మళ్ళీ వచ్చిన ‘మహిళావోటు బ్యాంకు’

నోట్లకే కాదు, వోట్లకూ బ్యాంకులుంటాయి.

కులానికో బ్యాంకు, వర్గానికో బ్యాంకు, మతానికో, ప్రాంతానికో బ్యాంకు -ఇలా వుంటాయి. అన్ని పార్టీలకూ, వాటి అగ్రనేతలకూ అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లుండవు.

ఆంధ్రప్రదేశ్‌నే తీసుకోండి. ఒకప్పుడు తెలుగుదేశానికి కమ్మ కులం వోట్లతో, బీసీల వోట్లు వుండేవి. కాంగ్రెస్‌కు రెడ్డి, కాపు, కులం వోట్లతో పాటు షెడ్యూల్డు కులాల, తెగల వోట్లు వుండేవి.

ఇప్పుడు మారిపోతున్నాయనుకోండి. కానీ, ఎప్పుడో కానీ, జెండర్‌ని బట్టి వోటు బ్యాంకు ఏర్పడదు. ఒకే వేళ ఏర్పడితే చాలా కాలం వుంటుంది. ఇలా ఏర్పడ్డప్పుడు మహిళా వోటర్లు కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా తాము అభిమానించే వారికి వోటు వేస్తారు.

ఈ మహిళా వోటు బ్యాంకు తొలుత ఇందిరా గాంధీకి వుండేది. ఆమెను ‘అమ్మ’గాభావించే పేదమహిళలు దేశమంతటా వున్నట్లే, రాష్ట్రంలోనూ వుండేవారు.(తర్వాత సోనియా గాంధీ వచ్చినా ఈ ‘అమ్మ’ వారసత్వం ఆమెకు బదిలీ కాలేదు. కాకుంటే ఇందిరమ్మ కుటంబం పట్ల వుండే సానుభూతి దేశంలో ఏదో మేరకు కొనసాగుతోంది.)

ఇక ఆతర్వాత ‘తెలుగింటి ఆడపడచులు’గా సంబోధించిన ఎన్టీఆర్‌కు వచ్చింది. అందుకే ఆయన్ని ‘అన్న’గా భావించారు. (ఆ తర్వాత ‘పొదుపు సంఘాల’ తో ఎంత ప్రయత్నించినా ఆ వరసతో చంద్రబాబును మహిళలు పిలవ లేక పోయారు.)

మళ్ళీ చాలాకాలం తర్వాత వైయస్‌. రాజశేఖర రెడ్డికి వచ్చింది.

ఈ పేర్లు రావటానికి పెద్ద పెద్ద కారణాలేవీ వుండవు. ఒక్కోసారి ఒక్కో జనాకర్షక పథకం సరిపోతుంది. ‘పక్కా ఇళ్ళ’తో ఇందిరాంధీ, ‘కిలో రెండు రూపాయిల బియ్యం’తో ఎన్టీఆర్‌, ‘పావలా వడ్డీ రుణాల’తో వైయస్‌ కూడా మహిళలు ‘వోటు బ్యాంకులు’ గా మారారు. ఆ తర్వాత ఇవే పథకాలను ఇతరులు మరింత చేరువలోకి తెచ్చినా, జనాకర్షణ వారికి బదిలీ కాలేదు. తాజా ఉదాహరణలు: కిరణ్‌కుమార్‌ రెడ్డి ‘కిలో రూపాయి బియ్యం, వడ్డీలేని రుణాలు’.

అంతే కాదు, ఒక్కసారి మహిళలు అభిమానించటం మొదలు పెట్టాక, వారి మీద ఎన్ని మచ్చలు పడ్డా- ఆ అభిమానం తొందరగా పోదు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ని మించిన ‘చీకటి పాలన’ స్వతంత్ర భారత చరిత్రలోనే లేదు. అలాంటి రోజుల్లో కూడా ఆమెను ఆంధ్రప్రదేశ్‌లో ‘అమ్మ’గానే ఆదరించి, అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సీట్ల(42కూ 41)ను ఇచ్చారు. ఎన్టీఆర్‌ ద్వితీయ వివాహం చేసుకోవటాన్ని లోకం ‘తప్పు పడుతున్నా’, ‘తెలుగింటి ఆడపడుచులు’ మరో మారు ఆయనకి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు.

