ను పట్టుకొని పూలచెట్టును ఊపినట్టు ఊపేశాక,

నా కన్నీటి గుత్తులన్నీ రాలిపోయాక,

ఇంకా ఏముంటాయి ఒలికించటానికి?

ఎండిపోయిన కొమ్మలవైపూ, పొడిబారిన కన్నుల వైపూ ఎంత చూసినా ఒక్కటే.

 

నేనూ మీలాగే తెగిన శిరస్సుల మధ్య తిరుగాడుచున్నాను.

తండ్రిమొండాన్ని ఒడిలో పెట్టుకున్న చెల్లి అడిగింది:

‘అన్నా ఏ తలల్ని వెతుకుతున్నావ్‌? ఎత్తిన తలల్నే కాదు, దించిన తలల్నీ నరికేశారు’

‘నేను కుత్తుకల్ని కాదు తల్లీ, కుత్తుకల్ని చూసి భయపడ్డ కత్తుల్ని వెతుకుతున్నాను.’

ఆమె కన్నార్పకుండా చూసింది. నీళ్ళు ఆవిరయ్యాయి.

నిద్రలేని దీర్ఘరాత్రిలాగా, ఏడుపు రాని నిట్టూర్పు

 

నెత్తుటి మడుగుల్లోనే నడుస్తున్నాను.

బాహువులు లేని భర్త దేహాన్ని మోస్తున్న భార్య అడిగింది:

‘తమ్ముడూ, ఏ చేతుల్ని గాలిస్తున్నావ్‌? ఓడించిన చేతుల్నే కాదు, జోడించిన చేతుల్నీ తీసేసారు’

‘అక్కా, నేను చేతుల్ని కాదు, చేతులకు చిక్కిన నాగళ్ళను గాలిస్తున్నాను’

రెప్పలు టప టపలాడిస్తూ చూసింది. చుక్క రాల్లేదు.

కురవబోయి ఆగిన మబ్బులాగా, గొంతు పెగలని దిగులు

 

 

అరవయ్యెకరాల భూమిలో సంచరిస్తున్నాను.

మెలికలు తిరుగుతున్న నిండు చూలాలు అడిగింది:

‘బిడ్డా, ఏ గర్బాలను శోధిస్తున్నావు? కడుపుతో వున్న స్త్రీలనే కాదు. పొట్టమీద వున్న చేలనూ చిదిమేశారు’

‘గర్బాలను కాదు తల్లీ! తొక్కిన పశువుల్ని గాలిస్తున్నాను’

ఏడ్వలేక నవ్వబోయింది. కన్నీటి జాడ లేదు.

అడ్డం తిరిగిన బిడ్డను కనలేకపోయనట్లు, నొప్పిని దించుకోలేని దు:ఖం.

 

అవును.

మోడయిన చెట్టునూ, ఎండిన ఏరునూ,ఏడ్వలేని మనిషినీ, అన్నీ నేనే.

నేను పుష్పించటమంటే భోరున విలపించటమే.

నేను ప్రవహించటమంటే గుండెలు బాదుకోవటమే.

చాలు.

నేను నలిగి ముక్కలవతున్నప్పుడు, మీరు ఎగిరి చప్పట్లు కొట్టింది చాలు.

నేను విలవిలలాడుతున్నప్పుడు, మీరు గలగలా నవ్వింది చాలు.

నేను వాడంత చిన్నబోయినప్పుడు, మీరు ఊరంత పెరిగిపోయింది చాలు.

నాకు తెలుసు

నా చలనం మీకు వినోదం

వలలోని చేప పిల్ల పెనుగులాటే చలనమయితే, నేను నిశ్చలనన్నావుతా.

వధ్యశిలపై గొర్రెపిల్ల ఆక్రందనే శబ్దమయితే, నేను నిశ్శబ్దాన్నవుతా.

హంతకుడిచ్చే ఎక్స్‌గ్రేషియాయే శోకమయితే, నేను అశోకాన్నవుతా.

 

రాల్చటానికి అశ్రువులు లేని ఆశోకవృక్షం –

కలలు తొలగిన ఆడపడుచుతనంలాగే వుంటుంది.

