‘యమ్‌’ పాల్‌!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : సంత్‌ రామ్‌పాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం:‘యమ్‌’పాల్‌ ( నా ఆశ్రమంలో కొస్తే మృత్యువును చూస్తారు.)

ముద్దు పేర్లు :‘దేరా’ బాబా( నేను హర్యానాలో చేపట్టిన ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమం లెండి.) కానీ నన్నిప్పుడు ‘డేరా’ పీకించేసి ‘డేరా బాబా’ను చేశారు.

‘విద్యార్హతలు :‘ఐటిఐ’లో డిప్లమా. (ఐటిఐ- అంటే ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌ అనుకుంటున్నారా? అబ్బే. ఇంటిలిజెంట్‌ టోకరా ఇన్సిట్యూట్‌. అందుకే నా ఆశ్రమంలో బోర్డు పెట్టాను. విరాళాలిచ్చే భక్తులు నేరుగా నాకే ఇమ్మంటాను. ఈ విషయంలో ఏ ‘వాల’ంటీర్‌నీ నమ్మను. ‘వాల’మంటేనే తోక- కదా! ఎలా నమ్ముతాను చెప్పండి.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: కాషాయం, బొట్లూ, తట్టలూ ఏమీ వుండవు. తెల్ల జుత్తు, తెల్ల దుస్తులూ… అంతా తెల్ల తెల్ల గా వుంటుంది. అందుకే ఒక్కసారి నా ఆశ్రమంలోకి వస్తే మీరే ‘తెల్ల’బోతారు.

రెండు: నేను హేతువాదుల్నీ, నాస్తికుల్నీ తిట్టను. సాటి బాబాలనూ, స్వాములనీ తిడతాను. అదే నా ప్రత్యేకత.

సిధ్ధాంతం : గీత, బైబిల్‌, ఖురాన్‌, గురు గ్రంథ్‌ లలోని సారాన్ని మింగేశాను. అప్పుడు నాకు ‘కబీరు’ కనిపించారు. అఫ్‌ కోర్సు నా లోనే కబీరును చూస్తారనకోండి. అది వేరే విషయం.

వృత్తి : ఏ బాబా అయినా ఏం చేస్తాడు? లెక్చరిస్తాడు, జోలె పడతాడు. నేనూ అదే చేస్తాను.

హాబీలు :1. నా దర్శనార్థం వచ్చిన వారిని ‘తన్ని’ పంపించటానికి నేను ‘తన్ను’ బాబాను కాను. సినీ తారలతో అసభ్య భంగిమలతో రహస్య కెమరాలోకు ఎక్కే ‘పైత్యానంద’ బాబానీ కాను. కడకు దీక్షాశిబిరంలో కూర్చుని పోలీసులు వస్తే ‘సల్వార్‌ కమీజ్‌’ అరువు తీసుకుని పారిపోయే ‘భోగా’ బాబానీ కాను. ( అందుకే కదా, పోలీసులొచ్చినా తొలుత లొంగి పోకుండా, భక్తులను అడ్డుపెట్టుకుని పోరాడాను.) నా హాబీ ఒక్కటే. భక్తులను ‘గుడుల’ చుట్టూ తిరగొద్దని ప్రబోధిస్తుంటాను.

2. ‘రాతి బొమ్మల్ని’ కొలవొద్దని ప్రబోధిస్తుంటాను. ఎదురుగ్గా రక్త మాంసాలతో నిలువెత్తుబాబాను నేనుండగా, భక్తులకు ‘విగ్రహాలను’ కొలిచేటంత ఖర్మ ఏమిటి?

అనుభవం : స్వర్ణదేవాలయంలో దాక్కున్న భింద్రన్‌ వాలేకూ నాకూ ఒక్కటే తేడా. ఆయన పోలీసుల తూటాలకు ప్రాణాలొదిలాడు; నేను భక్తులను ముందు పెట్టుకుని ప్రాణాలతో పోలీసులకు చిక్కాను. చట్టం ముందు పౌరులూ, బాబాలూ సమానులే కావచ్చు. కానీ ‘బాబాలు కొంచె ఎక్కువ సమానం’ అని మేం నమ్ముతాం.

మిత్రులు : మిత్రులా? ఏ బాబాకయినా ఇంత కన్నా పెద్ద తిట్టు మరొకటి వుండదు. బాబాకు భక్తులుంటారు కానీ, మిత్రులుంటారా?

శత్రువులు : ఈ మాట ఒప్పుకుంటాను. ‘ఆర్యసమాజ్‌’ నే విమర్శించినవాడిని. ఇతర ‘సమాజా’లను వదలుతానా? అందుకే అందరు శత్రువులుంటారు.

మిత్రశత్రువులు : అస్పృశ్యత వద్దంటున్నాననీ, అన్నికులాల భక్తులను స్వీకరిస్తున్నానీ. నా మీద సాటి బాబాలే కత్తికట్టారు. వారి నా మిత్రశత్రువులు.

వేదాంతం : నేను పోలీసులకు చెప్పే వేదాంతం ఒక్కటే. సీసాలో పెట్రోలు పోసినంత మాత్రాన బాంబు అవుతుందా?

జీవిత ధ్యేయం : బాబాకు వివాదమే ప్రచారం. ఈ వివాదాలతో ఎంత మంది బాబాలు ‘నిత్యానందం’గా లేరూ…?

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 22-28 నవంబరు 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply