మృతి-స్మృతి

(మనుషులంతే. కలసినప్పడూ, విడిపోయినప్పుడూ, కలసివిడిపోయినప్పుడూ, విడిపోయి కలసినప్పుడూ.. కళ్ళు చెమ్మ చేసుకుంటారు. ఘనమైన మనుషులు, గంభీరమైన మనుషులు, కఠినమైన మనుషులు…ఇలా కరుగుతుంటారు. అవును. కరిగినప్పడే మనుషులు. అంతకు ముందు..? ఏమైనా కావచ్చు: కొయ్యలు కావచ్చు. రాళ్ళు కావచ్చు. గడ్డకట్టిన నదిని చూపి, నది అంటే నమ్ముతామా..? మనిషీ అంతే…! కరిగిపోతేనే ఉనికి.)

padapic-prayer

నిషంటే

ఒక దేహమూ, దానిలోపల ప్రాణమూ

మాత్రమే కాదేమో.

కళ్ళతో చూసుకోవటానికీ,

కౌగలించుకోవటానికీ

మాత్రమే మనిషయితే,

ఈ మనిషి చాలు.

కానీ, కళ్ళు చెమర్చుకోవటానికీ,

కడుపు నిండా నవ్వుకోవటానికీ,

క్షణ క్షణం కలసి వుండటానికీ

కావాల్సిన మనిషి వేరు.

ఒక జ్ఞాపకమూ, ఒక అనుభవమూ కలిపితే

వచ్చే మనిషి అతను.

కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కనిపిస్తాడు.

పేరుకు మృతుడంతే

స్మృతిలో ఎప్పుడూ సజీవుడే.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం)

1 comment for “మృతి-స్మృతి

 1. మీ అక్షరం అంటే ఇష్టం.
  ఎందుకో మీ పదాలలో ఉండే అర్థాలన్నిఇష్టంగా గుండెకు తాకుతుంటాయి ఇది మహాఇష్టం.
  అలాంటిది వాక్యమే వచ్చి మీద పడితే వయ్యారంగా వాటేసుకోకుండా ఉండలేం.
  గడ్డ కట్టిన నది. నదేకాదు
  ఎండ వేడి తగిలితే కానీ అది కరిగి ప్రవహించదు.

  కానీ మీ అక్షరం, మీ పదం, మీ వాక్యం స్పర్స తగితే.
  కదలని పకృతి కదులుతుంది.
  బండలా ఉండే గుండేలు మనసుతో ఊసులాడుకోవడం మొదలవుతుంది.

  – రమణ కంది

Leave a Reply