హరివిల్లు ఎరుగని అనాథాకాశంలాగే వుంటుంది.

నిండు వసంతంలో కోకిలమ్మ మౌన వ్రతంలాగే వుంటుంది.

 

ఏడ్వకుండా వుండటం కష్టంగానే వుంది,

కానీ లోలోపల కాలు దువ్వుతున్నట్టుంది. కాక వేసుకుంటున్నట్టుంది. నోటిలో చుట్టను తిరగేసి పెట్టుకుని గుప్పుతున్నట్టుంది. నిప్పును మింగి పొగలు కక్కుతున్నట్టుంది. నాలోనేను మందుగుండు కూరుకున్నట్టుంది. కంటి చెమ్మనే కాదు, ఒంటి చెమ్మనంతా ఆవిరి చేసుకున్నట్టుంది. ఉత్త కట్టెనయి పోయినట్టుంది.

 

చిగురించినంత వరకూ చీదరించుకున్నారు.

పుష్పించినంత వరకూ తుంచుతూనే వున్నారు.

పెనుగాలికి మెలికలు తిరిగినప్పుడెల్లా పెదవులపై జాలిచూపారు.

ఏడ్వటం మానేసిన చెట్టును ఏమి చెయ్యగలరు?

 

ఏడ్వటం మానెయ్యటమంటే-

కొమ్మలు చాచి నీడకు రమ్మని అడుక్కోవటమూ,

పండ్లిచ్చి రాళ్ళతో కొట్టించుకోవటమూ, తనువంతా గంధమయి తుపుక్కున ఉమ్మించుకోవటమూ నిలుపు చెయ్యటమే.

 

పొడి పొడిగా, వేడి వేడిగా, మంట మంటగా వుంది.

మొండి బారిన చెట్టుకు చిగురు బదులు పొగరు పుడుతందని తెలీదు.

కోపం కోపంగా వుంది, పులులు పురుగుల్లా వున్నాయి.

పువ్వు పూయని తరువుకు పగ పూస్తుందని తెలీదు.

కొత్త కొత్తగా వుంది. ఇలాగే ఉండిపోవాలన్నంత మత్తుగా వుంది..

 

ఎందుకో, వచ్చిన దారిన వెళ్ళాలని పించింది.

చెట్టుకు దయచూపటం తెలుసు.

కట్టెకు దహించటం తెలుసు.

తడిసిన వృక్షం మరో తడిసిన వృక్షాన్ని వెలిగించలేదు.

ఇప్పుడు నేను దగ్ధ వృక్షాన్ని. తడి ఆరిన ఏ మనిషినయినా వెలిగించగలను.

 

చితిపేర్చి నిప్పుకోసం వెతుకుతున్న కాటి కాపరిని కలిసాను.

నన్ను కౌగలించుకోమన్నాను. జ్వలించామిద్దరమూ.

రెండు పొడి రాళ్ళ మధ్యే కాదు, ఎండిన రెండుదేహాల రాపిడికీ నిప్పే పుడుతుంది.

 

మోగని డప్పును చేత బట్టిన ముసలి తాత ముందు నిలుచున్నాను

నా తల నిమిరాడు. అగ్ని కిరీటం వచ్చిపడింది.

రెండు కరెంటు తీగల్నే కాదు, ఎండిన రెండు పేగుల్ని కలిపినా మంటే పుడుతుంది.

 

నీరింకిన తనాన్ని నేనిప్పుడు నిలువెల్లా అనుభవిస్తున్నాను.

నే మండుతూ నలుగుర్ని మండిస్తున్నాను.

తాకని తనాన్ని తగలేస్తున్నాను.

 

చెట్టుకే నీరు, కట్టెకు నిప్పే.

నీనాభి రహస్యం తెలిసింది నాకిప్పుడు.

నీకు ఊరే భూమి, భూమే ఊరు.

వెలి వేయటమంటే-

నన్ను నేలమీద నుంచి గాలిలోకి వినిరేయటమే.

భూమ్మీద నా కాలు లేదు కనుకే, బువ్వలో నా వేలు లేదు.

