యూటీఅంటే కేంద్రపాలిత ప్రాంతం(యూనియన్ టెరిటరీ) అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నేతలూ వేరే అర్థాలు తీస్తున్నారు. ‘యూ-టీ’ అంటే ‘వెనక్కితీసుకోవటమే’ (యూ-టర్నే) అంటూ కొత్త భాష్యాలు చెబుతున్నారు.
హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన చేసేసింది కాబట్టి, ఇప్పుడు కొత్తగా హైదరాబాద్‌కు ఈ తరహా ప్రత్యేక హోదాను కల్పించటం తప్పకుండా ‘యూ-టర్నే’ అన్నది తెలంగాణ వాదుల నిశ్చితాభిప్రాయం.
మరి ‘సమైక్యాంధ్ర వాదులు’? లోపల ఒక మేరకు అంగీకారం వున్నా, రాష్ట్రాన్ని సమైక్యంగా వుండటం మినహా మరే నిర్ణయాన్నయినా తాము ‘యూ-టర్న్’గానే పరిగణిస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌ను యూటీ చేస్తారన్న వార్త రాష్ట్రమంతటా పాకి పోయింది. బాధపడేవాళ్లు బాధపడ్డారు. సంతోషించే వాళ్ళు సంతోషించారు. బహిరంగంగా బాధపడి, రహస్యంగా సంతోషించే వాళ్ళు సంతోషించారు. (అయితే బహిరంగంగా సంతోషించి, రహస్యంగా బాధపడేవాళ్ళ గురించి ఇంకా వెల్లడి కాలేదు. బహుశా, హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల పారిశ్రామిక వేత్తలూ ఈ కోవలోకి వస్తే రావచ్చు. ఎందుకంటే ‘పిల్లి తగవు, పిల్లి తగవు కోతి తీర్చినట్టుగా, హైదరాబాద్ కోసం రెండు ప్రాంతాల ప్రజలూ ‘మాదంటే మాదీ’ అని కొట్టుకు చస్తుంటే, మధ్యలో కేంద్రం హైదరాబాద్‌ని ఎగరవేసుకు పోవటం వీరికి సుతరామూ నచ్చదు. ఆదాయం మొత్తం ఈ రెండు ప్రాంతాల వారికి కాకుండా, కేంద్రానికి పోతుందంటే, వారికా మాత్రం ఉలికిపాటు వుంటుంది.)
యూటర్న్ అనుకున్నా, ఏ టర్న్ అనుకున్నా, కేంద్రం హైదరాబాద్ హోదా మీద మరో ప్రకటన చేస్తుందన్నది నిజయమ్యే అవకాశం వుంది. ఇందుకు కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహ రచన ఖరారు చేసివుండాలి. మనకు రాష్ట్రమంటే ‘రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ‘ ప్రాంతాలు కావచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ కు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే 42 పార్లమెంటు సీట్లు. యూపీయే-3ను అధికారంలో వుంచటానికీ, రాహుల్‌ని ప్రధానీ, కాకుంటే యూపీయే చైర్‌పర్సన్ చెయ్యటానికీ మన రాష్ట్రం నుంచి వెళ్ళే ఎంపీ సీట్లు కూడా అత్యంత కీలకమే. వీటిలో ఎక్కువ సీట్లు (అధమం 25 నుంచి 30 సీట్లు ) తెచ్చుకోవాలంటే, రాష్ట్ర విభజన ప్రక్రియ మీదా, తద్వారా వచ్చే ఉద్వేగాల మీదా ఆధారపడటమే మార్గంగా చేసుకున్నది. అందుకు ఒక వ్యూహాన్ని రచించి పెట్టుకున్నది. ఇప్పటికే ఆ వ్యూహంలో కొంత భాగాన్ని ఆమలు చేసింది. తెలంగాణ పై చేసిన ప్రకటన అందులో భాగమే. ఆ వ్యూహంలో మిగిలిన భాగం ఇలా వుండవచ్చు.
సీన్-1: సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధ్ధృతమయ్యే క్రమంలో, మెల్లగా ఆ ఉద్యమానికి కాంగ్రెస్ నేతలే సారథ్యం వహిస్తున్నారన్న ఖ్యాతి తెచ్చుకోవటం. అయితే ఇప్పటికే వైయస్ ఆర్ కాంగ్రెస్ అధినాయకత్వమూ( జగన్, విజయమ్మ, షర్మిలలు), తెలుగుదేశ అధినేత నారా చంద్రబాబు నాయుడూ ఈ పనిలో నిమగ్నమయి వున్నారు. కానీ ఇప్పటికీ ఈ ఉద్యమం ప్రజలు చేస్తున్న స్వఛ్చంద ఉద్యమం లాగానే కనిపిస్తోంది. రాజకీయ నాయకత్వం ఇంకా స్థిర పడలేదు. కాంగ్రెస్ నుంచి ఈ పనికి ఎవరిని నియోగిస్తుందన్న విషయంలో ఉత్కంఠ ఏమీలేదు. సమైక్యాంధ్ర కోసం అధిష్ఠానాన్ని సైతం ధిక్కరిస్తున్నాడన్న కిరణ్ కుమార్ రెడ్డిని ముందు ఉంచబోతున్నారు. ఇదే సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవిని త్యజించాడన్న కీర్తిని ఆయన ఖాతాలో పడేటట్టు కాంగ్రెసే సహకరించవచ్చు.(ఎలాగూ నాలుగు నెలల్లో పోయే పదవికి చేసే రాజీనామా కూడా ఒక త్యాగమేనా-అని ఎవరూ అడగరని వారి నమ్మకం.)
సీన్2: హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఉనికిని గుర్తించటం: హైదరాబాద్‌లో సీమాంధ్రులు కూడా గణనీయంగా వున్నారనీ, ఈ నగరంతో వారికి ఎన్నో అనుబంధాలున్నాయనీ నిరూపించుకోవటానికి సమైక్యాంధ్ర వాదులకు వీలు కల్పించటం. అందులో భాగంగానే ఎల్.బి.స్టేడియంలో (సెప్టెంబరు 7న) తలపెట్టిన ఎ.పి.ఎన్జీవోల సభకు కాంగ్రెస్ సర్కారు అనుమతి ఇచ్చింది.
సీన్3: మజ్లిస్‌ను మచ్చిక చేసుకోవటం: మజ్లిస్‌తో మధ్యలో తెగిన సంబంధాలను ‘సమైక్యవాదుల’ ద్వారా పునరుధ్ధరించుకోవటం. హైదరాబాద్ మీద తీసుకోబోయే నిర్ణయానికి వారి మద్దతును కూడగట్టటం. (ఇప్పుడు ఎల్.బి.స్టేడియంలో జరుగుతున్న సభకు మజ్లిస్ కూడా హాజరవుతున్నారు.)
సీన్4: హైదరాబాద్ కు ప్రత్యేక హోదా(యూటీ లేదా ప్రత్యేక రాష్ట్రం) ప్రకటించటం: ఈ పనిని ఒక్క ఉదుటున చేయక పోవచ్చు. పదిజిల్లాల తెలంగాణ పై కేబినెట్ నోట్ తయారయిన దగ్గర నుంచి లాంఛనంగా అసెంబ్లీ ప్రతిపాదన పంపే వరకూ, తెలంగాణ పై చేసిన ప్రకటనకు కట్టుబడే వుంటారు. కానీ ఆ సమయానికి ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలు లేకుండా అసెంబ్లీ సమావేశం అయ్యేటట్టు చూస్తారు. అసెంబ్లీ తీర్మానం మీద విభజన ప్రక్రియ ఆధారపడి లేకపోయినా, తీర్మానం వీగిపోయేటట్టో, ఏకపక్షంగా జరిగినట్టో చేసి, ప్రక్రియకు నైతిక పరాజయాన్ని అంటగట్టటం.
సీన్5: సీమాంధ్ర, హైదరాబాద్‌లలో ఎక్కువ ఎం.పీ సీట్లను భద్రపరచుకోవటం.: హైదరాబాద్ కు ఇలాంటి హోదా కల్గటం వల్ల సమైక్యవాదులు శాంతించటమే కాకుండా, హైదరాబాద్ వాసులు వ్యతిరేకత తగ్గించుకోవటం వల్ల తమకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ఊహ. అప్పుడు గ్రామీణ తెలంగాణ భగ్గుమంటుంది. హైదరాబాద్ యూటీ చేసినప్పటికీ తెలంగాణ రాజధాని కూడా హైదరాబాద్‌లు వుండటం వల్ల కాంగ్రెస్ మాట తప్పినట్టు కాదని ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ భ్రమ పడుతుంది.
సీట్లూ, వోట్లే ప్రధానమయి పోయిన కాంగ్రెస్ మదిలో ఇంతకు మించి గొప్ప ఆలోచన వుంటుందనుకోవటం అత్యాశ అవుతుంది.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 7-13 సెప్టెంబరు 2013 సంచికలో ప్రచురితం)
సతీష్ గారూ! ఈ ఆర్టికల్స్ ను FBలో సఖ్య సమాఖ్య తోపాటు ‘తెలుగు అక్షరాలు’ గ్రూప్ లోనూ పెట్టండి.
సతీష్ చందర్ గారూ… ఇప్పుడు కాంగ్రెస్ ఏ టర్న్ తీసుకున్నా సీమాంధ్ర జనం ఓట్లేస్తారంటారా… తెలంగాణాలో కాంగ్రెస్ కే పట్టం కడతారా… ఎన్నికల నాటి పరిస్థితులు ఎలా వుంటాయో…ఎన్నికల తాయిలం వేద్దామనుకున్నా… కాంగ్రెస్ ఊహించని రీతిలో పప్పులో అడుగు వేసేసింది.. ఇక కాంగ్రెస్ కు యూటర్నే.. మీ ఐదు యూటర్న్ అంశాలు అద్భుతమైన విశ్లేషణ…బాగుంది సార్…
—–మండెల శ్రీరామమూర్తి,సీనియర్ జర్నలిస్ట్, రాజమండ్రి.
Dear Satish Sir! s, its a deepest analysis, Scene 1 & 4 are very useful to Congress..& seemaandhra people also some what get back from United Struggle… any how INC / Sonia / Gandhi has lost their place in AP….