‘మూడు ముడు’లూ, ఆరు వరసలూ..!

మూడు ముడులు


పెళ్ళి ఒక తంతు. కాపురం మన వంతు.
చేస్తే చెయ్య వచ్చు. లేకుంటే చెయ్యి యివ్వవచ్చు.
కాకుంటే తంతు వల్ల ఒక వరస ఏర్పడుతుంది. అతడు, ఆమె కాస్తా, మగడూ, పెళ్ళాంలు అవుతారు.
మధ్యలో ఈ వరసలు మారితే బాగుండదు కదా!
ప్రేమించిన ఆడపిల్ల పరమ దౌర్జన్యంగా చెయ్యి పట్టుకుని రాఖీ కట్టేస్తే ఎంత దారుణంగా వుంటుంది?
ప్రియుడి పాత్రలోనుంచి అన్న పాత్రలోకి రావటమంటే ఎంత చికాకు.
అలాంటిది, పెళ్ళయ్యాక, కట్టుకున్న వరస మార్చి కట్టుకున్న భార్యే భర్తను పిలిచిందనుకోండి. లేదూ భర్తే తన భార్యను పట్టుకుని ‘నువ్వు నాకు

సోదరితో సమానం’ అన్నాడనుకోండి. వాళ్ళు సరే, పెళ్ళిచేసిన వాళ్ళ వాళ్ళ తల్లి దండ్రులు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి?
తమ బిడ్డలు పెళ్ళి ఒకరితోనూ, కాపురం మరొకరితోనూ చేస్తున్నందుకు వారు మురిసిపోలేరు కదా!
ఎన్నిక కూడా పెళ్ళి లాంటిదే. కాకపోతే కాంట్రాక్టు పెళ్ళి లాంటిది.
మహా అయితే అయిదేళ్ళు, లేకుంటే ఆరేళ్ళు.
ఆ తర్వాత విడాకులు లేకుండానే, పెళ్ళిని పెటాకులు చేసుకోవచ్చు. వరసలూ మార్చుకోవచ్చు.
కనీసం ఈ మాత్రం కాలమయినా ఎన్నికయిన ప్రతినిథులు కాపురం చేస్తే బాగుటుంది కదా!
ఏమాట కామాటే చెప్పుకోవాలి. చాలా మంది కాపురాలు పూర్తికాలం చేస్తూనే వున్నారు. కానీ పెళ్ళి చేసుకున్న వాళ్ళతో కాకుండా, వేరే వారితో

చేస్తున్నారు.
ఇప్పుడు వీళ్ళని వోటేసి కూర్చోబెట్టిన తల్లిదండ్రుల్లాంటి వోటర్లు తలలు ఎలా యెత్తుకోవాలి?
మిగిలిన వోటర్ల సంగతేమోకానీ, మన తెలుగు వోటర్లు తమ పరువును మర్యాదపూర్వకంగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.
రూపవంతుడూ, గుణవంతుడూ, ధైర్యవంతుడూ అయిన ‘మెగాస్టార్‌’ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీనేతగా ముస్తాబయి వచ్చినప్పుడు, ఈడూ, జోడూ

సరిపోతుందని ‘సామాజిక న్యాయానికి’ ఇచ్చి, పెళ్ళిచేశారు. ప్రతిపక్షంలో నివాసం ఏర్పాటు చేశారు. అయిదేళ్ళూ కాపురం చేసుకోమన్నారు.
తెలుగు వోటరు తప్పు చెయ్యలేదు. ప్రచారమప్పుడే కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఎదురుగా నిలబడి ఆయన ‘మీసాలు’ మెలివేశారు. ‘తొడలు’ కొట్టారు. ఎంచక్కా

