ముద్దుల తనయుడికి ‘ముళ్ళ’ వారసత్వమా..!?

వారసత్వమే కావచ్చు. అందరికీ ఒకలాగా అందదు. కొందరికి పువ్వులతో వస్తుంది. ఇంకొందరికి ముళ్ళతో వస్తుంది. సోనియా గాంధీకి రెండో పధ్ధతిలో వచ్చింది.

ఆ మాట కొస్తే ప్రజాస్వామ్యంలో వారసత్వవమేమిటి.. ప్రేమలో మేనరికంలాగా!? కానీ మనదేశానికి అలాగే జరిగింది. (బ్రిటిష్‌) వలస వాదం పోయి, వారసత్వం వచ్చింది. అందుకే మనదేశంలో స్వరాజ్యానికి ఎంత వయసు వుందో, వారసత్వ రాజకీయాలకూ అంతే వయసు వుంది.

రాచరికం పోయినా, రాజు మీద జనానికి మోజు పోక పోతే, ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని రాజును చేస్తుంటారు; పూజిస్తుంటారు. అక్కడితో ఆగుతారా? రాజు కొడుకునీ, ఆ కొడుకు కొడుకునీ, కొడుకు లేక పోతే కూతుర్నీ ఇలా కొలుస్తూనే వుంటారు. బ్రిటిష్‌ పాలనకు ముందు రాచరికం వుండేది. ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యమనేది దేశ ప్రజల అనుభవంలోకి అంత తొందరగా రాలేదు. కాబట్టి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా, ‘సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామ్య’ రాజ్యాంగం రాసుకున్నాక కూడా, మనల్ని మనమే పాలించుకుంటున్నామన్న స్పృహ రాలేదు. అందుకు నూటొక్క కారణాలు వుండవచ్చు. దాంతో ‘ప్రధాన మంత్రి’ లో రాజును చూసేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడయిన నెహ్రూయే ఆ కుర్చీలో కూర్చున్నా సరే.. ఆయన్ని రాజు అనుకున్నారు. అందుకే ఆయన వృధ్ధాప్యంతో శుష్కించి పోయేంత వరకూ ప్రధాని పదవిని ఆయన వదల్లేదు; ఆయన్ను ప్రధాన పదవి వదల్లేదు. కారణం: ‘రాజు మరణానంతరమే మరో రాజు’ అనే భావనకు రావటం. కాంగ్రెస్‌ నేతలు కొంచెం ముఖమాట పడి మధ్యలో లాల్‌ బహుదూర్‌ శాస్త్రిని తెచ్చారు కానీ, వెంటనే నెహ్రూ తనయ ఇందిరాగాంధీని కూర్చోబెట్టినా జనం చప్పట్లు కొట్టేసేవారే. ఆలస్యం చేసి తేవటం చప్పట్ల చప్పుడు రెండింతలయ్యిందనుకోండి. అది వేరే విషయం. వారసత్వమే. కాంగ్రెస్‌ ‘పువ్వుల్లో పెట్టి’ ఇచ్చేసింది

నడమంతరపు ప్రజాస్వామ్యం

ఇందిరాగాంధీకి మాత్రం దేశం ఒకందుకు రుణ పడివుంది. ఇంతటి ‘రాచరికం’లోనూ ఆమె ప్రజాస్వామ్యపు అవసరాన్ని గుర్తు చేశారు. మధ్యలో ‘ఎమర్జన్సీ’ పెట్టి పౌర హక్కుల్నీ, వైరి పక్షనేతల హక్కుల్నీ ఒకే రీతిలో హరించటం వల్ల.. ‘మనకీ ప్రజాస్వామ్యం కావాలన్న మాట’ అని దేశం ఆలోచించింది. కానీ కాంగ్రెస్‌ కాదు. అది వారసత్వానికి కమిట్‌ అయిపోయింది. ‘జనతా పార్టీ పాలన’ లాంటి ఇంటర్వెల్‌ తర్వాత, కాంగ్రెస్‌ ఊహించిందే జరిగిపోయింది. మళ్లీ ఇందిరమ్మ గద్దెనెక్కారు. ఆ తర్వాత వారసత్వం మీద ‘ఉగ్రవాద’ నీడ పడింది. ఒక ఉగ్రవాదం ఇందిరమ్మను పొట్టన పెట్టుకుంటే, మరో ఉగ్రవాదం, ఆమె తర్వాత తన వారసుడయిన రాజీవ్‌ గాంధీని బలిగొంది. ఇందిరమ్మ పోయిన విషాదంలో కూడా అప్పుడు రాజీవ్‌ గాంధీకి కాంగ్రెస్‌ వారసత్వాన్ని (ప్రధాని పదవిని) పువ్వుల్లో పెట్టే ఇచ్చేశారు. రాజీవ్‌ గాంధీ హత్యానంతరం కూడా, ఆయన సతీమణి సోనియా గాంధీకి( పిల్లలు చిన్న వాళ్లు కావటం వల్ల) వారసత్వాన్ని పువ్వుల్లో పెట్టి ఇవ్వాలనే కాంగ్రెస్‌ పార్టీ భావించింది. కానీ సోనియా స్వీకరించటానికి సిధ్థంగా లేరు. పదవీ స్వీకారం కన్నా (తన పిల్లల) ప్రాణ రక్షణ ఆమెకు కీలకమయ్యింది.