వైయస్‌ విషయంలోనూ అలాగే జరుగుతోంది. ‘జగన్‌ అక్రమాస్తుల’పేరిట ఒకటి కాదు, రెండు కాదు. పలు కేసులు బిగుసుకున్నాయి. సిబిఐ తవ్వే కొద్దీ ‘పెట్టుబడుల రూపంలోని ముడుపులు’ బయిట పడుతున్నాయి. అన్నీ వైయస్‌ హయాంలో జరిగిన ‘ఆర్థిక నేరాలు’గానే సిబిఐ అభియోగాలు మోపుతోంది. ఫలితంగా జగన్‌ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే, అంతిమ తీర్పును న్యాయస్థానాలు ఇవ్వాల్సి వుంది. అది వేరే విషయం. ఇంత జరిగినా, సీమాంధ్రలో వైయస్‌ పై సానుభూతి( ఆయన మరణానంతర అకర్షణ, సానుభూతిగా మారింది) చెక్కు చెదరటం లేదు. ఇది జగన్‌ సభలకొచ్చిన జనాన్ని బట్టే కాకుండా, అంతకు ముందు జరిగిన కడప ఉప ఎన్నికప్పుడు కూడా నిరూపణ అయింది. జగన్‌ అరెస్టు తర్వాత ఈ సానుభూతి మరింత పెరిగింది. ఇప్పుడు పెరిగిన సానుభూతి వల్ల ‘మహిళా వోటు బ్యాంకు’ మరింత సుస్థిరమయ్యే అవకాశం కనిపిస్తోంది. కారణం జగన్‌ అరెస్టు. ఆయన ఆరెస్టుతోనే తల్లి(విజయమ్మ), చెల్లెలు(షర్మిల), భార్య(భారతి) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. విజయమ్మ ఇదివరకే రాష్ట్రప్రజలకు సుపరిచితురాలైనప్పటకీ, షర్మిల, భారతిలు మాత్రం – జగన్‌ అరెస్టు నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చారు.( అంత వరకూ కడప జిల్లా ప్రజలకు మాత్రమే బాగా తెలుసు.) మరీ ముఖ్యంగా, హైదరాబాద్‌లోని దిల్‌ కుశా అతిథి గృహం ముందూ, లోటస్‌ పాండ్‌లోని వారి నివాసం వెలుపలా చేసిన దీక్షల సందర్భంగా షర్మిల, భారతిలు మీడియా ముందు మాట్లాడిన తీరును అందరూ ఆసక్తితో గమనించారు. ఆ వెనువెంటనే విజయమ్మ సారథ్యంలో జరిగిన ప్రచార సభలకు ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు హెచ్చు సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సభల్లో విజయమ్మను చూడటానికి వచ్చిన జనం, షర్మిల మాటలకు ఆకర్షితులవుతున్నారు. ‘రాజన్న కూతురుగా, జగనన్న చెల్లెలుగా’ తనను తాను పరిచయం చేసుకునే తీరు ఆకట్టుకుంటోంది.

 