 

రైతుగానే చనిపోగలవు నువ్వు.

బతికున్నా రైతనరు నన్ను.

చెట్టంత కూలీగా చచ్చి,

కట్టెంత రైతుగా అవతరిస్తాను.

 

నా ప్రేయసి నలుగుపెడుతోంది చూడు.

నా కట్టెను తొలచి తొలచి, వలచి వలచి, మలచింది చూడు.

నేనిప్పుడు వెలిని వెలివేసే నాగలిని.

భూగర్భగుడిలో ప్రవేశించే భక్తుడిని.

 

నున్ను కడుపులో పెట్టుకోవటానికి నా తల్లి తహతహలాడుతోంది చూడు.

నేను ముడుచుకుని ముడుచుకుని అమ్మ వొడిలో గుండ్రంగా వొదుగుతాను చూడు

నేనిప్పుడు పంటను మోసుకు పోయే బండి చక్రాన్ని

భూమాత నుదుటి మీది కుంకుమ పొడిని.

 

చేవ దేరిన చెట్టునే.

చెమ్మ చచ్చిన కట్టెనే .

నరుకు. ముక్కలు ముక్కలుగా నరుకు. నరికే కొద్దీ, చెట్లుకూలతాయోమో కానీ, కట్టెలు రెట్టింపవుతాయి.

తరుగు. తునకలు తునకలుగా తరగు. తరిగే కొద్దీ ప్రేమలు చెరుగుతాయేమో కానీ, పగలు చెలరేగిపోతాయి.

 

రా. నేవచ్చిన దారిలోనే మారిన దృశ్యాలు చూడు.

‘ఎక్కడికి వెళ్తున్నావు చెల్లీ, నీ తండ్రి మొండాన్ని తీసుకుని?’

‘చివరి కోరిక తీరుస్తున్నా. నా తండ్రి చేతుల్తో కలల్ని చిమ్మించినట్లు, విత్తనాల్ని చల్లిస్తున్నా.’

 

‘అక్కా! బాహువులు లేని భర్త దేహంతో ఎక్కడికి’

‘వీలునామా రాయిస్తున్నా, తెల్లకాగితంపై వేలి ముద్రలు నొక్కించినట్లు, నల్ల బురదలో కాలి ముద్రలు వేయిస్తున్నా’

 

‘తల్లీ! నిండు గర్భంతో ఎటువైపు?’

‘పండిన చేలో పకపకా నవ్వగల శిశువుని ప్రసవిస్తున్నా’

 

ముక్కలు ముక్కలయిన నేను

చేను కు నిప్పుల కంచెనవుతాను.

సహనమూ కాదు, మరణమూ కాదు,

దహనమేరా నా పాటకు చివరి చరణం.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య అనుబంధం ‘వివిధ’లో 3-9-12 నాడు ప్రచురితం)

4 comments for “భూగర్భశోకం

  1. మీ అక్షరమంటేనే ప్రాణం నాకు.ఇక అది కవిత్వమయితే!వ్య్థథార్థజీవుల పక్షంనుంచీ మీరు విసిరే అక్షర తూణీరాలు చాలా పదునయినవి.నాకు తెలిసి ఇవాళ్టి పాత్రికేయులలో మీ అంత సునిశితంగా, పరిణతితో వ్యంగ్యాస్త్ర ప్రయోగం చేయ గలవారు లేరు(tv 1-మీ jounalist Dairy ని మిస్ కాకుండా చూసే వాళ్ళలో నేనూ ఒకడిని.రైతు విషాదం మీద మీరు రాసిన ఈ కవిత రైతుకష్టమ్ వున్నంత కాలం గుర్తుకొస్తుండేదే.నా బ్లాగ్ లో కూడా ఉంచుకుంటున్నాను.ధన్యవాదాలు సతీష్ చందర్ జీ!

  2. జీవితంలో మొట్ట మోదటి సారి నిజంగా మనిషిని చుసినట్టు వుంది సార్. అది మీరె.
    భాదో సంతొషమో తెలియదు. కంటి నించి నీరు ఆగడం లేదు.

Leave a Reply