అలా జారవిడుచుకున్న ‘వారసత్వాన్ని’ మళ్ళీ పొందటానికి నానా ఇక్కట్లూ పొందాల్సి వచ్చింది. రాజీవ్‌ హత్య తర్వాత ఆరు ఏళ్ళ గడిచాక, తిరిగి కాంగ్రెస్‌లో ప్రవేశించేసరికి కాంగ్రెస్‌ అస్తవ్యస్తంగా వుంది. అప్పటికే వృధ్ధుడయిన పీవీ సరసింహరావు అయిదేళ్ళూ ప్రధానిగా పనిచేసిన తర్వాత కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయింది. పరాజయ భారాన్ని మరో వయోవృధ్ధుడు సీతారామ్‌ కేసరి భుజాన వేసుకుని కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని తీసుకున్నారో, లేదో, పార్టీ చిన్నాభిన్నమయ్యింది. అప్పుడు సోనియా కాంగ్రెస్‌లో అధికారికంగా ప్రవేశించి రెండు నెలలు తిరగకుండా అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆమె పై సొంత పార్టీ నేతలే ‘ఇటాలియన్‌’ ముద్ర వేశారు. అధ్యక్షపదవికి పోటీ పెట్టారు. సీనియర్‌ నేత జితేంద్ర ప్రసాదను బరిలోకి దించారు. అప్పటికే కాంగ్రెస్‌ నుంచి వేరు పడి శరద్‌ పవార్‌, మమతలు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అంటే ఆప్పుడు ఇందిరమ్మకు ‘పువ్వుల్లో’ పెట్టి ఇచ్చినట్టు కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ సోనియా గాంధీకి ‘ముళ్ళల్లో’ పెట్టి ఇచ్చిందని చెప్పాల్సి వుంటుంది. కానీ ఒక్కొక్క ముల్లును ఏరి వేస్తూ 2004 నాటికి ఆమె అధ్యక్ష పదవిని పూల సింహాసనంలాగా మార్చుకున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకున్నారు.

పదవీ త్యాగమా? ప్రాణ భయమా?

కానీ తాను ప్రధాన పదవిని తీసుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ వారు ఈ చర్యను ‘త్యాగం’ గా కీర్తించారు. ఇంకొందరు బీజేపీ వేస్తున్న ‘ఇటాలియన్‌’ ముద్రకు భయపడ్డారన్నారు. రెంటిలోనూ సగం సగం సత్యం వుంది. కానీ సోనియా ఇక్కడే తన చతురతను వాడారు. ‘ప్రదాని పదవి’ ని మించిన ‘పదవి’ ని సృష్టించుకున్నారు. అదే ‘యూపీయే చైర్‌ పర్సన్‌’ పదవి. మన్‌మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వున్నా, అంతకు మించిన ఉన్నతాసనంలో ఆమే కనిపించేవారు; ఆమే నిర్ణయాలు చేసేవారు. అలా పదేళ్ళు ‘వారసత్వ పాలన’ను అనుభవించారు.

కానీ ఇదే వారసత్వం తనకు వచ్చినట్టు ‘ముళ్ళ’తో కాకుండా ‘పూల’తో ఇవ్వాలని భావించారు. ఇతర పార్టీలకు జవాబుదారీగా వుండే (యూపీయే వంటి) సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని కాకుండా, సంపూర్ణ ఆధిక్యంతో వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రధాని పదవిని కట్ట బెడదామనుకున్నారు. అందుకనే మధ్యలో మన్‌మోహన్‌ కేబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చి చిన్నబుచ్చాలనుకోలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వాలున్న చోట ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపించాడన్న ఖ్యాతిని రాహుల్‌ సంపాదించి పెట్టాలని తహ తహ లాడారు. కానీ ఆమె కల నిజం కాలేదు. 2014లో నరేంద్ర మోడీ ఎన్డీయే ప్రధానిగా అధికారంలోకి వచ్చాక, ఈ పని మరింత కష్టతరమయ్యింది.

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌కు ఇప్పుడు జరిగిన ఎన్నికలలో రాహుల్‌ ప్రచారాన్ని హోరెత్తించారు కానీ, ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ ఫలితాలను చూస్తే, కాంగ్రెస్‌ కు పరాజయం తప్పక పోవచ్చు. సరిగ్గా ఈ సందర్భంలోనే రాహుల్‌కు కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించి సోనియా తప్పుకుంటున్నారు. అంటే పార్టీ వారసత్వాన్ని ‘ముళ్ళ’తోనే కొడుక్కి ఆమె ఇవ్వాల్సి వచ్చింది. ‘రిటయరవ్వటమే ఇక నా పని’ అని ఆమె రాహుల్‌ అధ్యక్షపీఠంలో కూర్చోవటానికి ఒకరోజు ప్రకటించారు.

అంతే కానీ, వారసత్వ రాజకీయాలకి స్వస్తి చెప్పే యోచన ఆమెకీ లేదు; కాంగ్రెస్‌ పార్టీకి లేదు. పైపెచ్చు ఈ వారసత్వ సంస్కృతిని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పట్టుకుని ఊరేగుతున్నాయి. అంటే ప్రజాస్వామ్యం.. ఇంకా అందని కుసుమంగానే వుందన్న మాట

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *