రాజకీయాల్లో ‘కులం’ బద్దలు గొట్టిన జేసీ!

కుటుంబాన్ని సాగదీస్తే కులమవుతుందనీ, కులాన్ని ఎత్తి కుదేస్తే కుటుంబమవుతుందనీ.. చెప్పటానికి ఏ సామాజిక శాస్త్రవేత్తో దిగిరానవసరంలేదు. తేట ‘తెలుగు’ పార్లమెంటు సభ్యుడు చాలు. నిన్నగాక మొన్న ఈ మ్కునే జేసీ దివాకరరెడ్డి ‘కులం’ (కుండ కాదు) బద్దలు గొట్టి మరీ చెప్పారు. తిన్న ఇంటి వాసాలు కాదు, ఉన్న పార్టీ దోషాలను లెక్కించటంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతోకాలం కాంగ్రెస్‌లో వుండి వచ్చారేమో.. తల్లి పుట్టిల్లు గురించి మేనమామ ఏకరవు పెట్టినట్లు కాంగ్రెస్‌ గురించి సులభ వాయిదాల్లో చెపుతుంటారు.

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుని పోవటానికి అందరు ‘సీమాంధ్ర’ నేతలూ చెప్పే కారణం ఒక్కటే: వోట్ల కోసం రాష్ట్ర విభజన. కానీ జేసీ ఇంకో కారణాన్ని కనిపెట్టారు. ఆ పని చేసి వుంటే, 2014లో రెండు తెలుగురాష్ట్రాలతో పాటు, దేశంలో కూడా కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో వుండేదని చెప్పారు. అదేమంటే నాడు కాంగ్రెస్‌ అధినాయకురాలిగా వున్న సోనియా గాంధీ తన (జేసీ)మాట వినక పోవటమే అసలు కారణం.

జేసీ ఓ ఖరీదయిన సలహాను ఉచితంగా ఇచ్చి పారేశారట. అది కూడా పెళ్ళి విషయంలో. అవును రాహుల్‌ పెళ్ళికీ, కాంగ్రెస్‌ విజయానికీ లింకు ఉందని జేసీ చెప్పేశారు. రాహుల్‌కు జేసీ ‘చెప్పినట్లు’ గా పెళ్ళి చేసి వుంటే కాంగ్రెస్‌ గెలిచి వుండేదట. పెళ్ళి అనేది రాహుల్‌ కి ఇష్టం లేకుండా చెయ్యమన్నది జేసీ ఉద్దేశ్యం కాదు సుమీ! రాహుల్‌ కు మెచ్చిన, నచ్చిన అమ్మాయినే చెయ్యవచ్చు. కానీ రెండు షరతులు. ఒకటి: రాహుల్‌ చేసుకునే చిరంజీవి సౌభాగ్యవతి తప్పని సరిగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆమె అయి వుండాలి. రెండు: ఆమె బ్రాహ్మణ కులానికి చెంది వుండాలి. ఇలా జేసీ సూచించిన సలహా మేరకు సుముహార్తాన ( అనగా 2014 ఎన్నికల ‘మూఢా’నికి ముందు) వేద మంత్రాలతో జరిపించి వుంటే, రాహుల్‌ కు ‘రాజ’ యోగం వుండేదని సదరు ‘దివాకర’ సిధ్ధాంతి (దివాకర రెడ్డి) జోస్యం చెప్పారు.

జేసీ ఇప్పటికీ బాధపడుతున్నదేమిటంటే, సోనియా అప్పట్లో ఈ ‘పెళ్ళి’ గురించి ఆలోచించకుండా (సీమాధ్రనుంచి తెలంగాణను వేరు చేసే) ‘విడాకులు’ గురించి ఆలోచించారని. ఇక్కడివరకూ మాత్రం జేసీ అప్పట్లో జోస్యం చెప్పి ఊరుకుంటే – ఏదో నవ్వులాటకేమోలే- అని తీర్మానించుకోవచ్చు.

కానీ, రాజకీయాల్లో ‘కులాల’ పాత్రగురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరయినా గెలవాలంటే, కమ్మ, రెడ్డి, కాపు కులాల మద్దతు వుండి తీరాలి. కానీ ఉత్తరప్రదేశ్‌ లో అలా కాదు. అక్కడ బ్రాహ్మణుల ప్రాపకం పొంది తీరాలి. ఇదీ రాజకీయాల్లో ‘జేసీయిజం’. అంటే రాహుల్‌ గాంధీ బ్రాహ్మణ స్త్రీని పరిణయమాడి వుంటే, కాంగ్రెస్‌కు బ్రాహ్మణుల మద్దతు లభించి వుండేదని జేసీ సూత్రీకరణ.

నిజమే ఉత్తర ప్రదేశ్‌ లో ఎవరు పాగా వేస్తారో, వారే కేంద్రంలోనూ వెయ్యగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ (80) పార్లమెంటు సీట్లు అక్కడి నుంచే వుంటాయి. కానీ గెలుపునకు వోట్ల సంఖ్య కూడా ముఖ్యం. అలా చూసినప్పుడు- ఉత్తరప్రదేశ్‌ లో బ్రాహ్మణుల కన్నా బీసీలూ, ఎస్సీ, ఎస్టీలు అధిక సంఖ్యలో వుంటారు. ఆ లెక్కన రాహుల్‌ గాంధీ ఈ వర్గాలకు దగ్గర కావాలి. అంటే జేసీ యోచన ప్రకారం ఈ వర్గాల నుంచే వధువును ఎంచుకోవాలి. కానీ అక్కడ కూడా అల్ప సంఖ్యాకులుగా వున్న బ్రాహ్మణ కులం నుంచే ఎంచుకోమని ఎందుకు చెప్పారు.

ఇందుకు జేసీ చెప్పిన సారూప్యం కూడా ఒక సారి చూడాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కమ్మ, రెడ్డి, కాపు- కులాల మద్దతు కావాలన్నారు. సరే కాపు కులస్తులు సంఖ్యలో ఎక్కువ వుంటారు. కానీ కమ్మ, రెడ్డి కులస్తులు సంఖ్యలో కూడా తక్కువే కదా. కానీ గెలవాలంటే ఈ సమూహాల మద్దతు ఎందుకు కావాల్సి వుంటుందీ?

ఇక్కడే జేసీ దాచివుంచిన లాజిక్కు వుంది. కులాలు ‘రాజకీయ కులాలు’ కావటానికి సంఖ్యమాత్రమే కీలకం కాదు. ఆధారపడటం కూడా కీలకం. ఆర్థిక వనరులు( భూమి,పరిశ్రమలు వగైరా) మీద ఆధిపత్యం వున్న వారు ఏకులాల నుంచి వస్తారో, ఆ కులాలకు ‘రాజకీయ కులాల’ ముద్ర పడుతుంది. పార్టీలు టిక్కెట్లు ఇచ్చేటప్పుడూ, అధికారంలోకి వచ్చాక మంత్రిపదవులు ఇచ్చేటప్పుడు ‘రాజకీయ కులాల’ మధ్య సమ తూకాన్ని పాటించటానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ యూపీలో బ్రాహ్మణ కులాన్ని ‘రాజకీయ కులం’ గా భావించటానికి ‘ఆర్థిక వనరుల’తో పాటు, ‘అధికారగణం'(బ్యూరోక్రసీ)లో ఈ వర్గాల వారు పట్టు సాధించిటం కూడా. తెలిసి అన్నారో, తెలియక అన్నారో.. అంతటి హాస్యంలోనూ కొన్ని రహస్యాలను తేట తెల్లం చేశారు. కాకుంటే పెళ్ళిళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చేసుకుంటే అదనపు రహస్యాన్ని కూడా బయిట పెట్టారు. ఇప్పుడు ఆయన వుంటున్న పార్టీలోకూ ‘మంత్రులు మంత్రులు వియ్యాల’ లందిన వాస్తవాలున్నాయి.

కానీ ‘ఆర్థిక వనరుల’ పైనా ‘అధికార గణం’ పైనా పట్టులేని కులాల (బీసీ, ఎస్సీ, ఎస్టీ) నుంచి కూడా పార్టీలు ఆవిర్భవించాయి. ఇదే ఉత్తరప్రదేశ్‌ ను పాలించాయి. ‘జేసీయిజం’లో ఈ ఉదాహరణలు మినహాయింపులు కాబోలు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్రలో ప్రచురితం)

2 comments for “రాజకీయాల్లో ‘కులం’ బద్దలు గొట్టిన జేసీ!

Leave a Reply