మా ‘చెడ్డ’ వ్యసనం!

 ఎందుకో-

ఎవడయినా కొత్తగా చెడిపోయాడంటే నేను నమ్మను.

వాడు ఒకప్పుడు నిప్పు. ఇప్పుడు? బూడిద.

ఆ పిల్ల ఉందే….? వంచిన తల ఎత్తేదికాదు. ఈ మధ్యన పెళ్ళయిన వాడితో తలవంచుకునే లేచిపోయింది.

ఆ ఆఫీసరున్నాడే…? ఎవరయినా కాఫీ ఇప్పించినా తాగేవాడు కాడు. ఇప్పటికీ అంతే! ఏదీ తాగడు. తింటాడు. దొరికింది దొరికినట్టు తింటా డు…నోట్లూ.. కోట్లూ…!

ఈ జర్నలిస్టును చూస్తే అందరూ వణికి చచ్చేవారు. ఎవరి మీద ఏమి రాస్తాడో…అని. ఇప్పటికీ అతనంటే అదే వణుకు. ఎవరిని ‘బ్లాక్‌మెయిల్‌’ చేస్తాడో… అని.

ఆ నాయకుణ్ణి చూశారా…! వీధిలో వస్తుంటే అందరూ పక్కకు తొలగిపోయే వారు. ఇప్పటికీ అంతే. కానీ ఒక్కటే తేడా. అప్పుడు గౌరవంతో తొలగిపోతే, ఇప్పుడు అసహ్యంతో తొలగిపోతున్నారు.

వీళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే. కానీ, కొత్తగా చెడిపోయినవాళ్ళు కారు.

ఆ మాటకొస్తే…

ఎవ్వరూ కొత్తగా చెడిపోరు. ముందే చెడిపోయి వుంటారు. ఒక పథకం ప్రకారం దిగజారి వుంటారు.

కానీ కొత్తగా బాగుపడే వాళ్ళూ, కొత్తగా మంచి వాళ్ళయ్యే వాళ్ళూ వుంటారు.

ఎందుకంటే కొంతమందిని జీవిత మే నడ్డిమీద తన్ని మరీ మార్చుతూ వుంటుంది.

అలాంటి వాళ్ళు పరివర్తన చెందుతారు.

కానీ చెడ్డతనానికి మాత్రం పునాది ఆదిలోనే పడుతుంది.

నాకు తెలిసి సత్యం – అనే ఆదర్శవంతుడొకడుండేవాడు.

చిన్నప్పటినుంచీ ఆవేశపరుడి లాగే కనిపించేవాడు.

ఎక్కడో ఎవడో వందలీటర్ల పెట్రోలులో ఒక ఔన్సు కిరోసిన్‌ కలిపాడంటే… దేశం చెడిపోయిందని ఉద్రేకపడి పోయేవాడు.

అడపిల్లను అదే ఈడు కుర్రాడు పల కరిస్తే చాలు ‘ఈవ్‌ టీజింగ్‌’ అని చెప్పి కాలర్‌ పట్టుకునే వాడు.

వాళ్ళ మిత్రుడి చెల్లాయికి ఎవరో కుర్రాడు ప్రేమలేఖ రాశాడని తెలిసి, అతనికోసం గాలించి, పొరుగూరు సిని మాకు వెళ్ళాడని తెలుసుకొని, తానూ ఆ వూరు వెళ్ళి, అతని కోసం సినిమా థియేటర్‌ గేటు దగ్గర కాపుకాసి, అతడు కనపడగానే ఉతికి అవతల పారేసి, తన స్వంత ఖర్చుల మీద ఆసుపత్రిలో చేర్పించాడు.

తీరా చూస్తే, ఆ కుర్రాడు ఆ అమ్మాయికి ఒక ఉత్తరమే రాశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అప్పటికే పాతిక ఉత్తరాలు రాసి ఇచ్చింది. అది వేరే విషయం!

అదర్శాలు వల్లించటమే కాకుండా, ఇలా చేతల్లో చూపించే సత్యం అంటే మా అందరికీ వల్లమాలిన అభిమానం వుండేది.

స్త్రీలను గౌరవించే విషయంలో అయితే అందరికీ ఆదర్శప్రాయుడిలా వుండేవాడు.

కుర్రాళ్ళన్నాక సినిమాలు చూస్తాం కదా! సినిమా వాళ్ళ గురించి మాట్లా డుతాం కదా!

అప్పట్లో మా అభిమాన హీరోలుగా వున్న ఎన్టీఆర్‌, నాగేశ్వరరావులను చనువుగా ‘ఎన్టీవోడు’, ‘నాగ్గాడు’ అని అంటుండేవాళ్ళం.

కానీ మా సత్యానికి భయపడి-

ఆడవాళ్ళను మాత్రం సావిత్రిగారు, జమున గారు, వాణిశ్రీ గారు అంటుండేవాళ్ళం.

కానీ,

ఎందుకనో ‘వాంప్‌’ పాత్రలు వేసే జ్యోతిలక్ష్మీ, జయమాలిని లాంటి వాళ్ళ పేర్ల చివర ‘గారు’ అనే మాట వుంచలేకపోయేవాళ్ళం.

మా సత్యం అలాకాదు.

‘జయమాలిని గారు ఆ క్లబ్‌ డాన్స్‌ బాగా చేశారు’ అని అనేవాడు.

అతడి సంస్కారం మాకు రానందుకు మేంకొంత ఇబ్బంది పడేవాళ్ళం కూడా.

ఈ ఆదర్శవాది సత్యం అసలు పెళ్ళే చేసుకోడేమోనని భయపడ్డాం.

కానీ, ఒకరోజు హఠాత్తుగా పెళ్ళి వార్తతో వచ్చాడు.

అంటే పెళ్ళికార్డు ఇచ్చాడని పొరపడుతున్నారా? కాదు. కాదు.

తనకు అంతకుముందు రోజే పెళ్ళయిపోయిందన్న వార్త తెచ్చాడు.

మేం ముందు షాకయినా తర్వాత తేరుకుని, ఆ ‘అదృష్టవంతురాలి’ని పరిచయం చేయమని కోరాం.

మరుసటి రోజు వాళ్ళ ఇంటికి పిలిచాడు.

అందరమూ వెళ్ళాం.

మా సత్యం వంటగదిలోంచి ప్రత్యక్షమయ్యాడు.

‘ఈవిడే నా భార్య. పేరు జానకి గారు. మీరు మాట్లాడుతూ వుండండి. నేను ఒక్క క్షణంలో వచ్చేస్తా’. అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయాడు

‘నేను చేస్తానని ఎంత చెప్పినా వినకుండా ఆయనే వంట చేస్తున్నారు. నేను భర్తను కోరుకున్నాను. కానీ నాకు దేవుడు దొరికారు.’

అని ఆనందంతో ఆమె కంటతడి పెట్టింది.

అంతేకాదు ఆమెకున్న చిన్న ఫ్లాష్‌బ్యాక్‌ కూడా చెప్పింది.

ఆమె వేరే ఒకతన్ని ప్రేమించింది. పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసగించాడు.

ఇంకో విషయం కూడా చెప్పింది.

ఆమె మా సత్యం కన్నా వయసులో ఎనిమిదేళ్ళు పెద్దది. బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తోంది.

మా సత్యానికి సమాజ సేవే ముఖ్య మైన ఉద్యోగమని వేరే చెప్పనవసరం లేదు.

ఓ పదేళ్ళు గడిచిపోయాయి.

వరంగల్‌ పని మీద వెళ్ళినపుడు, మా సత్యం ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళాను.

ఇంటి వద్ద సత్యం లేడు. కానీ జానకి ఉంది.

ఆమె ముఖంలో కళలేదు. ఏదో దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న మనిషిలాగా అనిపించింది.

కానీ, ఆమెతో మాట్లాడాక అర్ధమయ్యింది. ఆమెకున్నది ‘మనోవ్యాధి’ అని.

‘మీ సత్యం లోకానికి మంచివాడే. నాకు మాత్రమే చెడ్డవాడు.’అన్నదామె.

సత్యం ఆటోమోబైల్‌ షాపులో చిన్న పని చేస్తున్నాడు. ఆమె బ్యాంకు మేనేజర్‌ హోదాలో వుంది.

అదేమంటే- ‘నన్ను వెక్కిరించటానికే ఆ పనిలో కుదిరాడు’ అని చెప్పింది.

ముందు ఆశ్చర్యపోయినా, తర్వాత ఆమె చెప్పిన వివరాలను బట్టి నిజమని నమ్మాల్సి వచ్చింది.

ఈ పదేళ్ళలోనూ, ఆమెకు ఒక పిల్లాడు పుట్టాడు.

ఆమెను పెళ్ళంటూ చేసుకున్నాడు కానీ, ఆమెతో బయటకు వెళ్ళటానికి ఇష్టపడడు.

కారణం మరేమీ కాదు. ఆమె వయసులో తనకన్నా పెద్దది. అదీకాక అంతకు ముందే ఆమె తన ప్రియుడితో ఇలాగే తిరిగి వుంటుందన్న స్ఫురణ.

ఆమెతో కలిసి ఒక అయిదు నిముషాలు కూడా కబుర్లు చెప్పడు.

కారణం ఆమె తన ప్రియుడితో రోజులు రోజులు ఇలాగే గడిపి వుంటుందన్న ఉక్రోషం.

ఎవరన్నా ఆఫీసు వాళ్ళు ఆమెకోసం ఇంటికి వస్తే చాలు-

ఆటోమోబైల్‌ షాపుకు వెళ్ళే ఆయిల్‌ దుస్తులతో కావాలని ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు. వద్దన్నా వినకుండా, తనే టీ పెట్టి తెచ్చి, అందరికీ సర్వ్‌ చేస్తాడు.

అక్కడికీ ఆమె జీతం మొత్తం అతని ఖాతాలోనే జమ చేస్తుంది.

డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేస్తాడు.

ఎవరికో చిన్న అవసరం ఉందంటే… తీసుకువెళ్ళి డబ్బు ఇచ్చి వస్తాడు.

తన సొంతభార్య జ్వరంతో మూలుగుతున్నా ఆసుపత్రికి తీసుకు వెళ్ళడు.

ఇప్పుడు చెప్పండి సత్యం మంచివాడా? చెడ్డవాడా?

సత్యానికి ఉన్న ఒకే ఒక వ్యసనం కీర్తి కండూతి.

చుట్టుపక్కలవాళ్ళ దృష్టిలో సత్యం అంతటి గుణవంతుడు లేడని అనిపించు కోవాలి.

ఈ ‘పేరు పిచ్చి’ అన్ని వ్యసనాలకన్నా చెడ్డది.

తాగుడూ, జూదం, దొంగతనం… ఇవన్నీ ఈ వ్యసనానికన్నా చిన్నవే.

అయితే ఈ వ్యసనం సత్యానికి కొత్తగా వచ్చింది కాదు.

ఎప్పటినుంచో వుంది.

మేం తెలుసుకోలేకపోయాం. కేవలం కీర్తి కోసమే ఆడవాళ్ళను గౌరవించేవాడనీ, కీర్తికోసమే సాహసకృత్యాలు చేసేవాడనీ, అదే కీర్తికోసమే జానకిని పెళ్ళి చేసుకున్నాడనీ ఇప్పుడర్ధమవుతోంది.

ఇంటావిడని ఏడిపించి ఊరును ఉద్ధరిస్తున్నా అని తిరుగుతున్న సత్యం ఏనాడో చెడిపోయాడు.

ఒక సహాయాన్ని ప్రేమతో చేసేవాడు ఎంత ఉన్నతుడో, కేవలం పేరుకోసం చేసేవాడు అంత నీచుడు.

అనుమానం లేదు. సత్యం నీచుడే!!

-సతీష్ చందర్

(సతీష్ చందర్ ‘చంద్రహాసం‘  పేరిట వేసిన అనురాగ కథలనుంచి.)

1 comment for “మా ‘చెడ్డ’ వ్యసనం!

Leave a Reply