జగన్‌ ప్రచార సూత్రాన్నే ఆయన తల్లీ, చెల్లీ పాటిస్తున్నారు. జగన్‌ సూత్రం ఒక్కటే: సానుభూతి. తండ్రి మృతి పట్ల సానుభూతి. కాబట్టే రెండేళ్లు ‘ఓదార్పు’ను కొనసాగించగలిగారు. సొంత ఇంట్లో మనిషి పోతే దు:ఖం కొన్ని వారాలుంటుంటుంది. కొన్ని నెలలుంటుంది. ఓదార్చే వారు కూడా ఈ మధ్య కాలంలోనే వెళ్తారు. కానీ వైయస్‌ మృతి వార్త విని ‘హఠాన్మరణం’ చెందిన వారిని ఏళ్ళ తరబడి ఆయన ఓదారుస్తూనే వున్నారు. ఆయన ఒక్క కుటుంబాన్ని ఓదార్చటానికి వెళ్ళితే ఊళ్ళకు, ఊళ్ళే ఆయనను చూడటానికి కదలి వచ్చాయి. కారణం ఈ ‘ఓదార్పు’ ఒక దు:ఖాన్ని తగ్గించి, వైయస్‌ లేడన్న దు:ఖాన్ని పెంచుతోంది. ఈ సానుభూతే, బహుశా ఆయనకు కావాల్సింది కూడా. ఇప్పుడు జగన్‌ ఇంటి మహిళలు(విజయమ్మ, షర్మిల,సావిత్రిలకు) ఈ సానుభూతిని రెండింతలు చేసుకునే ప్రయత్నంలో వున్నారు. ‘వైయస్‌ను లేకుండా చేశారు. జగన్‌ను జైల్లో వేశారు’. ఈ రెంటికీ కారకులుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను చూపిస్తున్నారు. విజయమ్మయితే జగన్‌ అరెస్టు వార్తను ధృవీకరించిన మరుక్షణం నుంచే, ‘వైయస్‌ మృతి చెందిన హెలికాప్టర్‌ ప్రమాదం’ మీద తన అనుమానాలు తనకున్నాయని, ‘ముగిసిపోయిన’ వివాదాన్ని మళ్ళీ ముందుకు తెచ్చారు. ప్రచారంలో కూడా ‘మూడునెలలుగా మూలన వున్న హెలికాప్టర్‌నే ఎందుకు వాడాలి?’ అనటం మొదలు పెట్టారు. దానితో పాటు ‘జగన్‌ నిర్బంధం’ సరేసరి. ఎక్కడా కూడా తాము ఆస్తులు చట్టబధ్ధంగా కూడబెట్టుకున్నవని చెప్పే వాదనలు కానీ, చూపే ఆధారాలను కానీ ప్రస్తావించటం లేదు. ‘రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని (మహిళలని) రోడ్డెక్కించారు’ అన్నదే వారు ప్రధానంగా వోటర్ల ముందు ఉంచదలిచారు. దీంతో మహిళలు ‘కుల,మత, వర్గాల’కు అతీతంగా వీరి ‘రోడ్‌షో’లకు తరలి వస్తున్నారు. దీంతో వైయస్‌ తో వున్న మహిళల వోటు బ్యాంకు, కాంగ్రెస్‌కు కాకుండా- వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కే బదిలే అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అయితే ‘ఈ రోడ్‌ షో’ లకు వస్తున్న ఈ జనమంతా, జగన్‌ అరెస్టుకు నిరసనగా (28 మే 2012 న) జరిగిన బంద్‌ లో భాగస్వాములయ్యారా? అలా అయి వుంటే, బంద్‌ (కడప మినహా మిగిలిన ప్రాంతాలలో)పాక్షికంగానూ, పెద్ద ప్రభావం చూపకుండానూ ఎందుకు ముగిసి పోయింది? ఇక్కడే వైయస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీకున్న బలమూ, బలహీనతా బహిర్గతమవుతున్నాయి. ఆ పార్టీకి ఇప్పటికే కొన్ని వోటు ప్రత్యేక మయిన వోటు బ్యాంకులు ఏర్పడ్డాయి. అందులో ప్రధానమయినవి రెండు.

ఒకటి: ఎస్సీల(దళిత క్రైస్తవుల) వోటు బ్యాంకు.

రెండు: రెడ్డి సామాజిక వర్గీయుల వోటు బ్యాంకు.

నిజానికి, మధ్యలో ఎన్టీఆర్‌ వచ్చినా, ఎస్సీల వోటు బ్యాంకు సీమాంధ్రలో కాంగ్రెస్‌తోనే వుండిపోయింది. కానీ వైయస్‌ మృతి తర్వాత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపారు. ఇందుకు కేవలం జనాకర్షక పథకాలే కాకుండా, వైయస్సార్‌ కుటుంబం మొత్తం ‘క్రైస్తవ మతం’లో వుండటం. (వైయస్‌ అంత్యక్రియలు క్రైస్తవ మతాచారం ప్రకారం జరిపారు. వైయస్‌ అల్లుడు బ్రదర్‌ అనిల్‌ రాష్ట్రంలోక్రైస్తవ ప్రచారకుడుగా పేరొందారు.). దళిత క్రైస్తవులు తమ నిరసనను ‘ఉపవాసాలు, ప్రార్థనలు’ వంటి వాటితో నాలుగు గోడల మధ్య తెలియజేస్తారు తప్ప ఎప్పుడో కానీ రోడ్డెక్కరు. ఇక రెడ్డి సామాజిక వర్గీయులు ఇంకా కొంత శాతం కాంగ్రెస్‌లో వున్నారు.

ఈ వోటు బ్యాంకు కాకుండా, నిజంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌కు నేడు జీవం పోస్తున్నది మహిళ వోటు బ్యాంకు. పటిష్టమైన పార్టీ నిర్మాణం వుండి, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎక్కడి కక్కడ రంగంలోకి దిగితేనే తప్ప ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద యెత్తున స్త్రీలు పాల్గొనరు.

కానీ సానుభూతి విపరీతంగా వున్నప్పుడు ఎలాంటి నిర్మాణం లేకుండా కూడా ఎన్నికలప్పుడు ఇదే మహిళలు పోలింగ్‌ బూత్‌ల మందు క్యూలు కడతారు. ఈ అనుభవం జూన్‌12 న జరగబోయే ఒక పార్లమెంటు, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో ఎదురు కావచ్చు.(తెలంగాణ ప్రాంతానికి చెందిన పరకాల నియోజకవర్గం ఇందుకు మినహాయింపు అయితే కావచ్చు.)

అయితే వైయస్సార్‌ కాంగ్రెస్‌కు శత్రువక్షాలయిన కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలు ఈ ఉప ఎన్నికల మీద మరీ పెద్దగా ఆశలు పెట్టుకోవటం లేదు. వీరి ప్రధానోద్దేశ్యం ఎన్నికల ముందూ, తర్వాత శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల వలసలను నిరోధించటమే. అయినప్పటికీ ఒకటీ, ఆరా జరగుతూనే వున్నాయి. కానీ ‘అష్ట దిగ్బంధనాని’కి గురయిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల వోటరుకి సానుభూతి కలిగి దగ్గరకు వస్తే, వేరే పార్టీలో వుండే ప్రజాప్రతినిధి అభద్రతతో దూకటానికి జంకుతాడు.

ఇలాంటప్పుడు ఉప ఎన్నికల తర్వాత జగన్‌ వ్యూహమేమిటి? బహుశా నిత్య ఉప ఎన్నికలు వుండే విధంగా చూడటమే ఆయన ముందున్న మార్గం. పెద్ద ఎత్తున ఎలాగూ ఇతర పార్టీలనుంచి వలసలు వుండవు. కానీ ఒకరూ ఇద్దరూ వస్తున్నప్పుడు వారి కారణంగా ఉపఎన్నికలు జరుగుతూ వుంటాయి. ఇలా 2014 వరకూ ‘సానుభూతి’ని బతికించుకోవచ్చని ఆయన భావిస్తారు.

అంతవరకూ తన కుటుంబ సభ్యుల సారథ్యంలో పార్టీ నడుస్తుంటుంది. ఇప్పటికే వున్న మహిళా వోటు బ్యాంకు వీరి కారణంగా మరింత స్థిరపడితే, ఇతర పార్టీల వారు సైతం తమ తమ పార్టీలోని మహిళా నేతల్ని ముందు పెట్టే అవకాశం వుంది. ఏమయినా ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలలోనే కాకుండా, 2014 ఎన్నికలలో కూడా సీమాంధ్రలో మహిళ వోట్లు కీలక పాత్ర పోషించే అవకాశం వుంది.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక కోసం  రాసిన వ్యాసం)

 

 

 

 

 

 

 

 

2 comments for “మళ్ళీ వచ్చిన ‘మహిళావోటు బ్యాంకు’

  1. అత్యంత విషాదకరం. చైతన్యవంతమైన ఆంధ్ర ప్రదేషు దిగజారిపోయింది. ఇంక ఎంతకాలం పడుతుందో. రెండు కమ్యూనిష్టు పార్టీల నాయకుల పనులవలన చంద్రబాబు నాయుదు, రాజశేఖరరెడ్డి వారి కుటుంబ సభ్యులు, స్నెహితుల ఆస్తులు, కంపేనీలు పెరిగాయి. ప్రజలకు లాటి దెబ్బలు, జైల్లు, తుపాకి కాల్పులు,చావులు. అంతకన్న ప్రజల చైతన్యం, నీరు కారిపోయింది. ఇది అత్యంత విషాదకరం. రెండు కమ్యూనిష్టు పార్టీలు బలహీన పడి పోవదం,బధకరం, అందువలన ప్రజల్లో చైతన్యం తగ్గి, దబ్బు చుట్టు మనుషుల మెదడులను తిప్పగలుగుతున్నారు. తిరిగి ఎన్ని త్యాగాలు చేయల్సివస్తుందో అని విచారిస్తున్నారు. ఈ రాష్త్రం, చంద్రబాబు నాయుడు జగన్ మోహన రెడ్డి డబ్బు ఆశలనుంచి బయటపడాలంటె ఎన్ని త్యాగలు చేయల్సివస్తుందొ ఈ రాష్త్రం. తప్పదు. కారల్ మార్క్స్ చెప్పినట్లు సమస్య గర్భంలోనే పరిష్కారం ఉంటుంది. కాని ఎన్ని త్యాగాలు చేయల్సివస్తుంది రెందు కమ్యూనిష్తు పార్టీలనాయకుల నిర్నయాలవలన. ఛైతన్య వంతమైన పార్టీలు వ్యక్తులు ఎంతొ క్రుషి చెస్తె మరల మనం సుందరయ్య, నాగిరెద్ది, తెన్నేటి గౌతు లచ్హన్న, దామోదర సంజీవయ్య మొదలైన వారు కూర్చున్న అస్సెంబ్లీని చూదగలం, అప్పటివరకు, కంపెనీలు, ఆస్తుల గొదవలు, షేర్ మార్కెట్ల, అస్సెంబ్లీ భరాయించల్సిందే.

Leave a Reply