యాభయ్యేళ్ళ పాపాయి

photo by esbjorn2

పరుగే పరుగు

ముందు పళ్లు రాలనీ, మోచిప్పలు పగలనీ

ఆగదు ఆగదు

జీన్‌ ఫ్యాంటు ధరించి, ర్యాంకులనే జపించి

అమెరికాను తలంచి, ఎంసెట్‌నే పఠించి

వీరబోసు కుర్రపరుగు

 

కుటుంబాన్ని త్యజించి, కొంత సుఖం వరించి

వంట గదిని, పడగ్గదిని

సగం మూసి, సగం తెరచి

తనువుల్నే కుదించి, మనసుల్నే వధించి

వీర ఝన్సీ ఆడ పరుగు

 

ఊరేమిటి? వాడేమిటి?

వేరుచేసి, గోడగట్టి

అటుకొంచెం, ఇటు కొంచెం

‘అంటు’ జబ్టు విసరి కొట్టి

అడుగంటిన జాబుల్నే,

ఉత్తుత్తికి పంచిపెట్టి

డప్పులతో గొప్పలతో

వీర గాంధీ దళిత పరుగు

 

విప్లవాలు, ఉద్యమాలు

కార్పొరేటు రంగంలో

వికసించగ, లాభించగ

పొత్తూ, పదవులనే సుత్తీ కొడవలిగా

హొటళ్ళూ, బారులనే, భూమీ పోరులగా

పిడికిళ్ళను బిగించి, బరులన్నీ తెగించి

వీర క్రామేడ్‌ ఎర్ర పరుగు

 

గుంపులుగా, తంపులుగా

మడమతిప్పని యోధులుగా

పరుగులండి పరుగులు

 

ఎందుకెందుకెందుకని

తెలియనట్టు అడక్కండి

ముందుగ, మున్ముందుగ

దొర్లుకుంటు వెళ్ళుతోంది

అదిదగదిగో రూపాయి

‘స్వర్ణం’లా మెరుస్తోన్న

యాబదేళ్ళ పాపాయి

(స్వరాజ్యం వచ్చి యాభయ్యేళ్ళయినప్పుడు)

1997

 

2 comments for “యాభయ్యేళ్ళ పాపాయి

Leave a Reply