ఈ రెండు పనులూ అయిదేళ్ళ పాటు ఆయన చేయగలరని విశ్వసించారు తెలుగు వోటర్లు.
కానీ ఆయన ‘తొడలు’ కొట్టిన వారితోనే ‘చేతులు’ కలిపారు. ‘సామాజిక న్యాయం’ పుట్టింటికి వెళ్ళిపోయింది.
కాంగ్రెస్‌ మొత్తాన్ని ‘సుస్థిరత’ కిచ్చి కట్టబెట్టాడు ఇదే తెలుగు వోటరు. కానీ అది ‘అస్థిరత’తో కాపురం చేస్తుంది.
అంతే కాదు, అందులోనుంచే ఇంకో పార్టీని అతి సులువుగా పుట్టించేశారు వై.యస్‌ జగన్మోహన రెడ్డి. కానీ ‘ప్రతిపక్షం’లో కూర్చోబెట్టటానికి సిధ్ధమయ్యారు.
అయితే కొంతలో కొంత నయం. ప్రతిపక్షంలో కూర్చోవటానికి కూడా విసుగనిపించి, విడాకులకు(రాజీనామాలకు) సిధ్ధమయ్యారు.
పోనీ చంద్రబాబయినా తన పార్టీ వరసలు మార్చకుండా వున్నారా? తెలుగు వోటరు ఆయన ప్రతిభను గుర్తించి ప్రధాన ప్రతిపక్షంగా వుండాలని

నిర్ణయంచాడు. కానీ ఆయనేం చేశాడు. కాపురాన్నే రెండు ముక్కలు చేసి, ఒక ముక్కను తెలంగాణాలోనూ, మరొక ముక్కను సీమాంధ్రలోనూ వుంచారు.
సరే, కమ్యూనిస్టులనీ, బీజేపీ వారినీ (ఎంతగా ముదిరిపోయినా)తెలుగు వోటరు పెళ్ళీడు వచ్చిన వారిగా గుర్తించలేదు. కాబట్టే కాపురం ప్రసక్తే వారికి

లేదు.
అయితే ఎటొచ్చీ ‘తెలంగాణ’ , ‘తెలంగాణ’ అని ఎప్పటినుంచో మొత్తుకుంటున్న కేసీఆర్‌(టీఆర్‌ఎస్‌)ను తెలుగు పాఠకుడు ఎన్నికలప్పుడు పెద్దగా

గుర్తించలేదు. అందుకనే ‘మూడో ప్రతిపక్షం’లో కూర్చోబెట్టాడు.
ఈ కాపురాన్ని కష్టం మీదే అయినా బుధ్ధిగా చేస్తున్నారు. కానీ, మిగిలిన అందరి పార్టీల కాపురాల్లో రెండేసి కుంపట్లు పెట్టించారు.
ఇలా చూస్తే, 2009 ఎన్నికలలో
రాష్ట్రం లో వోటరు పెళ్ళి తంతు మాత్రమే చేశాడు.
కాపురాలు చేసే వంతు పార్టీ లయింది.
ఫలితంగా ఒకరి కాపురాలు ఒకరు చేసి పెట్టేస్తున్నారు
వరసలు మార్చేసుకున్నారు.
బావలు అన్నలయ్యారు. అన్నలు బావలయ్యారు.
అసలు వరసల్ని ఇప్పుడు వోటరు కూడా మరచిపోయాడు.
మళ్ళీ ఎన్నికలొస్తే, ఈ కొత్త వరసల్తోనే వీళ్ళని పీటలెక్కిస్తాడు.
ప్రతీ కథకీ ఒక నీతి వుంటుంది.
కానీ రాజకీయ కథకు మాత్రం ‘అవినీతి’ వుంటుంది.
ఇక్కడ అవినీతి ఏమిటంటే- వరసలు మార్చటమే సరసమైన ప్రజాస్వామ్యం!!

-సతీష్‌ చందర్‌
(ఈ వ్యాసం ‘ఆంధ్రభూమి’ దిన పత్రికలో 28 ఆగస్టు2011 నాడు ప్రచురితమయినది)

6 comments for “‘మూడు ముడు’లూ, ఆరు వరసలూ..!

Leave a Reply