రాజకీయ దురంధరేశ్వరి

కేరికేచర్: పురంధేశ్వరి

కేరికేచర్: పురంధేశ్వరి

పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి

ముద్దు పేరు : రాజకీయ దురంధరేశ్వరి

విద్యార్హతలు : వారసత్వ రాజకీయాలలో పి.హెచ్‌.డి. (ఈ విషయంలో చంద్రబాబు కూడా నా ముందు దిగదుడుపే. బాబు ‘అత్తింటి'(పోనీ, ‘మామింటి’) వారసత్వం కోసం తాప త్రయ పడితే, నేను ‘పుట్టింటి ‘వారసత్వాన్ని నిలబెట్టుకుంటాను.

హోదాలు : ఎన్ని హోదాలున్నా ‘అన్న’ కూతురు హోదా ముందు, అన్నీ దిగదుడుపే.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ‘నాన్నే’ నాకు గుర్తింపు చిహ్నం. (మళ్ళీ జన్మలంటూ వుంటే, ఆ నాన్న కూతురుగానే పుడతాను. ప్రతీ జన్మలోనూ కేంద్రమంత్రి పదవి గ్యారంటీ వున్నా లేక పోయినా ఫర్వాలేదు.)

రెండు: రాజకకీయాల్లో అందరూ ‘గ్రహ’ స్థితిని నమ్ముకుంటారు. నేను ‘విగ్రహ’ స్థితిని నమ్ముకుంటారు. పార్లమెంటు లో ‘నాన్న’ విగ్రహం పెట్టించాక నా రాజకీయ భవిష్యత్తులో పెనుమార్పులు సంభవించనున్నాయి. ఆ విషయం నాకు తెలుసు.

అనుభవం : ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవం నిలిపారు. నేను ఎన్టీఆర్‌ గౌరవాన్ని కాంగ్రెస్‌ లో నిలిపాను.

వేదాంతం : ఇస్తే పుచ్చుకునేది ఆహ్వానం కానీ, అడిగి తీసుకునేది కాదు. ( చంద్రబాబుకీ, లక్ష్మీపార్వతికీ ఈ విషయం ఇప్పటికీ ఆర్థమయినట్లు లేదు.)

వృత్తి : నాకు ఏ శాఖ నిచ్చినా నేను నిర్వహించేది టూరిజం. హైదరాబాద్‌ టూ ఢిల్లీ, హైదరాబాద్‌ టూ విశాఖపట్నం( నేను గెలుపొందిన నియోజక వర్గానికి వెళ్తుండాలి కదా!)

హాబీలు :1. పదవీ పరిరక్షణ( కేంద్ర మంత్రి వర్గం విస్తరించినా, కుదించినా, పునర్వవ్యవస్థీకరించినా, నా స్థానం నాకుంటుంది.)

2. నందమూరి కుటుంబ సభ్యుల ఐక్య సంఘటన కోసం కృషి. చంద్రబాబు కూడా ఈ కృషి కొంత చేస్తుంటారు కానీ, నా కృషికీ ఆయన కృషికీ తేడా వుంది. ‘వియ్యాల’ ద్వారా బాబూ, ‘నెయ్యాల’ ద్వారా నేనూ కృషి చేస్తుంటాం.

నచ్చని విషయం : ‘వెన్ను పోటు’ పొడిచిన వారే ‘అన్న’ వారసత్వం కోసం పాకులాడటం.

మిత్రులు : నా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. నేను రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంటాను. ఆయన చరిత్రను లిఖిస్తుంటారు.( తెలుగు రాజకీయాల మీద ఆయన అథారిటీ)

శత్రువులు : ‘తెలుగు”ఇంటి’ దొంగలు. (‘నాన్న’ ఫొటోను పెట్టుకుని కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తుంటారు.)

జపించే మంత్రం : నిదానమే ప్రధానం.( అరుపులకూ కేకలకూ నేను వ్యతిరేకం.)

విలాసం : డాటర్‌ ఆఫ్‌ నందమూరి తారక రామారావు, కాంగ్రెస్‌ పార్టీ.

గురువు : రాజకీయాల్లో నాన్న, నాట్యంలో వెంపటి చినసత్యం. ( ‘చిందులు’ తెలియకుంటే కాంగ్రెస్‌లోకి వెళ్ళగలిగే దానిని కాను.)

జీవిత ధ్యేయం : తెలుగింటి ఆడపడచును తెలుగు నాట ముఖ్యమంత్రిగా చూడాలన్నది నాన్న కల. దానిని నేను ఎప్పటికన్నా నిజం చేయాలి.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 10-16 మే 2013 వ సంచికలో ప్రచురితం)

 

Leave a Reply